Site icon NTV Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

రేపు ఒంగోలుకు వైఎస్‌ జగన్‌.. 25 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రేపు ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్నారు.. ఒంగోలు నగరంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు సీఎం జగన్‌.. ఇక, ఒంగోలు పర్యటన కోసం.. రేపు ఉదయం 9.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న ఆయన.. ఉదయం 10.20 గంటలకు ఒంగోలులోని అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30 ఒంగోలు తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 11.25 నుంచి 12.25 వరకు సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12.45 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్ చేతుల మీదుగా 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. గత కొద్ది కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న ఒంగోలు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్ధానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు. ప్రభుత్వం తొలివిడత 70 కోట్ల నగదును విడుదల చేసింది.. అయితే, ఆ తర్వాత రెండవ విడత నగదు విడుదలలో జాప్యం జరగటంతో ఒంగోలులో వైసీపీ పట్టాలు ఇవ్వలేదని పెద్దఎత్తున టీడీపీ విమర్శలకు దిగింది.. దీంతో సీరియస్ గా తీసుకున్న బాలినేని.. పలుమార్లు సీఎం జగన్ ను కలసి పరిస్థితి తీవ్రతను వివరించారు.. 25 వేల మందికి పట్టాలు పంపిణీ చేయలేక పోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా ప్రకటించారు.. దీంతో సీఎం జగన్ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ప్రభుత్వం ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చే సేందుకు అవసరమైన భూ సేకరణకు, లే అవుట్‌లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 231 కోట్లు మంజూరు చేసింది.

టీటీడీ తరహాలో శ్రీశైలానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి.. ట్రస్ట్‌ బోర్డ్‌ తీర్మానం..
శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డ్‌ సమావేశంలో కీలక తీర్మానం చేశారు.. శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది. అనంతరం మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశారు.. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించామని వెల్లడించారు ఆలయ చైర్మన్‌ చక్రపాణి రెడ్డి.. అలాగే శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కర్నూలు నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం, వాణిజ్య సముదాయానికి రూ.8 కోట్ల 60 లక్షలకు ఆమోదించారు. వీటితోపాటు సున్నిపెంటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతిగృహాలకు నీటి సరఫరాకి ఏర్పాటుకు అంచనా వ్యయం రూ. 15 కోట్లు ఆమోదించారు. క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీరు పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయశాఖకు ప్రతిపాదనలకు తీర్మానించారు. అలానే దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాకు తెలిపారు.

సీఎం జగన్‌కు పొంచువున్న ముప్పు..! ఇంటెలిజెన్స్ నివేదిక
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రమాదం పొంచిఉందని ఇంటెలిజెన్స్‌ హెచ్చరిస్తోంది.. దీంతో.. సీఎం కోసం రెండు హెలీకాప్టర్లు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.. సీఎం జగన్ పర్యటనల నిమిత్తం రెండు ప్రత్యేక హెలీకాప్టర్లను రెడీ చేస్తున్నారు.. విజయవాడ, విశాఖల్లో రెండు హెలీకాప్టర్లను అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం.. లీజు ప్రాతిపదికన సీఎం జగన్‌కు హెలీకాప్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.. మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా హెలికాప్టర్స్ అనే సంస్థ నుంచి హెలీకాప్టర్లను లీజుకు తీసుకుంది ప్రభుత్వం.. రెండు ఇంజిన్లు కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లను లీజుకు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఒక్కో హెలికాప్టర్‌కు నెలకు రూ.1.91 కోట్ల చొప్పున లీజు చెల్లించనున్నారు.. ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా హెలికాప్టర్లను లీజుకు తీసుకున్నారు.. ఎయిర్ పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్ల బస, రవాణా, ఇంధన రవాణా, హెలికాప్టర్ క్రూ వైద్య ఖర్చులు వంటి వాటికి గంటల ప్రాతిపదికన ఏటీసీ ఛార్జీల చెల్లింపులకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని నిర్ధారించిన ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ లిమిటెడ్. ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీల ప్రయాణం కోసం రెండు హెలికాప్టర్లు అవసరమని భావించింది.. సీఎం జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున వివిధ అంశాలను సున్నితంగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు ఇంటెలిజెన్స్ డీజీపీ. సీఎం జగన్‌కు మావోయిస్టులు, టెర్రరిస్టులు, వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్‌లు, సంఘ విద్రోహశక్తుల నుంచి ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చారు ఇంటెలిజెన్స్ డీజీపీ. సీఎంకు అత్యంత భద్రత కల్పించాల్సి ఉన్నందున ప్రయాణాల్లో సునిశితంగా వ్యవహరించాల్సి ఉందని వెల్లడించారు.

మంత్రి ధర్మానపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..
మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవచ్చు అంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ.. ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది.. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని.. ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీకి చెందిన నాయకులు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారం చేయాలని మంత్రులే బహిరంగంగా చెబుతున్నారని.. వృద్ధులు, వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఎన్నికల సిబ్బందికి ఆదేశాలివ్వాలని ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఈసీ స్పష్టం చేయాలి.. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో ఎన్నికల సంఘాన్ని కోరారు అచ్చెన్నాయుడు.

ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్..!
రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇక, వైసీపీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. టీడీపీ, జనసేన ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించే పరిస్థితి ఉందన్నారు. కుప్పంలో భువనేశ్వరి పోటీ చేస్తారంట.. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు అని తెలుసుకున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఘనవిజయం సాధించినప్పుడే, చంద్రబాబు ఓటమి ఖాయం అయిపోయిందన్నారు కుప్పానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా తాగు, సాగునీరు ఇవ్వబోతున్నాం… కుప్పంలో చంద్రబాబు బండారం బయటపడింది.. గతంలో దొంగ ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబుకు ఈసారి అలాంటి ఛాన్స్ లేదన్నారు. కుప్పంలో నిలబడి ఓడిపోవడం కంటే రెస్ట్ తీసుకోవడం బెటర్ అని చంద్రబాబుకు తెలుసంటూ సెటైర్లు వేసిన ఆయన.. అందుకే భువనేశ్వరి నేను పోటీ చేస్తాను అంటున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో డబ్బు పెట్టి గెలవాలని చేగువేరా వారసుడు అని చెప్పుకునే పవన్ కల్యాణ్‌ మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు అంబటి.. బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో మంతనాలు చేస్తే పార్టీలు తిట్టవా..? అని ప్రశ్నించారు. ఒక పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకుండా, మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటే జాతీయ పార్టీలు తిట్టకుండా ఏం చేస్తాయన్న ఆయన.. టీడీపీ-జనసేన గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి… ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో వాళ్లకే తెలియడం లేదన్నారు. చంద్రబాబు రెస్ట్ తీసుకునే మూడ్‌లో ఉన్నాడు.. భవిష్యత్తులో టీడీపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. రెస్ట్ తీసుకోవడమే మిగిలిందన్నారు.

28న టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌
విజయవాడలో జరిగిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.. ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంలో టీడీపీ – జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.. ఇక, తాడేపల్లి గూడెం సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ హాజరుకానున్నారు.. తాడేపల్లి గూడెం సభ వేదికగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం లభించింది.. పొత్తును స్వాగతించిన టీడీపీ – జనసేన కేడర్ ను అభినందిస్తూ తీర్మానం. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసింది. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉమ్మడి సభ ఉంటుందన్నారు. తాడేపల్లి గూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తున్నాం.. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోంది.. త్వరలో విడుదల చేస్తాం అని వెల్లడించారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు-జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలి. టీడీపీ – జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్యన కూడా జగన్ తగవులు పెడతారు.. జగన్ అంత వరస్ట్ సీఎంను ఇప్పటి వరకు చూడలేదని ఫైర్‌ అయ్యారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు..

వనం నుంచి జనంలోకి.. చిలకల గుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్క..
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారు సమ్మక్క మేడారానికి బయల్దేరారు. డప్పు వాయిద్యాల, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెలపైకి తోడుకొని వస్తున్నారు. భక్తులు జయజయధ్వానాలు, పొర్లుదండాలు పెడుతూ సమ్మక్కకు స్వాగతం పలుకుతున్నారు. సమ్మక్కను ఈ రాత్రి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. కాగా, మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుని.. భక్త జనులకు దర్శనమిస్తున్నారు.

కరెంట్ కట్ చేస్తే సస్పెండే.. సీఎం వార్నింగ్
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై సీఎం విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ, కోత‌లు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి విద్యుత్ కోత‌ల‌పై సాగుతున్న ప్రచారంపై అధికారుల‌ను ప్రశ్నించారు. గ‌తేడాదితో పోల్చితే గ‌త రెండు నెల‌ల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా చేసినట్లు ట్రాన్స్ కో జెన్​కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు. ఇటీవ‌ల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల ప‌రిధిలో కొంతసేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింద‌ని తెలిపారు. దానికి కార‌ణాలు ఏమిట‌ని సీఎం ప్రశ్నించారు. సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు స‌రి చూసుకుంటూ ఉండాల‌ని, అలా చూసుకోక‌పోవ‌డంతో స‌మ‌స్య త‌లెత్తింద‌ని అధికారులు తెలియ‌జేశారు.

గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురు అరెస్ట్‌..
గొర్రెల పంపిణీ అవకతవకల్లో ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. వారిలో కామారెడ్డి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గొర్రెల పంపిణీలో అవకతవకలు పాల్పడి రూ.2.10 కోట్లు కొట్టేశారు అధికారులు. గొర్రెలను కొనుగోలు దారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. కాగా.. గుంటూరు జిల్లా చెందిన గొర్రెల పెంపకందారులు ఇచ్చిన ఫిర్యాదు పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై (Onion Exports) కేంద్ర ప్రభుత్వం (Modi Government) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సడలించింది. నాలుగు దేశాలకు పరిమిత స్థాయిలో ఉల్లిపాయల్ని ఎగుమతి చేసుకొనేందుకు వ్యాపారులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్‌, బెహ్రెయిన్‌, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన పరిమాణంలో ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని ఆయన స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

జమ్మూ కశ్మీర్‌లో మంచు బీభత్సం.. విదేశీయుడు మృతి
జమ్మూ కశ్మీర్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. గుల్‌మార్గ్‌లో మంచు చరియలు విరిగిపడడంతో ముగ్గురు విదేశీ పర్యాటకులు చిక్కుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలికి వెళ్లి వెలికితీయగా ఒక రష్యన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరిని రక్షించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకో ఆరుగురిని కూడా రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు చిక్కుకున్నారేమోనన్న సమాచారంతో ఆర్మీ, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది.హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. ప్రస్తుతం మంచు పర్వతాలను జల్లెడ పడుతున్నారు. వాస్తవానికి కొండచరియలు దగ్గరకు వెళ్లేటప్పుడు స్థానికులను సహాయంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ పర్యాటకులు మాత్రం ఎలాంటి సాయం లేకుండానే.. విదేశీ పర్యటకులు కొంగ్‌డోరి వాలు ప్రాంతంలో స్కీయింగ్‌ వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కశ్మీర్‌ను మంచు కమ్మేసింది. హిమపాతం కారణంగా ఎత్తైన ప్రాంతాలతో పాటు లోయలూ మంచుతో నిండిపోతున్నాయి. దీంతో స్కీయింగ్‌కు పేరుపొందిన గుల్‌మార్గ్‌కు పర్యటకులు వెల్లువెత్తారు. పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

బైడెన్ డాగ్ ఎంత పని చేసిందంటే..!
మూగ జీవాలను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. కొందరు పక్షుల్ని.. ఇంకొందరు కుక్కలను పెంచుకుంటారు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లు జంతువులను పెంచుకోవడం చూస్తుంటాం. తమ స్థోమతను బట్టి ఒకటి కంటే ఎక్కువగా పెంచుకునేవాళ్లు ఉంటుంటారు. మనుషుల మాదిరిగానే వాటిని చూసుకుంటారు. అయితే జంతువులను పెంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తుంటారు. లేదంటే కొన్ని సార్లు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటారా? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న డాగ్.. ఎంత పని చేసిందో తెలిస్తే.. అయ్యో అని అనకుండా ఉండరు. జో బైడెన్‌కు ఎంతో ఇష్టమైన కుక్క.. వైట్‌హౌస్‌లో ఇతరులకు అభ్యంతరకరంగా మారింది. అధ్యక్షుడి భవనంలో పని చేస్తున్న సీక్రెట్ సభ్యులను పలుమార్లు కరిచినట్లు దృష్టికి వెళ్లింది. ఈ కుక్క కాటు బారిన పలువురు సిబ్బంది ఇప్పటికే పలుమార్లు వైద్యం తీసుకున్నట్లు తెలిసింది. దాదాపుగా కాళ్లు, చేతులు, నడుపుపై పలువురికి గాయాలైనట్లు సమాచారం.

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్య
ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ లాంటిది. ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో చెన్నై తలపడనుంది. మొత్తం.. 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. సాధారణంగా డిఫెండింగ్‌ చాంపియన్‌- రన్నరప్‌ మధ్య మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కొత్త ఎడిషన్‌ ఆరంభించడం ఆనవాయితీ. కానీ.. ఈ సారి అందుకు భిన్నంగా సీఎస్‌కే- గుజరాత్‌ టైటాన్స్‌కు బదులు.. సీఎస్‌కే- ఆర్సీబీతో పదిహేడవ ఎడిషన్‌ మొదలుపెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 22- ఏప్రిల్‌ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరుగుతున్నందున విశాఖలో ఆడనుంది. దేశంలో ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు. ఇప్పుడు 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల కానుంది. కాగా ఐపీఎల్‌–2024 పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ చెప్పిన విషయం తెలిసిందే.

ఆకట్టుకుంటున్న అజయ్ దేవగన్ ‘సైతాన్ ‘ ట్రైలర్..
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తాజాగా సైతాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్’. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను లాంచ్ చేశారు.. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రైలర్‌ కొనసాగుతుంది. సరదాగా సాగిపోతున్న కబీర్‌ (అజయ్‌) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అపరిచిత (మాధవన్‌) వ్యక్తిగా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. అతని నుంచి అజయ్‌ దేవగన్‌ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ.. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది.. కొన్ని సస్పెన్స్ సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.. మాధవన్‌ విలన్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జియో స్టూడియోస్‌ సమర్పణలో అజయ్ దేవగన్‌, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గుజరాతికి చెందిన ‘వష్’ మూవీకు ఇది రిమేక్ గా రాబోతుంది..

త్రివిక్రమ్ యూజ్ లెస్.. తొలిసారి పేరుతో సహా ఓపెనయిన పూనమ్!
గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూనం కౌర్ ఆ తర్వాత కాలంలో సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడడంతో ఆ విషయం మీద ఫోకస్ చేస్తున్న ఆమె సినిమాలకు దూరమైందని అందరూ అనుకున్నారు. అయితే కత్తి మహేష్ బతికి ఉండగా బయటకు వచ్చిన కొన్ని ఆడియో లీక్స్ సంచలనం రేపాయి. అప్పటి నుంచి ఆమె గురూజీ అనే పేరుతో కొన్ని విమర్శలు చేస్తూ వచ్చేవారు. ప్రస్తావించకపోయినా అది త్రివిక్రమ్ అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేది. అయినా సరే ఇప్పటివరకు ఎప్పుడూ సంయమనం కోల్పోయి మాట్లాడని ఆమె తాజాగా త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అంటూ ఒక ట్వీట్ చేసి కలకలం రేపింది. ఒక వెబ్ న్యూస్ పోర్టల్ తాజాగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఒకదానిని షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకొచ్చారు. త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ను కూడా తాను పంచ్ డైలాగ్స్ లాగా చెప్పలేనని పేర్కొన్నారు. అదే వీడియో కింద పూనం కౌర్ త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అని కామెంట్ చేసింది. సాధారణంగా ఈ కామెంట్ చూసిన అందరూ అది ఫేక్ అకౌంట్ అని, ఎవరో చేసిన కామెంట్ అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే అది పూనం కౌర్ ఒరిజినల్ అకౌంట్. దీంతో ఏకంగా త్రివిక్రమ్ పేరుని లాగుతూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నిజానికి త్రివిక్రమ్ కు పూనం కౌర్ కు మధ్య ఉన్న గొడవేమిటి అనే విషయం మీద ఇప్పటివరకు ఎవరూ క్లారిటీగా మాట్లాడింది లేదు. అలాంటిది ఇప్పుడు ఆమె ఏకంగా త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అనడం హాట్ టాపిక్ అవుతుంది.

Exit mobile version