నువ్వు సిద్ధమంటే.. మేం యుద్ధం అంటాం..
నువ్వు సిద్ధమంటే.. మేం యుద్ధం అంటామంటూ వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం నియోజకవర్గ నాయకులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా అనేక విషయాలపై స్పందించారు.. జగన్ సిద్ధం అంటే.. మనం యుద్ధం అంటాం.. అయినా, మనం యుద్ధం చేయాల్సిన అంత గొప్పవాడా? కదా? అనేది మనమే నిర్ణయించుకోవాలన్నారు.. సిద్ధం పోస్టుల గురించి కొంతమంది చెబితే సినిమా డైలాగులు మనకొద్దని చెప్పా.. నువ్వు సిద్ధమంటే మేం యుద్ధమని చెబుతాం.. కానీ, నేను సింహం లాంటోండని సీరియస్ గా జగన్ కి చెప్పలేను అన్నారు. నిజజీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడుతా.. విశాఖలో గోడల బద్ధలు కొట్టుకుని వెళ్దాం అన్నారు. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఉండాలని కోరుకుంటానన్న ఆయన.. పుల్ల కొరకు పోయి అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు.. ఓటు చీలకుండా ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చి ఎంత నలిగిపోయాను నాకు తెలుసు.. ఈ మాటతో జాతీయ నాయకుల వద్ద ఎన్ని చివాట్లు తిన్నాను నాకు తెలుసు.. కానీ, నేనెప్పుడూ జనసేన ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించలేదు.. తెలుగు ప్రజల భవిష్యత్తు గురించే ఆలోచించానని వెల్లడించారు పవన్ కల్యాణ్.. పొత్తులు బలంగా నిలబడాలి.. మనలో మనకి ఇబ్బందులు త్యాగాలు తప్పవన్నారు.. ప్రతి ఎన్నికల్లో మూడో వంతు బలంగా జనసేన తీసుకుంటుంది.. మన ఓటు టీడీపికి ట్రాన్స్ఫర్ అయితేనే.. స్థానిక ఎన్నికల్లో మరింత బలపడగలం అన్నారు.
జగన్ మా అన్న అయితే.. చంద్రబాబు మా బావ..!
సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే.. సీఎం వైఎస్ జగన్ మా అన్న అయితే.. చంద్రబాబు మా బావ.. మా బావ పగటి కలలు కంటున్నారు.. రెండు నెలలలో ప్రభుత్వం మారిపోద్ది అంటారు.. అసలు నువ్వు ప్రజలకేం చేసావో చెప్పు మారడానికి అంటూ నిలదీశారు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు.. శ్రీకాకుళం నియోజకవర్గ వాలంటీర్ల సేవలకు పురష్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడితే ఫ్లూట్ వాయించినట్లుంటుంది.. రాష్ట్రంలో ప్రభుత్వ విధివిధానాలు స్పష్టంగా చెప్పగలిగే ఏకైక వ్యక్తి ధర్మాన అన్నారు. ఇక, గ్రామాల్లో కి వెలితే ఇంకా గుర్తేంటి? అంటే ఫ్యాన్ కి బదులు చెయ్యి చెపుతున్నారు.. తండ్రిది చెయ్యి… కోడుకు ది ఫ్యాన్ అని చెబుతున్నామన్న ఆయన.. ప్యాన్ గుర్తును వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక, విశాఖ రాజధాని కోసం తన పదవికి రాజీనామ చేస్తానన్న వ్యక్తి మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ధర్మాన, బొత్స సత్తి బాబు వల్లే.. ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది అని తెలిపారు అప్పలనాయుడు.. ఇక, రెడ్ బుక్ లో పొత్తులుతో ఓడిపోతాం అని రాస్తావు తప్ప ఇంకేం రాస్తావ్ లోకేష్..? అని ఎద్దేవా చేశారు. పంచాయతీ రాజ్ శాఖ చేసిన నీకే పంచాయితీల గురించి తెలీదు అంటూ దుయ్యబట్టారు.. ఇక, సీఎం వైఎస్ జగన్ దూతగా ఉన్నవారు వాలంటీర్లు.. గ్రామాల్లో మాకంటే వాలంటీర్లైనా మీకే గౌరవం ఉంది.. వాలంటీర్ల వల్లే మేం గ్రామాల్లో ధైర్యంగా తిరుగుతున్నాం అన్నారు. మరోవైపు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని ఎమ్మెల్యేల సీట్లు మారవు.. మీ పని మీరు చేసుకోండని అధిష్టానం స్పష్టం చేసింది.. మీరు అపోహలు పడోద్దన్న ఆయన.. ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం పై కోపం ఉంది.. టీచర్లను ఉదయాన్నే స్కూల్ కి వెల్లమంటున్నాం అని వారికి జగన్ పై కోపం అన్నారు. మరోవైపు.. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిస్తే ఇక్కడ వైఎస్ జగన్ ఓటమి అంటూ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిగా లా హడావిడి చేస్తున్నారుని మండిపడ్డారు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు.
నారా భువనేశ్వరి అసలు విషయం పసిగట్టారు.. అందుకే పోటీ అంటున్నారు..!
కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సరదాగా సభలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు భువనేశ్వరి.. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఆయనకు రెస్ట్ ఇద్దాం.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి చమత్కరించారు.. అయితే, నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నారా భువనేశ్వరికి ప్రజల నాడి తెలిసింది.. రాష్ట్రంలోనే కాదు కుప్పంలోనూ టీడీపీ ఓటమి పాలవుతోందని భువనేశ్వరి పసిగట్టారన్నారు. 35 ఏళ్లు ఎమ్మెల్యే గా గెలిచినా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదు అని భువనేశ్వరి గుర్తించారని వ్యాఖ్యానించిన జోగి రమేష్.. కుప్పం ప్రజలు విసిగి వేసారి పోయారని గుర్తించి.. కుప్పం నుంచి పోటీ చేస్తానని అంటున్నారని దుయ్యబట్టారు. ఓటమిని చంద్రబాబు భార్య భువనేశ్వరి ముందుగానే గుర్తించింది.. 175 నియోజక వర్గాల్లో అభ్యర్ధులను నిలబెట్టలేని చవట చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. పొత్తుల కోసం పొర్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు.. ఒంటి చేత్తో 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్ తో చంద్రబాబుకి పోలిక అంటూ ఎద్దేవా చేశారు. సొల్లు మాటలు చెప్పే వ్యక్తి చంద్రబాబు.. పొత్తుల కోసం ఎంత మంది కాళ్లైనా చంద్రబాబు పట్టుకుంటాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్..
మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్సై సహా ముగ్గురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తోన్న ఓ ఎస్సై సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. భూత్పూర్ మండలం అన్నాసాగర్ దగ్గర నేషనల్ హైవే 44పై ప్రయాణిస్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది.. లారీనీ ఓవర్‌టేక్ చేస్తుండగా.. చెట్టును ఢీకొట్టింది కారు.. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరికి సీరియస్‌గా ఉంది.. మృతుల్లో నంద్యాల జిల్లా రాచర్ల ఎస్సై వెంకటరమణ, అతడి అల్లుడు, కారు డ్రైవర్ ఉన్నారు. అయితే, ఈ నెల 14వ తేదీన తన కుమార్తె వివాహాన్ని జరిపించాడు ఎస్సై.. ఇంతలోనే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు కారు వెళ్తుండగా.. జరిగిన ఈ ప్రమాదంలో నవ వరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
చంద్రబాబుకు రెస్ట్..! భువనేశ్వరి తన మనసులోని మాటను బయటపెట్టారు..
నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంది నేతలు.. కుప్పంలో నారా చంద్రబాబునాయుడు పని అయిపోయిందని భువనేశ్వరి మాటలు బట్టి అర్ధం అవుతోందన్నారు మంత్రి ఆర్కే రోజా.. మేం ఏదైతే ఇన్ని రోజులుగా చెబుతూ వస్తున్నామో.. భువనేశ్వరి తన మనసులో మాటను ఈరోజు బయటపెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు వయసొచ్చింది.. రెస్ట్ తీసుకునే సమయం ఆసన్నమైందన్న ఆమె.. భువనేశ్వరి తన కోరికను చంద్రబాబుకు ఈ విధంగా తెలియజేశారని చెప్పుకొచ్చారు. ఇక, మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని వ్యక్తి చంద్రబాబు అంటూ ఆరోపించారు.. కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాడు… కుప్పాన్ని అభివృద్ధి చేసింది సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డే అన్నారు మంత్రి ఆర్కే రోజా.
పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే గ్రంథి కౌంటర్.. మళ్లీ సినిమా షూటింగ్‌కి పంపించే సమయం దగ్గరల్లోనే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన, ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.. ప్రజలు మళ్లీ పవన్ కల్యాణ్‌ను సినిమా షూటింగ్‌లకు పంపించే సమయం ఎంతో కాలం లేదన్నారు. కులాల మధ్య గోడవలు సృష్టించేందుకు పవన్ బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. పవన్ పిరికివాడు.. ఆయన ఎంత పిరికివాడో నేడు ఆయన మాటల్లోనే అర్థమైందన్నారు. మేం సిద్ధం అంటుంటే.. ఆయన యుద్ధం అంటున్నాడు.. ఇది ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. 2019 ఎన్నికల తర్వాత భీమవరం 3వ సారి వచ్చాడు.. ఆయన ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు..? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలకే ముఖం చూపించలేదు.. వారే పవన్ కల్యాణ్.. ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారో చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు వెన్నెముక లేకే.. టీడీపీ, బీజేపీతో కలసి వస్తున్నాడు అని సెటైర్లు వేశారు ఎమ్మల్యే గ్రంథి.. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించిందే పవన్ కల్యాణ్ అని ఆరోపించిన ఆయన.. పవన్ భీమవరం పర్యటన.. భీమవరం నియోజకవర్గ ప్రజలే కాకుండా.. తెలుగుదేశం నాయకులు కూడా కళ్లు తెరిపించేలా ఉందన్నారు. సినిమాల్లో యాక్టింగ్ చేసే వాళ్లు నిజ జీవితంలో కూడా యాక్టింగ్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యవహార శైలిని బట్టి అర్థమైందన్నారు. ఇక, భీమవరం ప్రజలు మళ్లీ సినిమా షూటింగ్ పంపించే సమయం ఎంతో కాలం లేదన్నారు.
సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు వేయండి.. సింగరేణి సీ.ఎండీకి ఆదేశాలు
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో సింగర్‌రేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, డైరెక్టర్(పర్సనల్) ఎన్.వి.కె.శ్రీనివాస్, ఇతర అధికారులతో డిప్యూటి సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్భందీగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళాలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండా చేసుకున్న రూ.కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందం పురోగతి గురించి ఆరా తీశారు. ప్రమాదభరితమైన బొగ్గు రంగంలో పనిచేస్తున్న 43 వేల మంది ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత ను కల్పించిన వారమవుతామని తెలిపారు.
నాణ్యమైన విద్యుత్ సంపూర్ణంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం..
రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండి రీజ్వితో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్ ఈ రెండు అంశాల సందర్భంలో ఇబ్బందులు వస్తున్నాయి.. వీటిని సమన్వయం చేసుకొని తక్కువ సమయంలో పరిష్కరిస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని పేర్కొన్నారు. కమర్షియల్ ఏరియాలో మెయింటెనెన్స్ కోసం రాత్రివేళ లైన్ క్లియరెన్స్ (LC) తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతాల్లో అది కూడా తక్కువ సమయం LC తీసుకోవాలని.. LC తీసుకునే సమయాన్ని ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులకు ముందే తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక విద్యుత్ అధికారులు మాట్లాడి డిమాండ్ కు తగినంతగా విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని వివరించాలని తెలిపారు. గత ఏడాదికి ఈ ఏడాదికి డిమాండ్ ఎంత పెరిగింది. ఆ మేరకు సప్లైని ఎలా పెంచుతున్నామని గణంకాలతో స్థానికంగా మీడియాకు అందించాలని కోరారు.
భారీగా టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుద్యోగుల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని ముందు నుండి ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ తమ హామీలను నెరవేర్చే పనిలో పడింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. 11 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకోసమని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. కాగా.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో పాటు 563 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తెలంగాణ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 563 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది
ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో కమలం పార్టీపై కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. బీజేపీ నిజ స్వరూపాన్ని భగవంతుడే ప్రజల ముందు ఉంచాడని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ గెలవదనే ఘటన చండీగఢ్ మేయర్ ఎన్నిక నిరూపించిందని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలను బహిరంగంగా కూల్చివేసే ప్రయత్నాలకు బీజేపీ పాల్పడుతోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలపై (Farmers protest) స్పందించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రైతులను నగరంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించకపోవడమే కాక వారి సమస్యలు కూడా వినడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు.
ఈ మాజీ లవర్ ఎంత అదృష్టవంతుడో.. 2 కోట్ల గిఫ్ట్‌తో సర్‌ఫ్రైజ్!
ప్రేమ ఎంతో మధురం.. ప్రియురాలి మనసు అంత కఠినం.. ఇది టాలీవుడ్ సినిమాలోని పాట. ఓ సినీ కవి కథకు తగ్గట్టుగా రాసి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో ఓ ప్రియురాలు చేసిన పనిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. అది కూడా మాజీ బాయ్‌ఫ్రెండ్ కోసం అత్యంత ఖరీదైన గిఫ్ట్‌తో సర్‌ఫ్రైజ్ చేసి.. అతడి ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ఆ మాజీ ప్రేమికులెవరు? ఈ సీన్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదవాల్సిందే. చాలా మంది ప్రేమ విలువ తెలియకుండానే ప్రేమించుకుంటారు. కొంత కాలానికి విడిపోతుంటారు. కనీసం ముఖం వైపు చూడ్డానికి కూడా ఇష్టపడరు. ఇంకొంతమంది అయితే ప్రాణాలు పెట్టే వారుంటారు. కొన్ని సార్లు సినిమాల్లో జరిగినట్టుగా.. నిజ జీవితంలో జరగకపోవచ్చు. కానీ ఓ మాజీ ప్రియురాలు.. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ (Ex Boyfriend) కోసం ఏకంగా రూ.2 కోట్ల ఖరీదైన కారును (Car Gifts) గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో (Australia) చోటుచేసుకుంది. ప్రేమికులు అన్నాక గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడాలు సహజమే. ఏవో చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారు. కానీ విడిపోయిన తర్వాత కూడా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడమంటే బహుశా ఈ ఘటనే కావొచ్చు. టిక్‌టాక్ స్టార్ అయిన అన్నా పాల్ (24).. (Anna Paul) తన మాజీ బాయ్‌ఫ్రెండ్ పాల్ థామ్సన్‌కు రూ. 2 కోట్ల విలువైన అతని డ్రీమ్ కారును కొనుగోలు చేసి.. తాళాలు అందించింది. తాళాలు చూడగానే అతడు ఒకింత ఆశ్చర్యపోయాడు. ఊహించని ఆ పరిణామంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కారు నచ్చిందా? అని ఆమె అడగ్గానే అతడు అన్నాపాల్‌ను కౌగిలించుకుని ముద్దాడాడు. ఈ సంఘటన అంతా రెండు కుటుంబాల మధ్యే జరగడం విశేషం.
ఎన్నికలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ డిస్మిస్
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగాయో.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ తెలిసిందే. రక్తపాతం మధ్య ఎన్నికలు.. ఇంకోవైపు టెస్ట్ మ్యాచ్‌లా ఫలితాలు రావడం ప్రపంచమంతా చూసింది. ఆ తర్వాతైనా ఫలితాలు చక్కగా వచ్చాయంటే అది కూడా లేదు. ఏ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. ఇప్పటికే పాక్‌లో ప్రభుత్వం ఏర్పడ లేదు. తాజాగా సైన్యం జోక్యంతో PML-N మరియు PPP కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి షెహబాజ్ షరీఫ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్వరలోనే షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది(Pak Supreme Court). న్యాయవ్యవస్థ ప్రత్యక్ష పర్యవేక్షణలో 30 రోజుల్లో కొత్త ఎన్నికలను ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఓట్ల తారుమారు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కానీ ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.
థియేటర్ల బిజినెస్ లోకి రవితేజ.. ఏషియన్ తో కలిసి అక్కడ మల్టీప్లెక్స్
ప్రస్తుతం మన తెలుగు సినిమా హీరోలందరూ ఒకపక్క నటిస్తూనే మరో పక్క బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు చాలా మంది హీరోలు తమ సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి తమ సొంత సినిమాలు నిర్మించడమే కాదు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇక మరొక పక్క ఏషియన్ సంస్థతో కలిసి దియేటర్ల బిజినెస్ లోకి కూడా దిగుతున్నారు హీరోలు. ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి, అల్లు అర్జున్ త్రిబుల్ ఎ, విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ మల్టీప్లెక్స్ తో పాటు ఇప్పుడు రవితేజ కూడా అదే బిజినెస్ లోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. వీరితో ఈ మల్టీప్లెక్స్ లో భాగస్వామ్యం చేసి పాపులర్ అయిన ఏషియన్ సంస్థ ఇప్పుడు మరోసారి మరో మల్టీప్లెక్స్ నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంది. దిల్షుక్నగర్ ప్రాంతంలో ఆరు స్క్రీన్ల గల ఒక అత్యాధునిక మల్టీప్లెక్స్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు మరో ఆరు నెలల్లో దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. నిజానికి రవితేజ కూడా ఒకపక్క నిర్మాతగా మారి పలు సినిమాలు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన తన సొంత సినిమాల కంటే ఇతరులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వైవా హర్ష హీరోగా తెరకెక్కిన సుందరం మాస్టర్ అనే సినిమా కూడా రవితేజ బ్యానర్ లో నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే.
గూజ్ బంప్స్ తెప్పించేలా భీమా టైటిల్ సాంగ్
మాచో స్టార్ గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ టీజర్ తో హ్యాజ్ బజ్ క్రియేట్ చేసిందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. గోపీచంద్, మాళవిక శర్మల అందమైన కెమిస్ట్రీని చూపించిన ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మించిన ఈ చిత్రం సెకండ్ సింగిల్ గల్లీ సౌండుల్లో పాటని తాజాగా విడుదల చేశారు. లైవ్లీ కంపోజిషన్‌కు పేరుపొందిన రవి బస్రూర్ గూస్‌బంప్స్ తెప్పించే మ్యాసీవ్ ట్రాక్‌ని స్కోర్ చేసారు. గోపీచంద్ పాత్ర గురించి చెప్పే టైటిల్ ట్రాక్ కాగా తను నేరస్తులను భయపెట్టే ఆరోగెంట్ పోలీసు అంటూ సంతోష్ వెంకీ వోకల్స్ పాటలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసేలా ఉన్నాయ్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కంపోజర్ రవి బస్రూర్, సింగర్ సంతోష్ వెంకీ కలిసి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఇక అద్భుతమైన కంపోజిషన్, సాహిత్యం, పవర్ ఫుల్ వోకల్స్ తో ఈ పాట మాస్ ని అలరిస్తోంది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ, రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవి వర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు ‘భీమా’ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.
ఆ బాలీవుడ్ హారర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన తృప్తి..
యానిమల్ మూవీ తో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా యంగ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఎంతో పాపులర్ అయింది.ఒక్క సినిమాతో తృప్తి విపరీతంగా ఎంతో ఫేమస్ అయ్యారు.. ‘యానిమల్’లో రణబీర్ కపూర్, తృప్తి దిమ్రి మధ్య సన్నివేశాలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. యానిమల్ ఇచ్చిన జోష్ లో తృప్తికి వరుస క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.. తాజాగా కార్తీక్ ఆర్యన్ సరసన ‘భూల్ భులాయ్యా’లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా… జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ తమిళ, తెలుగు భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘భూల్ భులయ్యా’ పేరుతో రీమేక్ చేశారు. అంతే కాదు… కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘ భూల్ భులయ్యా 2’ పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది.. ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ తెరకెక్కిస్తున్నారు. అందులో తృప్తి దిమ్రి నటిస్తున్నట్లు ఇవాళ అనౌన్స్ చేశారు.’వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ భూల్ భులయ్యా” అంటూ తృప్తి దిమ్రికి స్వాగతం పలికారు హీరో కార్తీక్ ఆర్యన్. ”ఆమె చిరునవ్వు ఎంతో మంది గుండెల్లో భయం కలిగిస్తుంది. తృప్తి రాకతో థ్రిల్స్, చిల్స్ మరింత పెరుగుతాయి” అని టీ సిరీస్ పేర్కొంది. ‘భూల్ భులయ్యా 3’ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘యానిమల్’ సినిమా నిర్మాతలలో ఆయన కూడా ఒకరిగా వున్నారు.అక్షయ్ కుమార్ ‘భూల్ భులయ్యా’ సినిమాలో విద్యా బాలన్ నటించారు. తెలుగులో జ్యోతిక చేసిన పాత్రను ఆమె పోషించారు. అయితే, సీక్వెల్ ఆమె చేయలేదు. కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’లో టబు నటించారు. అందులో కియారా అడ్వాణీ హీరోయిన్. అయితే.. ఇప్పుడు మూడో పార్ట్ ‘భూల్ భులయ్యా 3’కు వచ్చేసరికి మళ్లీ విద్యా బాలన్ ను తీసుకున్నారు. దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది.
