Site icon NTV Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీఎం జగన్‌, చంద్రబాబుకు కేఏ పాల్‌ సవాల్‌.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్‌ విసిరారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, వైఎస్‌ జగన్ నా సవాల్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.. జగన్ కి నేనొక అవకాశం ఇస్తున్నా.. నాతో కలవమనండి..! అని సూచించారు. ఇక, జగన్, చంద్రబాబుని సిద్ధమా అంటున్నాడు.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు, జగన్ కి నా సవాల్.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కి విగ్రహం అవసరమా..? అని ప్రశ్నించారు. దళితులు విగ్రహలతో మోసపోరు అని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల వారికి నా విన్నపం.. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి భయటకు రండి.. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు అని విమర్శించారు. బీఆర్ అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగాడు…. కానీ, విగ్రహాలు పెట్టమని అంబేద్కర్ అడిగాడా? అని నిలదీశారు. అయితే.. నేను ఏ మతాన్ని, కులాన్ని విమర్శించను అన్నారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేనకు ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడు అంటూ విమర్శలు గుప్పించారు పాల్.. మరోవైపు వైఎస్‌ జగన్‌ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నాడు.. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నాడు.. వాళ్లందరని మడతపెట్టేయలని పిలుపునిచ్చారు. ఇక, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. కాగా, గతంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేఏ పాల్ పోటీ చేసిన విషయం విదితమే కాగా.. ఆయన పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాని విషయం తెలిసిందే.

పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై క్లారిటీ.. అక్కడి నుంచే..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, విపక్షాల మధ్య పొత్తుల వ్యవహారంతో అభ్యర్థుల ప్రకటన కాస్త లేట్‌ అవుతుందని నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ఎవరు? ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేదానిపై అంతర్గతంగా కొంత క్లారిటీ ఉందని తెలుస్తోంది. మరోవైపు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే చర్చ సాగుతూ వస్తుంది. కోస్తా నుంచి లేదా రాయలసీమ నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీనిపై జనసేన నేత చంద్రశేఖర్‌ క్లారిటీ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు జనసేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేనాని.. భీమవరం పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడినట్టు తెలిపారు.. అంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 20వ తేదీన ఆయన భీమవరం వెళ్లాల్సి ఉండగా.. 21వ తేదీ ఉదయం హెలికాప్టర్‌లో పవన్‌ కల్యాణ్‌.. భీమవరం వస్తారని తెలిపారు.. రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాలు పెరగడం మూలంగా పవన్‌ పర్యటన ఆలస్యం అవుతున్నట్టు పేర్కొన్నారు. భీమవరంలో పవన్ కల్యాణ్‌ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.. టీడీపీ, జనసేన నాయకులతో పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ సమావేశం అవుతారని తెలిపారు. ఇక, పవన్‌ కల్యాణ్‌.. భీమవరం నుండి పోటీ చేస్తారు చెప్పుకొచ్చారు జనసేన జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఎన్నికల సమయంలో ఏపీ పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు.. సీట్లు దక్కకపోవడంతో విపక్షాల వైపు చూస్తుంటే.. ఇక, సుదీర్ఘంగా విపక్షంలో పనిచేసే.. ఈసారి టికెట్‌ వచ్చే అవకాశం లేదని తేలడంతో.. మరికొందరు నేతలు అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. ఇప్పుడు నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు.. వైసీపీకి గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వచ్చారు ముద్రోయిన.. దీంతో.. ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పేసి.. వైసీపీలో చేరుతారని.. ఫ్యాన్‌ పార్టీ కండువా కప్పుకోవడానికి ఆయన క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చారనే చర్చ నడుస్తోంది. అయితే, తనకు టీడీపీ అధినేత చంద్రబాబు అన్యాయం చేశాడని నిన్న కార్యకర్తల సమావేశంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకున్న విషయం విదితమే.

చంద్రబాబుతో చర్చకు రెడీ.. సీఎం అవసరంలేదు.. మా నేతలు చాలు..!
రాప్తాడు సభలో సీఎం వైఎస్‌ జగన్ చేసిన విమర్శలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ విసిరిన ఛాలెంజ్‌కు స్పందించారు.. వైసీపీ అరాచక, విధ్వంసక పాలనపై జగన్‌తో తాను చర్చకు సిద్ధమన్నారు. బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు మాని దమ్ముంటే బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అంటూ సవాల్‌ చేశారు.. అంతేకాదు.. ఏ అంశం మీద అయినా, ఏ రోజైనా, ఎక్కడైనా తాను చర్చకు రెడీ.. చర్చకు వచ్చే దమ్ము జగన్‌కి ఉందా అంటూ ఛాలెంజ్‌ విసిరారు.. అయితే, చంద్రబాబు సవాల్‌పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడడ్ఇ.. చర్చకు రెడీ అన్నారు.. ప్రజాస్వామ్యంలో చాలా వేదికలు ఉన్నాయి.. సడెన్ గా ఒక ఛాలెంజ్ తో చంద్రబాబు వచ్చారు.. చంద్రబాబుకు సత్తా ఉంటే 2014-2019 మధ్యలో ఏమి చేశాడో చెప్పాలి. చెత్త పాలన అని దత్తపుత్రుడు చంద్రబాబును వదిలేసి 2019లో ఒంటరిగా పోటీ చేశాడు.. చంద్రబాబువి కారు కూతలు.. బరితెగించి మాట్లాడతారు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. వైసీపీ మేనిఫెస్టోలో అమలు చేసినవి మేం చెప్పుకుంటున్నాం అన్నారు సజ్జల.. మద్యం అమ్మకాలు రాష్ట్రంలో రతగ్గించగలిగాం.. అయితే మద్య నిషేధాన్ని అనుకున్న పద్ధతిలో చేయలేకపోయాం అన్నారు. మిగతావి అన్ని చేశాం.. ఏది చేయలేదో చెప్పండి? అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తున్నామని పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో చర్చకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవసరం లేదు.. మా నేతలు చాలు అన్నారు. పొద్దుపోని ఛాలెంజ్ లు ఎందుకు చంద్రబాబు ? అంటూ సెటైర్లు వేసిన ఆయన.. అవును కౌంట్ డౌన్ మొదలు అయ్యింది.. ప్రజలు నిర్ణయిస్తారు కదా..? అని ప్రశ్నించారు. మేం వాలంటరీల వ్యవస్థ తెచ్చామని చెబుతున్నాం.. అధికారంలోకి రాని చంద్రబాబు, లోకేష్ ఏదైనా మాట్లాడతారు అని మండిపడ్డారు.

ఎన్నికల ముందు చంద్రబాబు సరికొత్త నాటకాలు.. ధర్మాన ఫైర్‌
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు.. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేశారన్న ఆయన.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూపిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన మేరకు మేనిఫెస్టోలో పేర్గొన్న అంశాలన్నీ ఆచరణలో అమలు చేసిన ఏకైక నేత జగన్ మాత్రమే అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు సరికొత్త నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు నమ్మరని అధికారం కోసం అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటు అని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేశాడు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి కనిపించలేదా..? అని ప్రశ్నించారు ధర్మాన. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఉద్దాన ప్రాంతాన్ని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. చంద్రబాబు గత నాలుగేళ్లు డబ్బు పని చేస్తున్నారని చెప్పి.. ఇప్పుడు వాటికంటే ఎక్కువ ఇస్తానని అబద్ధపు మాటలు చెబుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి ధఱ్మాన ప్రసాదరావు.

రాయలసీమలో అధిక ఎమ్మెల్యే స్థానాలు బీసీలకు కేటాయించాలి..
రాయలసీమ ప్రాంతంలో బీసీలు అధికంగా ఉన్నారని.. వారికి పార్టీలు తగిన ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో అధికంగా ఉండే కుర్ణి శాలివాళ్ళకి, తిరుపతిలో అధికంగా ఉండే యాదవులకు, కర్నూల్ ప్రాంతంలో కురుబ సామాజిక వర్గానికి, అనంతపూరం జిల్లాలో అధికంగా ఉండే వాల్మీకి బోయ సామాజిక వర్గానికి తగిన ప్రాముఖ్యమైన కలగజేస్తూ పార్టీలు సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు తగిన రీతిలో సీట్లు కేటాయించకపోతే ఓటమి చవిచూస్తారని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కాగా.. ఈ ప్రెస్ మీట్లో బీసీ యూనియన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బి.భాస్కర్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధ్యక్షుడు కే తిరుమలేష్, బీసీ విద్యార్థి నాయకులు విక్రమ్ యోగేష్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల..
తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ కాసేపటి క్రితమే విడుదలైంది. కాగా.. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుండి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే లేదా జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష ఉండనుంది. అయితే.. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నా.. మళ్లీ అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తెలిపారు. అయితే.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ఈసారి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు.. ప్రభుత్వం వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది.

పత్తి కొనుగోళ్ళను కొనసాగించాలి.. కాటన్ కార్పొరేషన్ను కోరిన మంత్రి
తెలంగాణలో పత్తి కొనుగోళ్ళను కొనసాగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ను కోరారు. ఈ వాన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 44.92 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారని.. 25.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగలదని అంచనా వేసినట్లు చెప్పారు. తదనుగుణంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 8569.13 కోట్లు వెచ్చించి.. 12.31 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని దాదాపు 5,36,292 రైతుల వద్ద నుండి సేకరించినట్లు తెలిపారు. ప్రైవేట్ ట్రేడర్స్ ద్వారా మరో 4.97 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారన్నారు. అయితే ఇంకా కొన్ని జిల్లాలలో పత్తి మూడవసారి ఏరివేత దశలో ఉండగా.. కొన్ని ప్రాంతాలలో రైతుల వద్ద మొదట మరియు రెండవసారి తీసిన పత్తి మొత్తం కలిపి దాదాపు 71 లక్షల క్వింటాల వరకు ఉంటుందని అంచనా వేశారు. గత 15 రోజులుగా ప్రపంచ మార్కెట్లో కూడ పత్తికి డిమాండ్ పెరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా కొనుగోళ్లను నిరాటంకంగా మరియు వేగవంతముగా కొనసాగించాలని మంత్రి కోరారు. సీసీఐ (CCI) సందర్భములో కొనుగోళ్ల నుంచి తప్పుకుంటే మార్కెట్ లో ధరలు తగ్గే ప్రమాదము ఉందని.. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పత్తి రైతులకు ఆహ్వానించదగ్గ పరిణామం కాదని తెలిపారు. ఒకవేళ ఒకటి రెండు సందర్భాలలో పత్తి నాణ్యత ప్రమాణాలకు తగట్టుగా రాని ఎడల సీసీఐ (CCI) ప్రమాణాల ప్రకారం ధరలు నిర్ణయించి కొనుగోలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేశారు.

పొత్తుల ప్రచారంపై కిషన్ రెడ్డి క్లారిటీ..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. మెడ మీద తలకాయ లేని వాడు బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అని మాట్లాడుతారని.. మూర్ఖుడు, దుర్మార్గుడు చేస్తున్న ప్రచారాలను తాము ఖాతరు చేయమన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారన్నారు. పొత్తు వార్తలపై ఇంతకుముందు క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి.. ఇవాళ మరోసారి బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం సీరియస్.. కోర్టుకు హాజరుకావాలని అధికారికి ఆదేశం
చండీగఢ్ రిటర్నింగ్ అధికారిపై (Chandigarh Poll Officer) సుప్రీంకోర్టు సీరియస్ (Supreme Court) అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్‌ఆద్మీ పార్టీ వేసిన పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో మంగళవారం విచారణకు హాజరుకావాలని రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ఆదేశించింది. అంతేకాకుండా బ్యాలెట్ పత్రాలు కూడా సమర్పించాలని సూచించింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారు. వాస్తవానికి కాంగ్రెస్-ఆప్ సభ్యులకు సంపూర్ణ మద్దతు ఉంది. ఈ మేయర్ పోస్టును ఆప్-కాంగ్రెస్ కూటమి ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ఆప్ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మేయర్ ఎన్నిక సందర్భంగా అధికారి చేసిన అక్రమాల వీడియోను కూడా కోర్టుకు సమర్పించారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం రిటర్నింగ్ అధికారిపై మండిపడింది.

రాహుల్‌కి స్మృతిఇరానీ సవాల్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) సవాలు విసిరారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయాలని స్మృతి ఇరానీ సవాలు చేశారు. రాహుల్‌కి అమథీలో ఎంత ప్రజాదారణ ఉందో ఈరోజు భారత్ జోడో యాత్ర చూస్తే అర్థమవుతుంది అన్నారు. కనీసం స్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలు రాలేదని ఎద్దేవా చేశారు. అమేథీ వీధులన్నీ ఖాళీగా కనిపించాయని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి అమేథీ ప్రజలు ఎప్పుడో రాహుల్‌ను మరిచిపోయారని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమేథీ (Amethi) పార్లమెంటరీ నియోజకవర్గానికి స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జరిగిన ‘జన్ సంవాద్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అలాగే రాహుల్ సైతం భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అమేథీలో పర్యటిస్తున్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లో (Afghanistan) ఘోర విషాదం చోటుచేసుకుంది. నూరిస్తాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 25 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో హిమపాతాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కొండచరియలు విరిగిపడి 25 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్ నేతృత్వంలోని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాయపడ్డ మరో 10 మందిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయని.. దీంతో నూరిస్తాన్, కునార్, పంజ్‌షీర్ ప్రావిన్స్‌లలో రోడ్‌బ్లాక్‌లు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అలాగే పలు నివాసాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రావిన్స్‌లో మంచు హిమపాతం సంభవించి ఫలితంగా ఐదుగురు కార్మికులు అదృశ్యమయ్యారని వెల్లడించారు. వీరిలో ఇద్దరు మైనర్లు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.

‘రాయన్’గా వస్తున్న ధనుష్.. లుక్ అదిరింది బాసూ!
ధనుష్ కొత్త చిత్రానికి ‘రేయాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది. ధనుష్‌కి 50వ సినిమా కానున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుసారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. గత డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ధనుష్ గతంలో ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘రేయాన్’ టైటిల్ తో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి కనిపిస్తోంది. ఇక అతని వెనుక, సందీప్ కిషన్ మరియు కాళిదాస్ జయరామ్ చేతిలో కత్తులు ఉన్నాయి. సినిమాలో హింసకు లోటు ఉండదని పోస్టర్ ను చూస్తే అర్ధం అవుతోంది. ఇక ఈ కాంబినేషన్ కొత్తగా ఉండడం ఫ్యాన్స్ కి ట్రీట్ ఖాయం అని అంటున్నారు. ఇక దాదాపు 3 మంది వ్యక్తులు కసాయి దుకాణంలో పనిచేస్తున్నట్లు లేదా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌ను నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక గతంలో ‘పవర్ పాండి’ సినిమాని డైరెక్ట్ చేసిన ధనుష్ ఈసారి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సారి అతను యాక్షన్‌లోకి దిగినట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి రాయన్ అనే టైటిల్ పెట్టారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, జాకీ ఆర్ట్ డైరెక్టర్. పీటర్ హైన్ ఈ చిత్రానికి పోరాట సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. తొలి సినిమానే ఫీల్ గుడ్ సినిమాగా తెరకెక్కించిన ధనుష్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ కథను హ్యాండిల్ చేయడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు ‘నిలవుకు ఎన్మేల్ ఎన్నడి గోబం’ చిత్రానికి కూడా ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి టీనేజ్ డ్రామాగా ఉండబోతోంది.

సుమ ఆధ్వర్యంలో నేత్ర శిబిరం.. ఫ్రీగా ఆపరేషన్లు!
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉచిత ఐ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ కాంప్ కి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వందలాది మందికి ఉచిత కంటి చికిత్సలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమ కనకాల మాట్లాడుతూ – ఇవాళ ఈ ఐ క్యాంప్ లో పాల్గొనేందుకు వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నా,. ఆయన మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మేము స్థాపించిన ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థతో కలిసి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, శంకర్ నేత్రాలయ వారితో ఈ ఐ క్యాంప్ నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది. తెలుగు సినీ, టీవీ అసోసియేషన్ తమ సహకారం అందిస్తున్నారు. జుబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ కూడా తమ వంతు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఐ క్యాంప్ ను సినీ, టీవీ అసోసియేషన్ లోని సభ్యులంతా వినియోగించుకోవాలని కోరుతున్నానని అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కంటి వైద్యం చేయించుకోవాలని ఎదురుచూస్తున్న వారికి ఈ ఐ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా, ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నా. నానక్ రామ్ గూడలో ఉన్న స్థలం అన్యాక్రాంతం కాకుండా రిజిస్ట్రేషన్స్ ఆపించాం, అక్కడ సినిమా ఇండస్ట్రీ తరుపున పేద సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి తరుపున, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ కార్యక్రమం నిర్వాహకులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

Exit mobile version