*133 మంది తహశీల్దార్ల బదిలీ..
తెలంగాణలో 133 మంది ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు. అంతేకాకుండా.. 32 మంది ఆర్డీవోలు కూడా బదిలీ అయ్యారు. వారితో పాటు.. డిప్యూటీ కలెక్టర్లు, నయాబ్ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అధికారులు బదిలీలు జరిగాయి. కాగా.. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
*ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పవన్ పాల్గొననున్నారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయి. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలతో పవన్‌కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ క్రమంలోని టీడీపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరుపార్టీల నాయకులు శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరగనున్నాయి. పవన్‌కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. తొలి దశలో ముఖ్య నాయకులతో సమావేశాలు ఉండనున్నాయి. రెండో సారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలలో పాల్గొననున్నారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు, ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్ మూడు సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధమవుతోంది. ఉభయగోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు జనసేన ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
*రెండు రోజుల్లో ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. పొత్తులపై కీలక చర్చ!
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఒకట్రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పొత్తులపై చర్చల కోసం ఎన్డీయే భాగస్వామ్యపక్షం జనసేనను బీజేపీ అగ్రనాయకత్వం పిలిచే అవకాశం ఉంది. బహుశా, సోమవారం ఢిల్లీలో బీజేపీ, జనసేనలు పొత్తులపై చర్చలు జరిపే అవకాశం ఉంది. పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యపై బీజేపీ, జనసేన పార్టీలు ఓ అవగాహనకు రానున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తుల అంశంపై కూడా బీజేపీ, జనసేన నేతలు చర్చించే అనకాశం ఉంది. సోమ లేదా మంగళవారం రోజున పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పొత్తులపై మాత్రమే కాకుండా భవిష్యత్‌లో ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా పవన్‌తో పార్టీ పెద్దలు చర్చించనున్నారని సమాచారం. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.
*కాంగ్రెస్ పరిపాలన అయోమయంగా ఉంది..
తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పోరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50వేల కోట్ల పైన అవుతుంది.. మరి రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్ లో చెప్పలేదు అని ప్రశ్నించారు. ఫార్మసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది.. జీహెచ్ఎంసీ పాలకవర్గం బాధ్యతలను నిర్వహించడంలో ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. ప్రజాపాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగకుండ, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతుందని పేర్కొన్నారు. ఈనెల 13 న నల్లగొండలో జరిగే సభకు అందరూ హాజరు కావాలని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలను కోరామని తెలిపారు. మరోవైపు.. ఈనెల 19న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతారని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నిర్ణయాలను.. తమ సభ్యులు ఎండగడతారని పేర్కొన్నారు. ఒక్కరో ఇద్దరో పార్టీ మారితే వచ్చే నష్టం ఏమి లేదు.. అది వారి కర్మ అని కేటీఆర్ తెలిపారు.
*ముగిసిన మోడీ 2.0 చివరి బడ్జెట్ సమావేశాలు
ప్రధాని మోడీ 2.0 ప్రభుత్వ (PM Modi) చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శనివారం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జనవరి 31న చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు తాయిలాలు ఉంటాయని అంతా భావించారు గానీ.. అలాంటి ఊసేలేకుండా బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఇకపోతే ఈ చివరి సమావేశాల్లో అనేక బిల్లులను మోడీ సర్కార్ ఆమోదించింది. ప్రధానంగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేశారు. అలాగే పలు బిల్లులను ఆమోదించారు. సమావేశాల చివరిరోజున రామమందిరం నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. దీనిపై అమిత్‌షా మాట్లాడారు. ప్రధాని మోడీ కూడా సభనుద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్లలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. సమావేశాల ముగింపు సందర్భంగా ఓంబిర్లా మాట్లాడుతూ.. అధికార, విపక్ష బెంచ్‌లను సమానంగా చూశానని, సభా గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇక త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్, మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి రాబోతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమి కూడా అధికారం కోసం కృషి చేస్తోంది. మరీ వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందో వేచి చూడాలి.
*అబుదాబిలో మోడీ టూర్.. హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ప్రధాని మోడీ (PM Modi) ఈనెల 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని (First Hindu Temple) ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అబుదాబిలోని (Abu Dhabi) మొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి.. భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోడీ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించడానికి.. బలోపేతం చేయడానికి చర్చించుకోనున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకునే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే పర్యటనలో భాగంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో కూడా ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఆయన ఆహ్వానం మేరకు దుబాయ్‌లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2024లో పాల్గొని మోడీ ప్రత్యేక కీలకోపన్యాసం చేయనున్నారు. 2015 తర్వాత ప్రధాని మోడీ (PM Modi) యూఏఈలో (UAE) పర్యటించడం ఇది ఏడోది కాగా.. గత ఎనిమిది నెలల్లో ఇది మూడో పర్యటన కావడం విశేషం.
*బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది
బీజేపీ ప్రభుత్వం (BJP Government) పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోడీ (PM Modi) అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో (Parliament) ప్రధాని మోడీ ప్రసంగించారు. మా పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని.. దీంతో దేశ వ్యాప్తంగా మార్పు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఎంపీలంతా తమ జీతాలను బాధిత కుటుంబాలకు అందజేశారని గుర్తుచేశారు. జీ 20 సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఖ్యాతి పెరిగిందన్నారు. కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకున్నామని.. ఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలకు తీసుకోవడం వల్ల కాశ్మీర్‌లో ప్రస్తుతం శాంతి కనిపిస్తోందని తెలిపారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. ఎన్ని విపత్తులు ఎదురైనా అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగలేదని చెప్పుకొచ్చారు. కొత్త పార్లమెంటు భవనం కావాలని అందరూ చర్చించుకునేవారని.. కానీ గతంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పుడు కొత్త భవనాన్ని నిర్మించుకున్నామని.. అంతేకాకుండా ఈ సమావేశాల్లో అనేకమైన కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నామని మోడీ స్పష్టం చేశారు.
*నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో సంకీర్ణం.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు..
ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, అస్థిరత నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ కట్టబెట్టలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బ్యాట్ గుర్తును రద్దు చేయడంతో, అతని మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ “పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)”, బిలావల్ భుట్లోకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) పార్టీలు ఎక్కువగా సీట్లనను గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టోలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లుగా ఆ దేశ మీడియా వెల్లడించింది. ఎవరు ఏ పదవిని చేపడుతారనే దానిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. తామే ఎన్నికల్లో గెలిచామని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించుకున్నాడు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కూడా తనదే విజయమని చెబుతున్నారు. పాకిస్తాన్‌లో గురువారం 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీకి 71 స్థానాలు, భుట్టో పార్టీకి 53 స్థానాలను గెలుచుకుంది. మరో 15 నేషనల్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇక శనివారం ఉదయం వరకు వెలువడిన ఫలితాల్లో 99 స్థానాలను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. ఇందులో 88 మంది ఇమ్రాన్ ఖాన్‌కి విధేయులుగా ఉన్నారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 133 సీట్లు కావాలి. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో పాకిస్తాన్‌లో హంగ్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
*ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 28,000 దాటిన మృతుల సంఖ్య..
హమాస్ అంతాన్ని చూసే దాకా ఇజ్రాయిల్ గాజాలో యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ అంతమయ్యేదాకా యుద్ధాన్ని విరమించేంది లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో వెల్లడించారు. యుద్ధం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హమాస్ చేసిన నేరానికి సాధారణ పాలస్తీనా ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు యుద్ధంలో 28,064 మంది మరణించారని గాజాలోని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. గత 24 గంటల్లో 117 మంది మరణించినట్లు వెల్లడించింది. 67,611 మంది గాయపడ్డారు. గతంలో ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఏర్పడింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ నుంచి కిడ్నాప్ చేసిన పౌరుల్లో కొంతమందిని హమాస్ విడుదల చేయగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడిచి పెట్టింది. మరికొంత మంది ఇజ్రాయిల్ బందీలు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే, మరోసారి సంధి కోసం పారిస్ వేదికగా ఖతార్ ప్రయత్నిస్తుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో గాజాలోని ఉత్తర భాగాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలో కూడా వరసగా హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తోంది.
