*ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు ఇవే..
ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. కాగా.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదిలా ఉంటే.. మొదటి వారం రోజుల వరకు ఎలాంటి ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చు. ఈ మార్గదర్శకాలు.. రేపటి నుంచి అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించి.. రేపు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకంపై.. డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి వారం రోజులు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు సమన్వయం పాటించాలని.. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి బస్సులో ఎక్కిన మహిళా ప్రయాణికుల సంఖ్యను కూడా కండక్టర్లు విధిగా వివరాలు రాసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి పథకం అమలులోకి రానుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్.. సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. రేపు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం పరిధిలోకి 7200 బస్సులు రానున్నాయని సజ్జనార్ చెప్పారు. మరోవైపు.. రాబోయే రోజుల్లో 3వేల కోట్ల భారం పడనుందని తెలిపారు. కాగా.. రేపటి నుంచి వారం రోజుల వరకు టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చని.. వారం రోజుల్లో జీరో టికెట్ ఇష్యూ చేస్తామన్నారు. అందుకు సంబంధించి.. ఇప్పటికే అన్ని రీజనల్ సెంటర్స్ లో అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహనా కల్పించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్ణాటకకు తెలంగాణ ఆర్టీసీకి పోలిక లేదు… అక్కడి పరిస్థితులు వేరు.. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులూ రాకుండా జాగ్రత్త వహించడానికి తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సజ్జనార్ చెప్పారు. రాబోయే రోజుల్లో కొత్త బస్సులను తీసుకొస్తున్నామని.. వాటికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టనున్నామని తెలిపారు. ప్రతి మహిళా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు.
*నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం.. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటా
మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి అని లేఖలో పేర్కొన్నారు. కొడంగల్ లో రాజ్యం ఆదేశాలతో పోలీసు లాఠీలు నా ఇంటిపై పడి, నన్ను నిర్భంధించి, నడి రాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్ గిరి చలించిందన్నారు. ఆరు నెలలు తిరగక ముందే, కేవలం 14 రోజుల వ్యవధిలో నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది. ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది. ఈరోజు మీ రేవంతన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగురేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజ్ గిరిలోనే.. అని లేఖలో పేర్కొన్నారు. నా రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. మల్కాజ్ గిరికి అంతే ప్రాధాన్యత ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్ గిరి ప్రజలదేనన్నారు. ఐదేండ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశాను.. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని సార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండొచ్చు.. తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్టు… నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్లు ఆ బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించానని భావిస్తున్నాను.. ఈ సందర్భంగా మల్కాజ్ గిరి ప్రజలకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు. ఐదేళ్లే కాదు ఇక మీతో నా అనుబంధం.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటా. నాడు మీరు పోసిన ఊపిరి… నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుందని లేఖలో తెలిపారు.
*రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు లైన్ క్లియర్
తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను కమీషనర్లను తెలంగాణ డీజీపీ ఆదేశించారు. అంతేకాకుండా.. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో.. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయనుంది.
*ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. కాగా.. రేపు అసెంబ్లీలో మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం, ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండటంతో.. రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే.. శాఖల కేటాయింపు పై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రేపు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
*రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం.. అక్బరుద్దీన్ ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయం
రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం.. మా బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎవరూ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణం చేయరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆయన ముందు తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని అన్నారు. 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తానని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని గుర్తు చేశారు. దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ప్రోటెం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఎవరు దోస్త్, ఎవరు దుస్మన్ అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎంకి ఇచ్చిన లెక్కనే.. కాంగ్రెస్ కూడా భయపడి తమ చెయ్యిని కూడా ఎంఐఎం చేతికి ఇస్తుందని రాజాసింగ్ తెలిపారు. ఎందరో సీనియర్లు ఉన్న ఆయనే ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న, బీఆర్ఎస్ ఉన్న, టీడీపీ ఉన్న రేపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు కాళ్లు మొక్కి నెత్తి మీద కూర్చోడానికి ప్రయత్నిస్తారని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ మనిషి, టిల్లు అని ఆన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎందే రాజ్యం నడుస్తుందని రాజాసింగ్ విమర్శించారు.
*కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కాలు తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పొందుతున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం జగన్ ఆరా తీశారు. కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం జగన్ ఫోన్ చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి ఏపీ సీఎం తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
*డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల కమిషన్ సీరియస్
డూప్లికేట్ ఓట్లపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. తప్పుడు సమాచారంతో ఓటర్ నమోదుకు ప్రయత్నించే దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం వారికి శిక్షలు ఉంటాయని వెల్లడించింది. ఇదే విషయాన్ని రాష్ర్టంలోని అన్ని రాజకీయపార్టీలకు సైతం తెలియచేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులందరికి ఆదేశాలు జారీ చేసింది.
వాటిలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
*పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17,18 ప్రకారం ఒక ఓటర్ ఒకచోట మాత్రమే ఎన్‌రోల్ అయి ఉండాలి. అలా కాకుండా ఒక చోటకు మించి వేరే చోట లేదా మరో ప్రాంతంలో ఓటర్‌గా నమోదు చేసుకోవడం జరిగితే సెక్షన్ 31 ( పీపుల్స్ యాక్ట్ ) ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కేసులు నమోదు చేస్తారు.
*ఫారమ్ 6 అనేది ఫస్ట్ టైమ్ మాత్రమే ఎన్‌రోల్ చేసుకునేవారు వినియోగించాలి. ఫారమ్ 6 కింద దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడా కూడా ఓటర్‌గా నమోదు అయి ఉండకూడదు. అలా కాకుండా ఎవరైనా ఓటు కలిగి ఉండి కూడా ఫారమ్ 6 కింద ఎన్‌రోల్ చేసుకుంటే సెక్షన్ 31 ప్రకారం శిక్షించడం జరుగుతుంది.
*ఫారం 8 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి తగు విధంగా విచారణ చేయాలని బూత్ లెవల్ ఆఫీసర్‌లకు ఖచ్చితంగా కొన్ని అంశాలకు విచారణ చేసి తీరాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వాటిలో సంబంధిత వ్యక్తి ఓటర్ ఐడీని ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో చెక్ చేయాలి. అలా ఎక్కడైనా వారి పేరు వెబ్ సైట్‌లో ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని ఆ దరఖాస్తుదారుని అప్లికేషన్‌పై కామెంట్‌గా రాయాలి. ఫీల్డ్ వెరిఫికేషన్‌లో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి.
*వీటికి సంబంధించి బూత్ లెవల్ ఏజెంట్ల నుంచి గాని ఇతరుల నుంచి సందేహాలు, అభ్యంతరాలు ఉంటే బూత్ లెవల్ ఆఫీసర్లు నమోదు చేసుకోవాలి.
*వీటన్నింటిని అంటే డాక్యుమెంట్స్, ఫీల్డ్ వెరిఫికేషన్, బీఎల్వోలు, బీఎల్‌ఏల రిమార్క్స్ ను పొందుపరిచిన అనంతరమే ఈ ఆర్ ఓ లు ఆ దరఖాస్తులకు సంబంధించి తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
*ఏ దరఖాస్తుదారుడైనా తప్పుడు ధృవీకరణ, తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే వారిపై ఈఆర్‌ఓ కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా తగుచర్యలు తీసుకుంటారు.
*కొత్తగా కార్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే జనవరి నుంచి ఎక్కువ చెల్లించాల్సిందే..
కొత్త కార్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రముఖ కార్ కంపెనీలు తమ కార్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జనవరి నుంచి కార్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి కార్ మేకర్స్ వచ్చే నెల నుంచి తమ మోడళ్ల ధరలు పెంచనున్నాయి. ద్రవ్యోల్భణం, పెరుగుతున్న వస్తువుల ధరలు కారణంగా కార్ల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం కార్ మేకర్స్ మాత్రం ఏ మోడల్‌పై ఎంత ధర పెంచారనేది ప్రకటించలేదు. కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను ఏడాదికి రెండుసార్లు పెంచుతున్నాయి. ఇప్పటికే మారుతి తన కార్ల ధరలను జనవరి 2024లో పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపింది. జనవరి 16న భారత్‌లోకి హ్యుందాయ్ క్రేటాను విడుదల చేయాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చలు, ప్రతికూల మారకపు రేట్లు, వస్తువుల ధరలు పెరగడం వంటి ఇతరత్రా కారణాలు జనవరి నుంచి వాహనాల రేట్లను పెంచుతున్నాయి. మరోవైపు మహీంద్రా కూడా తన ఎస్‌యూవీ వాహణాలు, వాణిజ్య వాహనాలపై జనవరి నుంచి ధరల్ని పెంచనుంది. అయితే కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం.. కార్ల ధరల్లో పెరుగుదల మోడళ్ల బట్టి మారుతుందని తెలుస్తోంది.
