Site icon NTV Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ..
మిచౌంగ్‌ తుఫాన్‌ ఏపీలో విధ్వంసం సృష్టించింది.. అయితే, రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇస్తాం అన్నారు.. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో పల్నాడు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్షపాతం నమోదైంది.. ఈ తుఫాన్ తో రైతాంగం పంటలు కోల్పోయారు.. మిర్చి, అరటి, పత్తి , బెంగాల్ గ్రామ్ పంటలు పూర్తిగా పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుంది.. గతంలో హెక్టార్‌కు 15 వేల సబ్సిడీ ఉంటే జీవో నెంబర్ 5 ద్వారా ఆ మొత్తాన్ని రూ.17 వేలకు పెంచామని వెల్లడించారు. 9వ తేదీ నుండి నష్టపరిహారం అంచనా వేయటానికి బృందాలు పర్యటిస్తాయి అని తెలిపారు మంత్రి అంబటి.. రైతాంగం వేసిన పంటల్లో 33 శాతం పంటలు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా ఉందన్న ఆయన.. రైతులు ధైర్యం గా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామన్నారు. ప్రతి సంవత్సరం రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నారు. తుఫాను సమాచారం రాగానే ప్రతి జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి అలెర్ట్ చేశారు.. సీఎం సూచనలతో లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు.. వారికి అవసరమైన తాగు నీరు ఆహారం అందించారు.. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక, నాగార్జున సాగర్ లో నీళ్లు లేక సాగు చేయలేని దుస్థితిలో ఉన్న రైతులు కొందరైతే.. అప్పులు చేసి సాగుకు దిగితే ఇప్పుడు తుఫాన్‌.. రైతును ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఈ తుఫాన్‌ రైతాంగాన్ని ముంచేసింది.. అందుకే రైతాంగాన్ని ఆదుకునేందుకు, రైతాంగానికి అండదండగా ఉండేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు.

తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి విధితమే.. ఇదే సమయంలో.. ఆశించిన ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయారు.. అయితే, తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో చూశామన్న ఆయన.. ఏపీలో టీడీపీ, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారం కోసం కాదు ప్రతిపక్షం కోసం చంద్రబాబు జనసేనను కలుపు కున్నాడని.. ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నాడు.. ఎమ్మెల్యే కోసం పవన్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు.. వీరు ఇద్దరూ కలిసి జగన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్ సింహం మాదిరి సింగిల్ గా వస్తారు అని స్పష్టం చేశారు కొడాలి నాని.. ఇక, చంద్రబాబు పెద్ద 420.. ఆయన అధికారంలోకి రావడం కల అని స్పష్టం చేశారు.. సీఎం వైఎస్‌ జగన్ మీద వ్యతిరేకత లేదు.. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారని తెలిపారు. లారీ కింద దూరిన కుక్కకి టీడీపీ వారికి తేడా లేదని.. రేవంత్ రెడ్డి తెలంగాణలో గెలిస్తే ఇక్కడ టీడీపీ వాళ్లు సంబరాలు చేస్తున్నారు.. గెలిస్తే తమ వారని, ఓడితే తమకు సంబంధం లేదని చెప్పటం టీడీపీ నేతలకు అలవాటు అంటూ దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో సెటిలర్స్ తో ఓట్లు వేయించి కేసీఆర్‌ను ఓడిస్తమని చెప్పారు.. కానీ, హైదరాబాద్‌లో ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచిందా..? అని ప్రశ్నించారు. గ్రేటర్‌లో బీఆర్ఎస్‌ భారీ మెజార్టీతో గెలిచిందని గుర్తుచేశారు.

నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతా..
నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతాను అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను.. యువత భవిష్యత్ కోసం పోరాడుతుంటే అవమానాలు, వెటకారాలు చేస్తున్నారు.. అయినా వాటిని భరించడానికి సిద్ధం అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం కలిగిన నేల, అటువంటి చోట నుంచి వలసలు ఆగాలి అని ఆకాక్షించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం జనసేన బలంగా చేస్తోందన్నారు. ప్రజలకు జవాబుదారీ తనం కూడా వహించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరన్న ఆయన.. యువతరం రాజకీయాలను నమ్మడం లేదన్నారు. ఇక, సినిమాలు చేసి వందల కోట్లు సంపాదించుకుంటే స్వార్థపరుడిని అవుతాను.. అదే, రాజకీయాల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే 25 ఏళ్ల సేవ చేసినట్టే అన్నారు పవన్‌.. ఓటమి మీద ఓటమి ఎదురైన ఎక్కడా ఆగలేదు.. బీజేపీలో చేరితే నాకు కోరుకున్న పదవి ఇస్తారు.. అత్తరాంటికి దారేది అంటే మూడు గంటల్లో కథ చెప్పవొచ్చే.. అదే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏదీ అంటే జవాబు లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో దోపిడీ జరుగుతుంటే నన్ను విమర్శించే నాయకులు ఎందుకు గుర్తించలేకపోయారు.. అని ప్రశ్నించారు. జేజేలు కొట్టి ఎనర్జీ వెస్ట్ చేసుకోకండి ఎన్నికల్లో బలంగా ఓటేయండి అని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగి తీరాలి.. ఆంధ్రలో 29 బీసీ కులాలను తెలంగాణ గుర్తించడం లేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలును ఇస్తే ఒక్కసారి కూడా తెలంగాణ ప్రభుత్వంను ఎందుకు అడగలేదు.. ఎన్నికలప్పుడు పరస్పరం సహకరించుకునేప్పుడు ప్రజల ఇబ్బందులు ఎందుకు గుర్తుకు రావు అంటూ ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్‌.

సీఎం పదవిపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు..
ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌… విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ పోటీచేసిన స్థానాల్లో గెలిచి.. టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో వారిని గెలిపిస్తే సీఎం పోస్ట్‌ అడగవచ్చు అన్నారు.. ఇక, మేం టీడీపీ వెనకాల నడవడం లేదు.. టీడీపీతో కలిసి నడుస్తున్నరాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసైనికుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టబోను.. ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి అడగవచ్చు అన్నారు.. సీఎం ఎవరనేది చంద్రబాబు, నేను కూర్చొని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పవన్‌ కల్యాణ్‌. అన్నీ ప్రజలకు చెప్పే చేస్తాం.. మీ ఆత్మ గౌరవం ఎప్పుడు తగ్గించను.. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇక, మేం ఎవరికీ బీ పార్టీ కాదు అని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌.. నన్ను నేను తగ్గించునకైనానా.. మిమ్మల్ని పెంచడానికి నేను సిద్ధం అని ప్రకటించారు. ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే కాళ్లు, చేతులు తీసేసే బలం మనకు కలగాలి.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడుల్లో రాష్ట్రం 6వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని గెలిపిస్తే పోలీస్ శాఖకు పూర్వ వైభవం తెస్తాం.. శాంతిభద్రతల విషయంలో రాజీపడని అధికారులను నియమిస్తాం అన్నారు. నేను అహంకారంతో ఆలోచించే వాడిని కాదు.. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారు మయంచేయాలి.. అది నా లక్ష్యం అని వెల్లడించారు. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు బలమైన ఓట్లతో గెలిపించగలిగితే మన కోరిక తీరుతుంది.. ఒక్క జనసేన ఎంపీ ఉన్న స్టీల్ ప్లాంట్ గనులు సాధించేవాడిని అన్నారు పవన్‌ కల్యాణ్‌.

నిరుద్యోగులకి శుభవార్త.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాల పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్నారు.. అందులో కొన్ని భర్తీ కాగా.. మరికొన్ని ఫలితాల వరకు వచ్చాయి.. ఇప్పుడు గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ రిలీజ్‌ చేశారు. గ్రూప్ -2 తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566లు భర్తీ చేయనున్నారు.. ఇక, గ్రూప్‌ -2 పరీక్షలకు 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనుంది ఏపీపీఎస్సీ.. ఈ పరీక్షల కోసం 2023 డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు ధరఖాస్తులను స్వీకరించనున్నారు..

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటన.. రేపు రెండు జిల్లాలకు సీఎం జగన్‌
మిచౌంగ్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసమే సృష్టించింది.. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు ఉన్నా.. ఈ నెల 9వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్లి.. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు.. నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందజేస్తామని ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అయితే, క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రేపు మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు.. అందులో భాగంగా ముందుగా తిరుపతి, బాపట్ల జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ఈ పర్యటన కోసం రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. శుక్రవారం రోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన కొనసాగనుంది.. గ్రామస్ధులు, తుఫాన్‌ బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారి పాలెంకు చేరుకుంటారు.. అక్కడ తుఫాన్‌ బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెంకు వెళ్లనున్నారు.. రైతులతో మాట్లాడిన తర్వాత బుద్దాం చేరుకుని తుఫాన్‌ వల్ల దెబ్బ తిన్న వరిపంటలను పరిశీలించనున్నారు.. అనంతరం రైతులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్‌.. పంట నష్టంపై ఆరా తీయనున్నారు.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం వైఎస్‌ జగన్‌.

తొలగిపోయిన ప్రజాభవన్ కంచె.. చూసేందుకు ఎగబడ్డ జనాలు
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుంది.. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక.. గత ప్రభుత్వం ప్రగతి భవన్ చుట్టు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించానని తెలిపారు. పదేళ్ల పాటు బాధలను ప్రజలు మౌనంగా భరించారు.. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో.. ప్రజాభవన్ కంచే తొలగిపోవడంతో సీఎం కార్యాలయం చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వెళ్లారు. కొందరు కళాకారులు ప్రజా భవన్ ఎదుట పాటలు పాడుతూ బై బై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. అటుగా పోయే వాహనదారులు కూడా ఆగి సీఎం కార్యాలయాన్ని చూసుకుంటూ వెళ్లారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా కంచే ఉండటం.. జనాల్లో సీఎం కార్యాలయం ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటి ఎక్కువగా ఉండేది.. కానీ, ఇప్పుడు పూర్తిగా గేట్స్ ఓపెన్ అయ్యేసరికి జనాలు ఆసక్తిగా చూశారు.

PFI కేసులో మరో నిందితుడిపై NIA ఛార్జిషీట్ దాఖలు
PFI నిజామాబాద్ కేసులో మరో నిందితుడిపై NIA ఛార్జిషీట్ దాఖలు చేసింది. యువతను ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు చేర్చుకోవడం.. తీవ్రవాదం చేయడం మరియు శిక్షణ ఇవ్వడంపై నొస్సామ్ మహ్మద్ యూనస్‌పై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలైంది. దీంతో.. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 17కి చేరింది. 2047 నాటికి భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే PFI కుట్రను కొనసాగించడానికి హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించే PFI లో నొస్సమ్ మహమ్మద్ చేరాడని NIA ఛార్జ్ షీట్ లో చేర్చారు. అంతేకాకుండా.. ముస్లిం యువతను ప్రేరేపించడం, అమాయకులను రిక్రూట్ చేసుకోవడంలో నిందితుడు ప్రమేయం ఉందని పేర్కొంది. ప్రత్యేకంగా రహస్యంగా నిర్వహించే పీఎఫ్‌ఐ ఆయుధ శిక్షణా శిబిరాల్లో వారికి ఆయుధ శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. గొంతు, కడుపు, తల మొదలైన వారి ముఖ్యమైన శరీర భాగాలపై దాడి చేయడం ద్వారా వారి ‘లక్ష్యాలను’ చంపడానికి మారణాయుధాలను ఉపయోగించడంలో ఇతను శిక్షణ ఇచ్చాడు. దేశంలోని వివిధ మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం కోసం కుట్రను గుర్తించినట్లు NIA తెలిపింది.

వనాటులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ఓషియానియా ప్రాంతంలో ఉన్న ద్వీప దేశం వనాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ చిన్న దేశం భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వనాలకు దక్షిణంగా గురువారం ఈ భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రారంభంలో దీని తీవ్రత 7.3గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత సవరించి 7.1గా వెల్లడించింది. భూమికి 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇసాంగెల్ పట్టణానికి దక్షిణంగా 123 కిలోమీటర్ల దూరంలో, రాజధాని పోర్ట్ విలాకు 338 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉంది. భారీ భూకంపం రావడంతో పసిఫిక్ సముద్రంలో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఈ భూకంపం వల్ల వనాలు, న్యూ కలెడోనియా తీరాల వెంబడి తీరాల వెంబడి ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ప్రస్తుతం భూకంపం వల్ల కలిగిన నష్టం గురించి వివరాలు తెలియలేదు.

రష్యా అధ్యక్ష ఎన్నికల తేదీ ఖరారు.. ఐదోసారి పుతిన్‌కే అవకాశం..
ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత రెండు దశాబ్ధాలుగా అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల తేదీని రష్యా చట్టసభ సభ్యులు నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి 17, 2024న అధ్యక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మరోసారి పుతిన్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా అధ్యక్ష ఎన్నికల తేదీ ప్రతిపాదనలను అక్కడి పార్లమెంట్ ఎగువసభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఫెడరేషన్ కౌన్సిల్ స్పీకర్ వాలెంటీనా మాట్వియోంకో మాట్లాడుతూ.. ఇది దేశంలో ఎన్నికల ప్రచారానికి నాంది పలుకుతుందని చెప్పారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సమావేశం కానుంది. వ్లాదిమిర్ పుతిన్ గత 20 ఏళ్లుగా రష్యాను పాలిస్తున్నారు. సోవియట్ పాలకుడైన జోసెఫ్ స్టాలిన్ కన్నా ఎక్కువ ఏళ్లు పదవిలో ఉన్న అధ్యక్షుడిగా పుతిన్ చరిత్ర సృష్టించారు. రష్యాలో అధ్యక్షుడి పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. వచ్చే ఏడాది 2024లో పుతిన్ పదవి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి పోటీలో నిలబడేందుకు అనుకూలంగా ఓ చట్టాన్ని తీసుకువచ్చారు. దీంతో ఆయన మరో రెండు దఫాలుగా అధ్యక్ష పదవిలో కొనసాగే వీలు కలుగుతుంది. అంటే 2036 వరకు కూడా పుతిన్ పదవిలో కొనసాగే వీలుంది. ఈ రాజ్యాంగ సవరణలకు రష్యా ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు.

ఎంత జాగ్రత్తగా ఆ హీరోయిన్ ను దాచారు మావా.. సూపర్ అంతే
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ ఏడాది దసరా సినిమాతో వచ్చి మాస్ హిట్ కొట్టిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ను అందుకున్నాడు. ఇక మొదటి నుంచి సినిమాపై నాని చాలా నమ్మకంతో ఉన్నాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు బోర్ కొట్టదని, ఫ్రెష్ ఫీల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక నాని చెప్పినట్లుగానే ప్రేక్షకులు హాయ్ నాన్న సినిమాను ఆదరించారు కథ,కథనాలతో పాటు నటీనటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఒక ఇంటర్వ్యూలో నాని.. సినిమాలో చాలామంది ఉన్నారని, చూసి షాక్ అవుతారు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది ఒక కుర్ర హీరోయిన్. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రితికా నాయక్. మెయిన్ హీరోయిన్ కన్నా ఈమెనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆ సినిమా తరువాత తెలుగు కుర్రాళ్ల గుండెల్లో క్రష్ గా నిలిచింది. ఇక ఈ చిన్నది హాయ్ నాన్న చిత్రంలో సందడి చేసింది. ఏ పాత్రలో అనుకున్నారు. నాని ముద్దుల కూతురు మహీగా కనిపించింది. చిన్నప్పుడు ఉన్న మహీని మాత్రమే బయట చూపించారు. ఆమె టీనేజ్ లోని పాత్రను రితికా చేసింది. జెర్సీలో ఎలా అయితే తండ్రి గురించి కొడుకు అర్జున్ చెప్తాడో.. ఇందులో తల్లిదండ్రుల కథ గురించి రితికా చెప్పడంతో సినిమా మొదలవుతుంది. నాని కూతురిగా రితికాను చూసి అభిమాను షాక్ అవుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఆ హీరోయిన్ ను దాచారు మావా.. సూపర్ అంతే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

చెన్నై వరద బాధితులకు నయనతార సాయం.. విమర్శలు చేస్తున్న నెటిజన్స్..
మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో తమిళనాడు లో వరదలు వచ్చి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రెస్క్యూ టీం ఎంతో మందిని కాపాడి సురక్షితమయిన ప్రాంతాలకు తరలించారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై నగరం క్రమంగా కోలుకుంటోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా వేలాది మంది రోడ్డున పడ్డారు.కూడు, గుడ్డ లేకుండా పునరావాస కేంద్రాల్లో ఎదురు చూస్తున్నారు.ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జనాలు ఆకలి బాధలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్వచ్ఛంద సేవకులు చెన్నై వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఇక సెలెబ్రేటిలు కూడా తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. తమ అభిమానులను కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కూడా తన వంతుగా సాయాన్ని అందించింది. తన సంస్థ ‘ఫెమీ 9’ ఆధ్వర్యంలో చెన్నై వేలచ్చేరి కైవేలి బ్రిడ్జి సమీపంలోని ప్రాంతాల్లోని వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. శానిటరీ న్యాప్‌కిన్లు, వాటర్ బాటిళ్లు మరియు ఫుడ్ ప్యాకెట్లు అందించారు. దీంతో నయన తారపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం లేడీ సూపర్‌ స్టార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఫెమీ 9’ కంపెనీకి చెందిన అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు ఉన్న ప్రత్యేక వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడమే నెటిజన్ల విమర్శలు చేయడానికి కారణం. దీనికి సంబంధించిన వీడియోను ‘పెమీ 9’ కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. వీడియో చివర్లో, స్థానిక మహిళలు కొందరు నయనతారకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు.. మహిళలను బలవంతంగా పెట్టి సీన్ చిత్రీకరించారని వ్యాఖ్యానిస్తున్నారు.ఇలాంటి కష్ట సమయంలో కూడా కొందరు కంపెనీని ప్రమోట్ చేస్తున్నారా అంటూ నయనతారపై విమర్శలు చేస్తున్నారు. అయితే చాలా మంది నయనతార చేసిన సాయాన్ని మెచ్చుకుంటున్నారు.

Exit mobile version