Site icon NTV Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఎస్సై నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అభ్యర్థుల ఎత్తు కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించారు.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు.. రిక్రూట్ మెంట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు, 2019లో అర్హతగా పరిగణలోకి తీసుకున్న అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్ న్యాయస్థానంకు అందించారు పిటిషనర్లు.. అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్ పునఃపరిశీలన చేసి వారంలో కోర్టు ముందు ఉంచాలని రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. వరుసగా ముగ్గురు అభ్యర్థుల కొలతలు అర్హత పొందక పోవటంతో హైకోర్టు సీరియస్ అయ్యింది.. ఇటీవల ధ్రువీకరణ పత్రాలు జారీపై అవసరమైతే విచారణ చేస్తామన్న హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే, ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది హైకోర్టు.. ఎస్సై ఫలితాలను విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.

విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌..
మిచౌంగ్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది.. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ రైలు మార్గంలో భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారాయి కొండచరియలు.. కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్.. శివలింగపురం యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. దీంతో, కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.. అరకులోనే కిరండోల్ – విశాఖ ప్యాసింజర్‌ రైలును అధికారులు నిలిపివేశారు.. ప్రయాణికులను ఆర్టీసీ బస్సులలో గమ్యస్థానాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు..

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? అనే ఉత్కంఠకు తెరదించింది కాంగ్రెస్‌ అధిష్టానం.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాలు సాధించిన తర్వాత.. సీఎల్పీ సమావేశం జరిగింది.. ఇక, ఏకవాఖ్య తీర్మానం చేసి అధిష్టానానికి పంపించారు.. గత రెండు రోజులుగా కాంగ్రెస్‌ అధిష్టానం, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో చర్చలు జరిగిపింది.. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్‌, థాక్రే.. ఇలా అంతా తెలంగాణ సీఎంపై చర్చించగా.. చివరకు ఢిల్లీలో మీడియతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్.. నిన్న సీఎల్పీ మీటింగ్‌ జరిగింది.. సీఎల్పీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్‌రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్‌ ని సీఎల్పీ నేత గా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని.. అయితే, ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు అనేది తర్వాత చెబుతాం అన్నారు కేసీ వేణుగోపాల్‌. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు ప్రకటించారు కేసీ వేణుగోపాల్.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్‌గా పనిచేస్తారన్న ఆయన.. మంత్రులు ఎవరు అనేది తర్వాత చెబుతాం అన్నారు.

ఎల్లుండి సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం..
కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ జరిగింది.. సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ నడిచింది.. కానీ, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డే అనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది.. సీఎల్పీ సమావేశంలో ఏకవాఖ్య తీర్మానం చేసి.. ఆ తీర్మానంతో ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్‌ ఢిల్లీ బాట పట్టిన తర్వాత.. మరింత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కూడా హస్తినకు వెళ్లడం.. అధిష్టానం పెద్దల వరుస సమావేశాలు.. చూస్తుంటే.. ఏదో జరగుతోంది? అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.. కాంగ్రెస్‌ పార్టీలోనే కాదు.. ఓ జాతీయ పార్టీలో ఆ మాత్రం చర్చలు, కసరత్తులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వాచ్చారు.. మొత్తంగా సీఎం ఎవరు? అనే ఉత్కంఠగా తెర దింపుతూ.. కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు.. నిన్న సీఎల్పీ మీటింగ్‌ జరిగింది.. సీఎల్పీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్‌రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్‌ ని సీఎల్పీ నేతగా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్.. మంత్రులు ఎవరు, ఎల్లుండి ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనే విషయాలు తర్వాత చెబుతాం అన్నారు.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్‌గా పనిచేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్‌. మరోవైపు.. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి రేవంత్‌రెడ్డికి పిలుపు రావడంతో హుటాహుటినా ఢిల్లీకి బయల్దేరారు రేవంత్‌రెడ్డి.. హోటల్‌ ఎల్లాలో ఉన్న రేవంత్‌కు అధిష్టానం నుంచి సమాచారం రాగానే.. అక్కడి నుంచి బయల్దేరి మొదట ఇంటికి.. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు.. ఇక, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు రేవంత్‌రెడ్డి.

కొండారెడ్డిపల్లి నుంచి సీఎం సీటు వరకు.. రేవంత్‌రెడ్డి ప్రస్థానం
రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్‌రెడ్డి.. ఏం మాట్లాడినా.. ఏ పార్టీలో ఉన్నా.. ఏం చేసినా సెన్సేషన్‌. తెలంగాణ రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నాయకుడు. రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్‌కు సరికొత్త ఊపిరిలూదిన నేత.. జడ్పీటీసీగా పొలిటికల్ ఇన్నింగ్స్‌ ప్రారంభించి నేడు రాష్ట్ర అధినేతగా మారారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌ కూడా లేని రేవంత్‌ అధ్యక్షుడయ్యాడంటే ఆయన స్టామినా ఏంటో అర్థమవుతుంది. నిజానికి ఏబీవీపీతో రేవంత్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత టీడీపీ ఆపై కాంగ్రెస్‌లో చేరి తక్కువ కాలంలోనే పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఇక బీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీనే.. కాంగ్రెస్ కేవలం నామమాత్రమే అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీకి రిపేర్లు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేతలకు సరికొత్త దూకుడు నేర్పించాడు. ముఠాల కాంగ్రెస్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకొని.. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పోటాపోటీగా బహిరంగసభల్లో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థుల తరపున 87 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించారు. గెలుపు వ్యూహాలు రచించారు. తన నాయకత్వ పటిమతో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జన నాయకుడు రేవంత్‌. నోటిఫికేషన్‌కు ముందు నుంచి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందంటూ బల్లగుద్ది చెప్పాడు. చెప్పడమే కాదు అది నిజమయ్యేలా చేశారు.

మిచౌంగ్‌ తుఫాన్‌ విధ్వంసం.. ఈ జిల్లాల్లో బీభత్సం..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్‌ మిచౌంగ్‌ తీరం దాటింది. ఏపీలోని బాపట్ల సమీపంలో తుఫాన్‌ తీరం దాటిన సమయంలో బీభత్స వాతావరణం కనిపించింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హోరెత్తింది. సముద్రంలో అలలు… ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగిసిపడ్డాయి. అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీరం దాటిన రెండు గంటలకు తుపానుగా బలహీనపడుతుందని… అలాగే ఆరు గంటల్లోగా వాయుగుండంగా కూడా బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాన్‌ తీరం దాటిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుఫాను తీరం దాటిన క్రమంలో పలుచోట్ల 20 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇప్పటికే, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆస్పత్రి లోపల కూడా నీరు చేరడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో 8వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతిలో వర్షాలకు గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పెదవేగి, పెదపాడు, వట్లూరు తదితర ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోయాయి. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చలిగాలులకు ప్రజలు వణికిపోతున్నారు. ఏపీలో 140కిపైగా రైళ్లు, 40 విమానాలు రద్దయ్యాయి. మొత్తం 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ.

20 ఏళ్ల తర్వాత అతిభారీ తుఫాన్..
అన్నదాతలకు తీరని కష్టాలు మిగిల్చింది మిచౌంగ్ తుఫాన్. గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుఫాన్‌ ఎఫెక్ట్‌తో పంట నీట మునిగింది. దీంతో మనోవేదన చెందుతున్నారు రైతులు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మిచౌంగ్ తుపాను అపార నష్టం మిగిల్చింది. కోసిన చేను పొలాల్లోనే తడిచిపోయింది. మరికొన్నిచోట్ల ధాన్యం బస్తాలు వర్షంలో నానిపోయాయి. వాటిని రక్షించుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు వరి పంట నేలకొరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో కాఫీ రైతులను మిచౌంగ్‌ తుఫాన్‌ నిండా ముంచింది. ఓ వైపు పంటల ఘోరంగా దెబ్బతినగా, డ్రై యార్డుల్లోని కాఫీ గింజలు కూడా తడిచిపోయాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎడతెరిపిలేని వర్షాలకు… వేరుశనగ, పొగాకు, వరి పంటలకు కొంత వరకూ నష్టం జరిగింది. కృష్ణా జిల్లాలో 2 లక్షల 83 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తడిచిపోయిన 20 వేల టన్నుల ధాన్యాన్ని గౌడొన్లకు పంపే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు జిల్లా కలెక్టర్‌ రాజబాబు.

మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పటిష్ట భద్రత ఏర్పాటు
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్‌లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి. సమావేశాలకు ముందు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్, జాయింట్ కమిషనర్ అశ్వతీ దోర్జే సోమవారం పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధాన్ భవన్ చుట్టూ సాయుధ పోలీసులను వ్యూహాత్మకంగా మోహరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం.. 11,000 మంది పోలీసులు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) యొక్క 10 కంపెనీలు, 1,000 మంది హోంగార్డులు, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ ఫోర్స్ వన్, 40 బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు (BDDS) రాష్ట్ర శాసనసభ రక్షణగా ఉంటారు. అంతేకాకుండా.. 9 మంది డీఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నారు.

భారీ పంపులను సిద్ధం చేస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ టన్నెల్స్‌లో వరదలకు ప్లాన్..
ఇజ్రాయిల్-హమాస్ సంధి తర్వాత గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిలీ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఉత్తర గాజాకే పరిమితమైన యుద్ధా్న్ని, దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. హమాస్ ఉగ్రసంస్థను లేకుండా చేసేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఆ దేశ స్పై ఏజెన్సీ మొసాద్‌కి హమాస్ కీలక నేతలను హతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే గాజాలో హమాస్ ఉగ్రవాదుల పటిష్ట స్థితికి కారణమవుతున్న టన్నెల్ వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతోంది. టన్నెల్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు పెద్ద ఎత్తున పంపులు, మోటార్ల సాయంతో సొరంగాల్లో వరదలు సృష్టించాలని భావిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదుల్ని బయటకు రప్పించేందుకు ఇలా చేయనుంది.

పెళ్లైన తర్వాత రోజే షార్క్ దాడిలో నవ వధువు మృతి
పెళ్లైన తర్వాతి రోజు మృత్యువు షార్క్ రూపంలో వచ్చింది. నవ వధువుపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన బహామాస్‌లో జరిగింది. తన భర్తతో కలిసి 44 ఏళ్ల మహిళ సముద్రంలో పాడిల్ బోర్డింగ్ చేస్తుండగా, షార్క్ అటాక్ చేసింది. బోస్టన్‌కి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమెకు ఆదివారమే వివాహం జరిగిందని, సోమవారం బీచ్‌లో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా, ఈ భయంకరమైన దాడి జరిగింది. సోమవారం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 11.15 గంటలకు యూఎస్‌కి చెందిన మహిళపై షార్క్ దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే చనిపోయిన మహిళ పేరును వెల్లడించలేదు. బహమాస్‌లోని వెస్ట్రన్ ప్రొవిడెన్స్ లోని ఒక రిసార్ట్ వెనకలా ఉన్న సముద్ర తీరం నుంచి దాదాపుగా 3-4 మైళ్ల దూరంలో సముద్రంలోవిహరిస్తుండగా.. మహిళపై దాడి జరిగిందని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. కుడి తుంటి భాగం, కుడి అవయవాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో చనిపోయిందని వెల్లడించారు. కేబుల్ బీచ్‌లోని శాండిల్స్ రిసార్ట్ సమీపంలో ఈ దాడి జరిగింది. బహమాస్ ప్రాంతం మొత్తం 3000 కంటే ఎక్కువ ద్వీపాలు కలిగిన దేశం. దాని ఆర్థికవ్యవస్థ ప్రధానంగా టూరిజం పైనే ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం సముద్రతీరం, బీచులకు ప్రసిద్ధి. షార్కుల దాడి ఇక్కడ చాలా అరుదు. ఏడాదికి కేవలం ఐదారు ఘటనలు మాత్రమే జరుగుతుంటాయి. అయితే ఆస్ట్రేలియాలో ఎక్కువగా షార్క్ దాడులుకు గురవుతున్నారు.

గురువుకు రోలెక్స్ గిఫ్ట్ ఇచ్చిన డార్లింగ్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ప్రభాస్ మంచి మనసు గురించి టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియా మొత్తం తెలుసు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎలాంటి వివాదం లేని హీరోగా ప్రభాస్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆయన ఆతిథ్యం గురించి అసలు మాట్లాడాల్సిన పని ఉండదు. తనకు నచ్చిన వారిని ప్రభాస్ ఏ రేంజ్ లో చూస్తాడు అనేది చాలామంది స్టార్లు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ప్రభాస్ తనకు నటన నేర్పిన గురువుకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 2021 లో సత్యానంద్ కు ప్రభాస్ ఒక రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ లోఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్న హీరోలకు గురువు ఎవరు అంటే టక్కున వైజాగ్ సత్యానంద్ పేరును చెప్పుకొస్తారు. ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా స్టార్ లందరూ సత్యానంద్ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళే. ప్రభాస్ కూడా సత్యానంద్ శిష్యుడే. అందుకే టాలీవుడ్ లోసత్యానంద్ కి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇక చాలామంది శిష్యులు అప్పుడప్పుడు ఆయనకు ప్రత్యేకమైన బహుమానాలు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ సైతం తన గురువు సత్యానంద్ కు బంగారు కానుకను ఇచ్చాడు. 2021 లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఆయనకు గోల్డ్ రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. డార్లింగే స్వయంగా సత్యానంద్ ఇంటికి వెళ్లి ఆ ఆ బాక్స్ ను అన్ ప్యాక్ చేసి గురువు చేతికి తొడిగాడు. ఇక ఈ వాచ్ ను కొనడానికి ప్రభాస్ చాలా కష్టపడినట్లు తెలుస్తుంది. గురువుగారికి తెలుపు ఇష్టమని తెలుసుకొని గోల్డ్ వాచ్ ను ఆ కలర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఇచ్చినట్లు సమాచారం. శిష్యుడు ఇచ్చిన వాచ్ చూసి సత్యానంద్ ఎంతో మురిసిపోయాడు. ఇక ప్రభాస్ సైతం చాలా ఆనందంగా గురువు దగ్గర ముచ్చట్లు చెప్తూ కనిపించాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. కల్కి షూటింగ్ జరుపుకుంటుంది.

మాస్ మహారాజా.. ఊర మాస్ ప్రభంజనం.. ఆడు మచ్చా
టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ తరువాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫర్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రెండు రోజుల క్రితమే ఈ సినిమా మొదటి సింగిల్ ఆడు మచ్చ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్రామీణ పండుగ వేడుకలు జరుపుకుంటున్న గ్రామస్థులతో కూడిన రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఆడు మచ్చా పాటని ఊరా మాస్ అంథమ్ గా కంపోజ్ చేశారు దావ్‌జాంద్. రవితేజ తన గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ పరంగా విభిన్నంగా, మాస్ గా కనిపించాడు. నల్ల చొక్కా, ధోతీ ధరించి, మెడలో రుద్రాక్ష మాలతో పూర్తిగా కొత్త అవతార్ లో ఆకట్టుకున్నాడు. దావ్‌జాంద్ అన్ని మాస్ ఎలిమెంట్స్‌ తో, పక్కా థియేటర్ సాంగ్‌ను రూపొందించాడు. ఈ ట్యూన్ లైవ్ ఇండియన్ పెర్కషన్స్, ఫ్లూట్స్, పేపర్ హొర్న్స్ తో సాంగ్ ప్రోగ్రామింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. రెండిషన్ లోకల్ ఫ్లేవర్ తో అద్భుతంగా అలరించింది. కల్యాణ చక్రవర్తి మాస్ ను ఆకట్టుకునే సాహిత్యాన్ని రాయగా.. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ వాయిస్ తో లైవ్లీ గా పాటని ఆలపించి అలరించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. రవితేజ తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో పాటలోని ఎనర్జీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. ఈ పాట అభిమానులకు కన్నుల పండగలా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version