Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య దాదాపు 8 లక్షల 44 వేల 558కి చేరింది. కొత్తగా ఒకరు రికవరీ అయినట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8 లక్షల 40 వేల 392కి చేరింది. కొత్తగా ఎవరూ మరణించలేదు.. మొత్తం మరణాల సంఖ్య 4, 111గా ఉంది. ఇక, తెలంగాణ రాష్ట్రంలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 55 ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో కొత్త కరోనా JN.1 వేరియంట్ కేసులు 2 నమోదు అయినట్లు చెప్పారు. నిన్న 989 మందికి టెస్టులు చేశారు.. మొత్తం టెస్టుల సంఖ్య 3 కోట్ల 91 లక్షల 77 వేల 325కి చేరింది. 12 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

 

*రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క
రేపు ఢిల్లీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడంతో రేపు సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉంది. అయితే, రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలవనున్నారు. ప్రధానంగా పార్లమెంట్‌ ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొననున్నారు. అయితే, తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన విషయంపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నారు. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆరు ఎమ్మెల్సీ పోస్టులకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. వీటన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రేపటి ఢిల్లీ పర్యటనతో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

 

*సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తుంది..
సత్తుపల్లి సింగరేణి ఎన్నికల్లో భాగంగా ఐఎన్టీయూసీ కార్మికులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2017 సింగరేణిలో గెలిచి మొన్నటి వరకు పారిపాలించిన పార్టీ తరుపున పొరాడం.. అప్పటి ముఖ్యమంత్రి వాగ్దనాలు నమ్మి గెలిపించి మోసపోయాం.. మీ అందరి దీవెనలతో మొన్నటి ఎన్నికల్లో సింగరేణి ఏరియాల్లో ఘన విజయం సాదించాం.. ఆ నాటి ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల సమస్యలు చెబుదామని వెళ్ళిన పట్టించుకోలేదు.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.. మేమే సమస్య పరిష్కారం చేసే స్థాయిలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికలు జరగకుండా కోర్టులో కేసులు వేస్తే స్టే తెచ్చుకొని గత సీఎం కాలం వెల్లదీశాడు.. గతంలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయ్యాని వాళ్ళు ఇప్పుడు ప్రతి పక్షంలో మళ్ళీ అదే వాగ్దనాలతో మీ ముందుకు వస్తున్నారు జాగ్రత్త అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పరిష్కారం చెయ్యని వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా చేస్తారో మీరే ఆలోచించాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆశయం ఆశయాలను నెరవేరలాంటే ఐఎన్టీయూసీని భారీ మెజారిటీతో గెలిపించాలి.. ప్రతి పక్షంలో ఉన్న వారి మాటాలు నమ్మి వారికి ఓటేద్దామా.. కామ్యూనిస్ట్ అధికారంలో లేని వారికి ఓటు వేద్దామా మీ ప్రభుత్వం మీ శ్రీనన్న ఉన్న దానికి ఓటు వేద్దామా ఆలోచించండి అని ఆయన చెప్పారు. సింగరేణి ఆవిర్భవ దినోత్సవాన్ని డిసెంబర్23న సెలవు ప్రకటించే విధంగా ఆదేశాలు ఇస్తాం.. సింగరేణి కార్మికుల కోసం మూడు సూపర్ స్పేషాలిటి హస్పటల్స్ నిర్మాస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సత్తుపల్లి ఓసీలో అత్యధికంగా ప్రోడక్షన్ ఇస్తుంది అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ సత్తుపల్లిని ఏరియాగా అభివృద్ధి చేస్తాం.. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వస్తున్న కార్మికులకు బస్సులు ఏర్పాటు చేస్తాం.. సింగరేణితో సహ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. వాటిన్నంటిని భర్తీ చేస్తాం.. బీజేపీ పార్టీ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరంగా చెయ్యాలని చూస్తుంది.. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కానివ్వం.. అందరు కష్ట పడి పని చేయ్యండి.. ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి.. కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పని చెయ్యండి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

*రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందే బీఆర్ఎస్..
నాగ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ సభకు లక్షలాది మంది తరలి రావాలి అంటూ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. దేశ సంపద కొల్లగొడుతూ.. మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ.. బీజేపీ ముక్త్ దేశం కావాలని నాగ్ పూర్ లో కాంగ్రెస్ అగ్ర నేతలు పిలుపు ఇవ్వనున్నారు.. ఏడాదికి 2కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని మాటలు చెప్పినా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు పికేస్తుంది.. కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే.. బీజేపీ ప్రైవేట్ పరం చేస్తుంది అని ఆయన ఆరోపణలు గుప్పించారు. వికలాంగులకు 6 వేల రూపాయల పెన్షన్ పెంచాం.. త్వరలోనే చెల్లిస్తామన్నారు. మా ప్రభుత్వం ఏర్పాటై ఇంకా 20 రోజులు కూడా కాలేదు.. ఆరు గ్యారెంటీల హామీలలో ఈనెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకు వచ్చామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జీరో టికెట్లు ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మా కమిట్మెంట్ ఎలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది.. అసెంబ్లీలో మేము శ్వేత పత్రం విడుదల చేశాం.. కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంలో ఔటర్ రింగ్ రోడ్డు కట్టినట్లు ఫోటో పట్టుకున్నారు.. ఔటర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఖజానాకు చెందిన ప్రతి పైసా ప్రజలకు చెందాలి తప్ప నలుగురి కుటుంబ సభ్యులకు కాదు.. ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది.. ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తాం.. మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. ఈనెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రేషన్ కార్డుల కోసం దరఖస్తులు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

 

*తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా..?
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ వాయిదా పడింది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.. అయితే, ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేశారు. తెలంగాణలో గ్రూప్-2, 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేశారు. అయితే, గ్రూప్ -2 ఎగ్జామ్ డేట్ రీ షెడ్యూల్ చేస్తారా లేక కొత్త పోస్టులను చేర్చి రీ వైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది ఇప్పటి వరకు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం రివ్యూ చేసింది.. గ్రూప్- 2 ఎగ్జామ్స్ పై తెలంగాణ సర్కార్ స్పష్టత ఇవ్వలేదు.. అయితే, ఇప్పటికి ఎన్నిసార్లు పరీక్షను వాయిదా వేస్తారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎక్సామ్ వాయిదా పడటంతో పలువురు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 

*ఏపీలో 47 రోజుల పాటు క్రీడా సంబరం.. రేపటి నుంచే ‘ఆడుదాం ఆంధ్రా’
రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏపీలో 47 రోజుల పాటు ఈ క్రీడా సంబరం జరగనుంది. గ్రామ వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు. జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించటం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్పూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
*ఇప్పటికే పూర్తి అయిన రిజిస్ట్రేషన్లు

*క్రీడాకారులు: 34.19 లక్షలు,

*ప్రేక్షకులు: 88.66 లక్షలు

*రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తం కోటి 22 లక్షల మంది

*నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు

*బహుమతుల కోసం 12 కోట్లకు పైగా నగదు ఇవ్వనున్న ప్రభుత్వం
సీఎం షెడ్యూల్‌ ఇదే.. ఆడుదాం ఆంధ్రా లాంచ్
రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. పదిన్నరకు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌కు సీఎం చేరుకోనున్నారు. అనంతరం శాప్ జెండా, జాతీయ జెండా సీఎం ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

 

*రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు చట్టబద్ధత
కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనం బిల్లులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు కొత్త బిల్లులకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉభయసభలు ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్రం పంపించింది. తాజాగా నేడు ఈ మూడు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఆ బిల్లులు చట్టబద్ధతను పొందాయి. రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల కావడంతో ఈ మూడు బిల్లులు ఇక చట్టాలుగా మారనున్నాయి. కాగా, ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌‌లలో కొన్ని సవరణలతో పాటు.. మరికొన్ని అంశాలను చేరుస్తూ.. ఆ మూడు చట్టాల పేర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త బిల్లులను తీసుకువచ్చింది. ఈ మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంతో చట్టబద్దత కలిగింది. ఇకపై ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్‌ స్థానంలో భారతీయ సాక్ష్య అధీనం పేర్లు కనబడనున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ పేర్లు ఇక నుంచి కనిపించవు.

 

*పాక్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్న హఫీజ్‌ సయీద్ కుమారుడు..
26/11 ఉగ్రదాడి సూత్రధారి, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) పాకిస్థాన్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని పాక్ ఆంగ్ల దినపత్రిక డాన్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్‌లోని ప్రతి జాతీయ, ప్రావిన్సు అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థులను నిలబెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నివేదిక ప్రకారం నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127, లాహోర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి జైలులో ఉన్నాడు. సయీద్‌పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD) లష్కరే తోయిబా (LeT) యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్, ఇది ఆరుగురు అమెరికన్లతో సహా 166 మందిని చంపిన 2008 ముంబై దాడికి బాధ్యత వహించింది.పీఎంఎంఎల్‌ ఎన్నికల గుర్తు ‘కుర్చీ’గా తెలిసింది. పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో, తమ పార్టీ చాలా జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలని, పాకిస్థాన్‌ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని తాము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. అదే సమయంలో, ఖలీద్ మసూద్ సింధు NA-130 లాహోర్ నుంచి పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధినేత, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై పోటీ చేయనున్నారు. హఫీజ్‌ సయీద్‌కు పార్టీకి సంబంధాలను ఖలీద్ మసూద్ సింధు ఖండించారు. హఫీజ్ సయీద్‌కు మా పార్టీకి ఎలాంటి మద్దతు లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version