Site icon NTV Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ..
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనమే జరిగింది.. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అలియాస్ పీకే.. ఇప్పుడు జెండా మార్చేశారు.. అదేనండి.. ఈ సారి తన వ్యూహాలను తెలుగుదేశం పార్టీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పీకే సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. ఉన్నట్టుండి ఈరోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన పీకే.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చి నేరుగా టీడీపీ జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కారు ఎక్కారు.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్.. అయితే, లోకేష్‌ .. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. నేరుగా వెళ్లి ఆయన లోకేష్‌ వాహనంలో కూర్చుకున్నారు.. ఆ తర్వాత ఓకే వాహనంలో చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. ప్రశాంత్ కిషోర్‌తో పాటు చంద్రబాబు నివాసానికి రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.. ఇక, చంద్రబాబుతో పీకే సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది.. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్ధితులపై సుదీర్ఘంగా చర్చ సాగినట్టు సమాచారం.. ఇదే సమయంలో.. తాను చేసిన సర్వేల అంశాలను టీడీపీ అధినేతకు పీకే వివరించారట.. ఈ సమావేశంలో చంద్రబాబు, పీకేతో పాటు లోకేష్‌ కూడా పాల్గొన్నాడు.. మొత్తంగా ఏపీ రాజకీయ వర్గాల్లో చంద్రబాబు-పీకే భేటీ సంచలనం రేకెత్తిస్తోంది.

ప్రశాంత్‌ కిషోర్‌-చంద్రబాబు భేటీ.. మంత్రి అంబటి హాట్‌ కామెంట్స్‌.. ఆ పీకే, ఈ పీకే వచ్చినా..!
టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశం కావడం.. ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, పీకే-బాబు సమావేశం జరిగిందో లేదో.. అప్పుడే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి విమర్శలు మొదలయ్యాయి.. ఈ భేటీపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడు.. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు అని వ్యాఖ్యానించారు. ఎంతమంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా, ఎంతమంది పవన్ కల్యాణ్‌లు కట్ట కట్టుకుని వచ్చినా.. ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యం అని జోస్యం చెప్పారు.

ఆ ముగ్గురి మధ్య 3 గంటల పాటు కీలక చర్చలు..!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు హాట్‌ టాపిక్‌గా మారిన ఘటన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశం కావడం.. హైదరాబాద్‌ నుంచి నారా లోకేష్‌తో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పీకే.. లోకేష్‌ కారులోనే చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. మూడు గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో చంద్రబాబు, ప్రశాంత్‌ కిషోర్‌, లోకేష్‌ పాల్గొన్నారు.. అంతేకాకుండా.. ఇప్పటి వరకు టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్‌ శర్మ టీమ్‌ కూడా ఈ భేటీలో ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, మూడు గంటలపాటు పీకే.. చంద్రబాబు సుదీర్ఘ భేటీ కంటే ముందే తెలుగుదేశం పార్టీ.. పీకేతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.. దాదాపు మూడు నెలల క్రితం నుంచే పీకేతో టచ్ లో ఉన్నారట నారా లోకేష్‌.. గతంలోనే ఓ రెండుసార్లు పీకేతో లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం. ఇక, ఈ రోజు చంద్రబాబుతో జరిగిన భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా పీకే చర్చించనట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో సోషల్ మీడియా క్యాంపెయిన్ బాధ్యతలను ఇక నుంచి పీకే హ్యండిల్ చేసే అవకాశం ఉందంటున్నారు. తాను తెచ్చిన సర్వేల వివరాలను చంద్రబాబుకు వివరించారట పీకే.. ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాల రూపకల్పనకు పీకే ప్రణాళికలు సిద్ధం చేశారట.. చంద్రబాబు – పవన్ కల్యాణ్‌ కాంబినేషన్ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై స్కెచ్ సిద్ధం చేస్తున్నారట ప్రశాంత్‌ కిషోర్‌.. మరోవైపు.. పీకే చేసిన సూచనలను ఇప్పటికే టీడీపీ అమలు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇకపై పీకే గైడెన్స్‌లో రాబిన్ శర్మ టీం పనిచేస్తుందంటున్నారు.. రాబిన్‌ శర్మ గతంలో పీకే టీమ్‌లో పనిచేసిన వ్యక్తే.. దాంతో.. వారి కాంబోకి వచ్చిన ఇబ్బంది లేదంటున్నారు.. మొత్తంగా.. చంద్రబాబు, ప్రశాంత్‌ కిషోర్‌, లోకేష్‌.. ఆ ముగ్గురి మధ్య మూడు గంటల పాటు సాగిన చర్చలు ఇప్పుడు కీలకంగా మారాయి.. ఏపీలో రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ఎత్తుగడులు వేస్తారు. పీకే.. టీడీపీతో కలిసి పనిచేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అందుకే చంద్రబాబును కలిశా-ప్రశాంత్‌ కిషోర్‌
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. ఆ తర్వాత చంద్రబాబును ఎందుకు కలిశాను అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తూ వస్తోంది పీకే టీమ్‌.. ఈ రోజు ఉన్నట్టుండి లోకేష్‌ వెంట వచ్చి చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరపడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పీకే టీమ్‌ పనిచేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారగా.. ఈ భేటీ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం అయిన పీకే.. మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో సమావేశం ముగిసిన తర్వాత లోకేష్‌తో కలిసి తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ప్రశాంత్‌ కిషోర్‌ను ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించింది.. అయితే, తాను మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిశాను అని తెలిపారు.. చంద్రబాబు సీనియర్ నాయకుడు.. అందుకే చంద్రబాబు దగ్గరకు వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు పీకే.. అయితే, ఇప్పటి వరకు సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు ప్రశాంత్‌ కిషోర్‌ను టార్గెట్‌ చేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు పీకేనే సంప్రదించడం ఏంటి? ఆయన వ్యూహాలతోనే వచ్చే ఎన్నికల్లో ముందుకు నడుస్తుందా? లేదా? యథావిథిగా పీకే.. వైసీపీ తరఫునే పనిచేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇద్దరు పీకేలు కలిసి చంద్రబాబును పీకేస్తారు..
చంద్రబాబు ఎంత మంది పీకేలను తీసుకు వచ్చినా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఏం పీకలేరన్నారు మంత్రి జోగి రమేష్‌.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ భేటీపై సెటైర్లు వేశారు.. ఇద్దరు పీకేలు కలిసి చంద్రబాబును పీకేస్తారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మోసం చేశాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను పీకి పాతర వేయటానికి ప్రజా క్షేత్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా 12 పాజిటివ్ కేసులు
రోజుకు రోజుకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పన్నెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో మూడింట రెండొంతులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో తొమ్మిది, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు బులెటిన్ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుంచి ఒకరు కోలుకోగా… 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో ముప్పై మందికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని వెల్లడించింది. అలాగే నిలోఫర్ ఆసుపత్రి ఒక పాజిటివ్ కేసు నమోదైంది. నిన్న 51 శాంపిల్స్ టెస్టు‌ కోసం పంపగా ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఆరు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ రాగా.. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ మున్షీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ‌గా‌ ప‌శ్చిమ బెంగాల్ సీనియ‌ర్ నేత దీపాదాస్ మున్షీని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను త‌ప్పిస్తూ శ‌నివారం ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప‌శ్చిమ బెంగాల్ సీనియ‌ర్ నేత దీపాదాస్ మున్షీని నియ‌మిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే దీపాదాస్ మున్షీ. కాగా ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తూ వచ్చిన మాణిక్ రావు ఠాక్రేను గోవా-డయ్యూ డామన్ వ్యవహారాల ఇన్ చార్జీగా నియమించినట్లు మరో ప్రకటన ఇచ్చింది. కాగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు మ‌హారాష్ట్ర మాజీ పీసీసీ అధ్య‌క్షుడు మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ ఇన్‌చార్జీగా ఏఐసీసీ నియ‌మించింది. ఠాక్రేకు ముందు ఇన్‌చార్జిగా ప‌ని చేసిన మాణిక్ రావ్ ఠాకూర్‌.. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహ‌రిస్తున్నార‌ని సీనియ‌ర్లు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

నిఖిల్ గుప్తా కేసులో ‘భారత అధికార పరిధి’ లేదు.. స్పష్టం చేసిన చెక్ రిపబ్లిక్..
ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో అమెరికా సూచనల మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ గుప్తా ప్రేగ్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో భారత్‌కి ఎలాంటి అధికార పరిధి లేదని చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ తేల్చి చెప్పింది. నిఖిల్ గుప్తాకు సంబంధించిన కేసులో భారతదేశంలోని న్యాయ అధికారులకు ‘‘ అధికారం లేదు’’ అని చెక్ రిపబ్లిక్ చెప్పింది. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరతూ నిఖిల్ గుప్తా కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొన్ని రోజుల తర్వాత చెక్ అధికారుల నుంచి ఈ స్పందన వచ్చింది.

హిజాబ్ బ్యాన్‌పై సీఎం సిద్ధరామయ్య యూటర్న్.. అలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదంటూ..
హిజాబ్ అంశం మరోసారి కర్ణాటకలో వివాదాస్పదం అవుతోంది. గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాలయాల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. నిన్న సీఎం సిద్ధరామయ్య మైసూరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మహిళలు కావాలంటే హిజాబ్ ధరించవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో విద్యాలయాల్లో కూడా హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ అంశం మరోసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాజకీయ రచ్చను ప్రేరేపించింది. ఇదిలా ఉంటే హిజాబ్ బ్యాన్‌పై సీఎం సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తేయడంపై కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని శనివారం సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

దేశంలో ప్రతి నిమిషానికి 761 సైబర్ దాడులు, 2023లో 40 కోట్లకు!
భారతదేశంలో, 2023లో దాదాపు 85 లక్షల పరికరాలపై 40 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి. అంటే నిమిషానికి 761 సైబర్ దాడులు జరిగాయి. వీటిలో సూరత్ (15 శాతం), బెంగళూరు (14 శాతం)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి పైగా మీడియా – నెట్‌వర్క్ డ్రైవ్‌లకు సంబంధించినవి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DSCI) నివేదిక ప్రకారం, దాదాపు 25 శాతం దాడులు ఇమెయిల్‌లు, వెబ్‌సైట్‌లలోని హానికరమైన లింక్‌లపై క్లిక్ చేయడం వల్లనే జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ పరికరాల ద్వారా కూడా నెలకు సగటున మూడు దాడులు జరిగాయని తేలింది. సదరు రిపోర్టు ప్రకారం, నకిలీ యాప్‌లను మిలియన్ల మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు, వాటి ద్వారా వారి మొబైల్స్ హ్యాక్ చేయబడ్డాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల మాట్లాడుతూ దేశంలో అంతరిక్ష సంస్థ ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ సైబర్ దాడులను ఎదుర్కొంటోందని అన్నారు. తాజాగా అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ 16వ ఎడిషన్ కేరళలో జరిగింది. రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ముగింపు సమావేశంలో సోమనాథ్ అన్నారు. సైబర్ నిందితులు అత్యాధునిక సాఫ్ట్‌వేర్ – చిప్‌లను ఉపయోగిస్తున్నారు, కానీ ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇస్రో సిద్ధమైంది. మేము బలమైన సైబర్ సెక్యూరిటీ నెట్‌వర్క్‌ని కలిగి ఉన్నాము, రాకెట్‌లోని హార్డ్‌వేర్ చిప్‌ల భద్రతపై ఇస్రో దృష్టి సారించిందని ఇందుకోసం వివిధ పరీక్షల్లో ముందుకు సాగుతున్నామని అన్నారు.

అమెజాన్లో మరో సేల్ మొదలైంది.. ఈ ప్రొడక్ట్స్ మీద భారీ డిస్కౌంట్
డిసెంబర్ బొనాంజా సేల్ పేరుతో అమెజాన్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో, మీరు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు మరియు అనేక ఇతర ఉత్పత్తులను చౌక ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. ఈ సేల్ బ్యానర్ అమెజాన్‌లో కూడా లిస్ట్ చేయబడింది, అందులో డిసెంబర్ బొనాంజా సేల్ లో 70 శాతం వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో మీరు సగం కంటే తక్కువ ధరతో అనేక ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ సేల్‌లో అనేక అగ్ర బ్రాండ్‌లు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అవికూడా సున్నా శాతం నో కాస్ట్ EMIతో అందుబాటులో ఉంటాయి. Samsung, Lenovo, Redmi, Lava – Nokia వంటి బ్రాండ్‌లను కలిగి ఉన్న ఈ సేల్‌లో కొన్ని టాబ్లెట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. టాబ్లెట్‌పై 55 శాతం వరకు తగ్గింపు కనిపిస్తుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ పరికరాలపై టాప్ డీల్స్ కూడా చాలా లిస్ట్ చేయబడ్డాయి. వాటిలో స్మార్ట్‌వాచ్, గేమింగ్ ల్యాప్‌టాప్స్ కూడా ఉన్నాయి.

బెయిల్ మీద బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్‌గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం తెల్సిందే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేయడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాంతో పాటు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, ఆర్టీసీ బస్సుల అద్దాలను అభిమానులు పగలగొట్టారనే దానిమీద కూడా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడ జైల్ కు తరలించారు. తాజాగా పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా..నేడు అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్‌ని ఆదేశించింది. బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో హైలైట్ గా నిలిచింది ఈ సీజన్ మాత్రమే. ఒక కామన్ మ్యాన్ టైటిల్ విన్నర్ గా కావడం ఒక ఎత్తు అయితే.. అతను బయటకు వచ్చి అరెస్ట్ అవ్వడం మరో ఎత్తు అని చెప్పాలి. హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ నిజం కాదని, బయట అతడు చేసిన రచ్చనే చెప్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అమర్ కారు దాడి గురించి కూడా ప్రశాంత్ కు ముందే తెలుసు అని, అయినా ఆ దాడిని ఆపలేదని అమర్ ఫ్రెండ్ ఆరోపించాడు. ఇక అసలు తనకేం తెలియదని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. మరి ఈ వివాదం ఎక్కడవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

IMDB బెస్ట్ మూవీస్.. మూడు సినిమాలు మనోడివే
సొంతం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ తో అడివి శేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సినిమాల మీద ఉన్న మక్కువతో అమెరికాలో ఉన్న కుటుంబాన్ని వదిలి.. ఇండియా వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కర్మ అనే సినిమాను తన సొంత డబ్బుతో నిర్మించి కొంతవరకు నష్టపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా శేష్ కు ఒక గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా బాహుబలిలో నటించే ఛాన్స్ వచ్చేలా చేసింది. ఇక హీరోగా, రైటర్ గా మారి క్షణం సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమా శేష్ ను మళ్లీ వెనక్కి తిరగకుండా చేసింది. గూఢచారి సినిమాతో టాలీవుడ్ స్టైలిష్ స్పై గా మారిపోయాడు శేష్. ఎవరు, హిట్, మేజర్, వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం డెకాయిట్ అనే సినిమాతో పాటు గూఢచారి 2 సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక ఈ నేపథ్యంలోనే శేష్ ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ప్ర‌ఖ్యాత ఐఎండీబీ మొట్టమొదటి సారి.. తాము రేటింగ్ ఇచ్చిన టాప్ 250 చిత్రాలను ప్రకటించింది. అందులో శేష్ వి మూడు సినిమాలు ఉండడం విశేషం. క్షణం, ఎవరు, మేజర్ లాంటి సినిమాలో ఆ బెస్ట్ మూవీస్ లో నిలిచాయి. దీంతో ఈ కుర్ర హీరో పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే 250 చిత్రాల్లో ఈ సినిమాలు రేటింగ్, ర్యాంకింగ్స్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు శేష్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి శేష్ తన తరువాతి ప్రాజెక్ట్స్ తో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version