Site icon NTV Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

2014లో పెళ్లి.. విడాకులు తీసుకొని మళ్లీ కలిశారు.. టీడీపీ-జనసేనపై మంత్రి సెటైర్లు..
2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టీడీపీ-జనసేన పొత్తులపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారు..? అని నిలదీసిన ఆయన.. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా?రాజరికం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అసలు పుంగనూరులో గొడవ ఎందుకు జరిగింది? అని నిలదీశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని కలలు కనమనండి అని సూచించారు. దొంగలముఠా మరల వస్తుంది.. ప్రజలు నమ్మొద్దు.. విశాఖ రాజధానికి ఎన్నో అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇక, లోకేష్ యువగళం పాదయాత్ర పై మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు.. రాజకీయాల్లో కావాల్సింది రెడ్ బుక్ కాదు.. బ్లూ బుక్ కావాలని హితవుపలికారు. ఏమి చేసినా చట్టబద్ధంగా ఉండాలి.. ఎక్కడ యువగళం పాదయాత్రను అడ్డుకోలేదన్నారు. పిల్లాడు లోకేష్ ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు అని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో అసలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.

అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల స్పందన.. వాటికి ఓకే..
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు.. అయితే, వారి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.. పలు డిమాండ్లపై సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అంగన్వాడీ వర్కర్లకు, సహాయకులను వర్కర్లుగా ప్రమోట్‌ చేసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచనున్నారు.. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత వన్‌ టైం బెనిఫిట్ రూ.50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని.. అంగన్వాడీ సహాయకుల సర్వీసు విమరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్‌ రూ.40వేలకు పెంచాలని.. అంగన్వాడీ వర్కర్లకు TA/DA నెలకు ఒకసారి, అంగన్వాడీ హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ/గిరిజన ప్రాంతాలలో ఉన్న 16575 అద్దె భవనాలకు, పట్టణ సముదాయములో ఉన్న 6,705 అద్దె భవనాలకు 66.54 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం.. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 48,770 మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ కు Rs.500 చొప్పున, 6837 మినీ అంగన్వాడి సెంటర్స్ కు 250 చొప్పున మంజూరు చేసింది. సొంత భవనాల నిర్వహణ- గోడల పెయింటింగ్ లు, చిన్నపాటి మరమ్మత్తుల కింద 21, 206 అంగన్వాడీ సెంటర్స్ కు (ఒకొక్క కేంద్రానికి 3000/- రూపాయల చొప్పున) Rs.6.36 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్‌.. అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై..!
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి అభివృద్ధికి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమన్న ఆయన.. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు.. అయితే, నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ ఛాలెంజ్‌ చేశారు.. ఇదే సమయంలో.. నిరూపించలేకపోతే నీవు.. నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఇక, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు పెద్దారెడ్డి.. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారని ఆరోపించిన ఆయన.. అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీకి 52 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిదేనని దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో సాగునీరు అడిగే రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిదేనంటూ ఆరోపణలు గుప్పించారు. సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సీఎం వైఎస్‌ జగన్ దే తుది నిర్ణయం అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తా.. చివరకు కుప్పం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా సిద్ధమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

వైఎస్‌ కుటుంబానికి మాత్రమే పాదయాత్రపై పేటెంట్‌..!
వైఎస్‌ కుటుంబానికి మాత్రమే పాదయాత్రపై పేటెంట్‌ ఉందన్నారు మంత్రి మేరుగు నాగార్జున.. నారా లోకేష్‌ పాదయాత్రపై సెటైర్లు వేసిన ఆయన.. లోకేష్ చేసిన యాత్రను పాదయాత్ర అనలేం.. వైఎస్సార్ కుటుంబానికి మాత్రమే పాదయాత్ర మీద పేటెంట్ ఉందని వ్యాఖ్యానించారు. పేద ప్రజల కష్టాలు తెలుసుకోవటం కోసం రాష్ట్రం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్ వారి కష్టాలు తీర్చారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించగానే వాళ్లింట్లో ఒకరు చనిపోయారు.. ఆ తర్వాత దొంగపని చేసి వాళ్ల తండ్రి దొరికిపోయారు.. జనం లేక పాదయాత్రలు ముగించేశారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, లోకేష్ ముగింపు సభలకు ఎంత మంది జనం వచ్చారో అందరూ చూశారన్న నాగార్జున.. మా సీఎం అక్కడకు వచ్చినా వాళ్లలో ఎవరిని చూసి భయపడతారు..? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ది ఎలాంటి గుండె అనేది అందరికీ తెలుసు.. మేం టిక్కెట్లు మార్చుకుంటే మీకెందుకు.. మా నేతను చూసి ప్రజలు మాకు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీసీల సీట్లలో పోటీ చేసి చంద్రబాబు, లోకేష్ వారికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని మండిపడ్డారు. మా నాయకుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. ఆయన ఆశీస్సులు మా అందరికీ ఉంటాయి.. చంద్రబాబు ఆశీస్సులు లేకుండా ఆ పార్టీ లీడర్లు పోటీ చేస్తారా..? అని ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో సమస్యలుంటే మా సీఎం జగన్, మా నేత బాలినేని పరిష్కరిస్తారని వెల్లడించారు మంత్రి మేరుగు నాగార్జున.

ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసి బోర్లా పడింది.. మీడియాతో మాజీ మంత్రి
అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ అంశంపై చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్‌‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విమర్శలు, లేవనెత్తిన అంశాలను మీడియా ముందు జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసి బోర్లా పడిందని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో ఉన్న దాని మీద చర్చ జరగాలని మేం కోరాం. కానీ శ్వేత పత్రంలో ఉన్న లెక్కల్లోనే చాలా తేడాలు ఉన్నాయి. అధికార పక్ష నాయకులు ప్రతి పక్ష నాయకులను భయపెట్టే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేసింది. 22 వేల కోట్ల అప్పులు ఉన్న సమయంలో అనాడు మేము ప్రభుత్వంలోకి వచ్చాం. విద్యుత్ కి సంబంధించిన అప్పులు గురించి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. నష్టం వచ్చినా సరే ప్రజల కోసం రిస్క్ తీసుకోక తప్పదు. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం 24 గంటల కరెంట్‌ను ఇచ్చాం. పరిశ్రమలకు, వ్యవసాయానికి అవసరాల తగ్గట్టు 24 గంటల కరెంట్ ఇచ్చాం. 2014 కు ముందు 3 , 4 గంటలు కరెంట్ కూడా వచ్చేది కాదు. దేశాన్ని 50 ఏళ్ల పైగా పాలించింది కాంగ్రెస్. కానీ ఏ రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రాజెక్టులకు సంబంధించి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి.

రాహుల్ రెండో విడత “భారత్ జోడో యాత్ర”పై సీడబ్ల్యూసీలో భిన్నాభిప్రాయాలు
రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రపై సీడబ్ల్యూసీ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు పళ్లం రాజు.. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చించింది.. ఆ తర్వాత ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన పళ్లం రాజు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలనే దృఢ సంకల్పాన్ని సమావేశంలో తీసుకున్నాం అన్నారు.. సీడబ్ల్యూసీ సమావేశంలో 143 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ తీర్మానం చేసినట్టు పేర్కొన్న ఆయన.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి కొంత నిరాశ కలిగించినా, కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తగ్గకపోవడం కొంత ఊరట కలిగించిన అంశమని చర్చ జరిగిందన్నారు. ఇక, తొలి విడత భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా నిర్వహించిన రాహుల్‌ గాంధీ.. రెండో విడత పాదయాత్ర నిర్వహించాలని డిమాండ్‌ పార్టీలో ఉంది.. ఆ దిశగా రాహుల్‌ కూడా ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సాగుతుండగా.. రెండో విడత రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర” పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టు పళ్లం రాజు తెలిపారు. మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరించాం.. అంతిమంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు.. ఇండియా భాగస్వామ్య పక్షాల నేతలతో సీట్ల సర్దుబాటు, పొత్తులపై ముకుల్ వాస్నిక్ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ నియామకం చేసిన ఐదుగురు నేతలతో కూడిన కమిటీ చర్చలు జరపుతుందని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు పళ్లం రాజు.

కులగణనపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు.. ఓకే, కానీ..
వచ్చే ఏడాది జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘కులగణన’ అంశం కీలకంగా మారబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ దీనిపై స్పష్టంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామంటూ ప్రకటించారు. మరోవైపు ప్రజలను కులాలు, మతాల పేరుతో కాంగ్రెస్ వేరు చేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. ఇదిలా ఉంటే కులగణనపై బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ స్పందించింది. గురువారం రోజున ఆర్ఎస్ఎస్ కులగణనకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. శాస్త్రీయంగా, ఎన్నికల ప్రయోజనాల కోసం కాకండా నిర్వహించే ఏదైన నిశ్చయాత్మక చర్యను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరైన శ్రీధర్ గాడ్గే స్పందిస్తూ.. కులగణన కొంతమందికి రాజకీయ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని కారణంగా దానికి తన వ్యతిరేకత ప్రకటించానని, దాని వల్ల ఆచరణాత్మక ఉపయోగం లేదని అన్నారు.

దేశంలో 10 “బ్లాక్ టైగర్స్”.. అన్నీ కూడా ఒకే చోట..
భారతదేశంలో మొత్తం 10 నల్ల పులులు ఉన్నాయని, అన్నీ కూడా ఒడిశాలోని సిమిలిపాల్ లోనే ఉన్నట్లు ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కి తెలిపింది. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో మాత్రమే ‘‘మెలనిస్టిక్స్ టైగర్స్’’(బ్లాక్ టైగర్స్)ని నమోదు చేశామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభకు తెలిపారు. పాన్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎక్సర్‌సైజ్ 2022 సైకిల్ ప్రకారం.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో 16 పులులు ఉన్నాయని వీటిలో 10 బ్లాక్ టైగర్ అని చెప్పారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ జనటిక్ కంపోజిషన్ కారణంగా ప్రత్యేకమైన క్లస్టర్‌గా గుర్తించబడుతోందని మంత్రి చెప్పారు. గత 5 ఏళ్లలో ఈ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల సంరక్షణ, నివాసానికి, మానవ వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం పథకం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ వైల్డ్ లైఫ్ హాబిట్స్(CSS-IDWH) కింద రూ. 32.75 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు.

భారత్ చంద్రున్ని చేరుకుంటే.. పాకిస్తాన్ భూమిపై నుంచి లేవడమే లేదు..
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నవాజ్, నాలుగోసారి పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని అనుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా యూకేలో ప్రవాసంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇటీవలే పాకిస్తాన్ తిరితగి వచ్చారు. తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) తరుపున ప్రచారం చేస్తున్నారు. బుధవారం ఇస్లామాబాద్‌లో తన పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మన చుట్టుపక్కల దేశాలు చంద్రున్ని చేరుకుంటున్నాయని, పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ భూమి పై నుంచి లేవలేదని అన్నారు. పాకిస్తాన్ పతనానికి పాకిస్తానే కారణమని చెప్పారు. మన పతానానికి మనమే బాధ్యులమని.. లేకుంటే దేశం వేరే విధంగా ఉండేదని ఆయన అన్నారు.

ప్రైమ్ యూజర్స్ కి గుడ్ న్యూస్..ఆ ప్లాన్ పై భారీ తగ్గింపు..
అమెజాన్ ప్రైమ్ తమ యూజర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ ధరలను ప్రకటించింది. రూ.999గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ మెంబర్షిప్ ను ప్రకటించింది.. ఇక గతంలో ఈ మెంబర్ షిప్ నెలకు రూ.299, 3నెలలకు రూ.599, ఇయర్ ప్లాన్ రూ.1,499గా ఉండేది. ఆ తర్వాత ప్రైమ్ లైట్ ను జూన్ లో ప్రారంభించిన అమెజానల్ ప్రైమ్ ప్లాన్ లో కొన్ని మార్పులను చేస్తున్నట్లు ప్రకటించింది.. మామూలు ప్రైమ్ మెంబర్ షిప్ తో పోలిస్తే.. ఇందులో కాస్త ప్రయోజనాలు తక్కువగానే ఉన్నాయి. ఈ ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ మెంబర్ షిప్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.. అయితే మిగిలిన వాటికి ఎటువంటి తగ్గింపు లేదని చెప్పారు.. సాదారణంగా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్లు అనేక ప్రయోజనాలను పొందుతూన్నారు.. ధరతోపాటు ప్లాన్ లో కనిపించే మార్పుల విషయానికొస్తే… ఈ ప్లాన్ లో ఇంతకుముందు రెండు రోజుల్లో డెలివరీ చేసేవాళ్ళు.. కానీ ఇప్పుడు మాత్రం వన్ డే లో డెలివరీ అవుతుంది.. అలాగే టు డే డెలివరీ ఉంటుందని చెబుతున్నారు.. కొన్ని వస్తువులకు ఇంకాస్త ఫాస్ట్ గా డెలివరీ ఉంటుందని చెబుతున్నారు..

గౌతమ్ న్యూయార్క్ వెళ్ళింది యాక్టింగ్ నేర్చుకోవడానికా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని చిన్నప్పుడు వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు. ఆ తరువాత చదువులో పడి ఇప్పటికే ప్లస్ టూ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం తన కొడుకు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మహేష్ భార్య నమ్రత. గౌతమ్ ఇకపై కుటుంబానికి దూరంగా ఉండబోతున్నాడు, న్యూయార్క్ యూనివర్సిటిలో చేరేందుకు వెళ్లుతున్న కొడుకు ఫొటోను షేర్ చేస్తూ కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నందుకు గౌతమ్ కు శుభాకాంక్షలు అంటూ ఆమె పోస్టు పెట్టింది. ‘’నీ హార్డ్ వర్క్, ఫ్యాషన్, సంకల్పం చూస్తుంటే నాకు గర్వంగా ఉందని. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ పేర్కొన్న ఆమె ఇప్పుడు మరో పోస్ట్ పెట్టింది. అందులో గౌతమ్ చిన్నప్పటి పిక్ లో నేను ఇండియా, అమెరికాలో పెద్దయి తరువాత యాక్టర్ అవుతానంటున్నట్టు రాసుంది. ఇక అందుకు క్యాప్షన్ గా సుధీర్ఘంగా ఆమె రాసుకొచ్చింది. స్లేట్‌పై రాయడం నుండి వేదికపై స్క్రిప్ట్‌లలు రాయడం వరకు, కలలు – సంకల్పానికి ఒక అందమైన కాంబినేషన్. లైఫ్ స్పాట్‌లైట్‌ను స్వీకరించడానికి ఒక ఫుల్ సర్కిల్ పట్టింది. నువ్వు నీ కోసం ప్లాన్ చేసుకున్న ఈ అద్భుతమైన ప్రయాణంలో నీకు ఆనందం, విజయాలు మాత్రమే రావాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ క్రమంలో నమ్రత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గౌతమ్ ఏం చదవబోతున్నాడు అని కొందరు కామెంట్ చేస్తుంటే ఖచ్చితంగా నటన నేర్చుకోవడానికి వెళ్ళాడు, అందుకే ఆ పిక్ షేర్ చేసింది అని కొందరు అంటున్నారు. అయితే అసలు నిజం ఏమిటో నమ్రత,లేదా మహేష్ పూర్తిగా క్లారిటీ ఇస్తే తప్ప చెప్పలేం.

ప్రభాస్ ఫ్యాన్స్ పై షారుఖ్ ఫ్యాన్స్ దాడి?
ప్రభాస్ సలార్ సినిమా, షారుఖ్ డంకీ సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అని ట్రేడ్ వర్గాల వారు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే నేషనల్ చైన్స్ పీవీఆర్-ఐనాక్స్, సినీ పోలిస్ లలో సలార్ టికెట్లు అమ్మడం లేదని తెలియడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫాన్స్ మీద షారుఖ్ అభిమానులు దాడి చేయడం హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద పబ్లిక్ టాక్ సమయంలో ప్రభాస్ అభిమానులు డంకీ సినిమా బాలేదని అనడంతో వారి మీద దాడికి యత్నించారు షారుఖ్ ఫాన్స్. వెంటనే సెక్యూరిటీ అలెర్ట్ అయి వారిని విడగొట్టారు. గతంలో ఆదిపురుష్ సినిమా సమయంలో ఇలానే దాడి చేయడంతో థియేటర్ బయట రివ్యూలు చెప్పడం మానిపించారు. అయితే కాంపౌండ్ బయట పెట్టినా అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. ఇక డంకీ సినిమా ఒక ఎమోషనల్ డ్రామా, కేవలం హిందీ భాషలోనే రిలీజ్ అవుతుంది. దీంతో డంకీకి సౌత్ లో భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ప్రభాస్ సలార్ సినిమా హిందీతో పాటు సౌత్ లోని నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుండడం బాగా కలిసొచ్చే అంశం.

Exit mobile version