Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

*జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన.. 100 ఎకరాల్లో నిర్మాణానికి ప్రణాళిక
వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిధిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను వారు కోరారు. అయితే, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే విధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు న్యాయవాదులు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటెజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

*తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణలో పలు శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా కేంద్ర సర్వీసులో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి.. రాష్ట్ర సర్వీసులకు తీసుకు వచ్చారు. ఆమెకు అత్యంత కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్ పదవిని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా అమ్రపాలి నియామకం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇక, హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలిని తెలంగాణ సర్కార్ నియమించింది. ఇరిగేషన్ సెక్రెటరీగా రిజ్వీని నియమిస్తూ ఆయనకు అదనంగా ట్రాన్స్ కో అండ్ జెక్ కో చైర్మన్ ఎండీగా బాధ్యతలను అప్పజెప్పింది. అలాగే, ట్రాన్స్ కో జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్‌డీతో పాటు ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా ఐఏఎస్ కృష్ణ భాస్కర్‌ నియమించారు. ఎస్పీడీసీఎల్‌ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వరుణ్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక, అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి. గోపి, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా శైలజా రామయ్యర్ లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

*ఇరిగేషన్ ప్రాజెక్టులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళాంల, ఎస్ఎల్ బీసీ టన్నెల్, నక్కల గండి రిజర్వార్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అలాగే పిలాయిపల్లి కెనాల్, ధర్మ రెడ్డి కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మండలి ఛైర్మన్ కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తగినంత బడ్జెట్ ను కేటాయించాలని ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు సుఖేందర్ రెడ్డి సూచించారు. ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి, పనులు త్వరగా అయ్యేలా చూడాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయి.. ఇంకా ఎంత శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి.. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఎంత నిధులను ఖర్చు చేసింది.. అలాగే ఇంకా ఎంత నిధులు అవసరం ఉన్నాయనే పూర్తి నివేదికను గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇరిగేషన్ అధికారులకు అందించారు. ప్రాజెక్టులు పూర్తి అయితే జిల్లాలో నీటి సమస్య ఉండదని.. త్వరగా పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. గుత్తా లెవనేత్తిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

 

*అవి ప్రభుత్వ భూములే.. శంషాబాద్‌ ల్యాండ్స్‌పై హైకోర్టులో పిటిషన్‌ డిస్మిస్
తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టి వారి రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు చెందుతాయని ఇవాళ తీర్పు ఇచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారు. సంబంధం లేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ ఎస్టేట్, లీగల్, ఎన్ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని గత ఏడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. వాద ప్రతి వాదనల అనంతరం హైకోర్టు డివిజనల్ బెంచ్ నవంబర్ 18వ తేదీన తీర్పును రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ లో పెట్టింది. తుది తీర్పును ఇవాళ హైకోర్టు వెల్లడిస్తూ ఆక్రమణదారుల రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే, కేసు పూర్వోపరాలు: శంషాబాద్ లోని 181 ఎకరాల భూములను హెచ్ఎండీఏ 1990 సంవత్సరంలో ఆనాటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్వివైజేషన్ (LA) కింద తీసుకుంది. శంషాబాద్ లోని ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కు సర్వహక్కులు ఉన్నాయి. ఇక్కడి భూముల్లోని దాదాపు 20 ఎకరాల్లో హెచ్ఎండిఏ నర్సరీ పని చేస్తున్నది. ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏకు సంబంధించిన 181 ఎకరాల్లో రెండు(2) ఎకరాల భూమిని ఆ పరిసరాల ప్రజల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం హెచ్ఎండిఏకు సంబంధించిన ఈ భూముల నుంచి ముప్పై(30) గుంటల భూమిని కేటాయించింది. మిగత 50 ఎకరాల భూమిని కొందరు భూ అక్రమదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయడంతో గత కొంత కాలంగా హైకోర్టులో పోరాటం చేసిన హెచ్ఎండీఏ చివరకు తన పరిధిలోని 181 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.

 

*సమాచార శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమాచార శాఖ పని తీరును సంబంధిత అధికారులతో సమీక్షీంచారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్య వంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వింగ్ ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణ మాస పత్రికను మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చి దిద్దడంతో పాటు ఈ పత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజా ప్రతినిధులకు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తీసుకు రావాలని చెప్పారు. ఈ సందర్బంగా సమాచార శాఖలో వివిధ విభాగాల పని తీరును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. ప్రింట్ మీడియా, ప్రింట్ మీడియా, అవుట్ డోర్ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన మీటింగ్ నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్ర స్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమాచార శాఖ పని తీరును మెరుగు పర్చాలని అధికారులను ఆదేశించారు. సమాచార శాఖతో పాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమీషనర్ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సురేష్ , చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాధా కిషన్, ప్రాంతీయ సమాచార ఇంజనీర్ జయరామ్ మూర్తి, రాములు, అకౌంట్స్ ఆఫీసర్ పద్మ కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

*దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలి.. ఒక్కసారి జనసేనను నమ్మండి..
యువత, మహిళా బలం వల్లే వైసీపీ లాంటి గూండా నేతలను ఎదుర్కొని జనసేన నిలబడగలుగుతోందని.. వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలంటే.. ఒక్కసారి జనసేనను నమ్మండి అంటూ పవన్ ప్రజలకు సూచించారు. ముస్లింలు మైనార్టీలు కాదు మెయిన్ స్ట్రీమ్ నాయకులు అంటూ ఆయన పేర్కొన్నారు. మైనార్టీలు ఇబ్బందుల్లో ఉంటే సాటి మనిషిగా అండగా నిలబడతానని.. మైనార్టీలను ఓట్ల కోణంలో చూసే మనిషిని కాదన్నారు. నేడు జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. విశాఖ, పి.గన్నవరం, దర్శి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు. పవన సమక్షంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగించారు. ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పని చేయాలని కార్యాకర్తలకు పవన్‌ పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన పార్టీల పొత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలన్నారు. దశాబ్ద కాలంపాటు పొత్తు ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమన్నారు. నా భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదన్న పవన్‌.. ఏపీ భవిష్యత్తు కోసమే కృషి చేస్తున్నానన్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” నేను దశాబ్దకాలంగా పని చేస్తున్నాను. పల్లం వైపే నీరు వెళ్తుంది.. పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ప్రజలు తప్ప నాయకులంతా బాగు పడుతున్నారు. నేతలు కాంట్రాక్టులు చేసుకుంటున్నారు.. దోపిడీ చేస్తున్నారు.. సంపాదిస్తున్నారు. మైనార్టీలు నన్ను నమ్మాలి.రాజ్యాంగబద్దంగా ముస్లింలకు ఏం చేయాలో అవన్నీ చేస్తాను. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది.. దీనిని చక్క దిద్దాలి నేను అందరీ మతాలను గౌరవిస్తా. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా ఎప్పుడూ చూడను. ముస్లిం మైనార్టీల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తాం. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి. బీజేపీ వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముస్లింలకు అన్యాయం జరిగితే పవన్ ముస్లింల వైపే ఉంటాడు. ముస్లింల పక్షాన గళం ఎత్తే నాయకుడ్ని నేనే. ఉద్దానం తర్వాత ప్రకాశం జిల్లాలోనే ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలో వలసలు తగ్గించాలి. నీటి సమస్య, వలసలు తగ్గాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి. రాష్ట్ర భవిష్యత్ కోసం కనీసం 10 ఏళ్లు పనిచేయాలి. సినిమా టిక్కెట్ల లాంటి విధానాలకు చీఫ్ సెక్రటరీలతో పని చేయించే పరిస్థితి ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చీఫ్ సెక్రటరీలు.. రెవెన్యూ అధికారులతో పని చేయించే పరిస్థితి తెస్తాం.” అని పవన్‌ పేర్కొన్నారు.

 

*వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు సెటైర్లు
వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ లెక్కలు తారుమారయ్యాయని.. 11 మందికి సీట్లు మార్చేశారని ఆయన అన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఊహించలేదని.. ఓ చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుబాటు అవుతారని ఆయన ప్రశ్నించారు. దళితులు, బీసీలనే బదిలీ చేశారని.. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. అక్కడ బీసీ అభ్యర్థిని నిలపొచ్చు కదా అని చంద్రబాబు అన్నారు. ఇంత మందిని బదిలీలు చేసిన జగన్.. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదన్నారు. జగన్ మనుషులు.. బినామీలను ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. పేదవారి సీట్లే మారుస్తారా.. 150 సీట్లు మార్చినా వైసీపీ గెలవదన్నారు. ప్రజలను టేకిట్ గ్రాంటెడుగా తీసుకోవడం దారుణమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇప్పటికే చాలా మార్పు వచ్చింది.. నోటిఫికేషన్ వస్తే మరింతగా మార్పు వస్తుంది. అందరి అభిప్రాయాలతో అభ్యర్ధులను నిలబెడతాం. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అందరూ సహకరించాలి.. మార్పునకు నాందీ పలకాలి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తాం. పొత్తులో ఉన్నాం.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాం. ఈసారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోంది. వైసీపీలోని అసంతృప్తులు మాకెందుకు..? అక్కడ టిక్కెట్ రాలేదని మా దగ్గరకు వస్తామంటే మాకు అవసరం లేదు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తాం. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగనుకు.. ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిది..? పక్క రాష్ట్రాల్లో ఓటు లేని వారికి.. ఈ రాష్ట్రంలో ఓటు ఉంటే.. వాళ్లూ ఓటేయొద్దని ఎలా చెబుతారు..? ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారు..? జగన్ చేసేవన్నీ చెత్త పనులే. రిషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా..? రిషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా..? చట్టం సీఎంకు వర్తించదా..? జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడే కాదు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తున్నారు.. తరలింపు సాధ్యమా..? ఎలా తరలిస్తారు..? సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు.” అని చంద్రబాబు అన్నారు.

 

*యూకేలో విజృంభిస్తోన్న “నోరోవైరస్” కేసులు.. వ్యాధి లక్షణాలివే..
యూకేలో ఇటీవల కాలంలో నోరోవైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. బీబీసీ ప్రకారం ఈ నెల ప్రారంభం వరకు దాదాపుగా 1500 మందికి ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది. గతేడాదడి ఇదే సమయంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం అధిక కేసులు నమోదవుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సాధారణంగా వీటిని ‘‘ శీతాకాలపు వాంతుల క్రిమి’’ అని పిలుస్తారు. ఇది డయేరియాకు కారణమవుతుంది. క్రిస్మస్ ముందు నోరోవైరస్, ఇతర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య గురించి ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నోరోవైరస్ అనేది అంటు వ్యాధి, ఇది వికారం, వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. ఇది ఎక్కువగా కడుపు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ‘స్టమక్ ఫ్లూ’ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తిని కలుసుకుంటే వేరే వారికి కూడా ఈ నోరోవైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. నోరోవైరస్‌కి వ్యాక్సిన్ లేదు.ఇది కడుపు, పేగుల వాపుకు కారణమవుతుంది. దీనిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల తర్వాత లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. చాలా మంది ప్రజలు ఒకటి నుంచి మూడు రోజుల్లో ఈ వైరస్ బారి నుంచి కోలుకుంటారు. ఈ వైరస్‌కి ప్రత్యేకమైన మందులు లేవు. డీహైడ్రేషన్ నివారించడానికి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడంతో పాటు లక్షణాలను అనుసరించి చికిత్స చేస్తుంటారు. వ్యక్తుల మలంలో కనీసం రెండు వారాల పాటు వైరస్ ఉంటుందని, చేతులను సబ్బులో శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version