Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*రైతు బంధు నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ వెల్లడించారు. గతంలో మాదిరిగా రైతులకు ఈ చెల్లింపులు చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రైతుబంధును ఆపాల‌ని ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ త‌ర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈసీని అనుమ‌తి కోరగా, రైతుబంధు నిధుల విడుద‌ల‌కు పర్మిషన్ ఇచ్చింది. కానీ, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రైతు బంధు నిధులు విడుదల చేయొద్దని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో రైతుబంధు నిధులు విడుదల ఆగిపోయింది. ఇక, గ‌త బీఆర్ఎస్ సర్కార్ ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద 10 వేల రూపాయలు అందించింది. రెండు విడుతల్లో ఆర్థిక సాయాన్ని అందజేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రబీ సీజన్‌కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేదు.. దీంతో ట్రెజ‌రీలో రైతుబంధు నిధుల‌ను ప్రభుత్వం జ‌మ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల నిధుల‌ను ఇప్పుడు విడుద‌ల చేయాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

 

*గెలుపే లక్ష్యం.. సిట్టింగ్‌లను మారుస్తూ సీఎం జగన్‌ సంచలన నిర్ణయం
ఎన్నికలపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జిలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాల్లో చేసిన సర్వే ప్రకారం.. 45 నుంచి 50 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్ లో 11 సెగ్మెంట్లలో పరిస్థితిని వైసీపీ విశ్లేషించింది. సీనియర్‌ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద మీడియాకు తెలియజేశారు. పదకొండు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను నియమించినట్లు వెల్లడించారు. స్థాన చలనం కలిగిన వాళ్లలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. రెండు ప్రతిపాదనలపై ఫోకస్ పెట్టింది వైసలీపీ. ఒకటి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంఛార్జులను వేరే నియోజకవర్గాలకు స్థాన చలనం కలిగించడం.. రెండోది పూర్తిగా పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని బరిలో పెట్టడం లాంటివి ఉన్నాయి. గెలుపు గుర్రాలే ఏకైక ప్రాతిపదికగా నిర్ణయం తీసుకుంది. త్వరలో కసరత్తు కొలిక్కి రానుంది. గుంటూరు పశ్చిమ- విడదల రజిని, మంగళగిరి-గంజి చిరంజీవి, పత్తిపాడు-బాలసాని కిషోర్‌ కుమార్‌, వేమూరు- అశోక్‌బాబు, సంతనూతలపాడు -మేరుగ నాగార్జున, తాడికొండ-మేకతోటి సుచరిత, కొండెపి -ఆదిమూలపు సురేష్‌, చిలకలూరిపేట- రాజేష్‌ నాయుడు, అద్దంకి -పాణెం హనిమిరెడ్డి, రేపల్లె -ఈవూరు గణేష్‌, గాజువాక-వరికూటి రామచంద్రరావులను నియమించినట్లు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మార్పుతో 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. నేతల గెలుపు అవకాశాల్ని బట్టి ఇంఛార్జ్‌లను మార్చామని తెలిపారు. అన్ని స్థానాల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా సాగుతోందని.. అందుకోసమే సీఎం జగన్‌ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా అవసరాన్ని బట్టి మార్పులు ఉంటాయని సజ్జల చెప్పుకొచ్చారు.

 

*రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడం..
ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు నన్ను ఎంపీగా ఎన్నుకుని నాకు పునర్జన్మ ఇచ్చారు.. ఎప్పటికీ భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటాను అని వెంకట్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.. మార్చిలో భవన్ శంకుస్థాపన చేస్తాం.. ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. రేపు భవన్ అధికారులతో రివ్యూ నిర్వహిస్తాను.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడం అని తెలిపారు. గత ప్రభుత్వ మంచి, చెడులపై క్యాబినెట్ లో చర్చ చేస్తాం.. ఒక్క ఉపాధ్యాయ నియామకం చేపట్టలేదు.. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు.. 6 వేల పాఠశాలలు మూతబడ్డాయి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. భువనగిరి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీగా గెలిపించి నాకు పునర్జన్మ ఇచ్చారు.. భువనగిరి ఎంపీగా లేకపోయినా నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను.. ఇంటికో వెయ్యి వేసుకోని ప్రజలే నన్ను గెలిపించారు.. గత రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కలవలేదు, నిధులు ఇవ్వలేదు.. కేంద్ర మంత్రి నితిన్ గట్కరిని కలిసి జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను.. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

 

*కేసీఆర్ ను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకేసీఆర్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే, తుంటి ఆప‌రేష‌న్ సక్సెస్ అయిందని.. వేగవంతంగా కేసీఆర్ కోలుకుంటున్నార‌ని వైద్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి తెలియజేశారు. సాధ్యమైనంత తర్వలో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు వెల్లడించారు. అనంత‌రం కేసీఆర్ తో భట్టి కాసేపు మాట్లాడారు.. అలాగే అక్కడే ఉన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కల్వకుంట్ల కవితతో కలిసి ప్రమాదం జరిగిన తీరును, చికిత్స అందిస్తున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి కూడా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. ఇక, అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేత పత్రం రిలీజ్ చేస్తామని వెల్లడించారు. 2014కు ముందు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం సిద్ధం రెడీ చేస్తున్నామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మ గౌరవం కోసం తెలంగాణ సమాజం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకుంది అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. పది ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చక పోగా ఉన్న స్వేచ్ఛని సైతం హరించింద‌ని భట్టి విక్రమార్క విమర్శించారు.

 

*కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు. కేసీఆర్ తొందరగా కోలుకోలుకొని.. ప్రజా సేవలోకి రావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయని చంద్రబాబు తెలిపారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు సైతం కేసీఆర్‌ను పరామర్శించారు. ఇక, గత నాలుగు రోజుల క్రితం కేసీఆర్‌కు యశోద ఆస్పత్రి వైద్యులు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లోని బాత్‌రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్లు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

 

*కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ.. భారత్ జోడో యాత్రకు ధీరజ్ సాహు ఆర్థిక సాయం..!
భారత దేశ చరిత్రలో అత్యంత కీలక నిర్ణయం జమ్మూ కాశ్మీర్ లో తీసుకున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆర్టికల్ 370 రద్దును అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలికారు.. విపక్షాలు వ్యతిరేకించిన, జమ్మూ ప్రజలు సమన్వయంతో వ్యవహరించారు.. జమ్మూలో ఎన్నో మార్పులు వచ్చాయి.. సుప్రీం కోర్టు ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాము.. జమ్మూను సామాజికంగా ఆర్థిక పరంగా మౌలిక వసతులు కల్పించాలని ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితుడు.. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన వ్యాపారాలపైన.. ఆదాయపు పన్నుశాఖ అధికారులు చేసిన దాడుల్లో నేటి వరకు రూ.351 కోట్లు బయటపడ్డాయి.. దేశ చరిత్రలోనే ఓ సంచలనం అని కిషన్ రెడ్డి అన్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ డబ్బు పట్టుబడిన సందర్భాల్లో ఇదే ఎక్కువ అని కిషన్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో.. సోషల్ మీడియాలో ధీరజ్ సాహు పోస్టు చేస్తూ.. ‘కొందరు ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని ఎందుకు దాచుకుంటారో అర్థం కావడం లేదు’ అని ట్వీట్ చేశారు.. బ్యాంకు లాకర్లు, ఇతర వ్యాపార కేంద్రాల మీద దర్యాప్తును ఐటీతో పాటుగా వివిధ దర్యాప్తు సంస్థలు కొనసాగిస్తున్నాయి.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్థికంగా సహాయం అందించిన వ్యక్తి ధీరజ్ సాహు అని ఆయన ఆరోపించారు. రాహుల్ కను సైగల్లో.. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం ఈ డబ్బు పోగు చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆదాయపు పన్ను అధికారులను అభినందిస్తున్నాను.. నల్లధనంపై జరుగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.. ప్రధాని ఆకాంక్షలను పూర్తి చేసే దిశగా ఇలాగే సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నాను అని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు అని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ, 5 ఏండ్లకు సరిపడా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది.. ఛత్తీస్ గఢ్ లోన అవినీతి ఎక్కువైనందునే ఆ పార్టీని ఓడించారు.. గత తొమ్మిదిన్నర ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక చిన్న అవినీతి మరకకూడా లేకుండా పని చేస్తోంది.. కర్ణాటక బిల్డర్లను బెదిరించి, కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ ఎన్నికల్లో వినియోగించారు అని ఆయన ఆరోపించారు. శబరిమలలో పూర్తి స్థాయిలో భక్తులు ఇంకా చేరుకోక ముందే.. పరిస్థితులు, ఏర్పాట్లు అధ్వాన్నంగా ఉన్నాయి.. ఇవాళ కేరళ సీఎంతో మాట్లాడబోతున్నాను.. కేరళ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.. యుద్ధ ప్రాతిపదికన భ్రదతా సిబ్బంది, మౌలిక వసతులు, కనీస ఏర్పాట్లు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రసాద్ పథకం ద్వారా.. మౌలిక వసతులు కల్పిస్తామంటే.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు.. సీపీఎం ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 

*ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..
ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో పాటు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు. అలాగే, రైతు భరోసా పథకంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ చేశారు సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధికారులతో.. ఏక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ మీటింగ్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ఉన్నాధికారులు పాల్గొన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. నార్కోటిక్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, వాడకంపై గతంలో పలువురు సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు.. డ్రగ్స్ వ్యవహారంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసుపై రివ్యూ చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

*U-19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈరోజు (సోమవారం) U19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇంతకుముందు.. ఈ టోర్నమెంట్ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్ లో.. భారత్, బంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్, నమీబియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, నేపాల్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిపి 16 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని మాంగాంగ్ ఓవల్‌లో జరిగే ఛాంపియన్‌షిప్ ప్రారంభ మ్యాచ్‌లో ఐర్లాండ్-యుఎస్ఎ జట్టు తలపడనున్నాయి. పోచెఫ్‌స్ట్రూమ్‌లోని జెబి మార్క్స్ ఓవల్, ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్, కింబర్లీలోని కింబర్లీ ఓవల్, బెనోనిలోని విల్లోమూర్ పార్క్ ఈ టోర్నమెంట్ కు వేదికలు కానున్నాయి. ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ తన తొలి మ్యాచ్ జనవరి 20న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఆ తర్వాత.. జనవరి 25, 28 తేదీల్లో జరిగే తొలి రౌండ్‌లో ఐర్లాండ్‌తోనూ, అమెరికాతోనూ భారత్ తలపడనుంది.

*క్రికెట్లో రేపటి నుంచి కొత్త రూల్ అమలు
క్రికెట్ లో రేపటి నుంచి కొత్త రూల్ అమలు కానుంది. స్టాపింగ్ క్లాక్ పేరుతో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది ఐసీసీ. ఈ రూల్స్ ప్రకారం బౌలింగ్ జట్టు.. తన తర్వాతి ఓవర్ లోని మొదటి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకండ్ల లోపే వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. అలా లేకపోతే రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా అలానే జరిగితే.. బౌలింగ్ జట్టుకి 5 పరుగుల పెనాల్టీ వేస్తారు. కాగా.. వికెట్ కోల్పోయినప్పుడు మైదానంలోకి కొత్త బ్యాటర్ వచ్చినప్పుడు ఈ రూల్ వర్తించదు. డ్రింక్స్ సమయంలోనూ, గాయపడిన ఆటగాడు మైదానంలో చికిత్స పొందేందుకు అంపైర్లు అనుమతించినప్పుడు, ఫీల్డింగ్ జట్టుకు సంబంధించని కారణాలతో సమయం వృథా అయినప్పుడు కూడా ఈ నిబంధన వర్తించదు. 41.9 నిబంధన కింద ఈ కొత్త రూల్ తెచ్చేందుకు ఐసీసీ కసరత్తులు చేస్తోంది. తొలుత దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు జరిగే దాదాపు 59 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఈ కొత్త రూల్ ను అమలు చేసి పరిశీలిస్తారు. ఆట వేగాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ చెప్తుంది. రేపు వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ నుంచే ప్రయోగాత్మకంగా అమలు కానుంది.

Exit mobile version