NTV Telugu Site icon

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*రాష్ట్రంలో పలు కార్పొరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు
తెలంగాణలో పలు కార్పొరేషన్ ఛైర్మన్‌ల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు సంబంధించి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 మంది నియామకాలు, పదవీ కాలం పొడిగింపును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కాగా.. డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా, అప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియమకాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా 54 కార్పొరేషన్ల ఛైర్మన్ నియామకాలు రద్దు చేసింది.

 

*భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న ముగ్గురు మంత్రులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వారికి.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాముడు కంటే గొప్పగా ప్రజాపాలన అందించే దేవుడు లేడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే వారికి రాముడే ఆదర్శం.. ప్రజలు కోరుకున్నది అందించే ఏకైక రాజు శ్రీరామచంద్రమూర్తి అని తెలిపారు. కాబట్టి రాముడిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజాపాలన అందిస్తుందన్నారు. మతసామరస్యానికి సైతం పేరుగాంచిన దేవాలయం భద్రాద్రి రామాలయం.. ఆనాటి ముస్లిం రాజైనటువంటి తానీషా ప్రభువు, హిందూ దేవుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ముత్యాల తలంబ్రాలు పంపించాడు.. ఇటువంటి లౌకికవాదానికి ప్రతీకగా నిలిచిన రామాలయాన్ని దర్శించుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో సంపద పెంచుతాం.. ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తామన్నారు. తమది పీపుల్స్ ప్రభుత్వమని.. ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం కూడా అదేనని మంత్రి భట్టి పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శించుకున్నానని, ఇప్పుడు ఫలితాలు అనంతరం కృతజ్ఞతగా వచ్చి తిరిగి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. ప్రజా కంటకమైన రాక్షస పాలన ముగిసింది.. నేటి నుండి ప్రజలకు ప్రజాపాలన అందిస్తామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం, రామరాజ్యం తరహాలో ప్రజలకు పాలన అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. మరోవైపు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆనాటి రామరాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలిస్తామని చెప్పారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా బలాన్ని ఇవ్వాలని శ్రీరామచంద్ర ప్రభువును కోరుతున్నామని ఆయన తెలిపారు.

 

*సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ కలిశారు. ఈ సందర్భంగా.. వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పటి నుండి ఇప్పటి వరకు అన్యాక్రాంతమై, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలన్నీ ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో.. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు అనేక ఇబ్బందులను గురిచేసిందని వారు పేర్కొన్నారు. దరిద్రమైన ధరణి వెబ్ సైట్ ద్వారా ఖరీదైన భూముల వివరాలన్నీ అన్యక్రాంతం చేశారని జేఏసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

 

*కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ గురి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్.. అందులో భాగంగా తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఆ సమావేశాల అనంతరం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా విస్త్రతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై సమీక్షించనున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో బీజేపీకి అధిక ఓట్లు వచ్చాయి? ఏయే గ్రామాల్లో పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది? పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న మండలాలు, గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ఎంత? అనే అంశంపై లోతుగా విశ్లేషించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష పూర్తయిన అనంతరం.. మండలాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమీక్షలు చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాల్లో విస్తరించింది. మొత్తం 40 మండలాలు, 671 గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం 16,51,534 మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీకి వచ్చిన ఓట్ల సరళిని విశ్లేషించనున్నారు. అనంతరం బీజేపీ బలోపేతం, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం బండి సంజయ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా రాబోయే 45 రోజులపాటు తన పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారిని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని నిర్ణయించిన బండి సంజయ్ సంక్రాంతి తరువాత నేరుగా జనం వద్దకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

 

*టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం
మిచౌంగ్ తుఫాన్ కొన్ని జిల్లాలను అతలాకుతలం చేసిందని ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తుఫాన్‌ వస్తుందనే సమాచారంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని.. దీని వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందని మంత్రి తెలిపారు. ఈ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని.. జగన్‌పై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. బురద అంటకుండా, చొక్కా నలక్కుండా తుపాను బాధితులను పరామర్శించారని అంటున్నారని చెప్పారు. తుపాను బాధితులను పరామర్శించడానికి వెళితే బురదలో పొర్లాడాలా అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు లాగా షో చేయటం జగన్‌కు రాదని ఆయన అన్నారు. కొత్త ప్రాజెక్టులు రాష్ట్రంలో కట్టింది ఎవరు.. వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. జగన్ అవుకు 2వ టన్నెల్ నుంచి నీళ్ళు విడుదల చేశారని చెప్పారు. శంఖుస్థాపనలు చేసింది రాజశేఖరరెడ్డి అని.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇవాళ జగన్ ప్రారంభిస్తున్నారన్నారు. టీడీపీ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టు కు నష్టం జరిగిందన్నారు. డ్యాం సేఫ్టీకి సంబంధించిన కమిటీలు టీడీపీ హయాంలో పరిశీలించి నివేదిక ఇచ్చాయని.. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను రిపేర్ చేయాలని చెప్పారని.. చంద్రబాబు 5 కోట్లు ఖర్చు పెట్టి గేట్లు రిపేర్ చేయకుండా రంగులు, బ్యూటిఫికేషన్ వంటి పనులు చేశారని ఆయన ఆరోపించారు. రిపేర్లకు ఇప్పటికే టెండర్లను పిలిచామన్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అతిథుల్లా వస్తుంటారు. ఇక్కడ దూషించి ప్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళుతుంటారు. చంద్రబాబు చేతిలో పచ్చ జెండా లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఇచ్చాడు. ఈయన జెండాలు పట్టుకుని తిరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. మన ప్రబుద్ధుడు పవన్ కళ్యాణ్‌ తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు. మూడు వాస్తవాలను పవన్ కళ్యాణ్ గమనించాలని విఙప్తి చేస్తున్నాను. చంద్రబాబు ముష్టి వేసినట్లు నీకు సీట్లు ఇస్తాడు. జనసేన కు అభ్యర్థులు లేని చోట్ల టీడీపీ వారినే జనసేన కండువా కప్పుతారు. రాయలసీమలో బంగాళదుంప, ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు ప్రమాదకరం కాదు.. చంద్రబాబు లాంటి క్యాన్సర్ గడ్డలే ప్రమాదం. తెలంగాణలో కలవని టీడీపీ, జనసేన ఇక్కడ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలి. ఎవరు క్యాష్ ఇస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళకే కాల్ షీట్స్ ఇస్తాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ది అపవిత్ర కలయిక. అపవిత్ర కలయికను ప్రజలు తిరస్కరిస్తారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశారు. తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోలేదా??. ఫెయిల్ అయిన ఫార్ములా.” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

 

*ఆమెకు ఉద్యోగం.. గుండెంతా ఆనందంతో నిండిపోయిందంటున్న యాంకర్ సుమ
తెలంగాణలోని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు ముఖ్యమంత్రిగా రజినీకి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపడం హాట్ టాపిక్ అయింది. కొద్దీ రోజుల కిందట నాంపల్లికి చెందిన వికలాంగురాలు రజినీ అనే యువతి గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తాను పీజీ పూర్తి చేశానని అయితే ఎత్తు సమస్య వలన ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆమెను కోరారు, ప్రభుత్వం ఏర్పాటు కాగానే తన అర్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వగా అన్నట్టుగానే ఆమెకు 50వేల జీతంతో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు. ఇక ఈ విషయం మీద స్పందించిన యాంకర్ సుమ ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని విని నా హృదయం ఆనందంతో నిండిపోయింది, తెలంగాణలో బస్ డ్రైవర్ పోస్టుల కోసం ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిసి ఇంకా ఆనందం కలుగుతోంది. కేవలం ఒక వారం క్రితం నేను పద్మావతి వికలాంగ సమాజానికి సమాన అవకాశాల గురించి మాట్లాడాము అని ట్వీట్ చేసింది. అంతేకాక సునీతా కృష్ణన్ ‘ప్రజ్వల’తో ట్రాన్స్‌జెండర్ల గురించి కూడా మాట్లాడాము. మీరు వాగ్దానం చేసినట్లుగా ఇంత గొప్ప చొరవ తీసుకుని, తూమరి రజినీకి ఉద్యోగం అందించినందుకు మరియు ఇతర విషయాలకు ధన్యవాదాలు సీఎం రేవంత్ అనుముల గారు అని ఆమె రాసుకొచ్చారు. ఇక ట్రాన్స్‌జెండర్లకు సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ అని పమేలా సత్పతీ అనే ఐఏఎస్ కి కూడా ఆమె థాంక్స్ చెప్పింది.

 

*నటి సంగీతను పెళ్లాడిన స్టార్ కమెడియన్..
కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్‌ కింగ్‌స్టీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్‌ కింగ్‌స్టీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో అతనికి బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో రెడిన్‌ కింగ్‌స్టీ పండించిన కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా తరువాత ఎల్‌కేజీ, అన్నాత్తె, బీస్ట్‌, కాతువాకుల రెండు కాదల్‌, మార్క్‌ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్‌ సినిమాలో నటించి స్టార్ కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. ఇక సంగీత విషయానికొస్తే.. ఆమె సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించి.. అరన్మనైక్కిలి, తిరుమల్‌ వంటి సినిమాల్లో చేసింది. ఇక వీరిద్దరి మధ్య ఒక సినిమా షూటింగ్ లో పరిచయమయ్యింది.. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఈ పెళ్లి ఫోటోలు చూసినవారందరూ.. ఇదేదో సినిమా షూట్ అని, సినిమాలోనే వీరు పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదంతా నిజం కాదని, వారు నిజంగానే పెళ్లి చేసుకున్నట్లు పలువురు సెలబ్రిటీలు సైతం చెప్పుకురావడంతో వీరి పెళ్లి నిజమే అని తెలుస్తోంది. ఇక కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ స్టార్ కమెడియన్ ముందు ముందు తెలుగులో కూడా మెరుస్తాడేమో చూడాలి.

 

*పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి.. సెంచరీతో రాణించిన పాక్ బ్యాటర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యువ జట్టు పాకిస్థాన్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్‌ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లో ఆజాన్ అవైస్ సెంచరీ (105)తో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత సాద్ బేగ్ (68) పరుగులతో రాణించి నాటౌట్ గా ఉన్నాడు. మరో బ్యాటర్ షాజీబ్ ఖాన్ (63) పరుగులు చేయడంతో పాకిస్థాన్ విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టులో మురుగన్ అభిషేక్ ఒక్కడే 2 వికెట్లు సంపాదించాడు. మిగతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన భారత కుర్రాళ్ల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (62), కెప్టెన్ ఉదయ్ సహారన్ (60), సచిన్ దాస్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ జీషాన్ 4 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత.. అమీర్ హసన్ 2, ఉబైద్ షా 2, అరాఫత్ మిన్హాస్ 1 వికెట్ తీశారు.