Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

గ్రూప్ 1 ఫలితాలు విడుదల..
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షా ఫలితాలను ప్రకటించింది.. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ ఈ రోజు గ్రూప్‌ ఫలితాలను విడుదల చేశారు.. గ్రూప్‌-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలు వెల్లడించారు.. గ్రూప్‌ -1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించినట్టు ఈ సందర్భంగా గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు.. మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య 111 ఉండగా.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తాం.. ఇప్పుడు 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం అని తెలిపారు. ఇక, గ్రూప్‌-1 పరీక్షల కోసం 1,26,449 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. ప్రిలిమ్స్ ఫలితాలను రికార్డు స్థాయిలో 19 రోజుల్లో విడుదల చేశాం.. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించామని.. ఎంపికైన అభ్యర్ధులు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు చేశామని.. కేవలం 34 రోజులలో మెయిన్స్ ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. ఇక, మొదటి సారి సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ తో పరీక్షలను నిర్వహించినట్టు వెల్లడించారు గౌతం సవాంగ్.. రికార్డు టైంలో 11 నెలల వ్యవధిలోనే ఎంపిక పూర్తి చేయగలిగాం.. 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేశాం.. అంటే 220 మంది ఇంటర్వూకు ఎంపిక అయ్యారు.. 220లో 35 మంది అభ్యర్థులు ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వచ్చిన వారే అన్నారు. మొదటి 10 మందిలో 6 గురు మహిళా అభ్యర్థులే ఎంపిక అయ్యారు.. ఎంపికైన వారిలో 52 శాతం మంది మహిళలే ఉండటం ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పుకొచ్చారు. ఇక, ఈ ఫలితాల్లో మొదటి ర్యాంక్‌ భానుశ్రీ అన్నపూర్ణ ప్రత్యూష, రెండో ర్యాంక్‌ భూమిరెడ్డి భవాని, మూడో ర్యాంక్‌ లక్ష్మీ ప్రసన్న సాధించారు. టాప్ మూడు ర్యాంకుల్లో అమ్మాయిలే సాధించడం విశేషం.

కొత్త పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సీఎం సమీక్ష.. వీటిపై దృష్టి పెట్టాలని ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. రామాయపట్నం పోర్టులో దాదాపుగా సౌత్‌ బ్రేక్‌ వాటర్‌, నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇక, రామాయపట్నం పోర్టు మొత్తం నిర్మాణ వ్యయం అంచనా రూ. 3,736 కోట్లుగా ఉందన్నారు. తొలిదశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలపై కూడా దృష్టి సారించారు సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్‌ఎంఈల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై ఫోకస్‌ పెట్టాలన్న ఆయన.. ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టి కేంద్రీకరించాలని.. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌ సౌకర్యంతో పాటు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలగాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఎంఎస్‌ఎంఈలను క్లస్టర్లగా విభజిస్తే మౌలిక సదుపాయాల వృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుంది.. హ్యాండ్‌లూమ్స్‌, గ్రానైట్‌ రంగాల్లో ఎంఎంస్‌ఎంఈలను క్లస్టర్లుగా విభజించాలి.. పర్యావరణ హిత విధానాలకు ఎంఎస్‌ఎంఈల్లో పెద్దపీట వేయాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇక, తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ జవహర్‌రెడ్డి సహా.. ఆ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు..
ఈ రోజు ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షా ఫలితాలను ప్రకటించారు.. గ్రూప్‌-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలు వెల్లడించారు.. గ్రూప్‌ -1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించినట్టు ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు.. మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య 111 ఉండగా.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తాం.. ఇప్పుడు 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం అని తెలిపారు. మరోవైపు.. మరిన్ని పోస్టుల భర్తీకి సిద్ధం అవుతోంది ఏపీపీఎస్సీ.. త్వరలోనే మరో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌తో పాటు.. గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనున్నట్టు గౌతం సవాంగ్‌ వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ నుంచి 64 నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు గౌతం సవాంగ్.. త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం.. సిలబస్ లో కీలక మార్పులు తీసుకుని రానున్నాం అన్నారు. 17 ఏళ్ల తర్వాత మొదటి సారి యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేయనున్నాం అని వెల్లడించారు. చివరిసారి 2006లో నియామకాలు చేశారని గుర్తుచేశారు. వచ్చే నెలలో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుందని ప్రకటించారు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌. అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్నవారు.. మళ్లీ పుస్తకాలను తిప్పేయాల్సిన సమయం వచ్చేసింది.. గ్రూప్‌ 1 తో పాటు గ్రూప్‌ 2కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా తక్కువ సమయంలోనే రాబోతున్నాయి.

పార్టీల చూపు బండారు విజయలక్ష్మి వైపు ..!?
బండారు దత్తాత్రేయ అంటే తెలియనివారుండరు.. బీజేపీలో ఆయనది సుదీర్ఘ ప్రయాణం.. కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. కమలం పార్టీ ఆయన సేవలను గుర్తించి గవర్నర్‌ను కూడా చేసింది. ఇక, ఆయన ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్య కారణాలతో మరణించగా.. కూతురు అన్నీ తానై చూసుకుంటున్నారు. సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న దత్తన్న కూతురు బండారు విజయలక్ష్మి గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. అన్ని పార్టీల్లోనూ దత్తాత్రేయకు మంచి మిత్రులు ఉన్నారు. వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరుంది. అన్నింటికి మించి.. అలయ్ బలయ్ కార్యక్రమం బండారు దత్తాత్రేయకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక, తన తండ్రి చేపట్టిన ఆ కార్యక్రమాన్ని భుజాలపై వేసుకున్న విజయలక్ష్మి.. వైభవంగా అలయ్‌ బలయ్‌ నిర్వహిస్తున్నారు.. రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించి తనవైపు అందరి దృష్టి మళ్లెలా చేసుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. ఇక, బండారు విజయలక్ష్మి అభిమానులు.. ముషీరాబాద్‌ లేదా సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆమెను బరిలోకి దింపాలని భావిస్తున్నారు.. ముషీరాబాద్‌ అయినా ఓకే.. లేదా సనత్‌నగర్‌ సీటు అయినా ఆమెకు కేటాయించాలి.. దత్తన్న బిడ్డను దగ్గరుండి గెలిపించుకుంటామంటున్నారు ఆమె అభిమానులు.. మరో వైపు ఇన్ని అనుకూలతలు ఉన్నా తమ నాయకురాలికి టికెట్ రాకుండా కొంతమంది పార్టీ పెద్దలు అడ్డుపడుతున్నారని మండిపడుతున్నారు పార్టీ కార్యకర్తలు.. ఇక, ఈ పరిణామాన్ని క్యాష్‌ చేసుకోవడానికి ఇతర పార్టీలు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సమాచారం.. విజయలక్ష్మికి అధికార బీఆర్ఎస్‌తో పాటు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నుంచి, ఇతర పొలిటికల్‌ పార్టీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని ఆమె అనుచరులు చెబుతున్నమాట.. ఈ మధ్య ఆమె పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కూడా కలిసిన ఆమె రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారట.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలంటూ రేవంత్‌రెడ్డి ఆమెను ఆహ్వానించారనే చర్చ సాగుతోంది.. బీఆర్ఎస్‌ నేతలు సైతం ఆమెతో టచ్‌లోకి వెళ్లారట.. ఒక వేళ బీజేపీలో టికెట్‌ దక్కని పక్షంలో.. మా పార్టీలో చేరండి.. మేం టికెట్‌ ఇస్తామని ఇతర పార్టీల నుంచి బండారు విజయలక్ష్మికి ఆఫర్లు వస్తున్నట్టు ఆమె అనుచరులు చెబుతున్నమాట.

విద్యారంగంలో గేమ్‌ ఛేంజర్‌.. ‘ఎడెక్స్’తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
ఇప్పటికే విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.. ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.. హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.. ఉన్నతవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా కోర్సులు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని కోసం ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.. ప్రఖ్యాత మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సులు కంపెనీ (MOOC) ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. ఒప్పందంపై సంతకాలు చేశారు ఎడెక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనంత్‌ అగర్వాల్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె శ్యామలరావు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందన్నారు. నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్‌, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ విద్యార్థులకు లభిస్తుందని వెల్లడించారు. వారికి ఉచితంగా ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఈ సర్టిఫికెట్లు మరింతగా మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. మన దేశంలో లభ్యం కాని ఎన్నో కోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుందని.. వివిధ కోర్సులకు అందుబాటులో లేని బోధనా సిబ్బంది కొరతను కూడా అధిగమించినట్టు అవుతుందన్నారు సీఎం. దీని కోసం ఇప్పుడున్న ప్రతి కోర్సులనూ, అందులో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులను పూర్తిగా పరిశీలించాలని.. దీని కోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలని.. అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలని ఆకాక్షించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

గెలుపు గుర్రాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ ఇదే..?!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. పనిలో పనిగా పార్టీలు మారేవారు.. చేరేవారు.. వెళ్లివారి సందడి కూడా సాగుతోంది.. ఇక, ఎన్నికల వ్యూహాలకు పదును పెంచారు బీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులకు ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.. ఇప్పటికే కొందరి పేర్లను ఖరారు చేసినట్టు కూడా తెలుస్తోంది.. ప్రస్తుతం కొందరు అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గులాబీదళపతి కేసీఆర్‌ ఫైనల్‌ చేసినట్టు ప్రచారంలో ఉన్న కొందరు అభ్యర్థుల విషయానికి వస్తే.. 10 ఉమ్మడి జిల్లాల్లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చాయి. వైరల్‌గా మారిన లిస్ట్‌లో చాలా మంది సిట్టింగ్‌ల పేర్లే కనిపిస్తున్నాయి.. ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే కొత్త వ్యక్తుల పేర్లు కనిపిస్తున్నాయి.. అయితే.. 51 మందితో తొలి జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్‌.. ఈ నెల 21వ తేదీన ప్రకటించబోతున్నారట. గత ఎన్నికల్లో వందకు పైగా స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. ఇప్పుడు మాత్రం సగం జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారట.. ఈ సారి టికెట్లు ఆశించేవారి సంఖ్య పెరగడంతో.. వివాదంలేని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్‌ చేశారట.. కేసీఆర్‌కు 6 అంకే సెంటిమెంట్‌.. అందుకు అనుగుణంగానే 51 స్థానాలల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

అమ్మో తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన
వాయువ్య బంగాళాఖాతంలో మరో 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. దాంతో వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న ( బుధవారం ) ఈశాన్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం.. నేడు (గురువారం) వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రభావంతో రాగల మూడురోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు ఆదిలాబాద్‌, కోమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బిల్లుల ఆమోదంపై క్లారిటీ ఇచ్చిన రాజ్ భవన్
తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్- సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి స్వీకరించడం) బిల్లు-2023తో సహా రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి అందిన అన్ని బిల్లులు చట్ట కార్యదర్శికి సిఫార్సు చేయబడ్డాయి. ఇది సంబంధిత నియమాలలో నిర్దేశించబడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి చేర్చుకోవడం) బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ, ఉద్యోగుల ప్రయోజనాలకు.. కార్పొరేషన్ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గవర్నర్ పది సిఫార్సులను సూచించారు. 2023 అసెంబ్లీలో అదేవిధంగా, నాలుగు ఇతర బిల్లులు గతంలో కొన్ని సిఫార్సులతో కూడిన సందేశాలతో శాసనసభ, శాసనమండలికి తిరిగి వచ్చాయి. ఇప్పుడు అందిన బిల్లుల్లో ఈ సిఫార్సులు సక్రమంగా నిర్వహించబడ్డాయా లేదా అన్నది గవర్నర్ నిర్ధారించాలన్నారు. ఈ విషయంలో.. లా సెక్రటరీ సిఫార్సుల ఆధారంగా టీఎస్ఆర్టీసీ బిల్లుతో సహా అన్ని బిల్లులపై తదుపరి చర్యలు తీసుకుంటామని రాజ్ భవన్ స్పష్టం చేసింది. గవర్నర్ TSRTC బిల్లును నిలిపివేశారని, రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటూ ప్రింట్- ఎలక్ట్రానిక్ మీడియాతో సహా కొన్ని వర్గాలలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ఈ ప్రెస్ కమ్యూనిక్ జారీ చేయబడింది. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్న ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని సూచించారు.

సింధియా సన్నిహితుడికి BJP మొదటి జాబితాలో లేని చోటు.. కారణమేంటి..?
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు-2023 అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 39 మంది అభ్యర్థుల జాబితాలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితులు ఇద్దరికి టికెట్ దక్కింది. మరొకరికి టిక్కెట్ దక్కలేదు. 2018లో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కాంగ్రెస్ నుండి బీజేపీకి వచ్చిన ఇద్దరు సహచరులపై బీజేపీ విశ్వాసం ఉంచింది. రాబోయే ఎన్నికలలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వారికి అవకాశం ఇచ్చింది. ఈ జాబితాలో ఎడల్ సింగ్ కంసనా మరియు ప్రీతమ్ సింగ్ లోధి పేర్లు ఉన్నాయి. అయితే అదే సమయంలో సింధియాతో కలిసి బీజేపీలోకి వచ్చిన రణ్‌వీర్‌ జాతవ్‌కు టికెట్‌ దక్కలేదు. ఎడల్ సింగ్ కంసనాకు బీజేపీ నుంచి రెండో అవకాశం దక్కింది. అంతకుముందు సుమావలి ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయగా.. ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు పండిట్ ధీరేంద్ర శాస్త్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రీతమ్ సింగ్ లోధీకి కూడా బీజేపీ పిచోర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అయితే సింధియాతో పాటు బీజేపీలో చేరిన రణవీర్ జాతవ్ పేరు అభ్యర్థుల జాబితాలో లేదు.

సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌.. టార్గెట్ అదే..!
ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే.. ఫేక్ ఐడీలతో మోసగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటినుంచి సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసుల వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధించింది. ప్రస్తుతం కొంతమంది సిమ్ డీలర్లు వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇకపై అలా జరగకుండా.. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని.. అలా చేయని ఎడలా వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నారని.. వారు వెరిఫికేషన్ పూర్తి చేయాలని అందుకోసం తగిన సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.

దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ?
దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలు కానుందా.. ? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వెంకటేష్ అన్న సురేష్ దగ్గుబాటి రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కు పెళ్లి చేయాలనీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో శ్రీరెడ్డి అతని పేరును ఎంతలా చెడగొట్టిందో అందరికీ తెల్సిందే. ఇక ఆ ఇన్సిడెంట్ అభిరామ్ కెరీర్ ను చాలా దెబ్బతీసింది. ఇవేమి జరగకుండా ఉంటే.. అభిరామ్ తెలుగుతెరకు ఎప్పుడో పరిచయమయ్యేవాడు. కానీ, అనుకోని సంఘటనలు జరగడంతో ఈ ఏడాది అహింస సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అతనికి ఆశించిన ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి కుటుంబం అతడికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికినట్లు తెలుస్తోంది. ఇక రానాలా కాకుండా ఈసారి బంధువుల అమ్మాయినే కోడలిగా చేసుకోవాలని సురేష్ ముచ్చటపడుతున్నాడట. కారంచేడుకు చెందిన అభిరామ్ చినతాత కూతురు కూతురునే పెళ్లాడనున్నాడని టాక్. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు అన్ని పూర్తయ్యాయట. త్వరలోనే నిశ్చితార్థం.. ఆపై పెళ్లి జరగనున్నాయని సమాచారం. ఇక దీంతో దగ్గుబాటి అభిమానులు అభిరామ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి తరువాత నుంచి అయినా అభిరామ్ లైఫ్ ఒక గాడిన పడుతుందని కుటుంబం మొత్తం ఆశిస్తున్నారు. ఇక రానా ప్రేమ వివాహం చేసుకోగా.. అభిరామ్ మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటున్నాడు. త్వరలోనే అధికారికంగా దగ్గుబాటి కుటుంబం అభిరామ్ పెళ్లి విషయం ప్రకటించనుంది. మరి దగ్గుబాటి కుటుంబం అనుకున్నట్లుగానే అభిరామ్ లైఫ్ పెళ్లి తరువాత మారుతుందేమో చూడాలి.

‘ఆహా’లో బేబీ వచ్చేస్తోంది.. ఎప్పటినుంచంటే?
చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బేబీ సినిమా గురించి ఇంకా ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది. కొబ్బరిమట్ట, హృదయ కాలేయం సినిమాల దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బేబీ తెరకెక్కింది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించగా ఈ సినిమా దాదాపు 90 కోట్ల దాకా వసూళ్లు రాబట్టుకుంది. ఇక ఇతర సినిమాల ఎంట్రీతో వసూళ్ళలో బ్రేక్ పడడంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇక ఎట్టకేలకు ‘బేబీ’ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ‘బేబీ’ మూవీ తమ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ‘ఆహా’ సోషల్ మీడియాలో ప్రకటించింది. రేపు ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపింది. నిజానికి రేపటి నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆహా ప్రకటనతో ఈ సినిమా వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 25న రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెండు గంటల 55 నిమిషాల వరకు నిడివి ఉండగా మరొక వర్షన్ థియేటర్లలో రిలీజ్ చేశారు కూడా. ఈ సినిమా నాలుగు గంటల కట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక ఈ వెర్షన్లో ఒక ఎక్స్ట్రా సాంగ్ తో పాటు కొన్ని వినసొంపైన ట్రాక్స్ కూడా ఉన్నాయని, ఆనంద్ చేత డ్యాన్స్ చేయించిన సాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక మొత్తం మీద ఈ సినిమా ఓటీటీ ప్రకటన అయితే చాలా మంది అభిమానుల్లో మంచి జోష్ తెచ్చిపెట్టిందని చెప్పచ్చు.

కొత్త కారు కొన్న ‘విక్రమ్’ డైరెక్టర్.. ధర ఎంతంటే ..?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఖైదీ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్ ను షేక్ చేసిన లోకేష్.. మాస్టర్ తో విజయ్ ను అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూపించి మెప్పించాడు. ఇక విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను అందుకున్నాడు. కమల్ హాసన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందించిన డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ తో లియో సినిమా చేస్తున్న లోకేష్.. తాజాగా ఒక కాస్ట్లీ కారుకు యజమానిగా మారాడు. ప్రస్తుతం మార్కెట్ లో లగ్జరీ కారుగా చెలామణి అవుతున్న బీఎండబ్ల్యూ 7 సిరీస్ ను లోకేష్ సొంతం చేసుకున్నాడు. ఇక దీని ధర తెలిసి అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ కారు ధర అక్షరాలా రూ.కోటి 70 లక్షలు ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న లోకేష్ కు ఇదేం పెద్ద అమౌంట్ కాదని, విక్రమ్ తరువాత ఆయన తన రెమ్యూనిరేషన్ కూడా పెంచాడని వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ బీఎండబ్ల్యూ చూడడానికి ఎంతో అందంగా ఉంది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక లోకేష్ లైనప్ గురించి మాట్లాడుకుంటే.. లియో సినిమాను పూర్తిచేసాక లోకేష్.. రజినీకాంత్ తో ఒక సినిమా చేయనున్నాడు. దీని తరువాత తన హిట్ సినిమా ఖైదీకి సీక్వెల్ చేయనున్నాడు.. ఇక ఇవే కాకుండా ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version