NTV Telugu Site icon

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*వాలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదిలిలో బిందువు బిందువు చేరి సిందువు అయినట్లు జనసంద్రం కనిపిస్తుందని.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ప్రతీ సిద్ధం అంటున్నారన్నారు. ప్రజల అజెండాతో మనం, జెండాలు జత కట్టి వాళ్లు వస్తున్నారని విమర్శించారు. తనతో కలిసి నడిచేందుకు మీరంతా సిద్దమేనా అంటూ ప్రజలను జగన్‌ కోరారు. ప్రజలందరికీ నచ్చిన రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమిగా వస్తున్నారని విమర్శించారు. జరగబోయే ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలే కాదని.. అన్నీ సామాజిక వర్గాలకు జరిగే న్యాయాన్ని కొనసాగిస్తూ మరో రెండు అడుగులు ముందుకు వేయాలా.. లేక మోసపోయి వెనక్కు వెళ్లాలా అని నిర్ణయించే ఎన్నికలని సీఎం పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్ళలో మన భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలని తెలిపారు. ఇవి జగన్ కు.. చంద్రబాబుకు మధ్య ఎన్నికలు కావు.. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్ పేదల పక్షమని.. మీ ఓటు మంచి కొనసాగుతుందా లేదా అని నిర్ణయిస్తుందన్నారు. మీ ఓటు జగన్‌కు వేస్తే పథకాలు కొనసాగింపు.. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలు ముగింపు అని.. అందుకే బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. చంద్రబాబు దారి ఎప్పుడు అడ్డదారి.. ఆయన విలువలు పాతాళంలో ఉంటాయన్నారు. చంద్రబాబు పేరు గుర్తొచ్చేది వెన్నుపోటు.. దగా.. మోసం.. అబద్ధాలు.. కుట్రలు.. ఇవి ఆయన మార్కు రాజకీయాలు అంటూ విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడని.. అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి ఫించన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లతో ఫించన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించారని అన్నారు. పెన్షన్లు పేదవారి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వెళ్లి ఇవ్వటం నేరమట అంటూ.. పేదల వద్దకు వెళ్లి వాలంటీర్లు ఇవ్వటం గత 56 నెలలుగా జరుగుతుందన్నారు. మన ప్రభుత్వంలో ఏ వారమైనా.. గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు. వెయ్యి ఇచ్చే పెన్షన్‌ను మూడు వేలకు పెంచుకుంటూ పోయి వారి ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నామన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని ఇచ్చాయి.. గంటల కొద్దీ క్యూ లైన్లో గంటల కొద్దీ నిలబడి తీసుకోవాలన్నారు. చంద్రబాబు కుటిల యత్నం పెన్షన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను మందే ఎండలో రోడ్డుపైకి తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ కోసం 30 మందికి పైగా అవ్వా, తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు ఈ చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. ఆయన రాజకీయాలకు అనేక మంది అవ్వా తాతలు మరణించారన్నారు. 56 నెలలుగా ఒకటో తారీఖున పెన్షన్ అందించామన్నారు. ఎన్నికల సమయంలో.. అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగిందన్నారు. అది ఆగలేదు.. ఆపబడిందన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల సీఎంగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.

 

*అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
“ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం గురించే విన్నాం.. కానీ ఇప్పుడు అనకాపల్లి గుడ్డు గురించి వింటున్నా.. ఐదు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్ ఇచ్చినా కిలోమీటర్ రోడ్డు కూడా వేయించుకోలేక పోయారు..” అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి గెలవాలనే ఆకాంక్ష కూటమి సభలకు వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. దశాబ్దకాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపడం మీ భవిష్యత్ కోసమేనని పవన్ ప్రజలనుద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలని కోరుకుంటే ప్రధాని ఇస్తారని.. ఆయనను అడిగే సాన్నిహిత్యం తనకు ఉందన్నారు. అమ్మ ఒడిలో కోతలు పెట్టి ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఒక స్కాం స్టర్.. సీఎం ఒక లిక్కర్, ఇసుక వ్యాపారి.. దోపిడీ చేయనమే ఆయన విధానమని విమర్శించారు. కేంద్ర నాయకత్వం అభ్యర్ధన మేరకు అనకాపల్లి ఎంపీ సీటును వదులుకున్నామన్నారు. జనసేన తరపున బలమైన ప్రాతినిధ్యం అసెంబ్లీ రాబోతోందన్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ భూములను ముక్కలు చేసి రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఆయన ఆరోపించారు. కోడిగుడ్డు ప్రభుత్వం కావాలో ప్రజా ప్రభుత్వం కావాలో ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి అయ్యే నాయకత్వ బలం లేదు.. ఈ ఎన్నికల్లో పోరాడదామన్నారు. తాను ముఖ్యమంత్రి అవ్వాలనే మీ కోరిక.. నూకాలమ్మ తల్లి ఆశీర్వాదంతో త్వరలోనే నెరవేరాలని ఆశిస్తున్నానన్నారు. మేనిఫెస్టో ప్రకటించడమే కాదు దాని అమలు కోసం అసెంబ్లీలో పోరాడతానన్నారు. రాష్ట్రంలో సర్వెంట్ లీడర్ షిప్ అంటే ఏమిటో చూపిస్తామన్నారు. తాను మాటిస్తే పీక తెగిపోయిన వెనక్కి తగ్గనన్నారు. సాగునీటి వ్యవస్థను ఈ ప్రభుత్వం దెబ్బ తీసిందని.. రైతులు కన్నీళ్లు తుడిచే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ మహిమో.. కాంట్రాక్టుల ఎఫెక్టో కానీ తిరుమల వెంకన్న ప్రసాదాల తయారీకి అనకాపల్లి బెల్లాన్ని దూరం చేశారన్నారు. మేం అధికారంలోకి వస్తే అనకాపల్లి బెల్లంకు అంతర్జాతీయ గుర్తింపు సాధిస్తామన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిదని.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపు సీపీఎస్‌కు సానుకూల పరిష్కారం చూపిస్తామన్నారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుంటే.. ప్రభుత్వం మాత్రం భూములు దోపిడీ, అద్దెలు రూపంలో నిధులు కొట్టేస్తున్నారని పవన్ ఆరోపించారు. బరోడా మోడల్ చెత్త శుద్ధి కేంద్రం అనకాపల్లిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని.. క్రిమినల్ గవర్నమెంట్‌ను ఈడ్చి రాష్ర్ట సరిహద్దుల అవతల పడేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు సహకారంతోనే వైజాగ్ పోర్టుకు డ్రగ్స్ వచ్చాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జనం ప్రేమను చూసిన తర్వాత వచ్చిన జ్వరం పారిపోయిందన్నారు. టిడ్కో ఇళ్లను అనర్హులకు కట్టబెట్టారని ఆయన ఆరోపణలు చేశారు. నూకాలమ్మ తల్లి జాతరను రాష్ర్ట పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చెత్త పన్ను తొలగించమని చంద్రబాబుని అడుగుతానన్నారు. హక్కులు కాలరాసే ఎవరినైనా తుంగలో తొక్కడం ఖాయమన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడి గుడ్డు మంత్రి బినామీల భరతం పడతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం బలంగా నిలబడతామని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా కాపాడుకోవాలనేది మా ఆకాంక్ష అని ఆయన చెప్పారు. ఢిల్లీ వెళ్లేందుకు ఉక్కుపోరాటం చేస్తున్న కార్మిక సంఘాలు ముందుకు రాలేదన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తన ఒక్కడి వల్ల అవ్వదని.. అందరూ కలిసి రోడ్డెక్కితే కాపాడుకోగలమన్నారు.

 

*పామర్రు ప్రజాగళంలో చంద్రబాబు కొత్త హామీ
పామర్రు ప్రజాగళంలో రైతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త హామీని ప్రకటించారు. రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం కూటమి పని చేస్తుందని.. ఈ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాట ధర లేదు.. ధాన్యం కొనుగోళ్లు లేవు.. కూటమికి వన్ సైడుగా ఓటేయాలని ప్రజలను కోరారు. రైతును రాజుగా చేయడమే తన ఆలోచన అని పేర్కొన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం నీళ్లందివ్వలేకపోతోందని.. సీజన్ మిస్ కాకూడదని పట్టిసీమ తెచ్చామన్నారు.పోలవరం పూర్తి చేయాలి.. నదుల అనుసంధానం కావాలి.. కృష్ణా డెల్టాకు మూడు పంటలకు నీళ్లందించాలని తన కోరిక అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో నేను నీళ్లు పారిద్దామనుకుంటే.. జగన్ కన్నీళ్లు పారిస్తున్నారని విమర్శించారు. పేదరికం లేని సమాజం ఉండాలనేది ఎన్టీఆర్ సందేశం.. అదే తన ఆశయమన్నారు. జగన్‌ది రివర్స్ పరిపాలన అని.. అలాగే ప్రజల జీవితాలను రివర్స్ చేశారన్నారు. రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పెడతామన్నారు. ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలా పరిశ్రమలు తెస్తామని హామీలు గుప్పించారు. పామర్రులో ఐటీ టవర్ కడతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పిల్లలను, యువతను గంజాయి బారిన పడేలా చేస్తోందీ ప్రభుత్వమంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంలోని అన్ని కంపెనీలను యువత ముందు పెడతామన్నారు. కృష్ణా జిల్లా అనే తులసీవనంలో ఇప్పుడు గంజాయి మొక్కల మొలిచాయన్నారు. ఐదేళ్లల్లో ఒక్కసారైనా అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడారా అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే భూములకు మంచి ధరలు వచ్చేవన్నారు. గుంతలు పూడ్చలేని జగన్.. మూడు రాజధానులను కడతారంట అంటూ ఎద్దేవా చేశారు. సంపద సృష్టించాలి.. ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలి.. ఇదే టీడీపీ విధానమన్నారు. చిన్న పని చేయాలన్నా.. హైదరాబాదుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. టీడీపీ కంటిన్యూ అయి ఉంటే హైదరాబాదుకు ధీటుగా అమరావతి అభివృద్ది అయ్యేదన్నారు. జగన్ తన పాలనను విధ్వంసంతో మొదలు పెట్టాడని.. వైసీపీ ఇచ్చే ఎంపీ సీటు వద్దని బాలసౌరీ బయటకొచ్చేశారన్నారు. కుమార్ రాజాకు కోట్లు లేవు.. వేసుకునే కోటూ లేదు. కానీ వర్ల రాజాకే దండ వేశానన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా కొనకళ్లకు టిక్కెట్ ఇవ్వలేకపోయానన్నారు. కొనకళ్ల ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదన్నారు. టిక్కెట్ ఇవ్వలేకపోయినా దేవినేని ఉమ సైనికుడిలా పని చేస్తున్నారన్నారు. ఇలాంటి వాళ్లని తాను మరువగలనా అని పేర్కొన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లను గుండెల్లో పెట్టుకుంటా.. వాళ్లని మరిచిపోగలనా అంటూ తెలిపారు. వైసీపీలో పార్థసారధి ఇమడలేకపోయారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ..”జగనుకు డబ్బున్నోళ్లు కావాలి.. గంజాయి బ్యాచ్ కావాలి.. టీడీపీకి మంచి వాళ్లు కావాలి. ఇవాళ అన్న క్యాంటీన్లు ఉన్నాయా..? ఎస్సీ పథకాలు ఉన్నాయా..?. ఎస్సీలకు అందాల్సిన ఎన్నో పథకాలను రద్దు చేశారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి.. జగన్ తన పేరు పెట్టుకున్నారు. జగవ్ అంబేద్కర్ కంటే గొప్పవాడా..?. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదు. గుడివాడ గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయి.. ఆడపిల్లలను వేధిస్తున్నారు. గంజాయి బ్యాచుపై ఫిర్యాదు చేస్తే.. బాధితుడి పైనే కేసులు పెట్టారు. నా మీదే కేసులు పెట్టారు.” అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

*రేపు కవిత మధ్యంతర బెయిల్పై తీర్పు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవెజా తీర్పు ఇవ్వనున్నారు. కాగా.. తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించింది. గత గురువారం నాడు కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత మధ్యంతర బెయిల్ పై స్పెషల్ కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది. కాగా.. కవితకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వద్దని ఈడీ కోర్టు ముందు వాదనలు వినిపించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని.. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారని.. ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్ళై ద్వారా కవిత 33 శాతం వాటా పొందిందని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. కవిత తనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఈడీకి చెప్పొద్దని కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని బెదిరించారని, ఇలాంటి సమయంలో కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ అభిప్రాయపడింది. దీంతో ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా.. రేపు మధ్యంతర బెయిల్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

 

*అగ్గిపెట్టె కోసం గొడవ.. యువకుడి దారుణహత్య
ఢిల్లీలో దారుణం జరిగింది. అగ్గిపెట్టె ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరు టీనేజర్లు, ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన దేశ రాజధానిలోని తిమార్‌పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అగ్గిపెట్టె ఇచ్చేందుకు నిరాకరించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని వినియోగించారు. సిగరేట్ కాల్చేందుకు అగ్గిపెట్టే ఇవ్వడానికి నిరాకరించడం హత్యకు దారి తీసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. చనిపోయిన వ్యక్తిని 21 ఏళ్ల అన్షుల్ భాటీగా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులిద్దర్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తిమార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్లకు సంబంధించిన పీసీఆర్ కాల్ వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోరిక్షా లోపల, దాని చుట్టూ రక్తపు మడుగు ఉన్నట్లు గుర్తించినట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(నార్త్) ఎంకే మీనా తెలిపారు. గాయపడిన వ్యక్తిని హిందూరావు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే బాధిత యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సంఘటన స్థలంలో సాక్షి వాంగ్మూలాన్న పోలీసులు నమోదు చేశారు. క్రైమ్ స్పాట్‌లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి పోలీసులు ఇద్దరు నిందితులను ఆదివారం పట్టుకున్నారు. నేరం చేయడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రశ్నించగా.. సిగరేట్ కాల్చడానికి అగ్గిపెట్టె ఇవ్వాలని కోరగా.. బాధితుడు అందుకు నిరాకరించాడని, ఇది వాగ్వాదానికి దారి తీసిందని వెల్లడించారు. కోపంతో ఒక వ్యక్తి బాధితుడిపై కత్తితో దాడి చేశారని, ఘటన తర్వాత ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిని బాల నేరస్తుల్లో ఒకరికి గతంలో దారుణమైన నేరానికి పాల్పడిన చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.

 

*భక్తి మాయలో అమ్మవారి మెడలో మంగళసూత్రం చోరీ చేసిన ఘనుడు..!
తాజాగా ఓ భక్తుడు ఎంతో భక్తి ఉన్నవాడిలా గుడికి వచ్చి గుళ్లో ఉన్న దేవత మెడలో ఉండే మంగళసూత్రాన్ని అపహరించాడు. మొదటిగా ఆలయంలో నిండుగా అలంకరణ చేసి ఉన్న అమ్మవారిని దండం పెట్టుకున్నాడు. అయితే ఆ భక్తుడు దండం పెట్టుకున్న తర్వాత తన కష్టాలు తొలగిపోవాలని అమ్మవారికి చెప్పే బదులు.. ఏకంగా అమ్మవారి మెడలో దగదగా మెరిసే తాళిబొట్టును లాగేసుకుని జేబులో వేసుకొని అక్కడ ఎవరికంట పడకుండా మాయమయ్యాడు. ఇకపోతే అతను మనుషులు ఎవరు చూడలేదని., అక్కడి నుంచి వెళ్ళిపోయినా.. ఆ అమ్మవారు చూస్తుంది అని లెక్కచేయకుండా వెళ్లిన అతను చివరికి గుడిలో ఉన్న సీసీ కెమెరాల కంట మొత్తం రికార్డయింది. దాంతో ఆలయ అధికారులు ఆ దొంగ భక్తుని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో ఉన్న సత్రంపాడు సౌభాగ్య లక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. ఇక భక్తుడులా వచ్చిన ఆ వ్యక్తి అమ్మవారి మెడలో ఉన్న పదికాసుల మంగళసూత్రాన్ని చోరీ చేశాడు. చోరీలో భాగంగానే ముందుగానే అతడు ముఖానికి మాస్క్ ధరించి గుడి దగ్గరికి వచ్చాడు. ముందుగా అమ్మవారికి దండం పెట్టుకుని ఆపై ఒక్క క్షణం ఆలోచన చేయకుండా చుట్టూ ఎవరు లేని సమయంలో అమ్మవారి మెడలోని తాళిబొట్టును తెంపేసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. ఇందుకు సంబంధించిన మొత్తం దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అవ్వగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టుతున్నారు.

 

*జూన్ 4 తర్వాత ప్రధాని మోడీకి లాంగ్ లీవ్.. జైరాం రమేష్ కామెంట్స్..
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘‘ముస్లిం లీగ్’’ భావజాలం ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన తరుణంలో ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ప్రధాని అబద్ధాలతో ఇప్పుడు దేశ ప్రజలు విసిగిపోయారని, జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్‌కి వెళ్లాల్సి వస్తుందని, ఇది భారత ప్రజల హామీ అని అన్నారు. 10 ఏళ్ల అన్యాయం తర్వాత కాంగ్రెస్ 5 న్యాయ గ్యారెంటీలు భారత ప్రజల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ప్రస్తుతం చాలా అవసరమని, ఇది దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల గొంతుకగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 25 హామీలను ప్రకటించింది. రైతులకు మద్దతు ధర, కుల గణన, యువతకు ఉద్యోగాలు, నారీ న్యాయ్ పేరుతో ప్రతీ మహిళ ఖాతాలోకి రూ. 1 లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, కార్మికులకు కనీస వేతనాల వంటి హామీలను ఇచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు భారతదేశ వ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొత్తం 543 ఎంపీ స్థానాల్లో ఈ సారి బీజేపీకి సొంతగా 370 స్థానాలతో పాటు ఎన్డీయే కూటమికి 400కి పైగా సీట్లు వస్తాయని కమలం నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈసారి బీజేపీని గద్దె దించుతామని కాంగ్రెస్ చెబుతోంది.

 

*రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటే మంచిది.. కాంగ్రెస్‌కి ప్రశాంత్ కిషోర్ సలహా..
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు రాకుంటే రాహుల్ గాంధీ తప్పుకోవడం మంచిదని అన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన గత 10 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నప్పటికీ, సరైన విజయం దక్కలేదని, అలాంటి సమయంలో విరామం తీసుకోవడం వల్ల నష్టం లేదని అన్నారు. రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుని, వేరే వారికి కాంగ్రెస్ పగ్గాలను అప్పగించాలని, మీ అమ్మ ఇదే పనిచేశారని, తన భర్త రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. 1991లో పీవీ నరసింహారావుని బాధ్యతలు చేపట్టాలని సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచి నాయకుల ముఖ్య లక్షణం ఏంటంటే.. వారు ఎందులో వెనకబడి ఉన్నారో తెలుసుకుని, దానిని పూరించడానికి చురుకుగా పనిచేస్తారని ఆయన చెప్పారు. ‘‘ కానీ రాహుల్ గాంధీకి అన్ని తెలుసని అనిపిస్తోంది.. మీరు సహాయం అవసరాన్ని గుర్తించకపోతే ఎవరూ మీకు సహాయం చేయలేరు. అతను సరైనదని భావించిన దాన్ని అమలు చేసే వ్యక్తి అవసరమని నమ్ముతున్నాడు. అది కుదరదు’’ అని పీకే అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే రాహుల్ గాంధీ నిర్ణయాన్ని గుర్తు చేస్తూ.. ఆ సమయంలో తాను వెనక్కి తగ్గానని , మరొకరిని ఆ పని చేయనివ్వండి అని చెప్పాడని, అయితే వాస్తవానికి అతను చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడు అని పీకే చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు సొంతగా ఏ నిర్ణయాలను తీసుకోలేమని చెబుతున్నారని, కనీసం మిత్ర పక్షాలతో సీట్ల షేరింగ్ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలను రాహుల్ గాంధీకి వదిలేస్తున్నారని చెప్పారు. అయితే, పార్టీలో ఓ సెక్షన్ నాయకులు మాత్రం రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకోరని చెబుతున్నారని చెబుతున్నారని అన్నారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మీడియా వంటి సంస్థలు రాజీ పడినందునే తమ పార్టీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇది పాక్షికంగా నిజం, అయితే పూర్తిగా నిజం కాదని పీకే అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 206 సీట్ల నుంచి 44కి పడిపోయిందని, ఆ సమయంలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ దాని పనితీరులో నిర్మాణాత్మక లోపాలతో బాధపడుతోందని, వాటిని పరిష్కరించడం దాని విజయాలకు చాలా అవసరమని నొక్కి చెప్పారు.

 

*మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
ఆదివారం మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోని ఆయిల్ రిగ్ లో మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా.. గ్యాస్ పైప్ లైన్లు ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

*పాకిస్తాన్‌లో మారణహోమం.. వేర్వేరు ఘటనల్లో 18 మంది మృ‌తి..
దాయాది దేశం పాకిస్తాన్ వరసగా తీవ్రవాద దాడులతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో మిలిటెంట్లు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది మరణించారు. ఇందులో ఆరుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. 12 మంది ఉగ్రవాదులు ఉన్నారు. సీనియర్ పోలీస్ అధికారితో సహా ఆరుగురు పోలీసులు మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. బలూచిస్తాన్ ప్రావిన్సులో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ సాయుధ దళాల మీడియా విభాగం తెలిపింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని కులాచీ తహసిల్‌లోని కోట్ సుల్తాన్ ప్రాంతంలో భద్రతా దళాల కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని లక్కీ మార్వాత్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒక సాయుధ దుండగుడు, డీఎస్పీ, ఇద్దరు పోలీసులు మరణించగా ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. రంజాన్ పండగ సందర్భంగా పోలీస్ భద్రత తనిఖీల్లో భాగంగా రద్దీగా ఉండే పెషావర్-కరాచీ హైవేపై డీఎస్పీ గుల్ మహ్మద్, ఇతర పోలీసులతో కలిసి తాత్కాలిక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారు చెక్ పాయింట్ నుంచి తిరిగి వస్తుండగా.. మంజివాల చౌక్ సమీపంలో పోలీస్ వ్యాన్‌‌పై సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో డీఎస్పీతో సహా పలువురు పోలసీులు మరణించారు. లక్కీ మార్వాట్‌లో పోలీసులపై జరిగిన దాడిని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదుల పిరికి చర్యగా అభివర్ణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ గుండాపూర్ కూడా తీవ్రవాద దాడిని ఖండించారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌‌లో అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్న తర్వాత రెండు దేశాల సరిహద్దులో ఉండే ఈ ప్రావిన్సు తీవ్రవాద దాడుల్ని ఎదుర్కొంటోంది. పాక్ తాలిబాన్లు ఆర్మీ, పాక్ పోలీసులు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇదే విధంగా దాడులు జరుపుతోంది.