Site icon NTV Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

బీజేపీతో వైసీపీకి తెర వెనుక సంబంధాలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి అంబటి
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎవరితో పొత్తు లేకుండా సింగిల్‌గానే పోటీ చేస్తుంది.. కానీ, బీజేపీతో వైసీపీకి తెర వెనుక సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కొన్ని పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.. దీనిపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. బీజేపీతో మాకు తెర వెనుక సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ అవాస్తవమని కొట్టిపారేశారు.. అలాంటి ప్రచారాలను వైసీపీ ఖండిస్తుందన్నారు. వైసీపీ స్వతంత్రంగా పోటీ చేసే పార్టీ.. ఏ పార్టీతో మాకు పొత్తు లేదని క్లారిటీ ఇచ్చారు.. మాకు ఎవరికీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాల కోసం.. కేంద్రం సహకారం కోసం స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుపుతూ ఉంటాం అన్నారు అంబటి రాంబాబు.. కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం అని స్పష్టం చేశారు..

అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు..
అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో.. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు అధికారులు. అయితే, దుండగులు ఆ నమూనా గ్యాలరీను పగలగొట్టారు.. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్‌లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపేలా బోర్డులను రూపొందించగా.. వాటిని దుండగులు ధ్వంసం చేశారు.. అయితే, నమూనాలను దుండగులు ధ్వంసం చేసిన తర్వాత స్థానిక రైతులు గుర్తించారు.. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్‌లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డులు ధ్వంసం చేయడం ఏంటి ? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని.. రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆ నమూనాలను ధ్వంసం చేయడం ఏంటి అని మండిపడుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

17వ రోజుకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్‌ ఇదే..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ రోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్‌.. రేపు మళ్లీ యాత్రను ప్రారంభించనున్నారు.. విజయవాడలో తనపై రాయి దాడి జరిగినా.. నుదిటిపై గాయం మానకపోయినా.. బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు ఏపీ సీఎం.. ఇక, 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. రేపు అనగా గురువారం ఉదయం 9 గంటలకు తేతలిలో రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయల్దేరతారు సీఎం జగన్‌.. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకోనున్నారు.. ఆ తర్వాత కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురంలో రాత్రి బస శిబిరానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. బస్సు యాత్రలు, రోడ్‌షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం విదితమే.. సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత పోలీసులు మరింత భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డులో సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కాగా, ఎన్నికల ప్రచారంలో ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్‌.. ఇచ్చాపురం వరకు చేరుకోనున్న విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే మేమంతా సిద్ధం యాత్రతో 16 జిల్లాలు, 49 నియోజకవర్గాలను చుట్టేశారు సీఎం జగన్‌.. 1636 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు.

గెలుపు ఖాయం.. కానీ, భారీ మెజార్టీలు కావాలి.. అది చూసి వాళ్లకు భయం వేయాలి..!
ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయం.. కానీ, భారీ మెజార్టీ కావాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కలిసి ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు అంశంపై ఏడాదిలోగా పరిష్కారం చూపుతాం అన్నారు. టీచర్లను గౌరవిస్తాం అని వెల్లడించారు. ఇక, సీఎం జగన్‌కు నా మీద కోపం పెరుగుతుంది. తాను ఓడిపోతున్నాననే విషయం జగన్‌కు అర్థమైందని ఎద్దేవా చేశారు. నేను భీమవరం నుంచి ఎందుకు మారారని జగన్ నన్ను అడుగుతున్నారు. మరి వైఎస్‌ జగన్‌ 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు వారి వారి స్థానాలను మార్చారు..? అని నిలదీశారు. నోరుంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అత్యంత అవినీతికి పాల్పడిన జగన్.. క్లాస్ వార్ గురించి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్.. పోలీసుల టీఏ, డీఏలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేసిన జగన్.. క్లాస్ వార్ గురించి మాట్లాడతారా..? ఐదేళ్లల్లో పదిసార్లు కరెంట్ బిల్లులు పెంచిన జగన్ పేదలపై భారం మోపారు. కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల రూ. 27 వేల కోట్ల మేర దోపిడీ చేశారని విరుచుకుపడ్డారు. పాస్ పుస్తకం కావాలన్నా.. చేపల చెర్వులు తవ్వాలన్నా.. డ్రైనేజీ కట్టాలన్నా ఇక్కడి ఎమ్మెల్యేకు ముడుపులు ఇవ్వాల్సిందేనట అని ఆరోపణలు గుప్పించారు. ఓ జడ్జి తల్లి ఆస్తులను కూడా జోగి రమేష్ దోచేశాడని సంచలన ఆరోపణలు చేశారు. 18 వేల మంది చేనేతలున్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో అప్పులతో చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, మేం అధికారంలోకి రాగానే చేనేతలు, కలంకారీ కార్మికుల కంటనీరు రాకుండా చూస్తాం అని ప్రకటించారు. కలంకారీ కార్మికులకు కళకు బ్రాండింగ్ చేస్తాం. పెడన కలంకారీ కళను రక్షించేందుకు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక చట్టాలు తెస్తాం అన్నారు పవన్‌.

ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి..!
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పెడనలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనకళ్ల, వేదవ్యాస్ వంటి వారికి అవకాశం కల్పించ లేకపోయాం. అధికారంలోకి రాగానే వీరిద్దరిని గౌరవిస్తాం అన్నారు. శ్రీరాముడు రావణాసుర వధ చేశాడు.. ఏపీ ప్రజలు జగనాసురవధ చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను నట్టెట్లో ముంచేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి.. బాలశౌరీ, కృష్ణ ప్రసాద్ గెలుపు తధ్యం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఇన్నాళ్లూ పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు బుగ్గలు నిమిరుతున్నాడు.. ముద్దులు పెడుతూ మళ్లీ బయలుదేరాడు అని ఎద్దేవా చేశారు. ఇక, మావి మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) జెండాలు కానీ.. ఏజెండా ఒక్కటే అన్నారు చంద్రబాబు.. మేం ముగ్గురం కలిసి వస్తున్నాం.. జగన్ శవాలతో వస్తున్నాడని విమర్శించారు. విధ్వంసం, అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు. 2019లో మేం గెలిచి ఉంటే.. కృష్ణాలో నీటి సమస్యే ఉండేది కాదు. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచేశాడని దుయ్యబట్టారు. అమరావతిని నాశనం చేశాడని ఆరోపించారు.. బందరు పోర్టు, అమరావతి వస్తే పెడన ఇంకా అభివృద్ధి అవుతుందన్నారు. టీడీపీ ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. జగన్ అమలు చేసేవి నవరత్నాలు కావు.. నకిలీ రత్నాలని సెటైర్లు వేశారు. మద్యపాన నిషేధం చేశాడా..? ప్రత్యేక హోదా తెచ్చాడా..? అని ప్రశ్నించారు. ప్రజలతో నాసిరకం మద్యం తాగిస్తూ.. జే-గన్ ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు.

ఏపీలో కూడా ఎన్డీఏకు మెజార్టీ స్ధానాలు.. సర్వేలు చెబుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్డీఏకు మెజార్టీ స్ధానాలు సాధిస్తుంది.. సర్వేలు ఇవే చెబుతున్నాయని తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జ్‌ సిద్ధార్థ్ నాథ్ సింగ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరితో కలిసి.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అరుణ్ సింగ్.. ఎన్నికల రణ రంగంలో నామినేషన్లు దాఖలు చేసే సమయం .. క్షేత్రస్ధాయిలో మరింత కష్టించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ స్ధానాలు బీజేపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.. ఏపీలో కూడా ఎన్డీఏ మెజార్టీ స్ధానాలు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇక, ఎన్డీఏ సభలు విజయవంతం చేయడానికి బీజేపీ వైపు నుండి పెద్ద ప్రయత్నం చేద్దాం అని సూచించారు ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జ్‌ సిద్ధార్థ్ నాథ్ సింగ్.. నామినేషన్లు దశ కనుక క్షణం తీరిక లేకుండా అహర్నిశలు పని చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలతో ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకునే విధంగా మని పనితం ఉండాలన్నారు. పొత్తులో కేటాయించిన సీట్లు మొత్తం గెలుచుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు సిద్ధార్థ్ నాథ్ సింగ్.. మరోవైపు.. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్ధులుగా భావించి విజయానికి కృషి చేద్దాం అని సూచించారు. ఎన్డీఏ గెలుపునకు బీజేపీ పెద్దన్న పాత్ర పోషించింది అన్న విశ్వాసాన్ని కలిగించాలి.. ఎన్నికల సందర్భంగా జరిగే సంఘటనలపై అప్పటికప్పుడు స్పందించాలి.. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటే గెలుపు తథ్యం అని సూచించారు పురంధేశ్వరి.

తెలంగాణ సమాజంలో సానుభూతి ఎక్కువ.. అందుకు కాంగ్రెస్‌ గెలిచింది
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్‌ అవర్‌ కార్యక్రమంలో నేడు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు ఏదీ శాశ్వతం కాదు. పత్రిపక్షంలో ఉన్నవాళ్లు అధికారంలోకి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మా పార్టీ పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడమని ఆయన అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక కరెంట్‌ సమస్యలు పరిష్కరించామన్న హరీష్‌ రావు.. రాష్ట్రంలో 5 ఉన్న మెడికల్‌ కాలేజీలను 31కి పెంచామని ఉద్ఘాటించారు. అంతేకాకుండా.. వైద్యాన్ని, వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చామని, ఐటీ అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఐటీ ఉత్పత్తులను పెంచాం. కొత్త జిల్లాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. అయితే.. దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు పోని కరెంటు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు పోతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు అడ్మినిస్ట్రేషన్‌ రావడం లేదని.. ఆ విషయాన్ని వారు ఒప్పుకోరని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్‌ నేరవేర్చలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటివరకు టీఎస్‌ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్‌ రావు అన్నారు. మేము ఎన్నికల ముందు బడ్జెట్‌లో పెట్టి ఆర్టీసీ డబ్బునే ఇప్పుడు ఇచ్చారని.. కానీ.. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు.

సీఏఏ, ఎన్‌ఆర్సీ రద్దుతో పాటు 10 వాగ్దానాలు.. ఏవేవంటే..!
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జోరు సాగుతోంది. ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుండగా.. తొలి విడత శుక్రవారమే ప్రారంభంకానుంది. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పోలింగ్‌కి రెండు రోజుల ముందు మేనిఫెస్టోను ప్రకటించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, యూనిఫాం సివిల్ కోడ్ రద్దుతో పాటు 10 కీలక వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టోను బుధవారం తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. పశ్చిమబెంగాల్‌లో తొలి దశలో కూచ్‌బెర్, అలిపుర్‌దౌర్, జలపాయ్‌గురిలో పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్‌సీ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) పశ్చిమబెంగాల్‌లో అమలు చేసేది లేదని మేనిఫెస్టోలో తృణమూల్ కాంగ్రెస్ స్పష్టంచేసింది. ఇండియా కూటమిలో భాగంగా కేంద్రంలో టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని తెలిపింది. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని వెల్లడించింది. ఉద్యోగాలకు భరోసా, యూనివర్శల్ హౌసింగ్, ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేయడం ఆనందంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎక్స్ ట్విట్టర్ ట్వీట్ చేసింది. ప్రతి భారతీయునికి ఉపాధి హామీ, సార్వత్రిక గృహాలు, ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు, రైతులకు హామీ ఇవ్వబడిన MSP, SC, STలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపింది. బీజేపీ జమీందార్లను పడగొట్టి అందరికీ గౌరవప్రదమైన జీవితానికి మార్గం సుగమం చేస్తామని టీఎంసీ వెల్లడించింది.

ఆజాద్ కీలక నిర్ణయం.. నామినేషన్ ఉపసంహరణ.. కారణమిదే!
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇటీవల ఆయన నామినేషన్ వేశారు. ఇంతలోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఏడు దిశల్లో పోలింగ్ జరుగుతోంది. అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మే 7న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19లోపు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. ఇంతలోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆజాద్ స్థానంలో మహ్మద్ సలీమ్ పరాయ్ పేరును పార్టీ ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ 2022లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, ఆ పార్టీతో తన ఐదు దశాబ్దాల అనుబంధానికి స్వస్తి పలికి.. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. ఈ ఎన్ని్కల్లో ఆయన అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కొద్దీ రోజులుకే ఆయన యూటర్న్ తీసుకుని నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 రష్యన్ సైనికులు మృతి
రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతూనే ఉంది. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కొన్ని వారాల్లోనే ఓడిపోతుందనే అంచనాల నేపథ్యంలో అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సాయంతో రెండేళ్లుగా ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది. పటిష్టమైన రష్యా సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి మరణించే సైనికుల సంఖ్య భారీగా ఉంటోంది. ఇప్పటి వరకు 50,000 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు బీబీసీ, మీడియాజోనా నివేదించింది. యుద్ధం రెండో ఏడాదిలో 27,300 కంటే ఎక్కువ మంది రష్యన్ సైనికులు మరణించారని చెప్పారు. ఇది మొదటి సంవత్సరం కన్నా ఎక్కువ. BBC రష్యన్, మీడియాజోనా మరియు వాలంటీర్లు ఫిబ్రవరి 2022 నుండి ఈ మరణాలను లెక్కిస్తున్నారు. మరణాల లెక్కను తేల్చడానికి అలాగే కొత్త సమాధుల సంఖ్యను అంచనా వేయడానికి రష్యన్ శ్మశానవాటికలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ యుద్ధంలో 50,000 మంది రష్యా సైనికులు మరణించారని నివేదిక తెలుపుతోంది. అయితే ఇది సెప్టెంబర్ 2022లో రష్యా అందించిన అధికార మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువ. ఈ లెక్కల్లో ఉక్రెయిన్ లోని డోనెట్స్స్, లూగాన్స్క్ మిలీషియా మరణాలు లేవు.

పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త.. ఇకపై చికిత్స కోసం ఎంత తీసుకోవచ్చంటే..!
పీఎఫ్‌ చందాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆర్థిక సంవత్సరం శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్‌ ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య ఖర్చుల నిమిత్తం ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈపీఎఫ్‌ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసమే అయినా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్‌ నుంచి కొంత మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్‌వో కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్‌ పరిమితిని ఈపీఎఫ్‌ఓ రెట్టింపు చేసింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌లో వెల్లడించింది. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుతున్నట్లు పేర్కొంది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈపీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్‌, హృద్రోగ చికిత్సల కోసమూ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి మెడికల్‌ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించి దీన్ని పొందొచ్చు. 2024, ఏప్రిల్ 16 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. ఉద్యోగి 6 నెలల బేసిక్, డీఏ లేదా వడ్డీతో సహా ఉద్యోగి వాటా ఏది తక్కువైతే అది విత్‌డ్రా చేయలేరు. అంటే ఈ మొత్తానికి మించి మీ PFలో రూ. 1 లక్ష ఎక్కువగా ఉంటే మాత్రమే దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు.లేదంటే కుదరదు.

తెలుగులోకి డబ్ కానున్న మరో మలయాళీ మూవీ
ఈ మధ్య ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి కూడా తెస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ఒక మలయాళ సినిమా కూడా తెలుగులోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ కిషోర్, శ్రుతి మీనన్ నటించిన వడక్కన్ మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరిసింది. రసూల్ పూకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ సంయుక్తంగా నిర్మించగా.. సాజీద్ ఎ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (BIFFF )లో స్థానం సంపాదించుకున్న ఈ సినిమాను ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ప్రాచీన ఉత్తర మలబార్ జానపద కథల నేపథ్యంలో సాగుతుంది. సమస్యాత్మకమైన వస్త్రాన్ని నేయడం ద్వారా ఈ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. తమ మలయాళ సినిమాకు ఇంతటి గుర్తింపు రావడంతో భ్రమయుగం, భూతకాలం దర్శకుడు రాహుల్ సదాశివన్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నారు. ‘వడక్కన్‌కి లభించిన అంతర్జాతీయ గుర్తింపు చాలా సంతోషకరమైనదని, మలయాళ చిత్రసీమను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు & నిర్మాత, జైదీప్ సింగ్ మాట్లాడుతూ ‘వడక్కన్‌తో ప్రపంచ స్థాయి కాస్ట్ & క్రూతో గ్లోబల్ సెన్సిబిలిటీలతో హైపర్‌ లోకల్ కథనాలను చెప్పడం ద్వారా భారతీయ సినిమాని పునర్నిర్వచించడమే మా లక్ష్యమని అన్నారు. వడక్కన్ ని ఈ సంవత్సరం కేన్స్‌లో మే నెలలో ప్రదర్శించనున్నారు. అనంతరం వడక్కన్ ని కన్నడ, తమిళం, తెలుగు భాషల్లోకి డబ్ చేయనున్నారు.

‘వీర ధీర శూరన్’ అంటూ వచ్చేస్తున్న విక్రమ్
విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చియాన్ విక్రమ్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేయగా త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. విక్రమ్ తో పాటుగా ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ‘వీర ధీర శూరన్’లో ప‌క్కా మాస్ అవ‌తార్‌లో చియాన్ విక్ర‌మ్ అభిమానుల‌ను మెప్పించ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. టీం రిలీజ్ చేసిన టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే హీరో పేరు కాళి, ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌నితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న హీరో అని క‌న్‌ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌, అయితే విల‌న్స్ జాడ‌ను హీరో ప‌సిగ‌ట్టేస్తాడు. అక్క‌డ ప‌ని చేసుకుంటూనే విల‌న్స్‌ను ఏం చేయాలా అని ఆలోచిస్తు అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని ఓ విల‌న్ చెవికి గాయ‌మ‌య్యేట‌ట్లు కాల్చ‌డంలో దుండ‌గులు భ‌యంతో ప‌రుగులు తీస్తారు. షాప్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ హీరో చేతిలోని గ‌న్ చూసి భ‌య‌ప‌డుతుంది. కానీ హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్ప‌టంతో షాపులోని లేడీ క‌స్ట‌మ‌ర్‌, ఓ ప‌క్క భ‌యం, మ‌రో ప‌క్క ఆశ్చ‌ర్యంతో నోరు వెళ్ళబెట్టేస్తుంది. 225 సెక‌న్ల పాటుండే ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌లోనే అంత మాస్ ఎలిమెంట్స్ ఉన్న‌ప్పుడు సినిమాలో ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ కూడా ఒక రేంజ్ లో ఉంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

Exit mobile version