NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

జనసేనకు గాజు గ్లాసు సింబల్‌ దక్కేనా..? రేపే కీలక తీర్పు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి సింబల్‌ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా ఈ గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, తీర్పు రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. అయితే, ఈసీ ఇప్పటికే గాజు గ్లాసు సింబల్‌ను ఫ్రీ సింబల్స్ లిస్ట్‌లో పెట్టింది. గాజు గ్లాసు గుర్తు తమకే వస్తుందని జనసేన పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా.. మంగళవారం దీనిపై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

రాయి దాడి ఘటనపై జగన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై రాయి దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనను ఖండిస్తూ.. చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటే.. మరికొందరు.. దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.. అయితే, రాయి దాడి ఘటనపై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు అని హెచ్చరించారు.. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదన్న ఆయన.. ఈ స్థాయికి వాళ్లు దిగజారారు అంటే మనం విజయానికి దగ్గరగా, వాళ్లు విజయానికి దూరంగా ఉన్నారని అర్థం చేసుకోవాలన్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు జగన్ అదరడు బెదరడు అని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. నా నుదిటి మీద వారు చేసిన గాయం.. కంట్లో తగల్లేదు అంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడని పేర్కొన్నారు.. నా నుదిటి పై గాయం 10 రోజుల్లో మానుతుంది.. కానీ, చంద్రబాబు పాలనలో చేసిన గాయాలు, మోసాలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. గాయపరచటం, కుట్రలు చేయటం చంద్రబాబు నైజంగా చెప్పుకొచ్చిన ఆయన.. ప్రజలకు మంచి చేయటం నా నైజం అని స్పష్టం చేశారు. ఇక, కృష్ణాజిల్లాలో ప్రజల సముద్రం.. మే 13న జరగనున్న మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన సముద్రమిది అని అభివర్ణించారు. పెత్తందారులతో యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్ దాడి ఘటన.. బెజవాడ పోలీసుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనతో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్ దాడి విషయంలో బెజవాడ పోలీసుల కీలక ప్రకటన చేశారు.. సీఎం జగన్‌పై దాడి చేసిన వారి వివరాలు చెప్పిన వారికి నగదు బహుమతి ప్రకటించారు ఈ మేరకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.. గౌరవ ముఖ్యమంత్రి గారిపై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి ఉంటుందని పేర్కొన్నారు.. సీఎం జగన్‌పై దాడి చేసిన నిందితులను పట్టుకొవడంలో ప్రజలు దోహదపడాలని విజ్ఞప్తి చేశారు బెజవాడ పోలీసులు.. ఖచ్చితమైన సమాచారాన్ని దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు అని సూచించారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారం ఇవ్వొచ్చని పేర్కొన్నారు.. కేసుకు దోహదపడే సమాచారం అందించిన వారికి రూ. 2 లక్షల నగదును బహుమతి ఇస్తామని.. సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.. ఇక, సమాచారం తెలిపే వాళ్లు.. కంచి శ్రీనివాస రావు, డీసీపీ (9490619342) లేదా ఆర్.శ్రీహరిబాబు, ఏడీసీపీ టాస్క్ ఫోర్సుకు ఏ.డి.సి.పి.టాస్క్ ఫోర్స్ (9440627089)కు తెలియజేయాలంటూ వారికి సంబంధించిన ఫోన్‌ నంబర్లను కూడా పేర్కొన్నారు పోలీసులు. అంతే కాకుండా కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్‌, పశువుల ఆస్పత్రి పక్కన. లబ్బిపేట, కృష్ణలంక, విజయవాడ అంటూ.. ఆఫీస్‌ అడ్రస్‌ను కూడా పేర్కొన్నారు.

సీఎం జగన్‌పై దాడి ఘటన.. ఐజీ, విజయవాడ సీపీకి ఈసీ కీలక ఆదేశాలు
విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై రాయి దాడి ఘటన కలకలం సృష్టిస్తుండగా.. అసలు దాడి ఘటనపై వివరాలు రాబట్టే పనిలోపడిపోయారు పోలీసులు.. ఇక, సీఎం జగన్‌పై దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (ఏపీ సీఈవో) ఎంకే మీనాకు వివరించారు ఐజీ రవి ప్రకాష్, బెజవాడ సీపీ కాంతి రాణా తాతా.. అయితే, సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు.. “మేమంతా సిద్దం” బస్సు యాత్రలో ఇటువంటి దుర్ఘటన ఏ విధంగా చోటు చేసుకుందనే విషయాన్ని సీఈవోకు వివరించారు బెజవాడ సీపీ.. దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం ఏర్పడిందో సీఈవోకు వివరించారు పోలీసులు. అయితే, పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ నిందితులు ఏ విధంగా రాయితో దాడి చేయగలిగారని పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఈ ఘటనలో దర్యాప్తును మరింత వేగవంతం చేసి.. సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (ఏపీ సీఈవో) ఎంకే మీనా.

కొంత మందిపై అనుమానం ఉంది.. అక్కడి నుంచే రాయి విసిరారు..
సీఎం వైఎస్‌ జగన్‌పై రాయి దాడి ఘటనలో కీలక విషయాలు ప్రస్తావించారు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తాతా.. బెజవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బెజవాడ పరిధిలో 22 కిలో మీటర్ల జగన్ రోడ్ షో చేశారు. 1,480 సిబ్బంది జగన్ రోడ్ షోలో బందోబస్తు కోసం పాల్గొన్నారు. 400 మందితో 40 రోప్ పార్టీలు పెట్టాయి. ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్లు వచ్చాయి. ఇదే కాకుండా సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. అక్టోపస్ భద్రతా ఉంది. జనసమ్మర్థమైన ప్రాంతాల్లో రోడ్ షో జరిగింది. రకరకాల కేబుల్స్ అడ్డంకిగా ఉన్నాయి. దీంతో కొన్ని తొలగించాల్సి వచ్చిందన్నారు.. బస్ రూఫ్ మీద ఎక్కుతారు కాబట్టి.. పవర్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఏ వీఐపీ కార్యక్రమమైనా.. రూఫ్ ఎక్కితే పవర్ ఆపాల్సిందే అన్నారు. అయితే, వివేకానంద స్కూల్ – గంగానమ్మ గుడి ప్రాంతానికి చేరుకున్న సందర్భంలో ఓ వ్యక్తి రాయి విసిరాడు అని వెల్లడించారు. ఇక, సీసీ కెమెరాల నుంచి.. సెల్ ఫోన్ విజువల్స్ నుంచి మేం సేకరించిన సమాచారం మేరకి రాయి విసిరారని నిర్ధారణకు వచ్చామని తెలిపారు సీపీ కాంతా రాణా.. సీసీ టీవీ ఫుటేజ్, విజువల్స్ ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపాం అన్నారు. సీఎంపై దాడి ఘటనలో ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపడుతున్నాం అన్నారు. ఇప్పటికే 52 మందిని ప్రశ్నించాం.. కొంత మందిపై అనుమానం ఉందన్నారు. అయితే, చీకట్లో రాయి విసిరిన వ్యక్తిని కనుక్కోవడం ఈజీ టాస్క్ కాదు. కానీ, త్వరలో కనుగొనే ప్రయత్నం చేస్తాం అన్నారు. స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నించొనే రాయి విసిరారు.. కంప్లైంటును బేస్ చేసుకుని.. కేసు సీరియస్ నెస్ ను దృష్టిలో పెట్టుకునే హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.

50 రోజుల్లో జగనే మళ్లీ సీఎం..
50 రోజుల్లో జగనే మళ్లీ సీఎం అవుతారని తెలిపారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వెనుక నుంచి భౌతికంగా తొలగించాలని చంద్రబాబు కుట్ర చేశారు.. కానీ, దేవుడు, ప్రజల ఆశీస్సులతో సీఎం జగన్ కు ఏమీ కాలేదన్నారు. 50 రోజుల్లో జగన్ మళ్లీ సీఏం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఓటు కోసం అబద్ధం చెప్పని వ్యక్తి జగన్ మాత్రమే అని ప్రశంసలు కురిపించారు. జగన్ ను గెలిపించి చంద్రబాబు ప్రజలు పాతేస్తారని హెచ్చరించారు.. వైఎస్‌ జగన్ ను ఏమైనా చేయాలి అంటే చంద్రబాబు మళ్లీ ఇంకో జన్మ ఎత్తాలని పేర్కొన్నారు కొడాలి నాని. ఇక, తన పరిపాలనలో స్కూల్‌కు వెళ్లేటువంటి పిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వా తాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీరుస్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అన్నారు కొడాలి.. జగనన్న ప్రభుత్వం. గ్రామగ్రామన, వార్డువార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సిన ప్రతి సౌకర్యాన్ని నేరుగా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజలకే అందిస్తుందన్నారు. గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నేత జగనే అని ప్రశంసించారు. మరోవైపు, ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్‌.. అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా 4 అడుగులు ముందుకు వేసిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని అభివర్ణించారు. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ వెంట్రుక ముక్క కూడా పీకలేడు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు కొడాలి నాని..

రైతుభరోసా, పంటలభీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం..
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంటల భీమా -2024 అమలుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎన్నికల సంఘం అనుమతితో.. ఈ ఖరీఫ్ కాలానికి పంటల భీమా పథకం అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టవల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏ ఒక్కరైతు, ఏ ఒక్క ఎకరానికి ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయో సందర్భం ఇక ఉండకుండా.. ఈ పంటల భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలియచేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో సంబంధిత అధికారులు సంస్థలతో చర్చించి రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని, అప్పటివరకు ఆర్థిక రంగ సంస్థలు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రైతులను పంటరుణాల రికవరీ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని వారిని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్యము ప్రకటించిన రైతుభరోసా పథకాన్ని అమలు చేసే విధివిధానాల మీద కసరత్తు జరుగుతుందని.. వచ్చే ఖరీఫ్ నుండి దీనిని అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందరికీ అమోదయోగ్యమైన విధానాన్ని రూపోందించి, అర్హులైన వారందరికీ రైతుభరోసా అందజేస్తామని చెప్పారు.

మంత్రి కోమటిరెడ్డికి ఆట సభలకు ఆహ్వానం
అమెరికాలో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వివార్షిక మహాసభలకు.. తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి‌కి ఆహ్వానం అందింది. అమెరికాలోని అట్లాంటలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో నిర్వహించే ఆట కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా ఆట ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఆట కన్వినర్ పాశం కిరణ్ రెడ్డి ఆహ్వాన లేఖను మంత్రికి అందించారు. జూన్ 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు అట్లాంట నగరంలో నిర్వహించే ఈ ఆట వేడుకల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలతో పాటు యువత కోసం జాబ్ ఫెయిర్స్, ఎడ్యూకేషన్ సమ్మిట్స్, హెల్త్ క్యాంపస్‌తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు, సానిటేషన్ వంటి మౌళిక వసతులు కల్పించేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన మంత్రికి వివరించారు. విశాలమైన అమెరికా దేశంలో ఆట వేదికగా తెలుగు భాష మాట్లాడేవారందరిని ఒక్కటిగా కలిపి ఉంచడంతో పాటు.. తెలుగు భాషను, సంస్కృతిని పెంపొందిస్తున్నామని మంత్రికి లేఖలో వివరించారు.

దేశ భవిష్యత్ బాగుండాలంటే మోడీని గెలిపించాలి
దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించాలని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ దేశ భవిష్యత్‌ను మార్చే నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటింగ్ రోజున హాలీడ్ కాదని.. భవిష్యత్‌ను డిసైడ్ చేసే రోజు అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో మోడీ పెకిలించేశారన్నారు. కరోనా వచ్చినప్పుడు ఇండియా పేద దేశం.. దేశంలో ఒకరి మాట ఒకరు వినరు అని వేరే దేశాలు అనుకున్నాయని.. దేశంలో అనేక మంది చనిపోతారని అనుకున్నారని.. కానీ వ్యాక్సిన్ కనిపెట్టి దేశాన్ని కాపాడినట్లు చెప్పుకొచ్చారు. కరోనా నుంచి ప్రజల ప్రాణాలు రక్షించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు లేని వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్ ఇస్తామని ప్రకటించారు. మోడీకి పేరు వస్తుందేమోనని.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌ను కేసీఆర్ ఇవ్వలేదని ఆరోపించారు. జన ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే మందులు ఇస్తున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదం
కాంగ్రెస్ మేనిఫెస్టో‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదమని ప్రధాని మోడీ తెలిపారు. ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన హామీలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తెలిపారు. బీజేపీ లక్ష్యం మాత్రం వికసిత భారత్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా తయారు చేస్తామని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను విఫలం చేసిందని మండిపడ్డారు. 25 ఏళ్లలోపు వారికి అతిపెద్ద నష్టం జరుగుతుందన్నారు. వికసిత భారత్ కోసం కొత్త ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధితో ఎక్కువ లాభపడేది.. యువతేనని మోడీ పేర్కొన్నారు. వికసిత భారత్ కావాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీని.. ఎన్డీఏ కూటమిని బలపర్చాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ మేనిఫెస్టో.. భవిష్యత్‌కు భరోసా లాంటిది అని పేర్కొన్నారు. భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఓటర్లకు ఇదే మంచి సువర్ణావకాశం అన్నారు. ప్రతిపక్షాల మేనిఫెస్టో యువత భవితవ్యాన్ని పాడు చేసే మేనిఫెస్టోలేనని విమర్శించారు. యువత ఆకాంక్షలను పూర్తిగా ధ్వంసం చేసేవేనని స్పష్టం చేశారు. దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లు తెలిపారు. అతి చౌకగా డేటా అందజేస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ విప్లవంతో యువతరం జీవితాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేవారి పట్ల గౌరవం ఉండాలన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉన్నందునే పన్నుల వసూళ్లు గణనీయమైన వృద్ధిని సాధించినట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో ఐటీఆర్‌ ఫైల్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని.. ప్రభుత్వంపై నమ్మకంతోనే ఈ వసూళ్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. వసూలు చేయబడిన ప్రతి పన్ను పేదవాళ్ల కోసమే ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు.

ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్‌లో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు..
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఏప్రిల్ 22న పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో రైసీ భేటీ కానున్నారు. ఏప్రిల్ 1న సిరియా డమాస్కస్‌ లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన ఇద్దరు సైనిక జనరల్స్‌తో పాటు ఏడుగురు సైనికాధికారులు మరణించారు. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకారంగా నిన్న ఇజ్రాయిల్ పైకి వందలాది డ్రోన్లతో, క్షిపణులతో దాడి చేసింది. ఈ పరిణామాల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పాకిస్తాన్‌లో పర్యటనకు వెళ్తుండటం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్, ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఇరాన్ సైనికులు, అధికారులపై దాడులకు పాల్పడుతున్న ‘జైష్ అల్ అద్ల్’ టార్గెట్‌గా పాకిస్తాన్‌పై దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఇరాన్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత ఇవన్నీ సద్దుమణిగాయి.

ఒమన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 13 మంది మృతి, పలువురు గల్లంతు
ఒమన్‌లోని మిడిల్ ఈస్ట్ నగరంలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి 13 మంది చనిపోయారు. యుఏఈకి చెందిన ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమన్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లో తప్పిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ఓ చిన్నారి సహా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం సంభవించిన వరదల కారణంగా.. కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొమ్మిది మంది విద్యార్థులు, ఇద్దరు నివాసితులు, ఒక వలసదారు ఉన్నారని నివేదిక పేర్కొంది. కుండపోత వర్షాల కారణంగా ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. రాయల్ ఒమన్ పోలీస్, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్, సివిల్ డిఫెన్స్ అథారిటీ మరియు అంబులెన్స్ బృందాలు పాఠశాలల నుండి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు.. ఒమన్ రోడ్లపై వరద నీరు కొట్టుకుపోయినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ప్రజలు తమ ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఒమన్ పోలీసు ఏవియేషన్ బృందం 21 మందిని గ్రామీణ వ్యవసాయ క్షేత్రం నుండి కురియత్ గవర్నరేట్‌లోని అల్ లాస్మో ప్రాంతానికి తరలించడానికి ఒక మిషన్‌ను నిర్వహించిందని ఖలీజ్ టైమ్స్ నివేదించింది.

పూజా కార్యక్రమాలతో మొదలైన ఏషియన్ రవితేజ సినిమాస్
ఏషియన్ థియేటర్స్ సంస్థ ఇప్పటికే పలువురు హీరోలతో కలిసి కొన్ని మల్టీప్లెక్స్ లను నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఏఎంబి సినిమాస్, విజయ్ దేవరకొండ తో ఏవిడి సినిమాస్, అల్లు అర్జున్తో కలిసి త్రిబుల్ ఏ సత్యం సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్ లను మొదలుపెట్టి విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మరో హీరోతో కలిసి ప్రాజెక్టు మొదలు పెట్టింది. ఆయన ఇంకెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. ఏషియన్ సినిమాస్ కొత్త వెంచర్ ఏ ఆర్ టి సినిమాస్ అంటే ఏషియన్ రవితేజ సినిమాస్ నిన్న అధికారిక పూజా లాంఛనాలతో ప్రారంభమైంది. నిన్న పూజా కార్యక్రమాలలో ఏషియన్ సునీల్ కుటుంబ సభ్యులతో పాటు రవితేజ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. థియేటర్లు ఇంకా సిద్ధం కాలేదు కానీ నిన్నటి పూజా కార్యక్రమాలతో ఆ పనులు ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఈ ఏఆర్టి సినిమా సంస్థ కొత్త థియేటర్ల చైన్ గా అవతరించబోతోంది. ఇక మరో పక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్స్ స్థలంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి ఏషియన్ సంస్థ థియేటర్ ప్రారంభించబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ఆ థియేటర్లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాల్పుల అనంతరం మొదటిసారి బయటకొచ్చిన సల్మాన్ ఖాన్
సోమవారం, ముంబైలోని బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరిగిన ఒక రోజు తర్వాత, సల్మాన్ ఖాన్ గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. సల్మాన్ తన బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉండగా అతని కారు ముందు – వెనుక పోలీసు కాన్వాయ్ కనిపించింది. సల్మాన్ ఇంటి బయట పోలీసులు కూడా ఉన్నారు. సల్మాన్ ను చూడగానే అభిమానుల్లో ఆనంద వాతావరణం నెలకొని, ఆయన ధైర్యాన్ని అందరూ కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏప్రిల్ 14న తెల్లవారుజామున 4:55 గంటలకు సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చి ఏడు సెకన్లలో 4-5 బుల్లెట్లు కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. సమీపంలోని చర్చి బయట బైక్‌ను వదిలేసి, లోకల్ ట్రైన్ పట్టుకుని శాంతా క్రజ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆటోలో వకోలాకు వెళ్లారని పోలీసులు తేల్చారు.