ప్రధాని మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ..
హస్తినకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 45 నిముషాల పాటు ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశం జరిగింది.. ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు ప్రధాని మోడీ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి , భ్రమరాంబికా దేవిని దర్శించుకోనున్న ఆయన.. కర్నూలులో నిర్వహిస్తున్న “సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” కార్యక్రమానికి హాజరుకానున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.. అయితే, ప్రధాని మోడీని “సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” కార్యక్రమానికి ఆహ్వానించారు సీఎం చంద్రబాబు.. మరోవైపు, నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో తలపెట్టిన “సీఐఐ—పార్టనర్షిప్ సమ్మిట్” కు హాజరుకావాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.. ఇక, రేపు ఉదయం 10 గంటలకు తాజ్ మాన్ సింగ్ హోటల్ లో “గూగుల్” సంస్థతో ఒప్పంద కార్యక్రమంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖలో “గూగుల్” డాటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ఐటీ శాఖ, గూగుల్ సంస్థల ప్రతినిధులు “అవగాహన ఒప్పందం” (ఎమ్.వో.యూ) పత్రాలపై సంతకాలు చేయనున్నారు.. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు “ఎమ్.వో.యూ” కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు..
డ్రైవర్ రాయుడు వీడియోపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు..
హత్యకు గురైన డ్రైవర్ రాయుడు పాత వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. డ్రైవర్ రాయుడు వీడియోపై స్పందించిన జనసేన మాజీ నాయకురాలు వినుత కోటా.. రాయుడు చావులో మా ప్రమేయం లేదు.. కాబట్టే మాకు కోర్టులో బెయిల్ వచ్చిందన్నారు.. మేం ఫారిన్‌లో లక్షల జీతాలున్న ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదన్నారు.. నాపై జరిగిన కుట్రకు సంబంధించిన ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు వినుత కోటా.. అయితే, డ్రైవర్ రాయుడు వీడియో, వినుత కోట వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు శ్రీకాళహస్తి ఎమ్మల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.. అయితే, రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలి.. నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. అయితే, కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.. నాకు రాయుడు తెలియదు.. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాను అన్నారు సుధీర్‌రెడ్డి.. న్యాయవాదులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. డ్రైవర్ వీడియో నమ్మేలా లేదు.. చంపడానికి ముందు బెదిరించి రికార్డు చేసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ పై పార్టీ అధిష్టానానికి వివరిస్తాను.. మా కుటుంబం 45 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేస్తుంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇప్పటి వరకు మేం ప్రజల్లో ఉన్నాం.. నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మాకు మంచి పేరు ఉంది. 2019 లో జనసేన పార్టీ నుంచి కోట వినుత పోటీ చేసి డిపాజిట్ కూడా రాలేదు.. ఆ రోజు మాకు 70,000 పైగా ఓట్లు వచ్చాయి.. 2024లో కూటమి ప్రభుత్వం తరఫున టికెట్ నాకు వచ్చింది.. కష్టపడి పని చేసాం.. మోడీ, అందరి ఆశీస్సుల వల్ల మంచి మెజారిటీతో గెలిచాం.. ఎప్పుడు ఎన్నడు లేని విధంగా కాళహస్తిలో పరిస్థితులు మారాయి అన్నారు.
నకిలీ మద్యం కేసుపై సర్కార్‌పై కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు..
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు సంచలనంగా మారింది.. అయితే, రాష్ట్రంలో నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సమగ్ర దర్యాప్తు కోసం నలుగురితో ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ ఏర్పాటు చేసింది.. ప్రభుత్వం.. ఆన్నమయ్య జిల్లా ములకల చెరువు లో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసును దర్యాప్తుచేయనుంది సిట్. సిట్ చీఫ్‌గా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ను నియమించింది. సిట్ సభ్యులుగా ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ… సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తి… టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికాగార్గ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. అయితే, ఇప్పటికే నకిలీ మద్యం కేసుపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఇచ్చిన ములకలచెరువు, భవానీపురం ఎక్సైజ్ పోలీసులు.. నకిలీ మద్యం కేసులో తదుపరి సమగ్ర దర్యాప్తు చేయాలని సిట్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.. అక్రమ తయారీ, సరఫరా, నకిలీ మద్యం పంపిణీకిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పురోగతి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ కె. విజయానంద్..
నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో.. జోగి రమేష్ చెబితేనే..!
ఓవైపు లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు.. నకిలీ మద్యం కేసులో ఏపీలో కలకలం రేపింది.. ఇప్పుడు ఈ కేసులో సంచలన వీడియో బయటకు వచ్చింది.. ఈ వీడియోలు కీలక విషయాలు బయటపెట్టారు నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్ధన్ రావు.. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు అంగీకరించారు జనార్ధన్ రావు.. అయితే, టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని పేర్కొన్నాడు.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని.. టీడీపీ ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించడానికి మళ్లీ నువ్వు నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేష్ నాతో అన్నారు అని వెల్లడించారు.. పై వారి ఆదేశాలతోనే నాకు నమ్మకస్తుడు అయిన నీకు ఈ పని అప్పజెప్పుతున్నాను. నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేష్ నాతో అన్నారని.. ఇబ్రహీంపట్నంలో పెట్టాలి అనుకున్నా.. కానీ, జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాం అని వీడియోలో వెల్లడించారు.. తంబళ్లపల్లె నియోజకవర్గంలో లిక్కర్ షాపులు నేను తీసుకున్నా.. తంబళ్లపల్లె నుండి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చు అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేష్ అన్నారని వీడియోలో చెప్పుకొచ్చాడు జనార్దన్ రావు.. వేరే వాళ్ల పేరు మీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్ని తీసుకొచ్చాం. లిక్కర్ తయారీ చెయ్యండి. మంచి సమయం చూసి మీరు ఎవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ నాతో అన్నారు. నీకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులు నుండి బయటపడటానికి సహాయం చేస్తామని జోగి రమేష్ హామీ ఇచ్చారు.. అంతా రెడీ అయ్యిన తరువాత నన్ను ఆఫ్రికాలో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరకు పంపారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్ కు లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు అంటూ ఆసక్తికర అంశాలు బయటపెట్టాడు..
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్.. పోలీసు శాఖను మూసేయండి..!
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని సంచలన వ్యాఖ్యలు చేసింది. డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతుందని.. అసలు పోలీసు వ్యవస్ధ పనిచేసేది ఇలాగేనా అంటూ ఆక్షేపించింది. తిరుపతి పరకామణి కేసు విచారణలో పోలీసు శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులు సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సీఐడీలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా అని నిలదీసింది. నిబద్దత ఉంటే ఐజీ స్ధాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చేవారని పేర్కొంది ఉన్నత న్యాయస్థానం. పరకామణి కేసు విచారణలో కీలకమైన రికార్డులను సీజ్ చేయడంలో విఫలం అయ్యారని మండిపడింది. ఆ ఆధారాలను తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి సహకరించారని వ్యాఖ్యానించింది. మీ చర్యలే మీరు ఎంత నిజాయితీగా వ్యవహరించాయో చెబుతున్నాయని కోర్టు పేర్కొంది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది.
LED స్క్రీన్ల ద్వారే రాజన్న దర్శనం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా స్వామి వారి దర్శనాన్ని భక్తులు పొందేలా చర్యలు తీసుకున్నారు. అర్చకులు, వేదపండితుల సూచనల మేరకు ఈ తాత్కాలిక దర్శన ఏర్పాట్లను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం కొనసాగుతుందని తెలిపారు. దేవాదాయ శాఖ సమాచారం ప్రకారం, భక్తుల కోసం అర్జిత సేవలు కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక సేవలు, ప్రసాదాల పంపిణీ, వసతి సదుపాయాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా, రాబోయే మేడారం జాతరకు వచ్చే భక్తులు కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ లో ఓటమిని కేటీఆర్ అంగీకరించారు
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ లో ప్రజల సపోర్ట్ స్పష్టంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఉందని, వందశాతం ఘన విజయం సాధించబోతోందని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని ఓటర్ల జాబితా 2023 లోనే సిద్ధమై ఉన్నదని, కేటీఆర్ ఓటు చోరీని చర్చిస్తూ అడ్డగోలుగా నోటికొచ్చినట్లు వ్యాఖ్యానించారన్నారు. అయితే, ఓటర్ల జాబితా రాజ్య ఎన్నికల సంఘం చేతే రూపొందించబడుతుందని, దాని ఏవైనా లోపాలపై ఆధారాలు ఈసీకి సమర్పించవచ్చని ఎమ్మెల్సీ స్పష్టంగా చెప్పారు. “ఓటర్ లిస్ట్ రూపొందించడం కాంగ్రెస్ పార్టీ పని కాదు. పదేళ్లు మంత్రి గా ఉన్న కేటీఆర్, బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చూస్తే కేటీఆర్ జూబ్లీహిల్స్ లో ఓటమి అంగీకరించారు. గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొత్త పథకాలు తీసుకువచ్చి ప్రజలను మోసం చేసింది. అధికార దుర్వియోగాన్ని ఎవరూ మర్చిపోలేరు” అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అధికార పార్టీ చేసిన దుర్వినియోగాలు, ప్రజల నమ్మకంపై అవినీతి ప్రకటనలను గుర్తు చేస్తూ వెంకట్ బల్మూర్ విమర్శలు చేశారు.
బీహార్ ఎన్నికల్లో ఫ్యామిలీ వార్.. అభ్యర్థులను ప్రకటించిన లాలూ పెద్ద కుమారుడు!
దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేయడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ఏకంగా సొంత పార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆయన తన పార్టీ జనశక్తి జనతాదళ్ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారో కూడా ఉంది. తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ జనశక్తి జనతాదళ్ నుంచి 21 మంది అభ్యర్థులు పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాలను తెలిపారు. ఆయన స్వయంగా మహువా అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నట్లు ఈ జాబితాలో ప్రకటించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో మహువా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన ఈ స్థానం నుంచే బరిలో దిగనుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జనశక్తి జనతాదళ్ (జెడి) పార్టీ అనేక మంది కొత్త, యువ ముఖాలతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎన్నికల్లో ప్రజా సమస్యలను ప్రశ్నిస్తూ పోటీ చేస్తామని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసందర్భంగా తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ.. యువతకు రాజకీయాల్లో కొత్త దిశానిర్దేశం చేయడం, బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. జనశక్తి జనతాదళ్ సామాన్య ప్రజల గొంతుకగా ఉంటుందని, అవినీతి, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలపై బహిరంగంగా పోరాడుతుందని పేర్కొన్నారు.
నేను యుద్ధాలను ఆపడంలో నిపుణుడిని.. పాక్-ఆఫ్ఘన్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. యుద్ధాలను పరిష్కరించడంలో, శాంతిని స్థాపించడంలో తాను నిపుణుడినని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఇది నేను పరిష్కరించబోయే 8వ యుద్ధం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం గురించి చర్చ జరుగుతోంది.” శాంతిని మధ్యవర్తిత్వం చేయగల తన సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ, “నేను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడిని, శాంతిని నెలకొల్పడంలో నేను నిపుణుడిని. అలా చేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని అన్నారు. సరిహద్దులో భారీ కాల్పులు, ఘర్షణల తరువాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు . రెండు రోజుల వివాదంలో రెండు వైపులా గణనీయమైన ప్రాణనష్టం జరిగింది. తాలిబన్లు 58 మంది పాకిస్తాన్ సైనికులను చంపినట్లు ప్రకటించగా, పాకిస్తాన్ వారి నుండి అనేక ఆఫ్ఘన్ అవుట్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి.. మళ్లీ కంపు లేపిన ట్రంప్!
సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాపై 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన నిర్ణయంతో మళ్లీ కంపు లేపారు. వాస్తవానికి ఇది మరోసారి వాణిజ్య యుద్ధ సంకేతాలను రేకెత్తించిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అమెరికా చర్యకు డ్రాగన్ కూడా బలమైన ఎదురుదాడిని ప్రారంభించింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాల ఉద్రిక్తతల ప్రభావం సోమవారం ఆసియా మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది. జపాన్ నుంచి హాంకాంగ్ వరకు మార్కెట్లు అన్నీ గందరగోళంలో పడ్డాయి. చైనాపై 100% సుంకాన్ని ప్రకటించిన ట్రంప్ నిర్ణయం ప్రభావం సోమవారం ఆసియా మార్కెట్లపై స్పష్టంగా కనిపించిదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జపాన్ నుంచి హాంకాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున భారీ క్షీణతతో ట్రేడ్ అయ్యాయి. ఒక వైపు నిక్కీ 491.64 పాయింట్లు (1.01% క్షీణతతో) 48,088.80 వద్ద ట్రేడ్ కాగా, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 534.33 పాయింట్లు (1.98% క్షీణించి) 25,756 స్థాయిలో ట్రేడ్ అయ్యింది. దక్షిణ కొరియా KOSPI ఇండెక్స్ కూడా 38.31 పాయింట్లు (1.06%) తగ్గి 3,572.29 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇతర ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. FTSE 100 (81.93 పాయింట్లు), CAC (123.36 పాయింట్లు), DAX (369.79 పాయింట్లు) ప్రారంభ ట్రేడింగ్‌లో తక్కువగా ట్రేడ్ అయ్యాయి.
నువ్ కేక బాసూ.. రెండో సినిమాకే కోటి రెమ్యునరేషన్
హ్యాష్‌ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్‌తో కంటెంట్ క్రియేటర్ మౌళి, నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఆ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది, మౌళికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మౌళి హీరోగా మారి చేసిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కూడా బాగా వర్కౌట్ అయింది. కామెడీ నేపథ్యంగా సాగిన ఈ సినిమా, నిర్మాతలకైతే కాసుల వర్షం కురిపించింది. ‘ఈటీవీ విన్’ ఒరిజినల్‌గా రూపొందించబడిన ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందని భావించి, ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నందిపాటి కలిసి థియేటర్లలో రిలీజ్ చేశారు. కేవలం మూడు, నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్‌లో రూపొందించబడిన ఈ సినిమా, థియేటర్లలోనే దాదాపుగా 30 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
పిచ్చి ముం* బూతు అని తెలియదు!
రాశి ఖన్నాకి తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌లో భాగం కాకపోయినా, సెన్సిబుల్ సినిమాలు చేస్తుందనే పేరు ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాలు చాలా తగ్గించేసింది. తగ్గించేసింది అనడం కన్నా, ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అయితే, సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేసిన తెలుసు కదా అనే సినిమాలో మాత్రం ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడిన ఒక బూతు మాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆమె ‘పిచ్చి ము’ కాదని అంటూ కామెంట్ చేసింది. అయితే, అది ఒక బూతు పదమనే విషయం తనకు తెలియదని తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చింది. నిజానికి ఆ పదాన్ని తమ సినిమాలో బామ్మ క్యారెక్టర్ వాడుతుందని, సిద్దు క్యారెక్టర్ కూడా వాడుతుందని ఆమె చెప్పుకొచ్చింది. “దీంతో అదేదో క్యూట్ వర్డ్ అనుకొని నేను కూడా మాట్లాడేశాను. కానీ, అది బూతు పదమని తర్వాత తెలిసిందంటూ” ఆమె చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఆ పదం సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది.