Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

భారీ నుంచి అతి భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌, 11 జిల్లాలకు ఆరెంజ్‌ వార్నింగ్‌
ఈ రోజు హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావారణ శాఖ.. హైదరాబాద్‌లో మరో మూడు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. గంట పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్‌ జారీ చేయగా.. 11 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో హెచ్చరికలు జారీ అయిన జిల్లాల్లో మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ ఉండగా.. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు.

బెజవాడలో బెడిసికొట్టిన ప్రేమ.. యువకుడిపై కతిత్తో యువతి తల్లి దాడి
చాలా మంది ప్రేమించుకుంటారు.. కొందరు పెద్దలను ఒప్పించి.. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపిస్తారు.. మరికొందరు పెద్దలు ఒప్పుకోక పోవడంతో.. త్యాగాలు చేస్తారు.. మరికొందరు దూరంగా వెళ్లిపోతారు. అయితే, బెజవాడలో ఓ ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది.. నాగరాజు అనే యువకుడిపై కత్తితో దాడి చేసింది ప్రేమికురాలు తల్లి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలో నాగరాజు అనే యువకుడు.. ఓ యువతి ప్రేమలో పడ్డారు.. కొన్నాళ్ల ఈ వ్యవహారం బాగానే నడిచినా.. ఆ తర్వాత దూరంగా ఉండాలని నాగరాజుకు సూచించింది యువతి.. అయితే, దీనికి నాగరాజు నిరాకరించాడు.. యువతి వద్దని చెప్పిన తర్వాత కూడా అతని తీరు మారలేదు. మరోవైపు.. ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఫోన్‌లో పెట్టిన మెసేజ్‌లు, కలిసి దిగిన ఫొటోలు.. వెంటనే డిలీట్‌ చేయాలని సదరు యువకుడిని కోరింది ఆ యువతి.. దాని కూడా నాగరాజు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి తల్లి.. అతడి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భార్యకు కరోనా పాజిటివ్
అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్‌కు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని సోమవారం వైట్ హౌస్ తెలిపింది. అయితే అధ్యక్షుడు జో బిడెన్ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. బిడెన్ 72 ఏళ్ల భార్యకు చివరిసారిగా గత ఏడాది ఆగస్టులో కోవిడ్ సోకగా, ప్రెసిడెంట్ జో బిడెన్ కి చివరిసారిగా జూలై 2022లో కరోనా వచ్చింది.రెండు రోజుల తర్వాత భారత్‌లో జరిగే జి-20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ హాజరుకానున్నారు. దీనికి ముందు ఇద్దరి కోవిడ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు కరోనా సోకినట్లు గుర్తించారు. అధ్యక్షుడు బిడెన్ నివేదిక ప్రతికూలంగా ఉంది. ఆమెకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని ఆమె కార్యాలయం చెబుతుంది. దీంతో ఆమె డెలావేర్‌లోని తన నివాసంలో ఉంటారు. వైట్ హౌస్ మెడికల్ యూనిట్ ఈ విషయాన్ని సన్నిహితులకు తెలియజేసింది.

5జీ, గ్రీన్ ఎనర్జీ, ఎఫ్ఎంసీజీలో ముఖేష్ అంబానీ భారీ పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఏ వ్యాపార అవకాశాన్ని కోల్పోకూడదనుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలు మూడు రంగాలలో తమ పెట్టుబడులను పెంచుతున్నారు. టెలికాం రంగం, గ్రీన్ ఎనర్జీ, ఎఫ్‌ఎంసిజిపై దృష్టి సారిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వాటి ద్వారా లాభాలు పొందేందుకు ముఖేష్ అంబానీ ప్రయత్నిస్తున్నారు. ఎఫ్‌ఎంసిజి, గ్రీన్ ఎనర్జీ, 5జిలో పెట్టుబడులను పెంచాలనుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో అనుబంధం ఉన్న ఈ రంగాల్లోని కంపెనీల్లో ముఖేష్ అంబానీ పెట్టుబడులు రాబోయే కొద్ది రెట్లు పెరిగే అవకాశం ఉందని ఫార్చ్యూన్ ఇండియా నివేదిక పేర్కొంది. అంబానీ 5జీ కోసం రూ. 2 లక్షల కోట్లు, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఐదు పునరుత్పాదక ఇంధన-కేంద్రీకృత గిగా ఫ్యాక్టరీలను నిర్మించడానికి రూ. 75,000 కోట్లు కేటాయించారు. 2027 నాటికి పెట్రో కెమికల్ సామర్థ్యాల విస్తరణకు మరో రూ.75,000 కోట్లు వెచ్చించనున్నారు. గత రెండేళ్లలో కంపెనీ మూలధన వ్యయంలో 98 శాతం లాభాల నుంచే సమకూరినట్లు వాటాదారులకు రాసిన లేఖలో ముఖేష్ అంబానీ తెలిపారు.

వర్షాలకు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి..
వర్షాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలు పడుతుంటే మరోవైపు వ్యాదులు కూడా పలకరిస్తాయి..దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.. ఇలాంటి వ్యాదులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. చికెన్, చేపలు, టోఫు వంటి లీన్ ప్రోటీన్స్ ద్వారా కండరాలు పెరుగుతాయి. కూరగాయలలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహారంలో విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినాలి. నిమ్మకాయలు, నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. బ్రకోలీ, బెల్ పెప్పర్స్, కివీస్‌లో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి కాపాడుతాయి..

మెరిసిన రోహిత్‌, గిల్.. ఆసియా కప్‌ సూపర్‌-4లో భారత్!
ఆసియా కప్‌ 2023 రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. గ్రూప్‌-ఏలో భాగంగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (74 నాటౌట్‌; 59 బంతుల్లో 6×4, 5×6), శుభ్‌మన్‌ గిల్ (67 నాటౌట్‌; 62 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో భారత్‌ గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-4 రెండో బెర్తును సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన నేపాల్‌.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ మొదటి బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు శ్రీలంక-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ను బట్టి గ్రూప్‌-బీలో సూపర్‌-4 బెర్తులు ఖరారు అవుతాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్‌ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌కు భారత ఫీల్డింగ్‌ వరంగా మారింది. 5 ఓవర్ల వ్యవధిలో నాలుగు క్యాచ్‌లు నేలపాలు కావడంతో.. ఓపెనర్లు ఆసిఫ్‌ షేక్‌ (58; 97 బంతుల్లో 8×4), కుశాల్‌ బుర్టేల్‌ (38; 25 బంతుల్లో 3×4, 2×6)లకు రెండేసి లైఫ్స్ లభించాయి. ఈ అవకాశాల్ని ఇద్దరూ బాగానే ఉపయోగించుకున్నారు. బుర్టేల్‌ భారత బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ పరుగులు రాబడితే.. షేక్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు. పదో ఓవర్లో బుర్టేల్‌కు శార్దూల్‌ చెక్‌ పెట్టగా.. జడేజా మాయాజాలంతో షర్కి (7), రోహిత్‌ పౌడెల్‌ (5), కుశాల్‌ మల్లా (2)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ అయ్యారు. ఈ సమయంలో సోంపాల్‌ కామి (48; 56 బంతుల్లో 1×4, 2×6), దీపేంద్ర సింగ్‌ ఐరీ (29) రాణించారు. జడేజా (3/40), సిరాజ్‌ (3/61) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. లక్షఛేదనలో భారత్‌ 2.1 ఓవర్లలో 17/0తో ఉన్న దశలో వర్షం మొదలైంది. దాంతో రెండు గంటలకు పైగా ఆట ఆగిపోయింది. ఆట మళ్లీ మొదలు కాదేమో అనుకున్న దశలో వరుణుడు కరుణించాడు. దీంతో అంపైర్లు భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. ఓపెనర్లు రోహిత్, గిల్ బౌండరీలు బాదుతూ పరుగులు చేసారు. దాంతో భారత్‌ 20.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 147 పరుగులు చేసింది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మళ్లీ తలపడబోతున్నాయి. రెండు జట్లూ గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-4కు అర్హత సాధించడంతో.. తర్వాతి దశలో మళ్లీ ఓ మ్యాచ్‌ ఆడనున్నాయి.

చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ రికార్డు బద్దలు!
ఆసియా కప్‌ 2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 59 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. సూపర్-4కు ముందు హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. నేపాల్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్‌ టోర్నీలో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్‌లు చేసిన భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌ ఇప్పటివరకు ఆసియా కప్‌లో 10 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉండేది. ఆసియా కప్‌ టోర్నీలో సచిన్ 9 హాఫ్ సెంచరీలు బాదాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ 5 సిక్స్‌లు బాదడంతో.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా 250వ సిక్స్‌ మైలురాయిని అందుకున్నాడు. దాంతో వన్డేల్లో ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో రోహిత్ 280 సిక్స్‌లు బాదాడు. వన్డే క్రికెట్‌లో షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 331 సిక్స్‌లతో రెండో స్థానంలో కొనాగుతున్నాడు. ఈ జాబితాలో మూడో స్ధానంలో హిట్‌మ్యాన్ నిలిచాడు. ఆసియా కప్‌ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత ఆటగాడిగా కూడా నిలిచాడు.

రెండు ఫైట్స్… రెండు సాంగ్స్… ఇండియన్ స్క్రీన్ పైన చూసి ఉండరు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్-చరణ్ అగ్రెసివ్ గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ చేసారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేస్తూ ఇండియన్ 2 రేస్ లోకి వచ్చింది. ఎప్పుడో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమా మళ్లీ స్టార్ట్ అవ్వడంతో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అప్పటివరకూ ఫుల్ స్వింగ్ లో జరిగిన షూటింగ్ స్లో అవ్వడంతో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కూడా డైలమాలో పడే పరిస్థితి వచ్చింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంటి వాడు స్టేజ్ పైన మాట్లాడుతూ… శంకర్ చెప్పే వరకూ మనకి ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ తెలియదు అన్నాడు అంటే గేమ్ ఛేంజర్ విషయంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా సంక్రాంతికి అనౌన్స్ అయిన గేమ్ ఛేంజర్ ఇప్పుడు సమ్మర్ కి లేదా పోస్ట్ సమ్మర్ కి షిఫ్ట్ అయినట్లు ఉంది. అయితే ఎంత డిలే ఉన్నా… గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం ప్రాపర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని సమాచారం. శంకర్ మేకింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు సాంగ్స్, రెండు ఫైట్స్ ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని రేంజులో ఉంటాయని సమాచారం. శంకర్ సాంగ్స్ లో ఉండే విజువల్స్ ఏ డైరెక్టర్ క్యాప్చర్ చేయలేడు అనేది నిజం. శంకర్ గ్రాండ్ మేకింగ్ కి, చరణ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో చూడాలి.

మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. నిజమేంటంటే?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక దీరుడు రాజమౌళి గురించి యావత్ ప్రపంచానికి తెలుసు..ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. అలాంటి రాజమౌళి గురించి ఓ ఇంట్రెసింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.. రాజమౌళి మొదట పెళ్లి అయిన రమా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట రమకి మ్యూజిక్ డైరెక్టర్ తో పెళ్ళై ఒక కొడుకు పుట్టాక విడాకులు అయ్యాయి. ఆ తర్వాత రమా ని రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రమా కి అంతకు ముందే కార్తికేయ అనే కొడుకు ఉన్నాడు. అలాగే కార్తికేయ కోసం రాజమౌళి మళ్లీ రమతో పిల్లల్ని కూడా కనలేదు. అలాగే మయూకా అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతున్నాడు.. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అదేంటంటే రాజమౌళి తండ్రి కాబోతున్నాడు అనేది నిజమే. కానీ రమా రాజమౌళి ప్రెగ్నెంట్ కాదు. అయితే రాజమౌళి ఒక అనాధ అమ్మాయిని దత్తత తీసుకోబోతున్నారట. ఈ విధంగా రాజమౌళి మరోసారి తండ్రి కాబోతున్నారు అంటూ ఓ న్యూస్ వినిపిస్తోంది.అయితే ఆడపిల్లలు అంటే ఉన్న ఇష్టంతో రాజమౌళి మరో అమ్మాయిని దత్తత తీసుకొని పెంచబోతున్నట్లు ఇండస్ట్రీ లో వార్త షికారు చేస్తుంది.. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఏది నిజమో తెలియాలంటే జక్కన్న చెప్పేవరకు ఆగాల్సిందే.. సినిమాల విషయానీకొస్తే.. మహేష్ బాబుతో త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు..

Exit mobile version