NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె..
విశాఖపట్నం తీరానికి ఓ భారీ పెట్టె కొట్టుకు వచ్చింది.. దీని బరువు సుమారు వందటన్నుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. పురతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్‌ సహాయంతో ఒడ్డుకు చేర్చారు పోలీసులు. బీచ్ లో వున్న సందర్శకులు ఆ భారీ పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు.. దీంతో.. వారిని పోలీసులు కట్టడి చేయడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు.. వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకువచ్చిన ఈ భారీ ఆకృతిలోని చెక్క పెట్టె.. బ్రిటీష్ కాలం నాటిదిగా అంచనా వేస్తున్నారు అధికారులు.. పురాతన పెట్టెపై ఆర్కియాలజీ విభాగానికి సమాచారం ఇచ్చారు పోలీసులు.. అయితే.. ఆ పెట్టెలో ఏముందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గతంలోనూ విశాఖ తీరానాకి కొన్ని వస్తువులు కొట్టికొచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే, ఇప్పుడు వచ్చిన చెక్క పెట్టెలో ఏముంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

నారా బ్రాహ్మణిపై మంత్రి రోజా కౌంటర్ ఎటాక్‌..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మణిపై కౌంటర్‌ ఎటాక్‌ దిగారు మంత్రి ఆర్కే రోజా.. అమ్మ మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకి వెళ్తే మీరేమో ఆ అవినీతి పరుడుకి మద్దతుగా ప్రజలను మోత మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారు. మీ భర్త నారా లోకేష్‌కి మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..? మీ మామ ఏమో అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ పోరాటాన్ని కాపీ కొట్టి పల్లాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటున్నారు.. బావుంది. మీ ఫామిలీ ఫ్యామిలీ అంతా కాపీ కొట్టడమేనా..? నీ మామ మీద ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు. కానీ, నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఘాటు కామెంట్లు చేశారు. ఇక, బకాసురుడిలా ప్రజల సొమ్మును దోచేసిన నీ మామ చంద్రబాబు మీద చర్యలకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తావా బ్రహ్మణి అంటూ నిలదీశారు మంత్రి రోజా.. అంటే మీరు కోర్టులకంటే గొప్పోల్లా..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..? కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతుందన్న జ్ఞానం లేదా..? #TDPGoons అనే హాష్ ట్యాగ్ జత చేశారు మంత్రి ఆర్కే రోజా..

గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. మరింత ఈజీగా సర్టిఫికెట్స్‌
సర్టిఫికెట్స్‌ కోసం రోజుల తరబడి అధికారుల వెంట తిరగాల్సి వస్తుందా? స్కూల్‌, కాలేజ్, ఉద్యోగం మానేసి సర్టిఫికెట్స్‌ కోసం ప్రయత్నాలు సాగించాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇక నో టెన్షన్‌.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్య, ఉద్యోగం, ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. ఈ మేరకు సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, నివాస ధృవపత్రం, బర్త్‌ డే సర్టిఫికెట్‌కాకుండా.. ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్‌ ఒకసారి తీసుకుంటే సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక, ఒకసారి పొందిన సర్టిఫికెట్లను శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని, ప్రతిసారీ కొత్త సర్టిఫికెట్‌ కోసం ఒత్తిడి తేవద్దని పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య శాఖలు, స్కిల్‌ డెవలప్‌మెంట్, వ్యవసాయ శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ సర్టిఫికెట్లు ఎక్కడైనా పోయినా, వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. గ్రామ, వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో అదే నంబర్‌తో కొత్తది పొందే వెసులుబాటు కూడా కల్పించింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్. కాగా, వివిధ రకాల సర్టిఫికెట్స్‌ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే.. తహసీల్దార్, ఎంపీడీవోలతో సహా వివిధ మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సచివాలయాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి.. వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను సేకరించడం.. వారికి వెంటనే వివిధ రకాల సర్టిఫికెట్లు అందించిన విషయం తెలిసిందే.

నిజమాబాద్‌లో డెంగ్యూ డేంజర్ బెల్స్.. నెలలో 192 కేసులు
వాతావరణంలో వస్తున్న మార్పులతో డెంగ్యూ జ్వరాలు డేంజర్ బెల్ మోగుతున్నాయి. డెంగ్యూతో పాటు వైరల్‌ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత నెల రోజులుగా ఆసుపత్రుల్లో ఇన్‌ పేషెంట్ల సంఖ్య పెరిగింది. మళ్లీ వర్షాలతో దోమలు పెరిగే అవకాశం ఉందని… ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాను డెంగ్యూ భయపెడుతోంది. ఒక్కసారిగా కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, మళ్లీ కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు పెరిగిపోతున్నాయి. అదనంగా, అపరిశుభ్ర వాతావరణం ఉండటం ముఖ్యంగా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్యను పెంచుతుంది. అదే సమయంలో ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆసుపత్రిలో ఉంటూనే డెంగ్యూతో కోలుకుంటున్నాడు. డెంగ్యూ ముఖ్యంగా చిన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. నిజమాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఒక్క సెప్టెంబర్‌ నెలలో 192 డెంగీ కేసుల నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. కిసాన్ నగర్ లో 24 గంటల వ్యవధిలో డెంగ్యూ లక్షణాలతో ఇద్దరు మహిళల మృతి చెందారు. మృతులు మధుప్రియ, తుంగెల లక్ష్మీ గా గుర్తించారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్ లో డెంగ్యూతో ఆరుగురు మృతి చెందారు. దీంతో డెంగ్యూ మరణాలు ఆందోళన కలిగిస్తున్నారు.

31 ఏళ్ల నాటి ఘటనలో న్యాయం..ఒకే కేసులో 215 మందికి శిక్ష
కాపాడాల్సిన పోలీసులే తనిఖీల పేరిట మహిళలపై అత్యాచారం, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మంది మహిళలపై అత్యాచారం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ బాధితులకు 31 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది. ఈ కేసులో ఒకేసారి 215 మందికి జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇది 1992 నాటి ఘటన. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కల్వరాయన్‌ కొండప్రాంతంలో జరిగింది ఈ అమానుష ఘటన. కల్వరాయన్ కొండప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య ఉంది వాసాత్తి అనే చిన్న గ్రామం. గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందంటూ 1992 జూన్‌ 20వ తేదీన పోలీసులు తనిఖీలకు వచ్చారు. 1992 జూన్‌ 20వ తేదీన 155 మంది అటవీసిబ్బంది, 108 మంది పోలీసులు, ఆరుగురు రెవెన్యూశాఖ అధికారులు కలిపి మొత్తం 269 మంది ప్రతి ఇంటికీ వెళ్లి తనిఖీ చేశారు. తమ సోదాల్లో కొన్ని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు 90 మంది మహిళలతో సహా 133 మందిపై కేసు నమోదుచేశారు. అంతటితో ఆగని పోలీసులు ఈ వంక దొరికింది కదా అని తమ ఇష్టారీతిన ప్రవర్తించారు.

మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం కొనాలేనుకొనేవారికి ఇది శుభవార్తే.. వరుసగా ధరలు కిందకు దిగి వస్తున్నాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా ధరలు తగ్గాయి.. శనివారం మార్కెట్ లో నమోదు అయిన ధరలను చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.250 నుంచి 270 రూపాయల మేర ధర తగ్గింది. అయితే శనివారం వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగాయి. కిలో వెండిపై రూ.1000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.74,700 పలుకుతోంది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700గా ఉండగా.. ముంబైలోనూ ఇదే ధర పలుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500, బెంగళూరులో రూ.72,500, కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.74,700 లుగా ట్రేడింగ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500 పలుకుతోంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

శరవేగంగా ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధి.. 14 నెలల్లో గరిష్ట స్థాయి
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎనిమిది ప్రధాన రంగాలు అంటే ప్రధాన రంగాల వృద్ధి రేటుకు సంబంధించి శుభవార్త వచ్చింది. కోర్ సెక్టార్ వృద్ధి రేటు ఆగస్టులో 14 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎనిమిది ప్రధాన ప్రాథమిక పరిశ్రమల (కోర్ సెక్టార్లు) వృద్ధి రేటు ఈ ఏడాది ఆగస్టులో 14 నెలల గరిష్ట స్థాయి 12.1 శాతానికి చేరుకుంది. అంతకుముందు జూలై నెలలో, ఈ ప్రధాన పరిశ్రమల వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది. అయితే ఒక సంవత్సరం క్రితం అదే నెలలో అంటే ఆగస్టు 2022లో ప్రధాన రంగ వృద్ధి రేటు 4.2 శాతంగా ఉంది. గత 14 నెలల్లో ఆగస్టులో అత్యధిక వృద్ధి రేటు నమోదైంది. మునుపటి గరిష్ట స్థాయి జూన్ 2022లో ఉంది. ఆ సమయంలో 8 ప్రధాన రంగాల వృద్ధి రేటు 13.2 శాతంగా ఉంది. బొగ్గు, ముడి చమురు మరియు సహజ వాయువు ఉత్పత్తిలో పెరుగుదల ఆగస్టు నెలలో ప్రాథమిక రంగ వృద్ధికి మద్దతునిచ్చిందని, ఈ కారణంగా ఈ నెల ఉత్తమంగా ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక డేటాలో పేర్కొంది. కోర్ సెక్టార్ వృద్ధి పరంగా ఇది నిరూపించబడింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాల ఉత్పత్తి కూడా ఆగస్టులో పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డేటా చూపిస్తుంది.

నేడే లాస్ట్ ఛాన్స్.. రూ. 2000 నోట్లను మార్చుకోండి లేదంటే..!
నేటితో రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లకు ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగియనుంది. రేపటి నుంచి రూ. 2 వేల నోటు చెల్లదు. అయితే.. ఇప్పటికే చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఇతర లావాదేవీల ద్వారా నోట్లను మార్చుకున్నారు. అయితే.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా.. ఏమరపాటుతో ఉన్నారు. అలాంటి వారు ఈరోజు చివరి అవకాశం. ఈరోజు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19, 2023న దేశంలో అతిపెద్ద కరెన్సీని డీమోనిటైజేషన్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రకారం.. రూ. 2,000 నోటును చెలామణి నుంచి తొలగించారు. అయితే.. ఈ నోట్లను మార్కెట్ లో మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు వెసులుబాటు కల్పించింది. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్చి 31, 2023 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. సెప్టెంబరు 1, 2023న ఆర్‌బీఐ విడుదల చేసిన లెక్కల ప్రకారం రూ.24,000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ సామాన్య ప్రజల వద్దనే ఉన్నాయని, ఇంకా బ్యాంకులకు తిరిగి రావాల్సి ఉందన్నారు. అందులో రూ.3.32 లక్షల కోట్లు అంటే 93 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. మిగిలిన 7 శాతం రూ. 24,000 కోట్లు రూ. 2000 నోట్లు ఇంకా వాపస్ రావాల్సి ఉంది. రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి గడువు ముగిసిన తర్వాత.. ఆర్‌బిఐ తన ప్రాంతీయ కార్యాలయాల్లో కొంత కాలం పాటు మరిన్ని నోట్లను మార్చుకోవడానికి అనుమతించాలని భావిస్తోంది, తద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిపై RBI తన స్టాండ్‌ను 30 సెప్టెంబర్ 2023న స్పష్టం చేయవచ్చు.