Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సవ్యంగా సాగుతోన్న కౌంట్‌డౌన్‌.. నేడే నింగిలోకి ‘ఆదిత్య’
చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో జోష్‌ మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది.. PSLVC-57 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.. ఇక, ఈ ప్రయోగానికి శుక్రవారం రోజు కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది ఇస్రో.. 24 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అనంతరం ఈ రోజు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు శాస్త్రవేత్తలు.. PSLVC-57 రాకెట్ ద్వారా సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది ఇస్రో.. నిన్న మొదలైన కౌంట్‌డౌన్‌ సవ్యంగా సాగుతోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. ఇక, రాకెట్ లో ఇంధనం నింపుతున్నారు శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తుండడంతో.. దానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదిక సిద్ధం అయ్యింది.. సూర్యుడి వాతావరణాన్ని వడపోసి, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు ఈ రోజు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహంతో పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం 4 నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ పాయింట్‌ను చేరుకుటుంది.. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం.. ఇంత సుధూర ప్రదేశంలోకి ఇస్రో ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడంతో ఉత్కంఠగా మారింది..

‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’.. జనసేనాని కీలక వ్యాఖ్యలు
‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ వైపు అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానంపై చర్చ నడుస్తుండగా.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం వడివడిగా అటువైపు అడుగులు పడుతున్నాయి.. “ఒక దేశం-ఒకే ఎన్నిక”పై మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు.. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. అన్ని అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులను చేయనుంది ఆ కమిటీ.. ఇక, ఎన్డీఏ భాగస్వామ పక్షంగా ఉన్న జనసేన పార్టీ ఈ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది.. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానానికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు పార్టీ చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నో సానుకూలతలు ఉన్నాయన్న ఆయన.. వేల కోట్ల ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడుతుందన్నారు. భద్రతా బలగాలు దేశ రక్షణపైనే దృష్టి నిలుపుతాయి.. రాజ్యాంగ దినోత్సవం అయిన నవంబర్ 26న ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దేశమంతటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామని, దీనిపై ప్రజలు కూడా చర్చించాలని పేర్కొన్నారు. అప్పటి నుంచి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చిందని గుర్తుచేశారు.

అమలాపురంలో హై టెన్షన్
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు.. పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అమలాపురం మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్ అనే వ్యక్తిని హత్యకు గురయ్యాడు. కొంతమంది ‌గుర్తుతెలియని దుండగులు ఈ హత్య చేశారు. ఈ ఘటనపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మాజీ హోం మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్ళంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. వైసిపి నేత హత్యకు ప్రతిక్రియ చర్యగా దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అమలాపురం ఎర్ర వంతెన వద్ద సప్తగిరి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో గంధం పళ్ళంరాజు.. రియల్ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొంతమంది వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఈ నేపథ్యంలోనే యువకుడిని హత్య చేశారని భావిస్తున్నారు. ఇరు వర్గాలు కొంత మంది రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నారు. వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలోనే ఈ ఘటనలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయన్న ముందస్తు సమాచారం పై పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. డీఐజీ జీవీజీ అశోక్ ఆదేశాల మేరకు.. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.. అమలాపురంలో ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఉభయ గోదావరి జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు.. అయితే, మొత్తంగా తాజా హత్య మరోసారి అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసింది.

సాఫ్ట్‌వేర్ దీప్తి కేసు.. అదుపులో చెల్లి చందన, ఆమె ప్రియుడు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో విసృత్త తనిఖీలు చేశారు పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దీప్తి సోదరి చందనతో పాటు మరో యువకుడి ఆచూకిని కనుగొన్నారు. ఒంగోలు సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులుగా నాలుగు పోలీస్ బృందాలతో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు చందన ఏం చెప్పనుంది. అక్క దీప్తిని తనే హత్య చేసిందా? లేక దీప్తిని చెల్లెలు చందన, ఆమె ప్రియుడు హత్య చేశారా? ప్రియుడి ప్రేమకోసం ఇదంతా చేసిందా? లేదా డబ్బులు, నగల కోసం చేసిందా? చెందన, ప్రియుడు ప్లాన్ ప్రకారమే దీప్తిని మద్యం తాగింది హత్య చేసి నగదుతో పరారయ్యరా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మనీలాండరింగ్‌ కేసు.. జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ అరెస్ట్‌
మనీలాండరింగ్‌ కేసులో మరో వ్యాపారవేత్త అరెస్టు అయ్యారు. బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించకపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు విచారణ జరిపి అనంతరం అరెస్ట్‌ చేశారు. కెనరా బ్యాంకును మోసంచేసిన కేసులో నరేష్‌ గోయల్‌ను ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరుచనున్నారు. కేనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మే 5న ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మానవత్వం మరచిన దంపతులు.. చిన్నారి ఒంటిపై సిగరెట్, హాట్ పాన్ తో వాతలు
ఓ జంట మానవత్వం మరచిపోయింది. ఇంట్లో పనికి చిన్నారిని తెచ్చుకోవడమే నేరం, అలాంటిది వారు ఆమెను చిత్ర హింసలకు కూడా గురిచేశారు. నాగపూర్ లోని నాగ్‌పూర్‌లోని అథర్వ నగరి సొసైటీలో ఈ ఘటన జరిగింది. చిన్నారి ఏ తప్పు చేసిన ఆమెను దారుణంగా హింసించే వారు ఓ జంట. వేడిపాన్, కత్తులు, సిగరెట్లతో కాలుస్తూ హింసించే వారు. దంపతులు బయటకు వెళ్లిన సమయలో చిన్నారిని చుట్టు పక్కల వారు రక్షించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం నాగపూర్ కు చెందిన ఓ జంట బెంగుళూరు నుంచి ఓ 12 ఏళ్ల బాలికను ఇంట్లో పని చేయడం కోసం తెచ్చుకున్నారు. అసలే మైనర్ లను పనిలో పెట్టుకోవడమే నేరమైతే ఈ జంట ఆ చిన్నారిని చిత్రహింసలకు కూడా గురిచేసింది. చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్ష విధిస్తూ ఆ బాలికకు నరకం చూపించింది ఆ కసాయి జంట. ఇక ఆ జంట పని మీద బెంగుళూరు వెళుతూ చిన్నారిని ఇంట్లో పెట్టి వెళ్లింది. నాలుగు రోజులు వారు రాకపోవడంతో ఆ చిన్నారి సాయం కోసం అరిచింది. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆ బాలికను రక్షించారు. ఆమెను ఎన్జీవో సంస్థలకు అప్పగించారు. ఇక ఎన్జీవో ప్రతినిధి మాట్లాడుతూ ఆ దంపతులు చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించేవారని, ఏ చిన్న తప్పు చేసిన వేడి పాన్, వేడి కత్తి, సిగరెట్లతో కాలుస్తూ నరకం చూపించే వారని వెల్లడించారు.అంతే కాకుండా ఆమెకు సరిగా తిండి కూడా పెట్టే వారు కాదని తెలిపారు.  ఆమెను కాపాడిన అనంతరం బాలికను చిత్ర హింసలకు గురిచేసిన దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్జీవో సంస్థ ప్రతినిధులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి  ఆ దంపతులపై మైనర్ ను పనిలో పెట్టుకున్నందకు అలాగే చిత్ర హింసలు పెట్టినందకు కేసు నమోదు చేశారు.

ప్రపంచంలో అన్నింటి కంటే ఆ విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవితంలో ఉన్న అతి పెద్ద బాధాకరమైన విషయం బయటపడింది. మస్క్ జీవితంలోని ప్రతి అంశాన్ని చేర్చి ఆయన బయోగ్రఫీని బుక్ గా రాస్తున్నారు వాల్టర్ ఐసాక్సన్. ఇక ఈ పుస్తకం సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. ఇందులో ఎలాన్ మస్క్ కు సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. ఇక ఈ విషయాలను మస్క్ పుస్తక రచయిత వాల్టర్ ఐసాక్సన్ తో పంచుకున్నారు. ఈ పుస్తకం ద్వారా మస్క్ గురించి మునుపెన్నడు తెలియని కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆయన బయోగ్రఫీలోని కొన్ని కీలక వివరాలు తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో వచ్చాయి. ఇందులో తన కూతురికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మస్క్ పంచుకున్నారు. వీటిని తెలుసుకుంటే ఓ తండ్రిగా మస్క్ ఎంత బాధను అనుభవిస్తున్నారో అర్థం అవుతుంది. మస్క్ లో ఇంత సెన్సిటివ్ కోణం కూడా ఉందా అనిపిస్తోంది.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలకు బ్రేక్ పడింది.. ఈరోజు కూడా భారీగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు కూడా ధరలు దిగి వచ్చాయి.. ఈరోజు తులం పై 24 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా రూ. 110 వరకు తగ్గడం విశేషం. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
* ఢిల్లీలో 22 క్యారెట్స్‌ రూ. 55,200, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,200గా ఉంది.
* ముంబయిలో 22 క్యారెట్స్‌ రూ. 55,050 , 24 క్యారెట్స్‌ రూ. 60,050 వద్ద ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రూ. 55,050, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్స్‌ బంగారం రూ. 55,350, 24 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 60,390గా ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ.బ55,050 కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,050 వద్ద ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,050 గా నమోదు అవుతుంది..

పవర్ స్టార్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..’హరి హర’ వీరమల్లు కొత్త పోస్టర్ ఇదే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా బర్త్ డే సర్ ప్రైజ్ ను ఇస్తున్నారు మేకర్స్.. గత రాత్రి అర్దరాత్రి పవన్ న్యూలుక్ రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసింది చిత్రయూనిట్ హరి హర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ జనాలను మెప్పించింది.. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.. ఆ పోస్టర్ తో పాటుగా ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరితమితమైన కరుణను జరుపుకుంటున్నాము’ అంటూ పోస్టర్ జత చేస్తూ రాసుకొచ్చారు. ఇక కొత్తగా విడుదలైన పోస్టర్ లో పవన్ ఒక యోధుడిగా కనిపిస్తున్నారు. సీరియస్ లుక్ లో పవన్ నడిస్తోన్న పిక్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఈ పోస్టర్ సినిమాలోని కీలకమైన ఫైట్ సీన్ అని తెలుస్తుంది.. ఆ సీన్ లో పవన్ చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు.. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ చిత్రంలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది..బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు రూ.150 కోట్లతో నిర్మిస్తోన్న ఈ మూవీలో నర్గిస్ ఫక్రి, పూజిత పొన్నాడ, విక్రమజీత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.. పవన్ సినీ కేరీర్ లోనే ఈ సినిమా హై బడ్జెట్ సినిమా అనే చెప్పాలి.. దాంతో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్..

Exit mobile version