NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. అజెండా ఇదే..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేబినెట్‌ సమావేశం జరగనుండగా.. లక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా రేపటి (గురువారం) నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేబినెట్‌ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్హణతో పాటు సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై చర్చించనున్నారని తెలుస్తోది.. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెటనున్న బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని నెలకొన్న తాజా రాజకీయ పరిణాలతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌.. మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం.. ఇదే సమయంలో.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడం.. చంద్రబాబుపై వరుసగా కేసులు.. ఇలా అనేక విషయాలపై కూడా ఏపీ కేబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో చిరుతల సంచారంతో భక్తులు భయాందోళనతో వణికిపోతూనే ఉన్నారు. అయితే, శేషాచలం కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్‌ చిరుత’ సక్సెస్‌ అవుతుందనే చెప్పాలి.. వరుసగా చిరుతలు అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుతున్నాయి.. నడక మార్గంలో జరిగిన దుర్ఘటనలతో అలర్ట్‌ అయిన టీటీడీ.. ఫారెస్ట్‌ అధికారులతో కలిసి ఆపరేషన్‌ చిరుత చేపట్టారు.. చిరుత, ఇతర అడవి జంతువుల కదలికలను గుర్తించడానికి నడకమార్గంలో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.. చిరుత కదలికలను గుర్తించి బోన్‌లు ఏర్పాటు చేస్తూ వస్తుండగా.. వరుసగా చిరుతలను చిక్కుతున్నాయి.. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించిన ఫారెస్ట్‌ అధికారులు. ఈ రోజు మరో చిరుత బోనులో చిక్కింది.. దీంతో.. ఇప్పటి వరకు ఫారెస్ట్‌ అధికారులకు చిక్కిన చిరుతల సంఖ్య ఆరుకు చేరింది.. చిన్నారి లక్షితలపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే ఆరో చిరుతను ట్రాప్ చేశారు అటవీ శాఖ అధికారులు.

వినాయక విగ్రహం విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు
దేశవ్యాప్తంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజలు.. కుల, మతాలకు అతీతంగా గణేష్‌ ఉత్సవాలు జరుగుతున్నాయి.. అయితే, కొన్ని ప్రాంతాల్లో అపశృతిలు చోటు చేసుకున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో వినాయక విగ్రహం విషయంలో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం ఒకరి మృతికి కారణమ్తెయింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం దొరగిల్లులో చోటు చేసుకుంది. గ్రామంలోని బీసీ క్వాటర్స్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం విషయంలో యువకులు గొడవపడ్డారు. ఈ గొడవ కాస్తా గ్రామంలోని వారు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది.. ఈ దాడిలో అనంతయ్య అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు కావడంతో.. అక్కడికక్కడే మృతిచెందినట్టుగా స్థానికులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మరో 10 మంది గ్రామస్థులు తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చేసుకున్న పోలీసులు.. అనంతయ్య మృతదేహన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఘర్షణ, హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

అటు హైకోర్టు.. ఇటు ఏసీబీ కోర్టు.. చంద్రబాబు పిటిషన్లపై విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్లపై హైకోర్టుతో పాటు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ రోజు విచారణ జరగనుంది.. నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ సాగనుంది.. అంగళ్లులో దాడి ఘటనలో ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ1 గా ఉండగా.. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది.. మరోవైపు.. చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.. కస్టడీ పిటిషన్ పై నేడు కౌంటర్ దాఖలుచేయనున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. ఇక, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ లపై నేడు కౌంటర్ వేయనుంది సీఐడీ.. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ 11వ రోజుకు చేరుకుంది.. ఇక, తొమ్మిది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు చంద్రబాబు.. ఇవాళ ములాఖత్‌లో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును కలవనుంది టీడీపీ లీగల్‌ సెల్.. సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసేందుకు వెళ్లనున్నారు ఆయన తరుపున న్యాయవాదులు.. మరోవైపు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు, రింగ్‌రోడ్డు కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం విదితమే.. టెరాసాఫ్ట్‌ కంపెనీకి ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్ట్‌ కేటాయింపులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ పిటీ వారెంట్‌ జారీ చేసింది. ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇదిలా ఉండగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుపై దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నిన్న వాదనలు ముగియగా.. తీర్పును హైకోర్టు రిజర్వు చేసిన విషయం విదితమే.

విద్యార్ధులకి తాజా వార్త.. 2024 CUET UG ,PG పరీక్ష తేదీలు విడుదల
యూనివర్సిటీలో యూజీ మరియు పీజీ చదవాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. ఎందుకంటే యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడం అంత సులువు కాదు. కానీ అవకాసం అందిపుచ్చుకుంటే మాత్రం అక్కడ విద్యావిధానం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. అందుకే విద్యార్థులు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అలా యూనివర్సిటీలో యూజీ మరియు పీజీ చదవాలని ఎదురు చూస్తున్న విద్యార్ధులకి శుభవార్త. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2024 లో జరగనున్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్(CUET ) UG మరియు PG పరీక్షల తేదీలను ప్రకటించింది. సెషన్ 2024లో జరగనున్న UG పరీక్షలు మే 15 నుండి ప్రారంభం కానున్నాయి. కాగా PG పరీక్షలు మార్చి 11 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ( CBT ) విధానంలో నిర్వహించబడతాయి. విడుదలైన నోటీసు ప్రకారం.. CUET UG పరీక్ష 2024వ సంవత్సరం మే 15వ తేదినుండి నుండి 2024 మే 31వ తేదీవరకు వరకు నిర్వహించబడుతుంది. CUET PG పరీక్షలు 2024 మార్చి 11 నుండి మార్చి 28 వరకు నిర్వహించబడుతుంది.. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ “nta.ac.in”ని సందర్సించ వచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా నిర్వహించ బడుతున్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్(CUET ) అనేది జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. యూజీ, పీజీ కోర్సులు యూనివర్సిటీ లో చదవాలనుకున్న వాళ్ళకి ఈ పరీక్షల ద్వారా అవకాశం లభిస్తుంది. ఈ పరీక్షలలో ఉతీర్ణత సాధించిన విద్యార్ధులకి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీల్లో యూజీ, పీజీ కోర్సులు చదివేందుకు ప్రవేశం లభిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రెండు పరీక్షల కోసం లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకుంటారు.

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.. ఇడ్లీలు అమ్ముకుంటున్న చంద్రయాన్ -3 టెక్నీషియన్
భారతదేశ చరిత్రలో 23 ఆగస్టు 2023 తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. రాబోయే తరాలు ఈ తేదీని భారతదేశం శక్తిని గుర్తుంచుకుంటారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు చప్పట్లు కొట్టి భారత్ ను ప్రశంసించారు. ఈ రోజున భారతదేశం చంద్రుని దక్షిణ ధృవం (చంద్రయాన్-3)పై దిగాలనే తన సంవత్సరాల నాటి కలను సాకారం చేసుకుంది. హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HEC)కి చెందిన కొంతమంది సాంకేతిక నిపుణులతో సహా చాలా మంది ఈ కలను నిజం చేసుకోవడానికి తమ జీవితాలను అంకితం చేశారు. వారిలో ఒకడు దీపక్ కుమార్ ఉప్రారియా. హెచ్ఈసీ సాంకేతిక నిపుణుడు. అతను ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించడానికి ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. అతను జార్ఖండ్‌లోని రాంచీలోని ధూర్వా ప్రాంతంలో ఇడ్లీ దుకాణాన్ని ప్రారంభించాడు. చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్‌ను తయారు చేయడంలో దీపక్ సహకరించారు. అతడికి 18 నెలలుగా తన జీతం అందలేదు. అందుకే కుటుంబ పోషణ కోసం ఓ పక్క ఇడ్లీల వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఈ వ్యాపారంతో పాటు ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీపక్ ఉదయం ఇడ్లీలు అమ్మి మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్తాడు. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక మళ్లీ ఇడ్లీలు అమ్మడం మొదలుపెడతాడు. అంతకుముందు అతను క్రెడిట్ కార్డుతో తన ఇంటిని నడిపించాడని చెప్పాడు. ఆ తర్వాత రూ.2 లక్షల రుణం పొంది డిఫాల్టర్‌గా ప్రకటించారు. దీని తర్వాత దీపక్ తన ఇంటి నిర్వహణ కోసం కొంతమంది బంధువుల వద్ద అప్పులు చేశాడు. ఇప్పటి వరకు ఇతరుల నుంచి రూ.4 లక్షల రుణం తీసుకున్నట్లు తెలిపారు. చాలా మంది వద్ద అప్పు చేసి తిరిగి చెల్లించలేక పోవడంతో ప్రజలు కూడా ఆయనకు అప్పు ఇవ్వడం మానేశారు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమించడం ప్రారంభించింది. కుటుంబ ప్రయోజనాల కోసం అతని భార్య తన ఆభరణాలను తనఖా పెట్టే స్థాయికి చేరుకుంది.

భారత్ పై కెనడా ఆరోపణలు.. స్పందించిన బ్రిటన్, ఆస్ట్రేలియా
కెనడా ప్రభుత్వం, భారత్ ల మధ్య  ప్రస్తుతం ఖలిస్తానీ చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. జీ20 సమావేశాలకు హాజరైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ఈ విషయం గురించి చర్చించిన కొద్ది రోజులకే ఈ రగడ మరింతగా ముదిరిపోయింది. కెనడా ప్రధాని ఖలిస్తానీ ఉగ్రవాదిని చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద నమ్మదగిన సాక్ష్యాలు ఉన్నాయని ప్రకటించినప్పటి నుంచి ఈ వివాదం మరింత రాజుకుంటుంది. అయితే ఈ వ్యాఖ్యలను ఇప్పటికే భారత్ ఖండించింది. ఈ చర్యల్లో భాగంగా భారతదౌత్య వేత్తను కెనడా బహిష్కరించగా, ఆ దేశ అధికారిని కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ హుకుం జారీ చేసింది. ఇక కెనడా వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ఈ ఆరోపణలపై స్పందించింది. దీనిపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై అటు ఆస్ట్రేలియా, ఇటు బ్రిటన్ కూడా స్పందించాయి. ఇక భారత్ పై కెనడా చేసిన ఆరోపణలపై బ్రిటన్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కెనడా భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నాం.  అధికారులు ఈ విషయంపై  దర్యాప్తు చేస్తున్నందున దీనిపై వ్యాఖ్యానించడం సరికాదు పేర్కొన్నారు. ఇక దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా ఈ ఆరోపణలు ఎంతో ఆందోళన కలిగించాయని పేర్కొంది. దీనిపై కొనసాగుతున్న దర్యాప్తు గురించి తెలుసుకున్నామని తెలిపిన ఆస్ట్రేలియా ఈ పరిణామాలపై మిత్రదేశాలతో సంప్రదింపులు చేస్తున్నాం అని వెల్లడించింది. తమ ఆందోళనను భారత్ సీనియర్ అధికారులకు తెలియజేసినట్లు పేర్కొంది.

అహ్మదాబాద్‎లో ఈడీ దాడులు.. రూ.1.36 కోట్ల నగదు, 1.2 కేజీల బంగారం, లగ్జరీ కార్లు స్వాధీనం
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అహ్మదాబాద్‌లోని ఫారెక్స్ వ్యాపారి ఆవరణలో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. అక్రమ విదేశీ మారకద్రవ్య వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులో రూ.3.10 కోట్ల విలువైన నగదు, ఇతర ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, 2002 (పిఎమ్‌ఎల్‌ఎ) నిబంధనల ప్రకారం టిపి గ్లోబల్ ఎఫ్‌ఎక్స్‌తో అనుబంధించబడిన ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు ఈడి ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో రూ.1.36 కోట్ల నగదు, రూ.71 లక్షల విలువైన బంగారం, రూ.89 లక్షల విలువైన రెండు లగ్జరీ కార్లు, బ్యాంకు ఖాతాలో రూ.14.72 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. విదేశీ మారకపు వ్యాపారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుండి అనుమతి పొందనప్పటికీ, సంస్థకు సంబంధించిన ప్రదేశాలలో సోదాల సందర్భంగా నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక దర్యాప్తు సంస్థ తెలిపింది. హిందుస్థాన్ ఇన్‌ఫ్రాకాన్ ఇండియాకు చెందిన రూ.71.48 కోట్ల విలువైన స్థిరాస్తులను మోసం కేసులో ఈడి తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటిలో మైసూర్, కర్ణాటక, బెంగళూరులో ఉన్న వ్యవసాయేతర భూమి, నివాస ఆస్తులు ఉన్నాయి. 71.48 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం ఈ చర్య తీసుకోబడింది. ఇది కాకుండా మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం సురేష్ జగుభాయ్ పటేల్, ఇతరుల కేసులో రూ.3.89 కోట్ల విలువైన 23 స్థిరాస్తులను అటాచ్ చేశారు. ఇది సురేష్ పటేల్ భార్య ప్రీతీబెన్ సురేష్ పటేల్‌కు చెందినది. హత్యలు, దోపిడీలు, అవినీతి తదితర నేర కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఈ ఆస్తులను సంపాదించారు. సురేష్ పటేల్ అలియాస్ సుఖా మరియు అతని సహచరులపై డామన్ పోలీసులు, గుజరాత్ పోలీసులు, ముంబై పోలీసులు వివిధ అవినీతి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, హత్య, దోపిడీ మొదలైన నేరాల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

రెండోసారి పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ.. పెళ్లి కూతురు ఎవరంటే?
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం (సెప్టెంబర్ 19) రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న కరాచీలో షాహీన్ మరియు అన్షాలు వివాహం చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే. షాహీన్ షా అఫ్రిదీ, అన్షా అఫ్రిదీల వివాహా కార్యక్రమానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మొహ్మద్ రిజ్వాన్ హాజరయ్యారు. వీరితో పాటు మరికొందరు క్రీడాకారులు కూడా హాజరయ్యారు. స్పీడ్‌స్టర్‌ అఫ్రిదీని బాబర్ ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఆసియా కప్ 2023లో పాక్ సూపర్-4 నుంచి నిష్క్రమించిన అనంతరం బాబర్, అఫ్రిదీ మధ్య పెద్ద గొడవ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో అఫ్రిదీని బాబర్ ఆలింగనం చేసుకొవడంతో అంతా సెట్ అయినట్టే అనిపిస్తోంది.

ఫలించిన 12 ఏళ్ల నిరీక్షణ.. 9 కిలోల ఉల్లిగడ్డ పండించి రికార్డు
ఉల్లిపాయలు ఇవి లేకపోతే మనం చాలా వంటకాలు చేయలేము. మనం నిత్యం ఆహారపదార్థాల్లో ఉపయోగించే వాటిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పానీపూరి దగ్గర నుంచి చాలా మందికి ఇష్టమైన మసాలా కూరల వరకు ప్రతి దాంట్లో మనకు ఈ ఉల్లిగడ్డలు ఉండాల్సిందే. అయితే సాధారాణంగా ఉల్లిపాయ ఎంత బరువు ఉంటుంది. 100 గ్రా నుంచి మహా అయితే 200 గ్రాములు ఇంకా కావాలంటే ఒక అరకేజీ ఉండోచ్చు. అరకేజీ అంటేనే అమ్మో అనిపిస్తుంది కదా. అలాంటిది ఓ రైతు ఏకంగా 9 కేజీల బరువు ఉన్న ఉల్లిగడ్డను పండించి ఏకంగా రికార్డు క్రియేట్ చేశాడు. యూనిటైడ్ కింగ్ డమ్ లోని  గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ (65) ఎన్నో ఏళ్లుగా పంటలు పండిస్తున్నాడు. అయితే అతడు ఓ భారీ ఉల్లిగడ్డను పండించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయాలని తపనపడేవాడు. అయితే 12 ఏళ్లు కష్టపడి ఎట్టకేలకు ఇటీవల ఓ భారీ ఉల్లిపాయను పండించాడు. దాని బరువు దాదాపు 8.9 కిలోలు. ఇక దాని పొడవు విషయానికి వస్తే 21 అంగుళాలు ఉంటుంది. దీనిని ఆయన ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో ప్రదర్శించారు. అయితే ఇది ప్రపంచ రికార్డు అని  ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా దీనిని గుర్తించలేదు. అయితే దీనిని తయారుచేయడానికి చాలా కష్టపడ్డానని చెబుతున్నారు గారెత్ గ్రిఫిన్.  తన తండ్రి కూడా పెద్ద సైజు ఉల్లిగడ్డలను సాగు చేసేవారని చెబుతున్న గారెత్ తాను కూడా ఓ పెద్ద ఉల్లిగడ్డను సాగుచేసి రికార్డు క్రియేట్ చేయాలని తపన పడ్డానని చెబుతున్నారు. ఇంతపెద్ద ఉల్లిగడ్డను పండించడానికి అదనపు లైటింగ్, ఆటోమేటిక్ ఇరిగేషన్ వంటి ప్రత్యేక చర్యలు అవసరమని వివరిస్తున్నారు.  సరైన విత్తనాలు, సరైన సాగు విధానాలతోనే ఇలాంటివి సాధ్యమని పేర్కొంటున్నారు గారెత్. ఈ భారీ సైజ్ ఉల్లిగడ్డలతో వంట కూడా చేసుకోవచ్చని అయితే సాధారణ ఉల్లిపాయల కంటే వీటి రుచి కొంచెం తక్కువగా ఉంటుందని గారెత్ పేర్కొ్ంటున్నారు. దీనిని చూసిన యూజర్లు సైతం వావ్, ఇది నిజంగా అద్భుతం అంటూ స్పందిస్తున్నారు.

హౌస్ లో రెచ్చిపోతున్న రతిక.. ప్రశాంత్ అంటే అంత ప్రేమా?
బిగ్ బాస్ సీజన్ తెలుగు 7 ఇప్పుడు మూడోవారం నామినేషన్స్ కోసం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది.. గతంలో కన్నా ఈ సారి లవ్ స్టోరీలు ఎక్కువ అయ్యాయి..ప్రస్తుతం పవర్ అస్త్రాలు వేట సాగుతోంది. ఈ వారం మూడవ పవర్ అస్త్ర టాస్క్ లు జరగబోతున్నాయి.. మంగళవారం రోజు మూడవ పవర్ అస్త్రకి సంబంధించిన అంశంలో కీలక ప్రక్రియ మొదలయింది. బిగ్ బాస్ కంటెండర్స్ ని ఎంపిక చేశారు. శివాజీ, రతిక గుసగుసల తో నేటి ఎపిసోడ్ మొదలైంది. అంతా నాగురించే చెడుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నా ఎక్స్ గురించి అంటూ రతిక శివాజీ వద్ద వాపోయింది. అలా మాట్లాడే వారిని ఏం పీక్కుంటారో పీక్కోమను. మనం వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదు. స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ శివాజీ రతికకి సలహా ఇచ్చారు.. అనంతరం హౌస్ లో వినాయక చవితి సెలెబ్రేషన్స్ జరిగాయి.. పూజ తర్వాత మూడవ పవర్ అస్త్ర కంటెండర్స్ గా అర్హత సాధించిన వారి పేర్లని ప్రకటించారు. తన పరిశీలన ద్వారా ఇన్ని రోజుల ఆట ద్వారా కంటెండర్స్ ని ఎంపిక చేసినట్లు బిగ్ బాస్ తెలిపారు. అమర్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ మూడవ పవర్ అస్త్ర కంటెండర్స్ గా నిలిచినట్లు ప్రకటించారు. తనకి కంటెండర్ గా అవకాశం రాకపోవడంతో ప్రశాంత్ కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడు. బిగ్ బాస్ గెలుస్తానని నమ్మకం పోయినట్లు బిగ్ బాస్ ముందు వాపోయాడు.. ఆ తర్వాత ప్రశాంత్ ను పిలిచి ముగ్గురిలో కంటెండర్ గా అర్హత లేనిది ఎవరికి అని నీవు భావిస్తున్నావు అని ప్రశ్నించాడు. దీనితో ప్రశాంత్ శోభా శెట్టి పేరు చెప్పాడు. ప్రియాంక.. అమర్ డీప్ పేరు చెప్పింది. తేజ, దామిని, రతిక.. యావర్ కి కంటెండర్ గా అర్హత లేదని తమ అభిప్రాయాన్ని తెలిపారు.. ఆ తర్వాత చిన్న విషయంలో రతిక, ప్రశాంత్ మధ్య వచ్చిన గొడవ హౌస్ లో ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇద్దరూ కాసేపు తిట్ల పురాణం అందుకుని ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చూస్తుంటే వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండేలా లేరు అనిపిస్తోంది.. ఈ గొడవ కూడా చూపరులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి..