సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ కలకలం.. బాలయ్య అభిమానుల అరెస్ట్..
నంద్యాలలో జరిగిన ఓ ఘటనకు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ కలకలం సృష్టించింది.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం పేరిట సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ పెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఛలో రాజమహేంద్రవరం నిర్వహించి చంద్రబాబును నిర్బంధించిన జైలు వద్ద ధర్నా నిర్వహించాలని, రాస్తారోకో చేయాలని ఫేక్ పోస్టింగ్ లో పిలుపునిచ్చారు. అది చూసిన పోలీసులు.. మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ సహా ఆరుగురు బాలయ్య అభిమానులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. బుధవారం రోజు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.. అయితే, సోషల్ మీడియాలో వచ్చింది ఫేక్ పోస్టింగ్ అని ఇంటెలిజెన్స్ సిబ్బంది నిర్ధారించారు.. ఆ తర్వాత అదుపులో ఉన్నవారిని అర్ధరాత్రి వదిలిపెట్టారు పోలీసులు.
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నేటితో ముగినుంది.. స్కిల్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్ట్ అయ్యారు చంద్రబాబు.. నేటికి ఆయన రిమాండ్ 26వ రోజుకు చేరింది.. అయితే.. చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై నేడు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వనుంది.. వర్చువల్ విధానంలో చంద్రబాబుని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. మరోవైపు.. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ నేడు మెమో ఫైల్ చేసేందుకు సీఐడీ సిద్ధమైంది.. దీంతో, ఏసీబీ కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఇక, స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ల మీద కూడా నేడు ఏసీబీ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు.. ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.. దీంతో.. చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట లభిస్తుందా? అనేది ఉత్కంగా మారింది.
నేడు తెలంగాణ విజయ ఫెడరేషన్ మెగా డెయిరీ ప్రారంభం
రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. మహేశ్వరం మండలం రావిర్యాలలో రూ.250 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా డెయిరీని నిర్మించారు. దీని నిర్వహణకు ప్రత్యేకంగా సోలార్ సిస్టమ్‌తో పాటు వ్యర్థాల వినియోగం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం ఈ మెగా డెయిరీని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ సహకారంతో దేశంలోనే అత్యాధునిక, పూర్తి ఆటోమేటిక్ మిషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించబడింది. ఈ డెయిరీకి రోజుకు 5 లక్షల నుంచి 8లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది.
నల్ల ద్రాక్షాల వల్ల ఎన్నో ప్రయోజనాలు… ఇలా తీసుకుంటే ఆ సమస్యలు మాయం..
నల్ల ఎండు ద్రాక్షాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు.. నల్ల ఎండుద్రాక్ష శరీరంలో రక్త లోపాన్ని తగ్గించడమే కాకుండా, మీ జుట్టుకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ ద్రాక్షాలలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి..ఫైబర్, ప్రోటీన్, చక్కెర, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు మరియు ఐరన్ ఉన్నాయి. ఇది రక్తపోటు, గుండె, కడుపు, ఎముకలు, చర్మం, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.. నల్ల ఎండుద్రాక్షలో లుటిన్ మరియు జియాక్సంతిన్ ఉన్నాయి, ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది కంటి చూపును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదనంగా రెటీనాకు ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తుంది. తద్వారా అకాల అంధత్వాన్ని నివారిస్తుంది.. నల్ల ఎండుద్రాక్షలో ఐరన్ మరియు ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. దీని కోసం ఒక గిన్నె నీటిలో 10 నల్ల ఎండుద్రాక్షలను నానబెట్టి, దానికి కొద్దిగా నిమ్మరసం కలపాలి.. నానబెట్టిన ఎండుద్రాక్షను దవడకేసి నమలాలి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే త్వరగా రక్తాన్ని పెరిగేలా చేస్తుంది..
నేటి నుంచే వన్డే ప్రపంచకప్.. తొలి పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ!
ఐసీసీ ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలు కాబోతోంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ టీమ్స్ ప్రపంచకప్ ఫేవరెట్ల జాబితాలో ఉన్నాయి. దూకుడుకు మారుపేరైన ఇంగ్లీష్ జట్టు మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై భారీ అంచనాలతో దిగుతున్న భారత్‌కు ప్రధాన ముప్పుగా ఇంగ్లండ్‌ను భావిస్తున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ కూడా గట్టి పోటీదారులే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచకప్ 2023 ముంగిట ఈ రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను ఇంగ్లీష్ జట్టు 3-1తో గెలిచినా.. మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. దాంతో మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. టామ్ లాతమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, రచిన్ రవీంద్ర, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి లాంటి ఉత్తమ ఆటగాళ్లతో కివీస్ బలంగా ఉంది. అయితే కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ దూరమవడం కాస్త నిరాశపరిచే అంశం.
రిలయన్స్ ఈవీ బ్యాటరీ వచ్చేసింది.. ఇంటి ఫ్యాన్లు, కూలర్లు కూడా రన్ అవుతాయి
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ క్రమంగా చమురు వ్యాపారాన్ని దాటి కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు భవిష్యత్ ఇంధన విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం ఈ వ్యాపారంలో భారీ ప్రవేశం చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కోసం దాని బ్యాటరీలను పరిచయం చేసింది. అన్నింటికంటే, ఈ బ్యాటరీల ప్రత్యేకత ఏమిటి… రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్ ఇంధన విభాగంలో పెట్టుబడులను పెంచింది. బ్యాటరీలు, సోలార్ సెల్ పరికరాలను తయారు చేయడానికి కంపెనీ గుజరాత్‌లో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త వ్యాపారానికి వారసుడు తన చిన్న కొడుకు అనంత్ అంబానీ అని కూడా ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశపెట్టిన బ్యాటరీలు మార్చుకోగలిగినవి.. అంటే ఈ బ్యాటరీలను ఒక వాహనం నుండి మరొక వాహనానికి ఇన్‌స్టాల్ చేయవచ్చు. వాటిని వాహనం నుంచి దించి ఇంట్లోనే చార్జింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ బ్యాటరీలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ తన స్వంత బ్యాటరీ మార్పిడి స్టేషన్లను కూడా తయారు చేయబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా సోలార్ సెల్స్ విక్రయించాలని యోచిస్తోంది. అందుకే తన బ్యాటరీని రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ నుంచి కూడా ఛార్జ్ చేసే విధంగా డిజైన్ చేశాడు. అయితే, మార్కెట్లో బ్యాటరీలు, రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.