Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 3,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది.. ఇప్పటికే వివిధ శాఖల్లో వరుసగా ఉద్యోగాలు భర్తీ చేస్తూ వస్తుండగా.. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి పూనుకుంది.. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీల్లో 3,220 పోస్టులు భర్తీ చేయనున్నారు.. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.. అయితే, రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 17 ఏళ్ల తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుండడం విశేషంగా చెప్పుకొవాలి.. 3,220 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అందులో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.. నేటి నుంచి ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పోర్టల్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి గరిష్టంగా 10 మార్కుల వెయిటేజ్ ఇవ్వనుంది ఉన్నత విద్యామండలి.

విశాఖ నుంచి పాలన దిశగా వేగంగా అడుగులు.. నేడు సీఎం జగన్‌కు నివేదిక
విశాఖపట్నం నుంచి పాలన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. దీనికి సంబంధించి విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది.. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆ నివేదిక సమర్పించనుంది కమిటీ.. విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ పరిశీలనకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం న నియమించిన విషయం విదితమే కాగా.. విశాఖలో పర్యటించిన త్రిసభ్య కమిటీ.. తాత్కాలిక కార్యాలయాల కోసం అనువైన భవనాలను పరిశీలించింది.. దీనిపై నివేదిక సిద్ధం చేసింది.. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి నివేదిక సమర్పించనుంది ఆ కమిటీ.. కాగా, విశాఖ నుంచి పాలన సాగించేందుకు సిద్ధమైన వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీనియర్‌ కార్యకర్తలకు వసతి సహా విశాఖపట్నంలో అనువైన రవాణా వసతిని గుర్తించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ (MA & UD డిపార్ట్‌మెంట్), స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్) మరియు సెక్రటరీ (సర్వీసెస్ & హెచ్‌ఆర్‌ఎం), జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, కార్యాలయాలకు అనువైన రవాణా వసతిని గుర్తించి, నివేదికను సిద్ధం చేసింది.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామంటూ.. తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతూ వస్తున్నారు.. మంత్రులు కూడా ఇదే మాట పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. కానీ, అది కాస్త ఆలస్యం అవుతూ రాగా.. ఇప్పుడు నివేదిక పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. కాగా, వైఎస్‌ జగన్‌ సర్కా్ర్‌ విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా నిర్ణయించిన విషయం విదితమే.

శ్రీశైలంలో 14 నుండి కార్తీక మాసోత్సవాలు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం కార్తీక మాసోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు.. కార్తీకమాసం నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు అధికార, అర్చకులతో సోమవారం రోజు సన్నాహక సమావేశం నిర్వహించారు.. కార్తీక మాసంలో సర్వ సాధారణంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ ఉంటుంది.. ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న దర్శానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా తరలివస్తుంటారు.. దీంతో.. భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు.. శని, ఆది, సోమ వారాల్లో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన రద్దు చేయనున్నారు.. సాధారణలో రోజులలో కూడా సామూహిక, గర్భాలయ అభిషేకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు దేవస్థానం అధికారులు.. ఇక, కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేయనున్నారు.. 27వ తేదీన కార్తీక పౌర్ణమి అయిన 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహించాలని నిర్ణయించింది శ్రీశైలం దేవస్థానం పాలకమండలి.

నవంబర్‌ 3 నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ.. పోలీసులు ప్రత్యేక దృష్టి
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నామినేషన్ కేంద్రాల చుట్టూ నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీపీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి నామినేషన్‌ కేంద్రం వద్ద నాలుగు అంచెల బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు, వారి అనుచరులు అధిక సంఖ్యలో నామినేషన్‌ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్‌ పోలీసు అధికారులకు సూచించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఆర్‌ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో భాగంగా ఓటర్లను మోసగించే డబ్బు, మద్యం, ఇతర వస్తువుల రవాణాను నిరోధించే విధంగా వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయం తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. సైబరాబాద్ అడిషనల్ సీపీ అవినాష్ మహంతి, జాయింట్ సీపీ (ట్రాఫిక్) కె.నారాయణ్ నాయక్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, మాదాపూర్ డీసీపీ సందీప్, రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎలక్షన్ సెల్ డీసీపీ అశోక్ కుమార్ తో పాటు ఏసీపీలు ఉన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. నేడు దుబ్బాక బంద్..
సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు పిలుపునిచ్చారు. హత్యాయత్నానికి పాల్పడిన రాజకీయ నాయకులపై, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు. దుబ్బాక, దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, తొగుట, చేగుంట, నార్సింగి, అక్బర్‌పేట-భూంపల్లి మండలాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. దుబ్బాకలో రఘునందన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హత్యాయత్నానికి నిరసనగా బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం దుబ్బాక నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. మండల కేంద్రాలు, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నాయకులు పిలుపునిచ్చారు. కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ ఎస్ నాయకులు ఆస్పత్రికి తరలివచ్చారు. బీజేపీ, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా దవాఖాన ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీజేపీ డౌన్ డౌన్.. ఎమ్మెల్యే రఘునందన్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి
తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం పూట ఎండలు, రాత్రిపూట ఎముకలు కొరికే చలితో రాష్ట్ర ప్రజలు రెండు రకాల వాతావరణాన్ని చూస్తున్నారు. అయితే మిగిలిన వరుణుడు కూడా ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉందని, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణలో పగటిపూట ఎండలు మండిపోతుండగా, రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్..
అక్టోబర్ నెల ఈరోజుతో ముగియనుంది.. రేపటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. కొత్త నెల ప్రారంభంతో అనేక ఆర్థిక మార్పులు జరగబోతున్నాయి. ఇది సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.. చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలను నిర్ణయిస్తాయి. ఈ పండుగ సీజన్‌లో సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపే మార్పులు ఏమిటో తెలుసుకుందాం.. ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్‌పిజి, పిఎన్‌జి, సిఎన్‌జి ధరలను ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పండుగల ముందు ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇస్తుందో లేక ధరలు నిలకడగా ఉంచుతుందో చూడాలి.. ఎల్‌ఐసీ పాలసీలు ఏవైనా ల్యాప్‌ అయ్యి, దాన్ని రీస్టార్ట్ చేయాలనుకుంటే మీకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. ఆగి ఉన్న పాలసీని పునరుద్ధరించేందుకు ఎల్ఐసీ ప్రత్యేక ప్రచారాన్ని (ఎల్ఐసీ పాలసీ రివైవల్ క్యాంపెయిన్) ప్రారంభించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఈ ప్రత్యేక ప్రచారంలో రూ. 1 లక్ష ప్రీమియంపై ఆలస్య రుసుములో 30 శాతం తగ్గింపు అంటే గరిష్టంగా రూ. 3,000 ఇవ్వబడుతుంది. 1 లక్ష నుండి 3 లక్షల మధ్య, 30% తగ్గింపు లభిస్తుంది. అంటే గరిష్టంగా రూ. 3500, 3 లక్షల కంటే ఎక్కువ, 30% తగ్గింపు అంటే రూ. 4000 వరకు బెనిఫిట్‌ పొందవచ్చు.దానికి చివరి అవకాశం ఈరోజే.. ఈ పని త్వరగా పూర్తి చెయ్యండి..

ప్రపంచకప్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’ రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఏ కెప్టెన్ సాధించలేదు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన విషయం తెలిసిందే. కీలక సమయంలో 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 87 రన్స్ చేశాడు. దాంతో రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. 36 ఏళ్ల వయసులో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచకప్‌ 2023లో రోహిత్‌కు ఇది రెండో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’. దాంతో ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

లియోనల్‌ మెస్సీకి మరోసారి ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు.. ఏకంగా ఎనిమిదోసారి!
ఫుట్‌బాల్‌ స్టార్ అటగాడు, అర్జెంటీనా ప్లేయర్‌ లియోనల్‌ మెస్సీని మరోసారి ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు వరించింది. 2022-23గాను ఉత్తమ ప్రదర్శన చేసినందుకు మెస్సీకి ఈ అవార్డు దక్కింది. గతేడాది నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటు ఖతర్‌ వేదికగా జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించినందుకు ఈ అవార్డు దక్కింది. సోమవారం పారిస్‌లోని థియేటర్ డు చాట్‌లెట్‌లో బాలన్‌ డి ఓర్‌ అవార్డును మెస్సీ అందుకున్నాడు. అత్యధిక సార్లు బాలన్‌ డి ఓర్‌ అవార్డు అందుకున్న ఆటగాడిగా లియోనల్‌ మెస్సీ రికార్డు సృష్టించాడు. మెస్సీ 8వ సారి ఈ అవార్డు అందుకున్నాడు. 36 ఏళ్ల మెస్సీ ఎనిమిదవ బాలన్ డి’ఓర్ అవార్డును కైవసం చేసుకోవడంతో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అతడు మరోసారి నిరూపించాడు. ఇంటర్ మయామి స్టార్ పురుషుల 30 మంది అభ్యర్థుల జాబితాలో ఎర్లింగ్ హాలాండ్‌ను ఓడించి మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇంటర్ మియామీ సహ యజమాని డేవిడ్ బెక్‌హామ్ చేతుల మీదుగా లియోనల్‌ మెస్సీ ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు అందుకున్నాడు. మెస్సీ థియేటర్ డు చాట్‌లెట్‌ వేదికపై మాట్లాడుతూ.. ఈ అవార్డు అర్జెంటీనా జట్టు మొత్తానికి ఓ బహుమతి అని పేర్కొన్నాడు. ఇక దివంగత అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు డిగో మారడోనాకు ఈ ట్రోఫీని అంకితమిస్తున్నట్లు మెస్సీ తెలిపాడు.

Exit mobile version