Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.. విశాఖతో పాటు అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఐదు గంటల పాటు జరిగే ఈ టూర్‌లో ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి.. ఋషికొండ ఐటీ సెజ్ లో ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ ను ప్రారంభించనున్న సీఎం.. కాగా, రూ. 35 కోట్ల పెట్టుబడితో వెయ్యిమంది ఉద్యోగులతో సాప్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది ఇన్ఫోసిస్. ప్రారంభోత్సవం అనంతరం ఉద్యోగులు, ఇన్ఫోసిస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం జగన్.. ఇక, బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ కొనుగోలు చేసిన ఆరు యంత్రాలును సీఎం ప్రారంభించనున్నారు.. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం అనకాపల్లి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ప్రారంభం కానుంది.. పరవాడ ఫార్మాసిటీలో ఫార్మా, యూజియా స్టెరిల్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్ యూనిట్, లారస్‌ సింథసిస్‌ ల్యాబ్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.. పార్టీ స్థానిక నాయకత్వంతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత.. ఇక, అచ్యుతాపురం ఏపీసెజ్‌లో లారస్‌ ల్యాబ్స్‌ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ను ప్రారంభిస్తారు.. పరవాడ, అచ్యుతాపురంలో స్థానిక నాయకత్వంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. మొత్తంగా ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన కోసం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.

శ్రీ గాయత్రి దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలు తరలివస్తున్నారు.. ఇక, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకోగా.. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.. పంచముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.. దీంతో.. గాయత్రి దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు.. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు.. గాయత్రీ దేవి ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని భక్తుల విశ్వాసం.. ఇక, శ్రీశైలంలో 2వ రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. సాయంత్రం బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనం ఇవ్వనున్నారు.. మయూరవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న శ్రీస్వామి, అమ్మవారు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం నిర్వహిస్తారు. మరోవైపు.. భద్రాద్రిలో నేటినుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. నవరాత్రుల్లో భాగంగా నేడు సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. శ్రీ దేవి నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రెండవ రోజు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు.. అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు బ్రహ్మచారిని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు జోగులాంబ అమ్మవారు.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతుండగా.. రెండవ రోజు బ్రహ్మచారిని అవతారం లో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.. కాళేశ్వరంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరగా.. బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ శుభానంద, సరస్వతీ దేవి అమ్మవారు.

తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. భద్రాచలంలోని నివాసంలో ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు (ఛాతీ నొప్పి) గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మృతి చెందారు. కుంజా సత్యవతి మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుంజా సత్యవతి దంపతులు ఆరంభంలో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆపై దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సత్యవతి భద్రాచలం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. వైఎస్‌ఆర్‌ మరణానంతరం వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరిన ఆమె.. ఆపై బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కుంజా సత్యవతికి టికెట్‌ దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.

మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేయగా.. ఆ వ్యక్తి మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని తేలింది. పోలీసుల విచారణపై అవగాహన ఉన్న అధికారులు ఆదివారం (అక్టోబర్ 15) ఈ సమాచారం ఇచ్చారు. మణిపూర్‌లో మే నెల నుంచి హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మధ్యమధ్యలో కొంత శాంతించినా..పెద్ద ఎత్తున నష్టం వార్తలు మాత్రం వచ్చాయి. అనుమానిత ఉగ్రవాది జూన్ నుండి మయన్మార్‌లో ఉన్న ఉగ్రవాద సమూహంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అనుమానిత ఉగ్రవాది కుల హింసలో ఎంతమేరకు ప్రమేయం ఉందో మణిపూర్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. మణిపూర్‌లో మెయిటై, కుకీ వర్గాల మధ్య హింస మే నెలలోనే ప్రారంభమైంది. ఇంఫాల్ లోయలో విపరీతమైన హింస, ఘర్షణ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. శాంతిభద్రతలను నెలకొల్పేందుకు పోలీసులతో పాటు సైన్యం సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. నిషేధిత సంస్థ ‘కాంగ్లీ యావోల్ కనా లూప్’ (కేవైకేఎల్)లో క్రియాశీలక సభ్యుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతని నుంచి 9 ఎంఎం బెరెట్టా యుఎస్ కార్ప్ పిస్టల్, ఏడు రౌండ్లు (మందుగుండు సామగ్రి), డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మాత్రం కొన్ని నిజాలను బహిరంగపరచలేదు. ఈ అనుమానితుడు మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని కూడా పోలీసులు చెప్పలేదు.

టీసీఎస్ లో లంచం ఇస్తేనే ఉద్యోగం.. 16మంది ఉద్యోగుల తీసివేత
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీలో లంచాలకు ఆశపడి ఉద్యోగాలను అమ్ముకోవడం బయటపడింది. విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి వారిపై చర్యలు తీసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన స్కాంతో సంబంధం ఉన్న 16 మంది ఉద్యోగులను, ఆరుగురు విక్రేతలపై నిషేధం విధించింది. ఈ చర్య గురించి కంపెనీ ఆదివారం బహిరంగంగా ప్రకటించింది. ఈ చర్యకు సంబంధించి టాటా గ్రూప్ ఐటీ కంపెనీ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై సమాచారం అందిన తర్వాత, దానిని క్షుణ్ణంగా విచారించినట్లు కంపెనీ తెలిపింది. విచారణలో రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో 19 మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు కంపెనీ గుర్తించింది. వారిలో 16 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించగా, ముగ్గురిని రిసోర్స్ మేనేజ్‌మెంట్ యూనిట్ నుండి తొలగించారు.

ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్‌.. నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ఎంట్రీ!
భారత్ గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌ 2023లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఫైవ్‌ టైమ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. నేడు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మెగా టోర్నీలో బోణీ చేయాలనీ చూస్తోంది. ఇక పాకిస్తాన్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌ (అక్టోబర్‌ 20)కు ముందు స్టార్ ప్లేయర్ ట్రవిస్‌ హెడ్‌ భారత గడ్డపైకి రానున్నాడట. ప్రపంచకప్‌ 2023కి ముందు దక్షిణాఫ్రికా టూర్‌ సందర్భంగా ట్రవిస్‌ హెడ్‌ ఎడమ చేతికి ఫ్రాక్చర్‌ అయింది. అయినా కూడా మెగా టోర్నీ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో హెడ్‌కు చోటు దక్కింది. గాయం నుంచి త్వరగా కోలుకుంటే.. హెడ్‌ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అతనికి రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ఎంపిక చేయలేదు. సీఏ ఆశించిన విధంగానే హెడ్‌ కోలుకున్నాడట. ప్రస్తుతం అతడు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడని తెలుస్తుంది. కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను ఆదుకునేందుకు భారత్‌కు త్వరలోనే బయల్దేరనున్నాడట. ట్రవిస్‌ హెడ్‌ గురువారం భారత్‌కు పయనమవుతాడని సమాచారం. పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ముందే హెడ్‌ భారత్ వచ్చేసినా.. అక్టోబర్‌ 25న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌ నుంచి జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయంపై సీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రపంచకప్‌ 2023కలో భారత్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో ఆసీస్ ఓటమిపాలైంది. టీమిండియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆసీస్‌.. ప్రొటీస్ చేతిలో 134 పరుగుల భారీ తేడాతో ఓడింది. దాంతో మైనస్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

వార్నీ.. ఏం తెలివి బాసూ.. ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి..
ఆ వైరల్ అవుతున్న ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఒక వ్యక్తి పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో ఓ బైక్‌ను తయారు చేశాడు.. ఆ బైకు నీటిలో కూడా వేగంగా దూసుకుపోతుంది.. ఓ ఇంస్టాగ్రామ్ యుజర్ దాన్ని షేర్ చేశాడు.. ఓ వ్యక్తి నాలుగు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములను రెండు వైపులా బైక్‌కు కట్టాడు. అనంతరం బైక్‌ను ఓ నదిలోకి పోనిచ్చాడు. ఆ ప్లాస్టిక్ డ్రమ్ముల వల్ల ఆ బైక్ నీటిలో మునిగిపోకుండా ముందుకు వెళ్లింది. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత ఆ యువకుడు బైక్‌ను ఆపి హాయిగా పడుక్కున్నాడు. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అతని ఐడియా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. వీడియోను పోస్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే మిలియన్స్ వ్యూస్ ను అందుకుంది..ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ ప్రయత్నం చాలా సృజనాత్మకంగా ఉంది. కానీ, ఇది ప్రమాదకరం కావొచ్చు, అద్భుతమైన ఐడియా అంటూ రకరకాల కామెంట్స్ ను అందుకుంది.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వెయ్యండి..

నయని పావని ఎలిమినేటెడ్.. మరో ట్విస్ట్ ఇచ్చిన నాగ్..
బిగ్ బాస్ తెలుగులో సండే ఎపిసోడ్ సందడిగా మారింది.. సెలెబ్రేటి టచ్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్.. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.. ఇక అనిల్ రావిపూడి ఒక్కొక్కరి గురించి ఫన్నీగా చెబుతూ ఆకట్టుకున్నారు. మధ్య మధ్యలో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ వచ్చింది. చివరికి నామినేషన్స్ లో పూజ, అశ్విని, నయని పావని మిగిలారు. అంటే ఈవారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కాబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. అదే నిజమైంది.. వీరి ముగ్గురిలో పూజా సేవ్ అయింది. దీనితో చివరికి నామినేషన్స్ లో అశ్విని, నయని పావని మిగిలారు. శ్రీలీలని పొగుడుతూ భోలే పాట పాడారు. అతడి పాటకి శ్రీలీల ఇంప్రెస్ అయింది. కాసేపు సరదాగా గడిపిన అనంతరం అనిల్ రావిపూడి, శ్రీలీల వెళ్లిపోయారు.. ఇక నాగ్ మళ్లీ నామినేషన్స్ గురించి మాట్లాడారు.. అశ్విని, నయని ముందు రెండు ఫిష్ బౌల్స్ ఉంచారు. వారిద్దరికీ రెండు బాటిల్స్ ఇచ్చారు. ఒక బాటిల్ ని ఫిష్ బౌల్ లో పోయగా ఇద్దరి ఫిష్ బౌల్స్ రెడ్ గా మారాయి. రెండవ బాటిల్ పోసిన తర్వాత అశ్విని ఫిష్ బౌల్ కలర్ మారింది. కానీ నయని ఫిష్ బౌల్ మాత్రం అలాగే రెడ్ కలర్ లో ఉండిపోయింది. దీనితో నయని ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటించారు.. ఇక నయని అందరికీ వీడ్కోలు చెప్పేసి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది..హౌస్ లో కొద్దీ రోజుల్లోనే అందరితో మంచి బాండింగ్ ఏర్పడింది అని పేర్కొంది. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయింది. ఆమె మాటలకు హౌస్ మేట్స్ కూడా కన్నీరు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు.. ఇక నాగ్ మరో ట్విస్ట్ ఇచ్చారు..ఒక బాక్స్ తీసుకుని వచ్చి సస్పెన్స్ పెంచేసారు. ఈ బాక్స్ లో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు హౌస్ లోకి వెళతారు అని చెప్పారు. అయితే బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి అనేది బిగ్ బాస్ ఇష్టం అని పేర్కొన్నారు. దీనితో నయని పావని నిజంగానే ఎలిమినేట్ అయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా బిగ్ బాస్ ను చూడాల్సిందే..

Exit mobile version