నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. పెరిగిన వయోపరిమితి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వివిధ పోస్టుల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేసింది.. కొన్ని పోస్టులను భర్తీ కూడా చేశారు.. అయితే, ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్.. ఇక తమకు ఏజ్ పెరిగిపోతోంది.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇక పోటీపడలేం.. పరీక్షలు రాయలేం అనే టెన్షన్ లేకుండా.. వారికి మరింత వెసులుబాటు కల్పించింది.. నిరుద్యోగులకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ), ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఇక, యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండేళ్లు పెంచేసింది.. వచ్చే 2024 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ వయస్సు సడలింపు వర్తించనుంది.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ వివరాలను పేర్కొన్నారు. మొత్తంగా.. నిరుద్యోగుకు ఇది శుభవార్తగానే చెప్పుకోవాలి..
తొలి రోజు 50 ప్రశ్నలు.. రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరోసారి సీఐడీ ముందు హాజరుకానున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. సీఐడీ నోటీసులు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు లోకేష్.. ఐఆర్ఆర్ కేసులో ఏ14 గా ఉన్న లోకేష్‌పై నిన్న ఆరు గంటల పాటు ప్రశ్నలు సంధించారు సీఐడీ అధికారులు.. తొలి రోజు లోకేష్ కు సీఐడీ అధికారులు 50 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో హెరిటేజ్ సంస్థలకు లబ్ధిచేకూరేలావ్యవహరిచాడని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చాలని సీఆర్డీఏపై ఒత్తిడి తెచ్చారనే విషయాలపై లోకేష్ కు ప్రశ్నించారని తెలుస్తోంది.. అయితే, నారా లోకేష్ విచారణకు సహకరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నమాట.. చాలా ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పినట్టు సమాచారం.. అయితే, ఐఆర్ఆర్ కేసులో మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని మరోసారి 41ఏ నోటీసు ఇచ్చింది సీఐడీ.. దీంతో.. ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు వెళ్లనున్నారు నారా లోకేష్. ఇక, సీఐడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. 50 ప్రశ్నల్లో 49 ప్రశ్నలు రింగ్‌రోడ్డుతో లింక్ లేని ప్రశ్నలే అన్నారు.. వాటికి గూగుల్‌లో వెతికినా జవాబులు తెలుస్తాయని సెటైర్లు వేశారు.. అయినా.. సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.. 2017లో మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు నా ముందు పెడితే వాటికి సమాధానమిస్తానని చెప్పాను.. అందుకు సంబంధించిన ఆధారాలేవీ వారు చూపించలేదన్నారు నారా లోకేష్.. ఇక, రెండో రోజు నారా లోకేష్‌పై సీఐడీ ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అనేది వేచి చూడాలి.
హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లోనూ చంద్రబాబు కేసులో విచారణ..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌తో మాజీ మంత్రి నారాయణ, ఆయన బావమరిది పిటిషన్లపై.. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన కేసుపై విచారణ జరగనుంది.. IRR కేసు, అంగళ్ల కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది.. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు రావాలని సీఐడీ ఇచ్చిన నోటీసులు క్వాష్ చేయాలంటూ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది.. మరోవైపు.. IRR కేసులో మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవులు ముని శంకర్ ముందస్తు బెయిల్ పై కూడా విచారణ జరగనుంది.. ఇక, విజయవాడలోని ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్ల మీద ఈ రోజు విచారణ జరగనుంది..
17 రోజులు 42 సభలు.. 15 నుంచే బీఆర్‌ఎస్ సమర శంఖారావం..
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. రేసులో ముందంజలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచార షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.ఈ నెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి నవంబర్ 9వ తేదీ వరకు బీఆర్‌ఎస్ ముఖ్య సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. కేసీఆర్ రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనేలా బీఆర్ఎస్ నేతలు షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. ముందుగా హుస్నాబాద్ లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార హోరు మోగించడం గమనార్హం. ఈసారి సభకు భారీ ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి బహిరంగ సభలకు హాజరుకానున్న కేసీఆర్.. ఈ నెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.
నగరానికి మరో వెయ్యి విద్యుత్ బస్సులు.. చార్జీలు చాలా తక్కువ..
ఆర్టీసీ గ్రేటర్ జోన్‌లో గత నెలలో ప్రవేశపెట్టిన 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 100 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేయనున్నాయి. ఈ 25 బస్సుల్లో 10 బస్సులను పుష్పక్ పేరుతో విమానాశ్రయానికి నడుపుతున్నారు. మిగిలిన 15 బస్సులు బాచుపల్లి నుంచి వేవ్‌రాక్, సికింద్రాబాద్ నుంచి వేవ్‌రాక్ వరకు రెండు రూట్లలో నడుస్తుండడంతో ఆర్టీసీకి మంచి లాభాలు వస్తున్నాయి. నగరంలో ఈ రెండు రూట్లలో నడిచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఐటీ, బ్యాంకు తదితర రంగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ఛార్జీలు నిర్ణయించారు. మొదటి స్టాప్ నుంచి చివరి స్టాప్ వరకు రూ.50 నుంచి 60 వరకు మాత్రమే టిక్కెట్టు ధర నిర్ణయించగా.. మెట్రో ఎక్స్ ప్రెస్ చార్జీల కంటే రూ.5 మాత్రమే ఎక్కువ. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సుల కంటే ఇక్కడ నడిచే ఎలక్ట్రిక్ బస్సుల చార్జీలు చాలా తక్కువగా ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు మరో రెండు మూడు నెలల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. వాయు, శబ్ద కాలుష్యం లేకుండా నగరవాసుల ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించారు. వీటిలో 50 బస్సులను మాత్రమే ఏసీకి మార్చగా, మిగిలినవి నాన్-ఏసీ బస్సులుగా నడపనున్నారు. ఈ బస్సులో టికెట్ చార్జీలు కూడా తక్కువే. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఓలెక్ట్రాతో ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. నగరంలోని ఇబ్రహీంపట్నం నుంచి జేబీఎస్ వరకు పది కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. వీటిలో ఇబ్రహీంపట్నం నుంచి ఐదు బస్సులు, జేబీఎస్ నుంచి ఐదు బస్సులు 9 స్టాప్‌లతో ప్రయాణికులకు ప్రతి 20 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులోకి వచ్చింది. టిక్కెట్టు రూ.60గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి ఈ సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రత్యేక కార్యక్రమం.. హాజరుకానున్న సూపర్ స్టార్, మాస్టర్ బ్లాస్టర్!
సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. నేడు (అక్టోబర్ 11) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుందని సమాచారం. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం అన్న విషయం తెలిసిందే. 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియంకు ఉంది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటికే ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్ జరిగింది. ఇక భారత్, పాకిస్థాన్ కోసం సిద్దమైంది. ఈ మెగా మ్యాచ్ కోసం స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇండో-పాక్ మ్యాచ్‌కు ముందు ఓ ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసిందట. అర్జిత్ సింగ్ వేదికపై ప్రదర్శన ఇస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ మ్యాచ్‌కు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మ్యాచ్‌కు హాజరవుతారట.
మా రవన్న కష్టం తెలిసినోడు… యష్ ని అంత తేలిగ్గా తీసిపడేయడు…
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ కి చిరు సపోర్ట్… అక్కినేని ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఏఎన్నార్ ఇప్పుడు నాగార్జున సపోర్ట్, నందమూరి ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణ సపోర్ట్… దగ్గుబాటి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ… ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో వెనక ఎదో ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తమ సొంత ట్యాలెంట్ తోనే ఈ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలు స్టార్ హీరోలు అయ్యారు అనేది నిజమే కానీ మొదటి అవకాశం వీరికి కాస్త ఈజీగా దొరుకుతుంది. ఒక సినిమా ఫ్లాప్ అయినా మార్కెట్ దెబ్బ తినకుండా ఇంకో అవకాశం వెంటనే వచ్చేస్తుంది. ఇది కొత్త హీరోలకి, బయట నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన మనుషులకి ఉండదు. ఇలాంటి కష్టాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో అయ్యే వరకూ భరించి, గెలిచి చూపించిన వాడు రవితేజ. హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే రవితేజకి ఒక్క ఫ్లాప్ పడితే చాలు రవితేజ పని అయిపొయింది అనే కామెంట్స్ వినిపిస్తాయి. ఇలాంటి కామెంట్స్ మిగిలిన ఏ స్టార్ హీరో గురించి కూడా వినిపించవు. విమర్శలు వచ్చిన ప్రతిసారీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే రవితేజ… పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తున్న రవితేజ, నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడుతూ… “అతను చాలా లక్కీ, KGF సినిమా అతనికి పడింది” అనే మాట అన్నాడు. ఈ మాటని పట్టుకోని కన్నడ యష్ ఫ్యాన్స్… యష్ లక్కీ కాదు, తను ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడు అంటూ కష్టం గురించి రవితేజకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల..నిజామా?
టాలివుడ్ లో బిజీ హీరోయిన్ అంటే శ్రీలీల పేరు వినిపిస్తుంది. చూపు తిప్పుకొనివ్వని అందం.. నటన, డ్యాన్స్ తో కుర్రకారును తెగ ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మొత్తం డజనుకు పైగా సినిమాలు చేతులో ఉన్నాయి.. అయితే ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే ఈ అమ్మడు కూడా సామ్ లాగా అరుదైన వ్యాధితో భాధపడుతుందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మరి శ్రీలీల బాధపడుతున్న ఆ అరుదైన వ్యాధి ఏంటి..నిజంగానే అది ట్రీట్మెంట్ లేని వ్యాధా..పెళ్లి కూడా కష్టమేనా.. అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.. పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.. అప్పటినుండి ఈమె ఫేట్ మారిపోయింది. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకొని వరుసగా పది సినిమాలకు సైన్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత మంది సీనియర్ హీరోయిన్లు ఉన్నా తగ్గేదేలే అన్నట్లు వరుస ఆఫర్స్ ను అందుకుంటూ బిజీ అయిపోతుంది.. ఇదిలా ఉండగా ఈ అమ్మడు గురించి ఓ వార్త వినిపిస్తుంది..శ్రీలీల ఒక్కసారి తుమ్మితే కంటిన్యూగా 20 నిమిషాల వరకు అలా తుమ్ముతూనే ఉంటుందట. ఇక కంటిన్యూగా అలా తుమ్మేసరికి చాలాసార్లు శ్రీలీల ఇబ్బంది పడి డాక్టర్లను కలిసినా కూడా ఫలితం లేకుండా పోయిందట. ఈ వ్యాధి కారణంగానే చాలా సార్లు కొన్ని సినిమా షూటింగ్ లకు డుమ్మా కొట్టింది.. ఇక ఈ విషయాన్ని ఓ సందర్బంలో ఈ అమ్మడే స్వయంగా చెప్పడంతో అందరు అదే నిజమని నమ్ముతున్నారు.. మరోసారి ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది శ్రీలీలకు ఇలాంటి జబ్బు ఉంటే పెళ్లి అవ్వడం కూడా కష్టమే అంటూ కామెంట్లు పెడుతున్నారు… ఈ వార్త విన్న ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.. ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. డజను సినిమాలను లైన్ లో పెట్టుకుంది.. ప్రస్తుతం బాలయ్య తో చేసిన సినిమా భగవంత్ కేసరి..ఈ సినిమా దసరా బరిలో దిగబోతుంది. అక్టోబర్ 19న ఈ మూవీ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..
రౌడీ ఇన్స్పెక్టర్ రేంజులో భగవంత్ కేసరి…
బాలయ్యని నరసింహ నాయుడు, సమరసింహా రెడ్డి సినిమాలతో సీడెడ్ కింగ్ గా మార్చాడు డైరెక్టర్ బీ.గోపాల్. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అది ఇండస్ట్రీ హిట్ అనే నమ్మకం ఉండేది జనాల్లో. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా బీ.గోపిల్, బాలయ్య కాంబినేషన్ లో ఇంకో సినిమా పడకుండా చేసింది. 1990-2001 వరకూ పదేళ్లలో 4 సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లారీ డ్రైవర్ అయితే రెండో సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ రామరాజుగా బాలయ్య మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేసాడు. బాలయ్య ప్లే చేసిన స్పెషల్ అండ్ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో ఇన్స్పెక్టర్ రామరాజు ఒకటి. ఇప్పుడు ఇలాంటి సినిమానే బాలయ్య నుంచి రాబోతోందా అంటే దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తోంది. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోని ‘అరెవో సాంబ’ పాటని పటాస్ సినిమాలో వాడి థియేటర్స్ లో విజిల్స్ వేయించిన అనీల్ రావిపూడి… ఇప్పుడు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి హిట్ పక్కా అనే కాంప్లిమెంట్స్ ని సొంతం చేసుకుంది. బాలయ్యని తెలంగాణలో దించుతూ అనీల్ రావిపూడి రాసిన డైలాగ్స్ టీజర్, ట్రైలర్ లో బాగా పేలాయి. కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది, దీంతో భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు పెరిగాయి. లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ప్రకారం… భగవంత్ కేసరి సినిమాలో రౌడీ ఇన్స్పెక్టర్ ఛాయలు ఉంటాయి, ఈ సినిమా చూసిన వారికి రౌడీ ఇన్స్పెక్టర్ గుర్తొస్తుంది అంటున్నారు. అనీల్ రావిపూడి దాచిన సెకండ్ గెటప్ ఒకటి సినిమాలో ఉంది, బాలయ్య అందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అనే మాట వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలి అంటే అక్టోబర్ 19 వరకూ వెయిట్ చేయాల్సిందే.
