వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే 9.. ఈ రోజు ఏ నియోజకవర్గాల్లో అంటే..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలు 9వ రోజుకు చేరాయి.. ఒకేసారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ యాత్రలు సాగుతున్నాయి.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకేసారి నిర్వహిస్తోన్న సామాజిక సాధికార బస్సు యాత్రల్లో రాష్ట్ర మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు పాల్గొంటున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చేకూరిన లబ్ధి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు నేతులు.. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు దిగ్విజయంగా సాగుతూ వచ్చిన ఈ యాత్రలు.. ఈ రోజు 9వ రోజుకు చేరాయి.. నేడు, గాజువాక- విశాఖపట్నం జిల్లా, కాకినాడ రూరల్ – కాకినాడ జిల్లా, మార్కాపురం – ప్రకాశం జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలు జరగనున్నాయి..
రైతులకు సీఎం గుడ్‌న్యూస్.. రేపే 53.53 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ
రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ నెల 7వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు.. ఇక, రేపటి పుట్టపర్తి పర్యటన కోసం.. మంగళవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్నారు.. పుట్టపర్తి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఈ ఏడాది ఇప్పటికే తొలి విడత సాయాన్ని అందజేసింది ఏపీ సర్కార్.. రేపు రెండో విడత సాయాన్ని జమ చేయనున్నారు.. వైఎస్సార్ రైతు భరోసా కింద 53.53 లక్షల మంది ఖాతాల్లోకి రూ.2,204.77 కోట్లు జమ చేయనున్నారు.. ఈ ఏడాది తొలి విడతలో రూ.7,500 చొప్పున 52.57 లక్షల మందికి రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించింది వైసీపీ సర్కార్.. ఇక, ఇప్పుడు రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్లు అందించనుంది.. కాగా, వైఎస్సార్ రైతు భరోసా కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతలో 52,57,263 మంది అర్హత పొందారు. వీరిలో 50,19,187 మంది భూ యజమానులు అయితే.. 1,46,324 మంది కౌలుదారులు, 91,752 మంది అటవీ భూ సాగుదారులున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున తొలి విడతగా జూన్ 1వ తేదీన భూ యజమానులకు, సెప్టెంబర్ 1న కౌలుదారులు, అటవీ సాగుదారులకు రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించింది ప్రభుత్వం.. ఇక, రెండో విడతలో 53,52,905 మంది అర్హత పొందారు.
రేపు హైదరాబాద్‌కు మోడీ.. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మంగళవారం భారీ సమావేశం నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమావేశం అనంతరం ప్రధాని తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. సభ ఏర్పాట్లను పార్టీ ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. ఎజెండాతోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో తెలంగాణలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని ప్రకటించారు. బీసీ సీఎం విషయంలో బీజేపీ నేతలు ప్రచార అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్నారు. తెలంగాణలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న బీసీ ఓట్లను దక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అయితే మరే ఇతర పార్టీ వారికి రాజ్యాధికారం ఇవ్వదనే కోణంలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 7న హైదరాబాద్ లో నిర్వహించే బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని సమాచారం.బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే అందులో ఎలాంటి అంశాలు, హామీలు ఇస్తారనేది బీజేపీ వ్యతిరేకులు. ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
మెట్రో సరికొత్త రికార్డు.. రోజూ 5.47 లక్షల మంది జర్నీ
మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ఒక రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. మూడు కారిడార్లలో ఒక్కరోజే 5.47 లక్షల మంది మెట్రో మార్గాల్లో ప్రయాణించారు. మెట్రో సేవలు ప్రారంభించిన ఆరేండ్లలో ఒక్కరోజులో దాదాపు 5.5 లక్షల మంది ప్రయాణికులు రావడం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. నగరంలో అత్యంత కీలకమైన రూట్‌లో మెట్రో రైళ్లు రాకతో ఏటా ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరుగుతోంది. కరోనా ప్రభావంతో మెట్రో రైళ్లలో రద్దీ క్రమంగా పెరుగుతుండడంతో ఆయా రూట్లలో మెట్రో అధికారులు రైళ్లను నడుపుతున్నారు. ముఖ్యంగా దసరా, దీపావళి సీజన్లతో మహానగరంలో ఐటీ కార్యకలాపాలు సందడిగా ఉండడంతో నగరంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఐటీ కంపెనీల కార్యకలాపాలతో సోమవారం నుంచి శుక్రవారం వరకు కారిడార్-3లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన మొదటిసారిగా 2003లో ప్రతిపాదించబడింది. అభివృద్ధి చెందుతున్న నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ మరియు రవాణా అవసరాలను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అధికారికంగా 29 నవంబర్ 2017న ప్రారంభించబడింది. దీనిని గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
గోరువెచ్చని నీటిలో ఈ 4 పదార్థాలను కలుపుకుని తాగండి…!
భారతీయ వంటగదిలో ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడే అనేక అంశాలు ఉన్నాయి. దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీరను సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు. అయితే ఈ పదార్థాలను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారని మీకు తెలుసా? వాస్తవానికి, ఈ పదార్ధాలలో ఇటువంటి అనేక పోషకాలు కనిపిస్తాయి, ఇవి అనేక సమస్యల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. శీతాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర మరియు కొత్తిమీర కలపడం ద్వారా మీరు కషాయాలను తయారు చేస్తే, అది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న స్వల్పంగా తగ్గాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,640గా ఉంది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,790గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,350గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,640గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా నేడు స్థిరంగా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 75,000లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,000లు ఉండగా.. చెన్నైలో రూ. 78,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,000లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000గా కొనసాగుతోంది.
బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ రద్దు కానుందా?.. కారణం ఏంటంటే!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. ఢిల్లీలోని తీవ్ర వాయు కాలుష్యం కారణంగా బంగ్లా-శ్రీలంక మ్యాచ్ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించడంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీలోని పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 460గా నమోదైంది. అంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఆదివారం బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తమ ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నాయి. లంక టీమ్ శనివారం పూర్తిగా ఇండోర్స్‌కే పరిమితం అయింది. బంగ్లా ప్లేయర్స్ మాత్రం సాయంత్రం మాస్కులు ధరించి సాధన చేశారు. ఇక శుక్రవారం బంగ్లా జట్టు తమ తొలి ట్రెయినింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది.
నాకు 365 రోజులు పట్టింది కానీ.. విరాట్ కోహ్లీ సెంచరీపై స్పందించిన సచిన్!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తన 35వ పుట్టిన రోజున వన్డేల్లో 49వ సెంచరీ చేయడం విశేషం. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. మరో సెంచరీ చేస్తే.. శతకాలలో హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంటాడు. విరాట్ వన్డేల్లో 50వ సెంచరీ సెంచరీ చేయాలని సచిన్ కోరుకున్నాడు. ‘విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడావ్. ఈ ఏడాదిలో నేను 49 నుంచి 50కి (వయసు పరంగా) చేరుకోవడానికి నాకు 365 రోజులు పట్టింది. కానీ రాబోయే కొన్ని రోజుల్లోనే నువ్వు 49 నుంచి 50కి (సెంచరీలు) చేరుకుని.. నా రికార్డు బద్దలుకొడతావని ఆశిస్తున్నా. శుభాకాంక్షలు’ అని సచిన్ టెండూల్కర్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. ప్రపంచకప్ 2023లోనే విరాట్ 50వ సెంచరీ చేయాలని సచిన్ ఆశిస్తున్నాడు. విరాట్ ఫామ్ చూస్తే.. లీగ్ దశ చివరి మ్యాచ్‌లోనే సచిన్ కోరికను నెరవేర్చే అవకాశం ఉంది.
