Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటితో ముగియనున్న కోటిదీపోత్సవం.. పాల్గొననున్న ప్రధాని మోడీ..
కార్తిక మాసంలో ప్రతీ ఏడాది ఎన్టీవీ, భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం చివరి రోజుకు చేరింది.. నవంబర్‌ 14వ తేదీ నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నిర్వహిస్తోన్న దీప యజ్ఞం కోటి దీపోత్సవం ఇవాళ్టితో ముగియనుంది.. దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహించారు.. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణ, అతిరథ మహారథులు అతిథులుగా వచ్చేశారు.. ఇక, ఈ ఏటి ఉత్సవం నేటితో పరిసమాప్తం కానుంది.. చివరి రోజు కోటిదీపోత్సవానికి కొత్త శోభ చేకూరనుంది.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు కోటిదీపోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. తెలంగాణకు రానున్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక, రాత్రికి కోటి దీపోత్సవంలో పాల్గొంటారు.
కోటిదీపోత్సవంలో చివరి రోజు విశేష కార్యక్రమాలు ఇవే..
* కోటిదీపాల సంబరంలో చివరిఘట్టం
* కోటి దీపోత్సవ ఘట్టంలో అపూర్వఘట్టం.. నేడు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ
* కార్తిక సోమవారం సహిత పూర్ణిమ సందర్భంగా పున్నమి కాంతుల్లో శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం
* తిరుమలేశుని కల్యాణం
* భద్రాద్రి రామచంద్రుని వైభవం
* స్వర్ణ లింగోద్భవ కాంతులు
* సప్తహారతుల వెలుగులు
* మహా నీరాజనాలు

శ్రీవారి సేవలో ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.. రాత్రి తిరుమలకు చేరుకుని రచనా అతిధి గృహంలో బస చేసిన ఆయన.. ఈ ఉదయం శ్రీవారి ఆలయానికి చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఇక ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న ప్రధానికి.. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. తదనంతరం ప్రధానికి టీటీడీ ఛైర్మన్‌, ఈవో.. స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. దాదాపు 50 నిముషాల పాటు శ్రీవారి ఆలయం, పరిసరాల్లో గడిపారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ తర్వాత తిరిగి రచనా అతిథి గృహానికి చేరుకున్నారు..

సెల్ఫీ విషయంలో వివాదం.. పొట్టుపొట్టు కొట్టుకున్న యువతులు..
గుంటూరు గాంధీ పార్క్ లో అమ్మాయిల మధ్య ఫైటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాంధీ పార్క్‌లో సెల్ఫీలు తీసుకునే క్రమంలో రెండు గ్రూపులు పోటీ పడ్డాయి.. అది కాస్తా మాటామాటా పెంచి వాగ్వాదానికి దారితీసింది.. ముందు సెల్ఫీలు తామే దిగాలని , తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని యువతుల మధ్య రాజుకున్న వివాదం.. శృతిమంచిపోయింది.. దీంతో.. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు యువతులు.. సెల్ఫీల కోసం ఇలా ఆడపిల్లలు ఫైటింగ్ కు దిగడంతో స్థానికులంతా నోరువెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఎలాగూ స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంది.. కాస్త వెరైటీగా ఏది కనిపించనా వదలడంలేదు.. ఈ అమ్మాయిల ఘర్షణను కూడా ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. సోషల్‌ మీడియాలో వదలడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారిపోయింది.

కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్.. ఇవాళ ఎక్కడంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఒక్క రోజు సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త ముందంజలో ఉంది. ఇక, గులాబీ బాస్, సీఎం కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పు సుడిగాలి పర్యటనలు చేస్తున్నాండటంతో ప్రతిపక్ష పార్టీలు సైతం తమ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నాయి. ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యదర్శులు వి.సుధాకరగుప్త, ముచకుర్తి ప్రభాకర్, వివేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ముషీరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించి, వీధి సభల్లో ప్రసంగిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు ఆటోయూనియన్‌ మీటింగ్‌, ఉదయం 10 గంటలకు పెద్దపల్లిలోని సుల్తానాబాద్‌ రోడ్‌ షో, ఉదయం 11.30 గంటలకు ధర్మపురి వెల్గటూర్‌ లో రోడ్ షో, ఉదయం 12.30 గంటలకు చెన్నూర్‌ లో రోడ్‌ షో, ఉదయం 1.30 గంటలకు హుజూరాబాద్‌ లో రోడ్‌ షో అనంతరం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకు హెలిాప్టర్లలో ఏటూరు నాగరం చేరుకుని రోడ్ షో లో కేటీఆర్ పాల్గొననున్నారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ నగరానికి చేరుకుని సాయంత్రం 6 గంటలకు అంబర్‌ పేట్‌ లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఆలీ కేఫ్‌, ఫీవర్‌ ఆసుపత్రి, చప్పల్‌ బజార్‌ రోడ్‌ షో నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్‌ లో రోడ్‌ షో లో నిర్వహించనున్నారు. రాంనగర్‌ ఎక్స్‌ రోడ్‌, భోలక్‌ పూర్‌, గాంధీ నగర్‌ న్యూ బ్రిడ్జ్‌ వరకు కేటీఆర్‌ రోడ్‌ షో లో చేపట్టనున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు అంబర్ పేట డివిజన్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో అలికేఫ్ చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్‌షోను విజయవంతం చేయాలని కోరారు.

స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.. పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.. అయితే గోల్డ్ రేట్స్ అనేవి తెలుసుకొని కొనుగోలు చెయ్యడం మంచిది.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,290 గా ఉంది. వెండి కిలో ధర రూ. 77,200 లుగా నమోదు అవుతుంది.. ఇక వెండి విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.77,200 గా ఉంది. ముంబైలో రూ.77,200 ఉండగా.. చెన్నైలో రూ.80,200, బెంగళూరులో రూ.76,250 ఉంది. కేరళలో రూ.80,200, కోల్‌కతాలో రూ.77,200 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,200 గా నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

స్టోక్స్‌, రాయుడుకు గుడ్‌బై.. చెన్నై రిలీజ్, రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌ ప్రక్రియకు ఆదివారం (నవంబర్‌ 26) ఆఖరి తేదీ కావడంతో.. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ రిలీజ్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముఖ్యంగా సీఎస్‌కే ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లకు అల్విదా చెప్పింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న బెన్‌ స్టోక్స్‌ (16.25 కోట్లు), తెలుగు తేజం అంబటి రాయుడు (6.75), పేసర్ కైల్‌ జేమీసన్‌ను (1 కోటి) రిలీజ్‌ చేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో ఐదుగురికి కూడా గుడ్‌బై చెప్పింది. విదేశీ ఆటగాళ్లు డ్వేన్‌ ప్రిటోరియస్‌ (50 లక్షలు), సిసండ మగాల (50 లక్షలు).. లోకల్‌ ప్లేయర్స్‌ ఆకాశ్‌ సింగ్‌ (20 లక్షలు), భగత్‌ వర్మ (20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతిలను (20 లక్షలు) రిలీజ్‌ చేసింది. భారత్ మాజీ సారధి ఎంఎస్ ధోనీ తమ కెప్టెన్ అని స్పష్టం చేసింది. దాంతో రికార్డు స్థాయిలో 15వ సారి చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇపుడు సీఎస్‌కే పర్స్‌లో 32.2 కోట్లు ఉన్నాయి. చెన్నైకి ఆరుగురిని కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ ఉంది.

ఏకంగా 11 మందిని వదిలేసిన ముంబై ఇండియన్స్.. స్టార్‌ బౌలర్‌కు గుడ్‌బై!
రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించేందుకు ఐపీఎల్ ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (నవంబర్ 26) ముగిసిపోయింది. దాంతో ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు అన్ని జట్లు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ ఏకంగా 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను కొనసాగించిన ముంబై.. స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం షాక్ ఇచ్చింది. గాయంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతూ వచ్చిన ఆర్చర్.. ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేదు. ఆర్చర్‌తో పాటు మరో 10 మందిని ముంబై వేలానికి వదిలేసింది. గతేడాది జరిగిన మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను (Cameron Green IPL Trade) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ముంబై ఇండిస్ ట్రేడ్ ద్వారా అమ్మేసింది. పూర్తి క్యాష్‌కు గ్రీన్‌ను ట్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు పెద్ద కారణమే ఉంది. గ్రీన్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకోనుంది. జై రిచర్డ్‌సన్, క్రిస్ జోర్డాన్, ట్రిస్టియన్ స్టబ్స్ వంటి కీలక విదేశీ ప్లేయర్లను కూడా ముంబై వదిలేసింది.

ఈ యాక్టర్ డైనమైట్ పైన 1200 కోట్లు ఖర్చు పెడుతున్నారా?
ఒక హీరో రేంజ్ ఏంటో చెప్పాలి అంటే కలెక్షన్స్ ని కౌంట్ చేయాలి కానీ కొంతమంది హీరోల సినిమాలు తెరకెక్కే బడ్జట్ లెక్కలు చూస్తే చాలు ఆ హీరో రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఈ జనరేషన్ ని పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కాయి. త్వరలో రానున్న సలార్ రెండు పార్ట్‌లు, కల్కి, స్పిరిట్, మారుతి ప్రాజెక్ట్‌ ల బడ్జెట్ లు కలిపితే… దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉంటాయి అంటే కేవలం ప్రభాస్ పైన రెండు వేల కోట్ల ఖర్చు పెడుతున్నారన్నమాట. ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోస్ లో ప్రభాస్ తర్వాత ఇదే రేంజ్ లైనప్ ని మైంటైన్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెలుగులోనే కాదు మొత్తం సౌత్‌ ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలు చేస్తున్నాడు ఎన్టీఆర్‌. కొమురం భీముడిగా అద్భుతంగా నటించి పాన్ వరల్డ్ ఆడియన్స్ ని రీచ్ అయిన ఎన్టీఆర్… ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జట్ తో దేవర సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. దేవర షూటింగ్ కంప్లీట్ అవగానే… బాలీవుడ్‌లో వార్ 2 చేస్తున్నాడు తారక్. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్… మాసియెస్ట్ ప్రాజెక్ట్ NTR31 సినిమా కూడా 300 కోట్ల నుంచి 400 కోట్ల బడ్జెట్ అయ్యే సినిమానే. ప్రశాంత్ నీల్-నటైర్ ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం బడ్జట్ ఉండడంలో తప్పు లేదు. సో మొత్తంగా దేవర, వార్ 2, NTR 31… సినిమాల బడ్జెట్ చూసుకుంటే… దాదాపు 1200 కోట్ల వరకు ఉంది. సినిమాల బడ్జెట్ లే 1200 కోట్లంటే.. బిజినెస్ డబుల్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈ సినిమాలతో యంగ్ టైగర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరో మూడు రోజుల్లో దుకాణం మూత పడుతుంది…
డిసెంబర్ 1న రణబీర్ కపూర్ నటించిన అనిమల్ మూవీ, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సామ్ బహదూర్ పై పెద్దగా హైప్ లేకపోయినా అనిమల్ సినిమాపై మాత్రం ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాలీవుడ్ కి 2023 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1 కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ మాత్రం అనిమల్ మూవీ వచ్చే లోపు వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ ని తమ బ్యాగ్ లో వేసుకోవాలని చూస్తుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ టైగర్ 3 కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు. టైగర్ 3 సినిమా నవంబర్ 12న రిలీజ్ అయ్యింది. టైగర్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా ఓపెనింగ్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా టైగర్ 3 సినిమా ఇప్పటివరకూ 430 కోట్లకి పైగా రాబట్టింది. ఆ రేంజ్ కలెక్షన్స్ వేరే ఏ సినిమాకి వచ్చినా అది సూపర్ హిట్ కింద లెక్కేసే వాళ్లు కానీ సల్మాన్ సినిమా పైగా షారుఖ్ క్యామియో కూడా ఉన్న సినిమా విషయంలో మాత్రం ఆ కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. డిసెంబర్ 1తో టైగర్ 3 థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ లోపు 450 కోట్ల మార్క్ అయినా అందుకోవాలని టైగర్ 3 సినిమా టికెట్ రేట్స్ ని తగ్గించారు యష్ రాజ్ ఫిల్మ్స్. ఇండియాలోని అన్ని మల్టీప్లెక్స్ లో టైగర్ 3 సినిమాకి నవంబర్ 30 వరకు 150 రూపాయల టికెట్ రేట్ ని ఫిక్స్ చేసారు. మరి ఈ రేట్ తగ్గించే విషయం టైగర్ 3 ఫైనల్ కలెక్షన్స్ ని ఎంతవరకు పెంచుతాయి అనేది చూడాలి.

Exit mobile version