NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కన్నుల పండుగగా కోటిదీపోత్సవం.. పదకొండవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే..
భక్తి టీవీ దీపయజ్ఞం కోటిదీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన కోటిదీపోత్సవం నేడు పదకొండో రోజుకు చేరుకుంది.. ఏటా కార్తిక మాసంలో నిర్వహించే ఈ దీప యజ్ఞంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. పీఠాధిపతుల అనుగ్రహ భాషణం, అతిరథ మహారథులు అతిథులుగా తరలివస్తున్నారు. ఇక, రోజురోజుకి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది..
11వ రోజు కోటిదీపోత్సవం కార్యక్రమాలు
* ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీపరిపూర్ణానందగిరి స్వామీజీ అనుగ్రహ భాషణం
* హైదరాబాద్‌ జగన్నాథ మఠం శ్రీవ్రతధర రామానుజ జీయర్‌ స్వామీజీ అనుగ్రహ భాషణం
* పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం
* వేదికపై కొల్హాపూర్‌ మహాలక్ష్మీకి కోటి కుంకుమార్చన
* భక్తులచే లక్ష్మీ విగ్రహాలకు కోటి కుంకుమార్చన
* యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
* స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ
* మహాదేవుని నీరాజనాలు
* కోటి దీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఈ రోజు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వచ్చే ఏడాది అంటే 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చే­యనుంది టీటీడీ.. మరోవైపు.. తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను కూడా ఈ రోజు మధ్యా­హ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.. భక్తులు www.tirumala.org వెబ్‌సై­ట్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు గదులను కూడా బుక్‌ చేసుకోవచ్చు.. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 31 కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 45,503 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇక, హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.

నేడు నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసిఆర్ పర్యటన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం మరింత స్పీడ్ పెంచారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో బీఆర్ఎస్​ అభ్యర్థులకు సపోర్టుగా గులాబీ అధినేత ప్రచారం చేయనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఈ సభా వేదికల్లో కేసీఆర్.. ప్రజలకు ఓటు హక్కును తెలియజేస్తున్నారు. మరోవైపు తొమ్మిదన్నరేళ్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి వివరిస్తున్నారు.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో రేపు (శనివారం) జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. టీఎస్​ఐఐసీఛైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి తలసాని సభా వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 82 సభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తూనే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే వాటిని సీఎం ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక, మరో వైపు విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. వారి వైఖరిని ఖండిస్తున్నారు.

ఖమ్మం గుమ్మంలో పువ్వాడ, తుమ్మల.. సై అంటే సై అంటున్న కీలక నేతలు
భిన్న రాజకీయాలకు వేదికగా పేరొందిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది.ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాలో నిత్యం భిన్నమైన నిర్ణయాలు. నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉండి నేడు కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ కొత్త మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో తలపడుతున్నారు. తుమ్మల విస్తృత అనుభవం ఉన్న నాయకుడు, గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. బీఆర్‌ఎస్‌లో టికెట్ రాకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ క్రమంలో కొత్త మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తుమ్మల పువ్వాడ అజయ్‌ను ఖాసీం రజ్వీతో పోల్చడం చర్చకు దారి తీసింది.అలాగే అజయ్ అరాచక, నిరంకుశ పరిపాలనకు సాక్షి అని తుమ్మల విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు కేరాఫ్ అడ్రస్ అహంకార రాజకీయాలకు కారణమని పువ్వాడ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం కేంద్రంగా పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావులను పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతలను ఆకర్షించేందుకు నేతలిద్దరూ అలుపెరగని ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, ఎవరు గెలిచినా పది వేల మెజారిటీ మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ గట్టి పోటీ కొనసాగుతుందనే చర్చ బలంగా సాగుతోంది. మాజీ మంత్రి తుమ్మల గతంలో 2009లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి తనుడు జలగామ వెంకట్రావుపై గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మలైపై కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో అజయ్‌కుమార్‌ ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున జిల్లాకు చెందిన ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఈ ఇద్దరు నేతలు మరో దఫా ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజకీయంగా బలప్రదర్శనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సీటులో ఎవరు గెలిచినా 10 వేల స్వల్ప మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయ్యప్ప భక్తులకు అలెర్ట్.. కేరళలో భారీ వర్షాలు!
గత రెండు రోజులుగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను కారణంగా.. దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్టల్ కర్నాటక, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ-మహేలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర, యానాం, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఈ నెల 26 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతోంది..
ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా గాలి తీవ్రత పెరిగిపోతుండటంతో దేశ రాజధానిలోని 14 ప్రాంతాలలో ఏక్యూఐ (AQI) 400 కంటే ఎక్కువగా నమోదు అవుతుంది. మరో రెండు మూడు రోజుల వరకు ఈ కాలుష్యం కొనసాగుతుందని సమాచారం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ఏక్యూఐ నిన్న (గురువారం) 390గా ఉండగా.. ఇవాళ ఉదయం ఈ సంఖ్య 450కి చేరుకుంది. ఈ స్థాయిలో గాలి న్యాణత పడిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేడు మళ్లీ బవానా ఢిల్లీలో అత్యంత కలుషితమైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ ఏక్యూఐ 450 ఉండగా, జహంగీర్‌పురి ఏక్యూఐ 439 పాయింట్లు నమోదు కావడంతో రెండవ స్థానంలో నిలిచింది. గాలిలో పీఎం 10 యొక్క సగటు స్థాయి 100 కంటే తక్కువగా ఉండాలి.. పీఎం 2.5 యొక్క సగటు స్థాయి 60 కంటే తక్కువగా ఉండాలి.. అప్పుడే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని గాలిలో పీఎం 10 యొక్క సగటు స్థాయి 355, పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 206 మైక్రోగ్రాములు.. గాలిలో కాలుష్య కణాల స్థాయి ప్రమాణాల కంటే మూడున్నర రెట్లు ఎక్కువగా పెరిగింది.

నాగుపాము గదిలో వదిలి.. భార్య, కూతురును దారుణంగా చంపిన కసాయి
ఒడిశాలోని గంజాం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అక్టోబరు 7న ఓ మహిళ, ఆమె రెండేళ్ల కుమార్తె తమ ఇంట్లో శవమై కనిపించారు. పాము కాటు వల్లే ఇద్దరూ చనిపోయారని తెలిసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాము కాటు వల్లే మహిళ, ఆమె కూతురు చనిపోయారని, అయితే ఇది సాధారణ మరణం కాదని పోలీసులు వెల్లడించారు. ఎందుకంటే, మహిళ భర్త ఇంట్లో విషపూరిత పామును వదిలివేయడంతో, దాని కాటు కారణంగా వారిద్దరూ మరణించారు. అసలు విషయం గంజాం జిల్లా కబీసూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధిబరగా గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడిని కె గణేష్ పాత్రగా గుర్తించారు. మూడేళ్ల క్రితం అధేబరా గ్రామానికి చెందిన కె గణేష్ పాత్ర అదే గ్రామానికి చెందిన బసంతి పాత్రను వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివాహానంతరం వారికి ఒక కూతురు పుట్టింది. పాము ఇద్దరినీ కాటేసింది. వారి ఆరోగ్యం క్షీణించడంతో బసంతి, రెండేళ్ల చిన్నారిని హింజిలికట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వారిద్దరినీ హత్య చేసి ఉంటారని అనుమానించిన బసంతి కుటుంబీకులు అల్లుడు గణేష్‌పై హత్య కేసు నమోదు చేశారు.

స్ప్లెండర్‌కు పోటీగా కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
ఇండియాలో ఈవీ బైకులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది..ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహన కాలుష్యం నుంచి రక్షణ కోసం ఈవీ వాహనాలపై సబ్సిడీలను ఇస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఈవీ బైకులను సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నారు.. కార్లతో పోల్చుకుంటే స్కూటర్లు, బైక్‌ల్లో ఈవీ వెర్షన్లు బాగా క్లిక్‌ అయ్యాయి. భారతదేశం బైక్‌ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంది హీరో స్ప్లెండర్‌ బైక్‌. అయితే ఇప్పుడు హీరో స్ప్లెండర్‌కు గట్టి పోటీనిస్తూ ఇంచుమించు అదే డిజైన్‌తో సరికొత్త లుక్ తో ఈవీను లాంచ్‌ చేశారు. ప్రముఖ ఈవీ వాహన తయారీదారు ప్యూర్‌ ఈవీ ఎకో డ్రైఫ్ట్‌ 350 బైక్‌ను మార్కెట్ లోకి వదిలింది.. ఈ బైక్‌ ధర సుమారు రూ.1.30 లక్షలుగా ఉంటుంది. ఈ బైక్‌ ముఖ్యంగా 110 సీసీ పెట్రోల్‌ బైక్స్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బైక్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే  171 కిలో మీటర్ల మైలేజ్‌ ఇవ్వనుంది.. ఇకపోతే ఏడువేల ఆదాయాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.. అంతేకాదు 3.5 కేడబ్ల్యూహెచ్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ బైక్‌ ఆరు ఎంసీయూలతో 3 కేడబ్ల్యూతో ఎలక్ట్రిక్‌ మోటర్‌కు శక్తినిస్తుంది. ఈ బైక్‌ 40 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌తో గంటకు 75 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడింది. గడిచిన రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే నేడు (నవంబర్ 24) బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. తులం బంగారంపై రూ. 50 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 56,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. శుక్రవారం కిలో వెండిపై రూ. 200 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 76,200గా ఉంది. చెన్నైలో రూ. 79,200 వద్ద వెండి ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 75,000గా ఉండగా.. హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 79,200 వద్ద కొనసాగుతోంది.

‘ఆదికేశవ’ ట్విట్టర్ రివ్యూ.. ఊరమాస్ యాక్షన్.. క్లైమాక్స్ ఫీక్స్..
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో ఆ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. మొదటి సినిమాకే పాజిటివ్ టాక్ ను అందుకున్న హీరో తర్వాత వచ్చిన కొండపోలం సినిమాతో యావరేజ్ టాక్ ను అందుకున్నాడు.. ఇక ఇప్పుడు ఊర మాస్ యాక్షన్ స్టోరీతో అడియన్స్ ముందుకు వచ్చాడు వైష్ణవ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోరో స్ బ్యానర్లపై నిర్మతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన చిత్రం ఆదికేశవ. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించగా.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది.. సినిమా ఎలాంటి టాక్ ను అందుకున్నాడో ట్విట్టర్ రివ్యూను చూద్దాం.. ప్రస్తుతానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా ఫస్ట్ హాస్ సరదాగా.. కామెడీతో అలరిస్తుందని.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ యాక్షన్ తో వైష్ణవ్ అదరగొట్టేశారని అంటున్నారు. ఇక శ్రీలీల డాన్స్ ఎనర్జీ గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సింహాద్రి, అల్లు అర్జున్ అల వైకుంటపురంలో లోని హిట్ పాటలకు శ్రీలీల డాన్స్ వేరేలెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్లీ వాయిదా
తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలంటే తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. అతను విక్రమ్‎తో గత ఐదేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన సినిమా ‘ధృవ నక్షత్రం’ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. కానీ, మళ్లీ వాయిదా వేసినట్లు దర్శకుడు గౌతమ్ ఈ రోజు తెల్లవారుజామున ప్రకటించారు. ‘ధృవ నక్షత్రం’ సినిమాని విక్రమ్ తో కొన్నేళ్ల ముందు మొదలెట్టారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా సినిమా షూటింగ్ నత్త నడకన సాగింది. ఒక ఐదేళ్ల పాటు షూటింగ్ జరిగి, ఈరోజు నవంబర్ 24న విడుదలవుతుందని దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రకటించారు. ఇప్పటికైనా సినిమా విడుదలవుతుందని విక్రమ్ అభిమానులు భావించారు. అదీ కాకుండా ఈ సినిమాకి ప్రమోషన్లు కూడా పెద్దగా నిర్వహించలేదు. ఈరోజు విడుదలవ్వాల్సిన ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్ళీ వాయిదా పడింది. స్వయంగా దర్శకుడు, నిర్మాత అయిన గౌతమ్ మీనన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. కానీ ఈరోజు తెల్లవారుజామున గౌతమ్ ఒక ప్రకటన చేస్తూ, “ఈరోజు ‘ధృవ నక్షత్రం’ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాలేకపోయినందుకు క్షమించండి. మాకు ఇంకో ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తాం, మీకు ఈ సినిమా అనుభూతిని మంచి థియేటర్స్ లో చూపిస్తాము,” అనుకుంటూ రాసుకొచ్చాడు.