NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కోటి దీపోత్సవంలో 8వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే
ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన దీపయజ్ఞం కోటిదీపోత్సవం ఎనిమిదో రోజుకు చేరింది.. ‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే..” అంటారు.. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగిచ గలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది.. అదే ఒకే చోట కోటి దీపాలను వెలిగించి.. ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ.. లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞం కోటికి చేరుకుని.. తెలుగు రాష్ట్రాలలోని భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది..
ఇక, 8వ రోజుకు చేరిన కోటిదీపోత్సవం వేడుకలు నేటి కార్యక్రాల విషయానికి వస్తే..
* నాగసాధువులచే మహా రుద్రాభిషేకం
* సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన
* ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కల్యాణం
* సింహవాహనంపై ఆదిపరాశక్తి అద్భుత సాక్షాత్కారం
* కంచి కామాక్షి దేవి, కొల్హాపూర్‌ మహాలక్ష్మి దర్శన భాగ్యం
* మైసూర్‌ అవధూత దత్తపీఠం శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వచనం
* ఉడుపి పెజావర్‌ మఠం శ్రీవిశ్వప్రసన్న తీర్థస్వామి ఆశీర్వచనం
* పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం
* అద్భుత కళాసంబరాలు, అద్వితీయ భక్తినీరాజనాలు

చంద్రబాబుకు బెయిల్‌పై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన విషం విదితమే.. అయితే, చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఏపీ ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.. స్కిల్‌ స్కాంకు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది తొందరపాటుగా భావిస్తున్నాం అంటున్నాయి. టీడీపీ నుంచి ఎవ్వరూ ఇప్పటి వరకూ దర్యాప్తునకు హాజరు కాలేదు.. సీడీఐ కోరిన సమాచారం కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు.. దర్యాప్తునకు సహకరించడంలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేశాం.. సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌లు హై ఎండ్‌ టెక్నాలజీని బదిలీ చేయలేదు అనడానికి దృఢంగా చెప్పలేదని బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడం కూడా సరికాదు.. కుదుర్చుకున్న ఎంవోయూను వారు అమలు చేయలేదన్నది ఈకేసులో ప్రధాన అంశం.. రిమాండ్‌ రిపోర్టులో ప్రతి పేరాలో ఇదే అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ సోదాలు
మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ ఎన్నికల బరిలో నిలిచారు. వేకువజాము నుంచి అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. చెన్నూరు, హైదరాబాద్, సోమాజిగూడలోని వివేక్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే… పార్టీ కార్యాలయాలు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఐటీ సోదాల సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చెన్నూరులోని వివేక్ ఇంటి వద్ద గుమిగూడారు. వారిని పోలీసులు అదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రచారంలో భాగంగా వివేక్ డబ్బు సంచుల కొద్ది తీసుకొచ్చి పంచుతున్నాడని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఆయన ఇంటి దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారు. వివేక్‌కు మద్దతుగా నిలిచారు.

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. కాల్పుల్లో జవాన్‌తో సహా ఇద్దరు మృతి
మణిపూర్‌లో మళ్లీ హింస మొదలైంది. ఇన్ని రోజులైనా ఇక్కడ పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనలో కాంగ్‌పోక్పి జిల్లాలో రెండు ప్రత్యర్థి సమూహాల మధ్య జరిగిన కాల్పుల్లో 6వ IRB పోలీసు హెన్మిన్లెన్ వైఫేతో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరోథెల్, కొబ్షా గ్రామాల మధ్య ఒక ప్రదేశంలో కాల్పులు జరిగాయి, అయితే కాల్పులకు కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కుకీ-జో కమ్యూనిటీ ప్రజలు రెచ్చగొట్టకుండా దాడి చేశారని ఒక గిరిజన సంస్థ పేర్కొంది. దీంతో జిల్లాలో బంద్‌ ప్రకటించారు.

పిల్లల ఆత్మహత్యకు కారణం తల్లిదండ్రులే.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
కోటా ఆత్మహత్య కేసులో పిల్లల తల్లిదండ్రులే బాధ్యులంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోటాలో పిల్లలు ఈ స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడడానికి తల్లిదండ్రులే బాధ్యులని కోర్టు పేర్కొంది. దీంతో కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు కోర్టు నిరాకరించింది. కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 24 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రుల కోరికలను పిల్లలపై రుద్దడం వల్లే వారు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు తమ పిల్లల నుండి వారి సామర్థ్యాల కంటే ఎక్కువ ఆశిస్తారు. దీంతో పిల్లలు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్నారుల ఆత్మహత్యలకు కోచింగ్ సెంటర్లే ​​కారణమంటూ ముంబైకి చెందిన వైద్యుడు అనిరుధ్ నారాయణ్ మల్పానీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ఎట్టకేలకు టన్నెల్లో 41మంది కనిపించారు.. కానీ వీడియో చూస్తే దారుణం
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 6 అంగుళాల పైప్‌లైన్ వారి పాలిట ప్రస్తుతం జీవనాధారంగా మారింది. తొలిసారిగా ఈ పైపు ద్వారా కూలీలకు వేడి వేడి ఆహారాన్ని పంపించారు. తాజాగా వారు టన్నెల్లో చిక్కుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సొరంగంలో చెత్తాచెదారం కుప్పకూలడంతో కూలీలు ఆరోగ్యంగా కనిపించడం ఊరటనిచ్చే అంశం. సొరంగంలో శిథిలాలు పడిపోవడంతో వారంతా 10 రోజులుగా చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్ కొత్త పైప్‌లైన్ సహాయంతో కెమెరాను పంపింది. ఇప్పుడు వారు బయట స్క్రీన్‌పై ప్రతి క్షణం మానిటర్ చేయవచ్చు. మొదటి వీడియోలో లోపల తగినంత లైటింగ్ ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుంది. కార్మికులంతా కెమెరా ముందు నిలబడి వాకీటాకీల ద్వారా మాట్లాడుకుంటున్నారు. బృంద సభ్యులందరూ సమీపంలో నిలబడి పూర్తిగా ఫిట్‌గానే కనిపిస్తున్నారు.

కెప్టెన్‌గా సూర్యకుమార్‌.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!
వన్డే ప్రపంచకప్‌ 2023 సమరం ముగిసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓడిన భారత్‌.. మరోసారి అదే జట్టుతో సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్‌ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో.. సూర్యకుమార్‌ యాదవ్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అయితే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ (తొలి మూడు మ్యాచ్‌లకు దూరం) వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబె, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఈరోజు ఎంతంటే?
బంగారం కొనాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే రూ.50 రూపాయల తగ్గింది.. 22 క్యారెట్ల బంగారంపై, 24 క్యారెట్ల బంగారంపై రూ. 50 మేర తగ్గింది. దీంతో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది.. బంగారం పెరిగితే, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు మార్కెట్ లో స్థిరంగా ఉంది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది. ముంబైలో రూ.76,000 ఉండగా.. చెన్నైలో రూ.79,000, బెంగళూరులో రూ.72,250 ఉంది. కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.76,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,000 గా కొనసాగుతుంది.. రెండు రోజులు ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

రికార్డ్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది…
కెజియఫ్‌ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ టైమ్ కి సలార్ మేనియా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి కలెక్షన్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో ఇండియాలో మొదటిసారి రూపొందిన సినిమా కాబట్టి హాలీవుడ్ లో కూడా సలార్ ఇంగ్లీష్ వెర్షన్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. నెల రోజుల్లో రిలీజ్ ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ జోష్ ని మరింత పెంచుతూ పది రోజుల్లో సలార్ ట్రైలర్ బయటకి రానుంది. టెన్ డేస్ టు సలార్ ట్రైలర్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. డిసెంబర్ 1న సాయంత్రం 7:19 నిమిషాలకి సలార్ ట్రైలర్ బయటకి రానుంది. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన సలార్ టీజర్, రిలీజైన 24 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ట్రైలర్ ఏ రేంజులో డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఒక్కసారి ట్రైలర్ బయటకి వచ్చేస్తే… ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హైప్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం గ్యారెంటీ.

Show comments