Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. మూడోరోజు విశేష కార్యక్రమాలు ఇవే..
ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్‌ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది.. భక్తిటీవీ కోటిదీపోత్సవం-2023 , 2వ రోజు కాణిపాకం వినాయక స్వామి కల్యాణం, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం.. కాజీపేట శ్వేతార్క మూలగణపతికి సప్తవర్ణ అభిషేకం,కోటి గరికార్చన.. మూషికవాహనంపై గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు, మయూరవాహనంపై మోపిదేవి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఇలా కన్నుల పండుగగా సాగింది.. ఇక, మూడో రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
మూడో రోజు ఇల కైలాసంలో జరిగే విశేష కార్యక్రమాల్లోకి వెళ్తే..
* కంచి కామాక్షి అమ్మవారి దర్శనం.
* భక్తులచే కోటిపసుపు కొమ్ముల సుమంగళి పూజ
* సకలదోషాలను హరించే అలంపురం బోగులాంబ కల్యాణం.
* కైలాసవాహనంపై ఆది దంపతుల అనుగ్రహం
* తుని తపోవనం శ్రీసచ్చిదానంద సరస్వతిస్వామి అనుగ్రహభాషణం
* కాశీ జగద్గురు శ్రీచంద్రశేఖర్‌ శివాచార్య మహాస్వామి అనుగ్రహభాషణం
* డాక్టర్‌ ఎన్‌. అనంతలక్ష్మి ప్రవచనామృతం
* కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు..
* స్వర్ణలింగోద్భవ వైభవం
* మహాదేవునికి మహానీరాజనం

ఏపీలో భారీ వర్షాలు.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
నేడు, రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారిపోయింది.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని.. విశాఖకు 380 కిలో మీటర్లు, పారాదీప్ కు 480 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలో మీటర్ల దూరంలో కేద్రీకృతం అయిఉన్నట్టు తెలిపింది.. గడచిన 6 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం పయనిస్తోన్నట్టు తెలిపిన వాతావరణ.. రేపు తీవ్ర వాయుగుండంగా పశ్చిమ బెంగాల్ తీరం మోన్గ్లా ఖేపురా మధ్య తీరం దాటే ఆవకాశం ఉందని పేర్కొంది.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చాల చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు అవకాశం ఉందని తెలిపింది.. ఇక, తీరం వెంబడి గాలులు 45-55 కిలోమీటర్లు వేగంతో వీచే ఆవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది.. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక.. కాకినాడ, గంగవరం పోర్టలకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చిరికలు జారీ చేసింది విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం.

మరోసారి ఐటీ దాడులు.. బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లలో సోదాలు
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ దాడులు మరోసారి కలకలం సృష్టించాయి. ఈసారి ఈ దాడుల టార్గెట్ బీఆర్ఎస్ నేతలే. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అనుచరులు ఇళ్లలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడలోని వైదేహి వెంచర్స్ లో సోదాలు కొనసాగిస్తున్న ఐటీ అధికారులు. మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాదులో 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు శ్రీధర్ తో పాటు వాళ్ళ కుమారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వైదేహి కన్స్ట్రక్షన్ పేరుతో నల్లమోతు భాస్కరరావు అనుచరులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారంతో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు ఆదా అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమాచారం అందిన వెంటనే ఐటీ అధికారులు వారి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు.

ఈనెల 20 వరకు కేటీఆర్‌ రోడ్ షో.. షెడ్యూల్ ఇదీ..
తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార బీఆర్‌ఎస్ ఇప్పుడు తదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఈసారి గ్రేటర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగనున్నారు. భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మొన్నటి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తన దృష్టి అంతా హైదరాబాద్ నగరంపైనే పెట్టాడు. పెద్ద నగరంపై నియంత్రణను కొనసాగించేందుకు తన ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులోభాగంగా నగరంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. నిన్నటి నుంచి నగరంలో కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభించారు. రెండు నియోజకవర్గాల్లో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేటీఆర్ ప్రచారం కొనసాగనుంది. తొలి విడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 నియోజకవర్గాల్లో నేటి నుంచి ఈ నెల 20 వరకు రోడ్ షోలు నిర్వహించేందుకు కేటీఆర్ ప్లాన్ చేశారు. ఇవాళ నగరంలోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లలో ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 19న అంబర్‌పేట, ముషీరాబాద్‌, 20న మంత్రి కేటీఆర్‌ ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌లో పర్యటించనున్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా రైల్వేలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం రైల్వేలో ట్రైనీ అప్రెంటీస్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక సైట్ konkanrailway.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2023. అభ్యర్థులు నోటిఫికేషన్ లోని లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇక కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌లో 190 ఖాళీగా ఉన్న ట్రైనీ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన డిప్లొమా చేసి ఉండాలి.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.

కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు
శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసం లో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు. అయితే ఈ మాసంలో పాటించే ప్రతి ఆచారం వెనుక సైన్స్ దాగి ఉంది. కార్తీక మాసం లో ఆచరించే ప్రతి నియమం మన ఆరోగ్యాన్ని మేరుపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ఆచారాల వెనుక దాగిన ఆ నిగూడ శాస్త్రీయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం అనే కాదు హిందూ ధర్మంలో ఏ పండుగను ఆచరించిన మొదటగా గుమ్మానికి మామిడాకు తోరణాలు కడతారు. ఇలా మామిడాకు తోరణాలు కట్టడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది అంటారు. అయితే లక్ష్మి అంటే సంపద మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. చెట్టు నుండి తెంపిన తరువాత కూడా మామిడాకులకు కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వదిలే శక్తి ఉంది. కనుక మామిడాకులను గుమ్మానికి కడితే అవి కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మనకు అందిస్తాయి. అందుకే తోరణాలను కడుతారు.

సెమీ ఫైనల్ కాదు.. ‘షమీ’ ఫైనల్!
వన్డే ప్రపంచకప్‌ 2023లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో ఏకంగా 23 వికెట్స్ పడగొట్టాడు. లీగ్ దశలో న్యూజీలాండ్, శ్రీలంకలపై ఐదేసి వికెట్స్ పడగొట్టిన షమీ.. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్స్ తీశాడు. దక్షిణాఫ్రికాపై 2 వికెట్స్ తీసిన అతడు.. నెదర్లాండ్స్‌పై మాత్రం ఒక్క వికెట్ తీయలేదు. ఇక కీలక సెమీస్ మ్యాచ్‌లలో సంచలన బౌలింగ్‌తో జట్టుకు అద్భుత విజయం అందించాడు. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో ఏడు వికెట్లు తీసిన మహ్మద్ షమీ.. కలకాలం గుర్తిండిపోయే గొప్ప ప్రదర్శన చేశాడు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. షమీ పదునైన బంతులకు దాసోహమైంది. ఓ దశలో టీమిండియాను భయపెట్టిన న్యూజిలాండ్‌ బ్యాటర్లను పెవిలియన్ చేర్చుతూ.. కివీస్‌ను చావుదెబ్బ తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో న్యూజిలాండ్‌ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కివీస్‌ మ్యాచ్‌లో పట్టుబిగిస్తున్న సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించి భారత్ ఊపిరి పీల్చుకునేలా చేసిన షమీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహ్మద్ షమీ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఫాన్స్, మాజీలు షమీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మహ్మద్ షమీ అద్భుతం, మహ్మద్ షమీ సూపర్, మహ్మద్ షమీ తోపు అంటూ ట్వీట్స్ చేస్తారు. చాలా మంది అయితే.. ఇది సెమీ ఫైనల్ కాదు.. ‘షమీ’ ఫైనల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షమీ బౌలింగ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లను భయపెట్టిన షమీ బౌలింగ్‌ను మీరూ ఒకసారి చూసేయండి.

చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఎవరికీ సాధ్యం కాలే!
బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 7 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భారత్‌కు షమీ ఆపద్భాందవుడయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్న కేన్ విలియమ్సన్‌తో పాటు టామ్ లేథమ్‌ను ఒకే ఓవర్లో ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆపై ప్రమాదకర మిచెల్‌ను పెవిలియన్ పంపి.. టీమిండియా హీరో అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. సెమీ ఫైనల్‌లో దుమ్ములేపిన షమీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌కప్‌ 2023లో మహ్మద్ షమీ ఐదుకు పైగా వికెట్లు సాధించడం ఇది మూడో సారి. అంతకుముందు న్యూజిలాండ్‌, శ్రీలంకపై ఐదు వికెట్స్ పడగొట్టాడు. వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఫైవ్‌ వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా షమీ రికార్డుల్లో నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు మరే బౌలర్‌కు సాధ్యం కాలేదు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధికసార్లు ఐదు వికెట్స్ పడగొట్టిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2019 వరల్డ్‌కప్‌లో కూడా షమీ ఒక ఫైవ్‌ వికెట్ల హాల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రి​కార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉండేది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా మహ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్‌పై 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన షమీ.. ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు స్టువర్ట్‌ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బంగ్లాదేశ్‌పై 4 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

బాప్రే.. ఆ ఇద్దరు భయపెట్టారు: రోహిత్
న్యూజిలాండ్‌ బ్యాటర్లు డారిల్ మిచెల్‌ (134; 119 బంతుల్లో 9×4, 7×6), కేన్ విలియమ్సన్‌ (69; 73 బంతుల్లో 8×4, 1×6) అద్భుతంగా ఆడారని, ఓ దశలో తమని బయపెట్టారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మహమ్మద్ షమీ అద్బుతంగా బౌలింగ్ చేశాడు, అతడి వలెనే ఈ విజయం అని పేర్కొన్నాడు. లీగ్ దశలో 9 మ్యాచ్‌లు ఎలా ఆడామో, అలానే నాకౌట్ మ్యాచ్‌ల్లో సత్తాచాటాలని ముందే నిర్ణయించుకున్నామని రోహిత్ చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో 70 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లింది. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన మొహ్మద్ షమీ (7/57)కి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడుతూ… ‘వాంఖడేలో నేను చాలా క్రికెట్ ఆడాను. ఈ మైదానంలో భారీ స్కోర్ చేసినా.. రిలాక్స్‌గా ఉండలేం. వీలైనంత త్వరగా పనిని పూర్తి చేయాలి. ఈ మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుందని తెలుసు. ఫీల్డింగ్‌లో చిన్న చిన్న తప్పిదాలు చేసినా.. మేం ప్రశాంతంగానే ఉన్నాం. చివరకు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. స్కోరింగ్ రేటు 9 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. వచ్చిన అవకాశాలను ఒడిపట్టాలి. కివీస్ అవకాశాలు ఇచ్చినా.. మేము వాటిని అందుకోలేకపోయాం. విలియమ్సన్, డారిల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారిద్దరూ బ్యాటింగ్ చేస్తుంటే.. మేం ప్రశాంతంగానే ఉన్నాం. ప్రేక్షకులు కూడా సైలెంట్‌గా ఉండిపోయారు. ఒక్క వికెట్ పడినా మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని మాకు తెలుసు’ అని అన్నాడు.

ప్రభుత్వం పై 1140శాతం పెరిగిన పెన్షన్ భారం..2022-23లో రూ.4.63లక్షల కోట్లు
ఒకవైపు దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఉద్యోగులు NPSని వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతీయ రాష్ట్రాలపై గణాంకాల హ్యాండ్‌బుక్ 2022-23ను విడుదల చేసింది. దీనిలో ప్రతి రంగానికి సంబంధించి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చూపించారు. ఈ హ్యాండ్‌బుక్‌లో రాష్ట్రాల పెన్షన్ బాధ్యతలకు సంబంధించిన డేటా విడుదల చేయబడింది. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2004-05 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై పెన్షన్ భారం రూ.37,378 కోట్లు. ఇది 2014-15లో 10 సంవత్సరాలలో దాదాపు 4 రెట్లు పెరిగి రూ. 1,83,499 కోట్లకు అంటే 400 శాతం పెరిగింది. వచ్చే 9 సంవత్సరాల 2022-23లో, పెన్షన్ భారం 152 శాతం లేదా ఒకటిన్నర రెట్లు పెరిగి రూ.4,63,437 కోట్లకు చేరుకుంది. ఇక 2004-05 నుంచి 2022-23 మధ్య 19 ఏళ్లలో రాష్ట్రాలపై పెరిగిన పెన్షన్ భారాన్ని పరిశీలిస్తే అది రూ.37,378 కోట్ల నుంచి రూ.4,63,437 కోట్లకు పెరిగింది. అంటే, ఈ కాలంలో పెన్షన్ లయబిలిటీలో రూ. 4.26 లక్షల కోట్లు అంటే 11 రెట్ల కంటే ఎక్కువ 1140 శాతం పెరిగింది.

ఇంస్టాగ్రామ్ అప్డేట్ ..మీ పోస్టులను కొందరికి మాత్రమే కనిపించేలా పెట్టవచ్చు.. ఎలాగంటే?
సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ లో మరో కొత్త అప్డేట్ వచ్చేసింది.. క్లోజ్ ఫ్రెండ్స్ ను ఈ ఫీచర్ మరింత దగ్గర చేస్తుంది..తమ అకౌంట్లలోని స్టోరీస్, నోట్స్‌తో పాటు పోస్ట్‌లు, రీల్స్‌ని ఎంపిక చేసుకున్న స్నేహితుల గ్రూపుతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈ మేరకు మార్క్ జుకర్‌బర్గ్ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించారు.. ఈ ఫీచర్ వల్ల షేర్ చేసిన రీల్స్, పోస్ట్‌లపై స్టోరీలు, లైక్స్, కామెంట్‌లు సన్నిహిత స్నేహితుల జాబితాలోని ఇతర సభ్యులకు మాత్రమే కనిపిస్తాయి. ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి మీ ఫీడ్‌కి వెళ్లండి.
కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేసేందుకు స్క్రీన్ దిగువన ఉన్న ‘ప్లస్ ‘ ఐకాన్‌పై నొక్కండి.
మీరు క్రియేట్ చేయాలనుకునే పోస్ట్ టైప్ ఎంచుకోండి..
మీరు మీ ఫోన్ గ్యాలరీ నుంచి షేర్ చేయాలనుకుంటున్న ఫొటో లేదా వీడియోను ఎంచుకోండి.
మీ పోస్ట్‌కు క్యాప్షన్ ఏదైనా అవసరమైతే ఎడిట్ చేసుకోండి..
రీల్‌కి ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ మ్యూజిక్ జోడించడానికి ఎడిట్ టూల్స్ ఉపయోగించండి.
క్యాప్షన్ బాక్స్ దిగువన ఉన్న ‘Audience’ ఆప్షన్‌పై నొక్కండి. ఆప్షన్ల జాబితా నుంచి ‘Close Friends’ ఎంచుకోండి.. అంతే ఈ ఫీచర్ ను మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు..

Exit mobile version