NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

చెత్త ఏరుకోవడానికి వెళ్తే రూ.25 కోట్లు దొరికాయి..!
సాధారణంగా కరెన్సీ దొరికితేనే కాస్త ఆశ్చర్యపోతాం.. ఒకవేళ అలాంటిది ఏకంగా రూ.25 కోట్లు దొరికితే ఏం చేయాలో కూడా తెలియకుండా షాక్‌కు గురయ్యే పరిస్థితి.. అది కూడా చెత్త కుప్పలో..! ఇలాంటి ఘటనే బెంగళూరులో ఈ నెల 1వ తేదీన జరిగింది.. అయితే అది ఇండియన్ కరెన్సీ కాదు.. అమెరికా డాలర్లు. బెంగళూరు శివారులో సల్మాన్ షేక్ అనే వ్యక్తి రోజులాగే చెత్త ఏరుతుండగా 23 కట్టల అమెరికన్ డాలర్లు దొరికాయి. షాక్‌తిన్న అతడు.. తన మూటలో డాలర్ల కట్టలను వేసుకొని ఇంటికి వెళ్లిపోయాడు.. ఏం చేయాలో అర్థంకాక.. మూడు నాలుగు రోజుల పాటు ఆలోచించాడు.. చివరకు 5వ తేదీన ఆ కరెన్సీని తన యజమాని బప్పాకు అందజేశాడు.. ఆ తర్వాత ఈ వ్యవహారం స్థానిక సామాజిక కార్యకర్త కలీముల్లా వరకు వెళ్లింది.. ఇక, బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానందకు ఈ విషయాన్ని చేరవేశారు.. అనంతరం కేసు దర్యాప్తు చేయాల్సిందిగా హెబ్బాళ్ పోలీసులను ఆదేశించారు సీపీ.. అయితే, దొరికిన ఆ డాలర్ల విలువ రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఆ కరెన్సీ కట్టలపై కొన్ని రకాల రసాయనాలు పూసినట్లు కూడా గుర్తించారు. నల్లడాలర్ కుంభకోణానికి పాల్పడిన ముఠా ఈ కరెన్సీ నోట్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు.. అవి అసలు డాలర్లా లేక నకిలీవా? అనే అనుమానాలు కూడా కలగడంతో.. ఆ విషయాన్ని తేల్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

సెలబ్రిటీలను పక్కనబెట్టిన బీజేపీ.. వద్దుమొర్రో అన్న వ్యక్తికి టికెట్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల సమర్పణకు మరొక్క మాత్రమే మిగిలి ఉంది. బీఆర్ఎస్‌ అభ్యర్థులందరికి బీ ఫామ్‌లు అందజేసింది. అటు కాంగ్రెస్‌ పార్టీ సైతం అభ్యర్థులకు ప్రకటించిన వారికి బీఫామ్‌లు అందజేసింది. బీ ఫామ్‌ అందుకున్న నేతలు ఇప్పటికే నామినేషన్లు సమర్పించారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ పెట్టింది. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాల్లో ఒక్క సెలబ్రెటీకు కూడా టికెట్‌ ఇవ్వలేదు. కాషాయ పార్టీలో పేరున్న సెలబ్రెటీలు లేరా అంటే.. చాలా మందే ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్‌ నటీమణులుగా పేరున్న వారు ఉన్నారు. వీరిలో ఒక్కరికి కూడా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికట్లో టికెట్ కేటాయించలేదు. ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవితా రాజశేఖర్‌, మధవీలత, రేష్మా ఉన్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కోస ప్రయత్నించిన ఒక్కరికీ వర్కౌట్‌ కాలేదని తెలుస్తోంది. సెలబ్రెటీలకు ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి టికెట్‌ కేటాయించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాజీ మంత్రి బాబుమోహన్‌ బీజేపీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. సీన్‌ కట్ చేస్తే అందోల్‌ టికెట్‌ను బాబుమోహన్‌కు కేటాయించింది. వద్దుమొర్రో అన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వండి మహాప్రభో అన్నవారికి కట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనన్న వ్యక్తికి టికెట్‌ కేటాయించిన కాషాయ పార్టీ.. మహిళా నటుల్లో ఏ ఒక్కరికి పోటీ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.

పాలిటిక్స్‌లో పట్టువదలని విక్రమార్కులు..! ఈసారైనా అసెంబ్లీలో అడుగుపెడతారా?
రాజకీయాలు ఓ సవాల్‌.. కొందరిని వరుసగా విజయాలు వరించవచ్చు.. మరికొందరు ఏళ్ల తరబడి విజయం కోసం నిరీక్షించవచ్చు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు నేతలకు వరుస విజయాలు లభిస్తున్నాయి. మరికొందరు నేతలకు మాత్రం పరాజయాలే పలకరిస్తున్నాయి. నాలుగైదు సార్లు పోటీ చేస్తున్నా.. విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. గెలుపు వాకిట వరకు వచ్చి ఆగిపోతున్నారు. స్వల్పమెజార్టీతో ఓడిపోతుండటంతో.. కొంచెం కష్టపడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ప్రతి ఎన్నికల్లో వస్తోంది. మరీ ఈ ఎన్నికల్లోనూ అయినా ఆ నేతలు గెలుపుబాట పడతారా అన్నతి ఆసక్తికరంగా మారింది. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రతి ఎన్నికల్లో పోరాడుతూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిందేనన్న పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అనాల్సిందేనన్న అభిప్రాయంలో ఉన్నారు. కొందరు ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌ అంటూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. బీజేపీ సీనియర్‌ నేత తల్లోజు ఆచారి కల్వకుర్తిలో మూడు దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విజయం కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 1994లో తొలిసారి కల్వకుర్తి నుంచి కాషాయ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. 2004, 2009, 2014, 2018.. ఐదుసార్లు పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. 2014లో 32 ఓట్ల స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లోనూ కల్వకుర్తి నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సిరిసిల్ల నుంచి మూడుసార్లు బరిలో దిగిన కేకే మహేందర్‌రెడ్డి.. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు అంచుల్లోకి వచ్చారు. కేవలం 171 ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2014, 2018లలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ద్వితీయ స్థానానికే పరిమితమయ్యారు. ఈ సారీ అదే పార్టీ తరఫున అదే స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మంత్రి కేటీఆర్‌ను ఢీ కొట్టబోతున్నారు. ధర్మపురి నుంచి కాంగ్రెస్‌ నేత అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. అన్ని ఎన్నికల్లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఈసారి కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ దక్కించుకున్న లక్ష్మణ్‌కుమార్‌.. విజయం కోసం శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తున్నారు. బోథ్‌ నియోజకవర్గం నుంచి అనిల్‌జాదవ్‌ బీఆర్ఎస్‌ తరపున పోటీ చేస్తున్నారు. 2009, 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి.. రెండోస్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 28 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. వేములవాడ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న ఆది శ్రీనివాస్‌ ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2009, 2010, 2018లలో కాంగ్రెస్‌ నుంచి, 2014లో బీజేపీ అభ్యర్థిగా పొటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండు సార్లు గెలుపు వాకిట వరకూ వచ్చి ఆగిపోయారు. ఈ సారైనా గెలిచి తీరాలన్న కసితో ప్రచారం చేస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఫిరోజ్ ఖాన్‌ పోటీ చేస్తున్నారు. 2009 నుంచి నాంపల్లి నియోజకవర్గంలో విజయం కోసం ప్రయత్నిస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ తరపున, 2018లో కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగినా పరాజయమే పలకరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కించుకున్న ఆయన అసెంబ్లీ అడుగు పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. భూపాలపల్లి నుంచి 2014, 2018లలో గట్టి పోటీ ఇచ్చిన గండ్ర సత్యనారాయణరావు.. 2023లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎన్‌.రాంచందర్‌రావు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2018లలో బరిలో దిగినా గెలుపు దక్కలేదు. 2019లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినా అదృష్టం వరించలేదు. మధ్యలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. మరోసారి మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.

నామినేషన్లకు నేడే ఆఖరు రోజు.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని బీజేపీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఈరోజు చివరి రోజు. అయితే బీజేపీ ఇంకా 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మరికొద్ది గంటల్లో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,317 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం ఒక్కరోజే 1,129 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 9 శుభదినం కావడంతో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేశారు. సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్, సిద్దిపేట నుంచి హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ఒక్కరోజు ముందు కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ తుది జాబితా అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈరోజు కామారెడ్డిలో బహిరంగ సభ కూడా ఉంది. బీసీ డిక్లరేషన్‌ ప్రకటించే ఈ సమావేశానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు. నామినేషన్‌కు ఒక్కరోజు ముందు బీజేపీ కూడా ఓ జాబితాను విడుదల చేసింది. మల్కాజిగిరి నుంచి రామచంద్రరావుకు, పెద్దపల్లి నుంచి ప్రదీప్‌రావుకు టికెట్ దక్కింది. శేరిలింగంపల్లి టికెట్ విషయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి ఆసక్తి కరువైంది. శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్‌కు టికెట్ రావడంతో ఉత్కంఠ పెరిగింది. నాంపల్లి నుంచి రాహుల్‌ చంద్రకు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి కృష్ణప్రసాద్‌, నకిరేకల్‌ నుంచి మొగిలికి టికెట్లు దక్కాయి. వీరంతా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో పాటు వేములవాడ బీజేపీలో రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. తుల ఉమన్‌ను బీజేపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. అయితే యువజన బీజేపీ నేత వికాస్ రావు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వేములవాడ నుంచి వికాస్‌రావుకు టికెట్ ఇవ్వడాన్ని ఆయన మద్దతుదారులు వ్యతిరేకించారు. అదే సమయంలో బీజేపీ మరో 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులు ప్రచారంపైనే దృష్టి సారించడంతో అయోమయానికి గురవుతున్నారు. ఇదిలావుంటే, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొందరు నేతలను పిలిచి నామినేషన్లు వేయాల్సిందిగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట్లో దీపావళి వేడుకలు..
భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. బుధవారంనాడు జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానిగా సునాక్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి అధికార నివాసాన్ని రంగు రంగుల దీపాలతో రెడీ చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్(ఎక్స్‌)లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా
రిషి సునాక్‌ అందరికీ దీపావళి శుభాకాంక్షలు వెల్లడించారు. ఇక, భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సైతం మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ దీపావళి వేడులక కార్యక్రమంలో పలువురు ఇండో అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌ తదితరులతో కమలా హ్యారిస్ మాట్లాడారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య పోరును గురించి ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సహాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

పసిడి ప్రియులకు శుభవార్త.. పండగ వేళ దిగొస్తున్న బంగారం ధరలు!
దీపావళి పండుగకు ముందు పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు పసిడి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 440 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,910గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760గా నమోదైంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760గా ఉంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 73,200లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,200లుగా ఉండగా.. చెన్నైలో రూ. 76,200లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,200లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,200ల వద్ద కొనసాగుతోంది.

భారత్ vs న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. 2019 ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం!
శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్‌.. నాకౌట్‌ చేరేందుకు మార్గం సుగమం చేసుకుంది. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో జట్టుగా కివీస్‌ ఆడనుంది. భారత్‌తో సెమీస్‌లో న్యూజిలాండ్‌ తలపడటం ఖాయమే అయింది. ఎందుకంటే పాకిస్థాన్‌ నాకౌట్‌లో అడుగుపెట్టాలంటే.. మహా అద్భుతమే జరగాలి. పాక్ సంచలనం కాదు.. అంతకుమించిన విజయాన్ని లంకపై అందుకోవాలి. దాదాపుగా ఇది జరిగే పని కాదు కాబట్టి మొదటి సెమీస్‌లో భారత్ vs న్యూజిలాండ్ తలపడనున్నాయి. 2019 ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్ ముందుంది. ప్రపంచకప్‌ 2019లో భాగంగా జులై 10న మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ సెమీస్ ఆడింది. లీగ్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌ చేరిన భారత్.. న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరుణుడు అడ్డంకిగా మారిన ఆ మ్యాచ్‌ రెండు రోజులు జరగ్గా.. తొలి రోజు కివీస్ 46.1 ఓవర్లలో 211/5 స్కోర్ చేసింది. మరుసటి రోజు మిగిలిన ఓవర్లు పూర్తి చేసిన కివీస్.. 8 వికెట్ల నష్టానికి 239 రన్స్ చేసింది. కేన్ విలియమ్సన్‌ (67), రాస్‌ టేలర్‌ (74) టాప్ స్కోరర్లు. భారత బౌలర్ భువనేశ్వర్‌ 3 వికెట్లు వికెట్స్ పడగొట్టాడు.

వన్డే ప్రపంచకప్‌ 2023.. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. లీగ్ మ్యాచ్‌లు ఇంకా నాలుగు మిగిలున్నా.. సెమీస్ ఆడే జట్లు ఏవో దాదాపు ఖరారు అయ్యాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. నాలుగో టీమ్‌గా న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాదించనుంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన కివీస్.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌‌లను వెనక్కి నెట్టి దాదాపుగా సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రపంచకప్ 2023లో అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ సెమీస్ నుంచి నిష్క్రమించదు. 8 పాయింట్స్ ఉన్న పాకిస్థాన్. న్యూజిలాండ్‌ను దాటి సెమీస్ చేరాలంటే భారీ విజయాన్ని అందుకోవాలి. ఇంగ్లండ్‌తో శనివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కనివిని విజయం సాదించాలి. ఒకవేళ పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 277 పరుగుల తేడాతో గెలుపొందాలి. అంటే పాకిస్థాన్ 400 పరుగుల భారీ స్కోర్ చేసి.. ఇంగ్లండ్‌ను 130 పరుగులకు ఆలౌట్ చేయాలి. ఒకవేళ ముందుగా బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేయడమే కాకుండా.. లక్ష్యాన్ని 2.3 ఓవర్లలో చేధించాలి. ఎలా చూసుకున్నా పాకిస్తాన్ గెలుపొందడం అసాధ్యం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు అయినట్లేనని క్రికెట్ విశ్లేషకులు, ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమయితే కివీస్ నాలుగో బెర్త్ దక్కించుకుంటుంది. అప్పుడు భారత్ సెమీఫైనల్ అభ్యర్థి న్యూజిలాండ్ అవుతుంది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీ కొట్టనున్నాయి.