NTV Telugu Site icon

Top Headlines @ 9AM: టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన ప్రచారం.. ఇంకా మిగిలింది 4 రోజులే..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 4 రోజులే ఉండడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్‌ క్యాంపెయినర్లు అంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు. ఇవాళ ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి 4 రోజులే ఉండడంతో.. ఈ సమయాన్ని ఎంతగా వినియోగించుకుంటే అంత మంచిది అన్నట్లు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షణం తీరిక లేకుండా సీనియర్ నేతలంతా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రోజుకు మూడు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం తెలిపారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలు కడుతున్నామన్నారు. అలాగే కూటమి నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ సీఎం జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్‌లో జరగాల్సిన రాహుల్ ప్రచారం గాలివానతో రద్దయింది. రోడ్‌షోలో మాట్లాడిన సీఎం రేవంత్.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అని ఆరోపణలు చేస్తున్నవారే.. దానికి సమాధానం చెప్పాలన్నారు. ముందు కేటీఆర్‌, తర్వాత బీజేపీ వాళ్లు ఎత్తుకున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్‌ రూపంలో బీజేపీ,బీఆర్‌ఎస్‌కు అన్ని నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలతో గులాబీ శ్రేణులలో జోష్‌ పెంచుతున్నారు. మెదక్‌ జహీరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఒక్కటి అమలు చేయలేదని.. ప్రజలను రాచిరంపాన పెడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కారు వల్ల అచ్చేదిన్‌ కాదు.. సచ్చేదిన్‌ వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇలా ఎక్కడికక్కడి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాలిపోయారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాని వచ్చిన ప్రధాని మోడీ.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఇవాళ వేములవాడ, వరంగల్‌ ప్రచార సభలలో ప్రసంగించనున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రాజంపేట పార్లమెంట్ పీలేరు నియోజక వర్గం కలికిరిలో ఎన్డీఏ భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అటు కాంగ్రెస్‌ నేతలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

 

*నేడు వరంగల్ లో మోడీ పర్యటన.. వేములవాడ స్వామివారికి ప్రధాని ప్రత్యేక పూజలు
రాజన్నసిరిసిల్ల జిల్లా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వేములవాడ, రాజన్న సిరిసిల్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మద్దతుగా మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వేములవాడకు బయలుదేరుతారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కోర్టు పక్కన గల మైదానంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. గుడి చెరువులో హెలిప్యాడ్ ను అధికారులు సిద్ధం చేశారు. 1200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వేములవాడ నుంచి ఉదయం 11.05 గంటలకు బయలుదేరుతారు. ఉదయం 11.45 గంటలకు మామునూర్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11.55 గంటలకు బహిరంగ సభ వేదికపైకి చేరుకుని.. మధ్నాహ్నం 12 నుంచి 12.50 వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 12.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. అనంతరం వరంగల్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.00 గంటలకు వేములవాడ నుండి హెలికాప్టర్ లో మామునూరుకు చేరుకుంటారు. ఆ పక్కనే ఉన్న లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వరంగల్ జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నేడు ప్రధాని మోడీ మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు బయలు దేరనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కలికిరిలో ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ బయలు దేరనున్నారు. అనంతరం సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్‌ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియంకు బయలు దేరనున్నారు. స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనం కానున్నారు.

 

*నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు రాజంపేట పార్లమెంట్ పీలేరు నియోజక వర్గం కలికిరిలో ఎన్డీఏ భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, నారా లోకేష్, నాగబాబు, కిషోర్‌కుమార్‌ రెడ్డి సహా ఇతర నేతలు పాల్గొననున్నారు. సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ రానున్నారు. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్‌ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియానికి మోడీ వెళతారు. స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్‌ షో ఉంటుంది. ఈ రోడ్‌ షోలో ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి పాల్గొననున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనం అవుతారు.

 

*నిజామాబాద్‌లో సీఎం రేవంత్ పర్యటన 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ నగరం, ఆర్మూర్‌లో పర్యటించనున్నారు. రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఆర్మూర్‌లోని ఆలూరు బైపాస్, జమ్మనజట్టి గల్లీ, గోల్ బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా రోడ్ షో కొనసాగనుంది. అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. నగరంలోని గోల్ హనుమాన్ చౌరస్తా, ఆర్యసమాజ్, బడా బజార్, పోస్టాఫీసు మీదుగా రోడ్ షోలో సీఎం పాల్గొంటారు. నెహ్రూ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. కాగా.. సీఎం పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తామని సీపీ కల్మేశ్వర్ తెలిపారు.
నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
* పూలాంగ్ చౌరస్తా నుండి నగరంలోకి వచ్చే వాహనదారులు ఆర్ఆర్ చౌరస్తా, వర్ని చౌరస్తా, బోధన్ బస్టాండ్ నుండి గాంధీ చౌక్‌కు వరకు.

* కంఠేశ్వర్ వైపు నుండి బస్టాండ్‌కు ఎన్టీఆర్ స్క్వేర్, రైల్వే స్టేషన్, ఫ్లైఓవర్ నుండి వచ్చే వాహనదారులు.

* బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బా చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బస్టాండ్‌కు రావాలి.

* హైదరాబాద్ నుండి వచ్చే మరియు వెళ్ళే వాహనాలు కంఠేశ్వర్ బైపాస్, కొత్త కలెక్టరేట్, ఖానాపూర్ ఎక్స్ రోడ్ మరియు దుబ్బా చౌరస్తా మీదుగా ప్రయాణించాలి.

* ఆర్మూర్ వెళ్లే వాహనదారులు కంఠేశ్వర్ బైపాస్, కొత్త కలెక్టరేట్ వైపు ఖానాపూర్ ఎక్స్ రోడ్, దుబ్బా చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా వెళ్లాలి.

* బాన్సువాడ వైపు నుంచి వచ్చే మరియు వెళ్లే వాహనాలు వర్ని చౌరస్తా నుంచి ఖిల్లా చౌరస్తా, బోధన్ బస్టాండ్, అర్సపల్లి రైల్వే గేట్, కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బ చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు.

 

*నేడు మెదక్‌, సంగారెడ్డిలో కేసీఆర్ బస్సు యాత్ర..
నేడు మెదక్, సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగనుంది. నర్సాపూర్, పటాన్ చెరులో జరిగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ ఇవాళ సంగారెడ్డి జిల్లాకు వెల్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రజలు, యువకులు, రైతులు భారీగా తరలివస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో బస్సు యాత్ర ముగించుకుని కేసీఆర్ మధ్యహ్నం సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. గుమ్మడిల నుంచి సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. గుమ్మడిల వద్ద పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. గుమ్మడిల నుంచి జిన్నారం మీదుగా పటాన్‌చెరు పట్టణానికి కేసీఆర్ బస్సు కొనసాగుతుంది. దారిలో ప్రజలు, రైతులు, యువత, ఇతర ప్రజాసంఘాలతో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. కేసీఆర్‌ బస్సుయాత్ర పటాన్‌చెరుకు చేరుకున్న తర్వాత సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌ వద్ద కేసీఆర్‌ రాస్తారోకో నిర్వహించనున్నారు. కేసీఆర్ రాస్తారోకోను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. సుమారు 50 వేల మందితో కేసీఆర్‌ రోడ్ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తుంది. జనంతో నిండిపోతున్న రోడ్లతో పాటు కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, నాయకులు ఉన్నారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రాసాపూర్ పట్టణానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కేసీఆర్ రోడ్ షో (బస్సుయాత్ర) చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్ పట్టణంలోని ఎర్రకోట నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగనుంది. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల నుంచి పెద్దఎత్తున రోడ్‌షోకు ప్రజలను తరలించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

*రైతులను ఆగం చేసిన అకాల వర్షం.. చెల్లాచెదురైన ధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అన్నదాత తీవ్రంగా నష్టపోయాడు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఈదురు గాలులకు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల పిడుగులు పడి మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోఅకాల వర్షం రైతులను ఆగం చేసింది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పిడుగుపాటుతో ఇద్దరు రైతులు, గాలి దుమారానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డు, కల్లాల వద్ద వరి ధాన్యం తడిచి ముద్దైంది. భారీ వర్షం రావడంతో వరదలకు పలు చోట్ల కొట్టుకుపోయింది. చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల అష్ట కష్టాలు పడ్డారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు నేలరాలిన మామిడి, భారీ వృక్షాలు నెలకొరిగాయి. గాలివానకి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలపూర్ నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మల్లేశం అనే రైతు మృతి చెందగా.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామ శివారులో పిడుగుపడి మరో రైతు మృతిచెందాడు. అయితే.. భారీ వృక్షాలు రోడ్లపై కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సిద్దిపేట జిల్లా రాయపోల్, మిరుదొడ్డి, కుకునూరుపల్లి, కొండపాక, గజ్వేల్ మండలాల్లో మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. సిద్దిపేట మార్కెట్ యార్డులో వేసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పిట్టలగూడెంలో ఈదురు గాలులకు రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. చేర్యాల మండలం వీరన్నపేటలో కమ్మకోలు రాజు రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వేమూరు మండలంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పర్ణశాలలో ఈదురు గాలులకు పలు దుకాణాలు, ఇళ్ల పైకప్పులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే అకాల వర్షానికి రైతన్నలకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి భారీ నష్టం జరిగిందని పంట నీట మునిగిందని వాపోయారు. అధికారులు ఆదుకొవాలని కోరారు.

 

*కుప్పకూలిన గోడ.. ఏడుగురు మృతి
మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. అయితే అక్కడే వున్న కూలీలపై నిర్మాణంలో వున్న గోడ కూలడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న (మంగళవారం) అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. కూలిన గోడ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. బాచుపల్లి లో నూతనంగా నిర్మాణమవుతున్న హరిజాన్ కన్స్ట్రక్షన్ లో రోజూ కూలీలుగా పనిచేస్తున్నారని స్దానికులు తెలిపారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో పెద్ద వర్షం పడేసరికి హరిజాన్ వెంచర్ చుట్టూ ఉన్న ప్రహరీగోడ, ఇనుప రేకులు కూలిపోయి గోడకు ఆనుకొని ఉన్న గుడిసెలుపై పడటంతో నలుగురుకి గాయాలైయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు‌ కేసు నమోదు చేసుకొని‌ దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఓ మహిళ, నాలుగేళ్ల బాలుడు ఉన్నారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను తిరుపతిరావు, శంకర్, రాజు, రామ్ యాదవ్, గీత, హిమాన్షు, ఖుషిగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ -బేగంపేట్ ఓల్డ్ కస్టమ్ బస్తీలో రెండు చోట్ల నాల వరదనీటిలో మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. దీంతో స్థానికులు బేగంపేట పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను చూసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. మృతదేహాలు కుళ్ళిన స్థితిలో ఉండడంతో బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

*బీఎస్పీ కీలక నిర్ణయం.. వారసుడిగా మేనల్లుడ్ని తప్పించిన మాయావతి
బహుజన్‌ సమాజ్‌ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. బీజేపీపై వివాదాస్పద కామెంట్స్ చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి పరిపక్వత సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. కాగా, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపుగా కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దాని కోసమే అంకితం చేశామని మాయావతి చెప్పుకొచ్చారు. అందుకే కొత్తతరాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం.. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్‌ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా ప్రకటించాం.. కానీ, పార్టీ, ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఆకాష్ పూర్తి స్థాయిలో పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్‌ కుమార్‌ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వర్తించబోతున్నారని మాయావతి వెల్లడించారు. అయితే, ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్‌ ఆనంద్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్‌ గవర్నమెంట్‌గా పేర్కొన్నారు. యువతను ఆకలితో ఉంచుతూ.. పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. ఈ పరిణామం తర్వాత ఆయన ర్యాలీలన్నింటినీ బీఎస్పీ క్యాన్సిల్ చేయడంతో పాటు ఆకాశ్ ఆనంద్ కు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా బీఎస్పీ తొలగించింది.

 

*రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?
చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు ( మే 9) భారత్‌ను సందర్శించనున్నారు. జమీర్ పర్యటన షెడ్యూల్ ను మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత ఊపందుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ద్వీప దేశంలో మూడు సైనిక స్థావరాలను నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ముయిజ్జూ పట్టుబట్టడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. భారత్ ఇప్పటికే చాలా మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది. ప్రెసిడెంట్ ముయిజ్జూ తన దేశం నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించుకోవడానికి మే 10ని గడువుగా నిర్ణయించారు. ఇక, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ రేపు (మే 9) అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం నాడు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో జమీర్ భేటీ అవుతారని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు భారతదేశానికి కీలకమైన సముద్ర పొరుగు దేశంగా ఉంది. అలాగే, విదేశాంగ మంత్రి జమీర్ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి మరింత ఊపందుకుంటుంది అని MEA ఒక ప్రకటనలో పేర్కొంది. మాల్దీవులు-భారత్ భాగస్వామ్యాన్ని “దీర్ఘకాలిక” సంబంధాలను విస్తరించడంపై దృష్టి సారించి జైశంకర్‌తో జమీర్ చర్చలు జరుపుతారని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జమీర్‌ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

 

*రఫా సరిహద్దును స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. కాల్పుల విరమణకు హమాస్ ఓకే
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం ఈజిప్ట్, గాజా మధ్య రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు రఫాపై భూదాడి చేస్తామని హెచ్చరించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ట్యాంకులు రఫా సరిహద్దుకు చేరుకున్నాయి. అదే సమయంలో, రఫా సరిహద్దును ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడానికి కొంతకాలం ముందు, హమాస్ కతార్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించింది. అంతేకాకుండా, 33 మంది బందీలను విడుదల చేయడానికి కూడా అంగీకరించింది. హమాస్ చెర నుండి విడుదలైన ప్రతి బందీకి, ఇజ్రాయెల్ 60 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని కాల్పుల విరమణ నిబంధనలు పేర్కొంటున్నాయి, ఇందులో మహిళలు, పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉంటారు. అయితే ఖతార్, ఈజిప్ట్, అమెరికా అధికారులు రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించింది. మరోవైపు, హమాస్ ప్రత్యర్థి పాలస్తీనా అథారిటీ ప్రతినిధి, సంఘర్షణ తీవ్రతరం కాకుండా ఆపడానికి యుఎస్ మరియు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం, మంగళవారం మధ్య దక్షిణ గాజా, రఫాలో నిర్వహించిన ఆపరేషన్లలో 20 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం రఫాలోని అల్ అబ్రార్ మసీదుపై కూడా దాడి చేసింది. అక్కడ చాలా మంది హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ తాజా కాల్పుల విరమణ ప్రతిపాదన ఇజ్రాయెల్ ముఖ్యమైన డిమాండ్లను పరిగణించడం లేదు. బందీలను తిరిగి ఇచ్చేయాలని గాజాపై చాలా సైనిక ఒత్తిడి ఉందని ఆయన అన్నారు. బందీలను విడిపించేందుకు చర్చలు విఫలమైతే, రఫాపై బలమైన సైనిక దాడి చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు.