NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

నేడు వరంగల్‌ లో సీఎం రేవంత్‌ పర్యటన..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరంగల్ పార్లమెంటరీ ప్రాంతంలో రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇవాళ మూడోసారి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తరఫున ప్రచారం చేసేందుకు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వరంగల్ మండిబజారు వద్దకు వస్తారు. అక్కడ ముస్లిలంతో కలిసి మండిబజారు దర్గాలో ప్రార్థనలు చేస్తారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయల్దేరుతారు. పోచమ్మమైదన్ లోని సాయిబాబా మందిరంలో పూజలు చేస్తారు. పోచమ్మ మైదాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. అక్కడి నుండి సాయంత్రం 6.30 గంటలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటారు. పోచం మైదాన్ నుండి హనుమకొండ వేయిస్తంభాల గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా హనుమకొండ చౌరస్తాకు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు.

నేడు మేడిగడ్డకు జస్టిస్‌ చంద్రఘోష్‌.. కాళేశ్వరం పై న్యాయవిచారణ
నేడు మేడిగడ్డకు జస్టీస్ పినాకి చంద్రఘోష్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిన నేపద్యంలో పర్యటించనున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో దెబ్బతిని , కుంగిపోయిన పియర్లను జ్యుడిషియల్ కమీషన్ చైర్మన్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం రామగుండంలోని‌ విశ్రాంతి గృహంలో రాత్రి బస చేయనున్నారు. కలకత్తా నుంచి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటలకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులతో సమావేశమయ్యారు. మే 9వ తేదీన బీఆర్‌కే భవన్‌లో నీటిపారుదల శాఖతో మరోసారి సమావేశం కానుంది. హైకోర్టు రిటైర్డ్ రిజిస్ట్రార్ మురళీధర్ ను న్యాయ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. విచారణలో సాంకేతిక సహకారం కోసం ప్రాజెక్టుకు సంబంధం లేని ఇద్దరిని తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో భిన్న వాతావరణం.. 19 జిల్లాల్లో వానలకు ఛాన్స్‌
అధిక ఉష్ణోగ్రతలు, వర్షంతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఈ మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 19 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం: ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు (ప్రతి గంటలకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో) నేడు, రేపు, ఎల్లుండి (మంగళ, బుధ, గురు) రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

మూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన..
ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ సైతం ప్రచారం ముమ్మరం చేసింది. మంత్రులు, కీలక నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్ సభ స్థానం పరిధిలోని రాజా నగరం నియోజకవర్గ పరిధిలోని కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకులం లోక్ సభ స్థానం పరిధిలోని ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో నిర్వహిస్తున్న సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 03 గంటలకు విశాఖపట్నం లోక్ సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్ లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.

నేడు పుంగనూరు, తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ప్రచారం చేయడానికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా.. శనివారం సాయంత్రం 6గంటలకే ప్రచారం ముగియనుంది. ఎన్డీయే కూటమి తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించే ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రజాగళం సభలో పాల్గొంటారు. కాగా, ఇవాళ ( మంగళవారం) మధ్యాహ్నం రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలో టీడీపీ అధినేత పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తామో తెలియజేయనున్నారు. ఇక, పుంగనూరులో నేతల పర్యటన నేపధ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గత చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలను పోలీసులు తీసుకుంటున్నారు.

పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పొరపాట్లు.. రీపోలింగ్ కు ఈసీ ఆదేశం
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు మే 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లు వేసేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నెల 5 న చిలకలూరిపేట నియోజకవర్గంలోని, గణపవరం జడ్పీ హైస్కూల్లో జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పొరపాట్లు జరిగినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అసలేం జరిగిందంటే.. ఎన్నికల విధులు నిర్వహించే బూత్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ పేపర్లకు బదులుగా, ఈవీఎం బ్యాలెట్ పేపర్లను అందించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబంధిత ఓటర్లు ఈవీఎం బ్యాలెట్ పేపర్లతోనే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను నమోదు చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తీరా సాయంత్రానికి జరిగిన పొరపాటు తెలుసుకుని.. నాలుక కర్చుకున్నారు ఎన్నికల సిబ్బంది. జరిగిన పొరపాటును ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ పొరపాటుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. గణపవరంలో ఐదో తేదీన నమోదైన 1, 219 ఓట్లను ఇన్ వాలిడ్ గా ప్రకటించింది. రద్దయిన ఈ ఓట్లను రీపోలింగ్ ద్వారా మళ్ళీ నమోదు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది . పలనాడు జిల్లాలో జరిగిన ఈ పొరపాటుకు కారణమైన, అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది, ఎన్నికల కమిషన్.

అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నగరంలోని నిషాన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో ప్రధాని ఓటేశారు. ఉదయం 7:30 గంటల తర్వాత ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనకు స్వాగతం పలకగా.. ఇద్దరు నేతలు బూత్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీని చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం రోడ్డు పక్కనే ఉండి నినాదాలు చేశారు. ఓటింగ్ బూత్‌కు వెళుతున్న సమయంలో ప్రధాని చిత్రపటంపై మద్దతుదారుడికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న అమిత్‌ షా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాల్లో ఈరోజు ఓటింగ్ జరుగుతోంది.

కాసేపట్లో అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌.. ముచ్చటగా మూడోసారి
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌లో నేడు స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్‌ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా.. తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతున్నది. స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్ మంగళవారం ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి ప్రయోగించనున్నారు. 58 ఏళ్ల సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. అంతరిక్ష యాత్ర ప్రారంభించే ముందు సునీత మాట్లాడుతూ.. ఈ క్షణం కోసమే తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకోగానే ఇంటికి తిరిగి వచ్చినట్లుగా ఉంటుందని చెప్పారు. మే 15న భూమికి తిరిగి వచ్చే ముందు వారిద్దరూ ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడపనున్నారు. 4.56 మీటర్ల వ్యాసం కలిగిన ఈ వ్యోమనౌక మొత్తం నలుగురు వ్యోమగాములను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విలియమ్స్ బీబీసీతో మాట్లాడుతూ.. మేమంతా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములైనందుకు మా కుటుంబం, స్నేహితులు సంతోషంగా, గర్వంగా ఉన్నారని పేర్కొన్నారు.

హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్.. అదిరిపోనున్న ఆ సాంగ్..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు .ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు.ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో దర్శకుడు కొరటాల ప్రస్తుతం దేవరలో ఎన్టీఆర్ లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ‘వార్‌ 2’ షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై దర్శకుడు ఆయాన్‌ ముఖర్జీ ఓ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు.ఈ సాంగ్ లో బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కూడా భాగం కానుంది.అయితే ఇదొక పబ్‌ సాంగ్‌ అని తెలుస్తుంది. బ్యాగ్రౌండ్‌లో కొన్ని సీన్స్‌ జరుగుతూ ఉండగా ఈ పాట నడుస్తూ ఉంటుందని సమాచారం.కథలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ పాటలో ఎన్టీఆర్ , హృతిక్‌ రోషన్ పోటీపడి మరీ స్టెప్పులేయనున్నారని సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్‌ ఆవుతుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బిగ్గెస్ట్ పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌గా తెరక్కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .

నేడు రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరు..
నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్ అద్భుతంగా ఆడి పటిష్ట స్థితిలో ఉండగా.. అదే సమయంలో ఢిల్లీ కూడా ప్లే ఆఫ్‌ కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది. కాగా, ఈ సీజన్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 6 స్థానంలో కొనసాగుతుంది. డీసీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ జట్టు మొత్తం రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అయితే, చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోగా.. ఇప్పుడు, సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు ఢిల్లీపై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని చూస్తుంది.