NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

నేడు ఏపీలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌ ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతం చేశాయి అన్ని పార్టీలు.. ఇక, ఈ సారి టీడీపీ-జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. దీంతో.. ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు ఏపీలో ప్రచారానికి తరలివస్తున్నారు.. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు.. రేపు మరోసారి ఏపీకి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏపీలో పర్యటించబోతున్నారు.. నేడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎన్డీఏ కూటమి బహిరంగ సభ నిర్వహించనున్నారు.. ధర్మవరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ధర్మవరం బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి సత్య కుమార్ తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు కీలక నేతలు. ఇక, ఏపీ నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు అమిత్‌షా. మరోవైపు.. ఇవాళ ఏపీకి కేంద్రమంత్రి రాజనాథ్‌ సింగ్ రానున్నారు.. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు కడప చేరుకోనున్న రాజనాథ్‌ సింగ్.. అక్కడి నుంచి ఎర్రగుంట్ల హెలిపాడ్ కు చేరుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నం 12:25 కు జమ్మలమడుగు బహిరంగసభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకూ బహిరంగ సభలో జమ్మలమడుగు బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధి ఆదినారాయణతో కలిసి సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఆధోని చేరుకోనున్న రాజనాథ్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకూ ఆధోనిలో అక్కడి అసెంబ్లీ అభ్యర్ధి పి.వి.పార్ధసారధితో కలిసి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.. అనంతరం కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి లక్నో వెళ్లనున్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌.

ముద్రగడకు కొత్త తలనొప్పి..! మరో వీడియో రిలీజ్‌ చేసిన ఆయన కూతురు..
జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. ఇక ఎన్నికల తరుణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు.. వరుసగా సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ.. పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే.. నాపై సూటిగా మాట్లాడాలని.. ఇతర నేతలతో మాట్లాడించడం కాదని పేర్కొన్నారు. పవన్‌ దమ్ముంటే.. నా ప్రశ్నలపై స్పందించాలి.. నన్ను ప్రశ్నిస్తే.. నేను సమాధానాలు చెబుతానని చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్‌ కల్యాణ్‌ను ఓడించి తీరుతానని.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే.. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఆయన చేసిన కామెంట్లు వైర్‌ అయ్యాయి.. అయితే, ఉన్నట్టుండి ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ముద్రగడ కూతురు క్రాంతి.. తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్‌ను తప్పుబట్టిన ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టంగా పేర్కొన్న ఆమె.. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కల్యాణ్‌ స్పందించారు.. అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ఊహించుకోండి అని సూచించారు.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి.

‘భరత్ టెన్ ప్రామిసెస్’ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన మార్గాని భరత్
రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ మేనిఫెస్టో ఆవిష్కరించారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద అశేష జనవాహిని, నగర ప్రముఖుల సమక్షంలో ‘భరత్ టెన్ ప్రామిసెస్’ పేరుతో ఈ మేనిఫెస్టోను రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నగరంలో రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి సంఘ విద్రోహక శక్తులను నగర బహిష్కరణ చేసి ప్రశాంతమైన నగరంగా ఉంచడం. వారిలో పరివర్తన వచ్చిన తరువాత మళ్ళా నగరంలోనికి అనుమతించడం. నగర వాసులకు 24 గంటలూ మంచినీటి సరఫరా, నగరంలోని యువతకు పదివేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయమని ఎంపీ భరత్ తెలిపారు.

రైతులకు గుడ్‌ న్యూస్‌.. ‘రైతుబంధు’ డబ్బులు పడేది అప్పుడే..
రైతుబంధు నిధుల జమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి డబ్బులు అందని రైతులకు మే 8వ తేదీలోపు డబ్బులు జమ అందజేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల్లో 65 లక్షల మంది రైతులు ఇప్పటికే రైతుబంధు అందుకున్నారని తెలిపారు. ఈ నెల 9వ తేదీలోగా చివరి రైతుకు రైతుభరోసా నిధులు అందనివారికి చెల్లిస్తామన్నారు. కేవలం 4 లక్షల మందికి మాత్రమే అందలేదని ఆయన స్పష్టం చేసారు. మే 9వ తేదీ వరకు రైతుబంధు వల్ల రాష్ట్రంలోని ఏ రైతుకూ బకాయిలు ఉండవని స్పష్టం చేశారు. రైతుబంధుకు నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ నేతల మాటలు నమ్మవద్దని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రుణమాఫీ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్ పాలనలో, పంట ఉత్పత్తికి అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందుకు గాను ఎకరాకు రూ. 5 వేలు అందించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇదే స్కీమ్ ను “రైతు భరోసా” గా అమలు చేయాలని నిర్ణయించింది. అతి త్వరలో కొత్త మార్గదర్శకాలు కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఏటా హెక్టారుకు రూ. 15,000 పెట్టుబడి సాయం అందించనున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. అలాగే వ్యవసాయ కార్మికులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.

నేడు నాలుగు సభల్లో పాల్గొననున్న సీఎం రేవంత్..
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఇవాళ నిర్మల్, గద్వాల, తుక్కుగూడ, శంషాబాద్ లో పర్యటించనున్నారు. ఇక, నిర్మల్, గద్వాల జన జాతర సభలకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. నేటి ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి నిర్మల్ జన జాతర సభలో సీఎం పాల్గొననున్నారు. అలాగే, సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి గద్వాలలోని అలంపూర్ జన జాతర సభలో పాల్గొంటారు. ఇక, సాయంత్రం 7 గంటలకు తుక్కుగూడ కార్నర్ మీటింగ్ కు రేవంత్ హాజరుకానున్నారు. రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ లో నిర్వహించే కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, ఎన్డీయే ప్రభుత్వ హయాంలోని వైఫల్యాలను ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అలాగే, కాంగ్రెస్ పాంచ్ న్యాయ్, పచ్చిస్ గ్యారెంటీలను సైతం ప్రజలకు తెలియజేయనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఇక, తెలంగాణలో 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పట్టుదలతో ముందుకు సాగుతుంది. పార్టీ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బాధ్యతలను మోస్తున్నారు.

నేడు జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షో
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాల పట్టణంలో నేడు (ఆదివారం) పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డికి మద్దతుగా పట్టణంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పార్టీ ముఖ్య నాయకులు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, నేటి సాయంత్రం 5 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ రోడ్డు షోలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్సు స్టాండ్ చౌరస్తా మీదుగా అంగడి బజార్, తహసీల్ చౌరస్తా, ఓల్డ్ బస్సు స్టాండ్ చౌరస్తా వరకు ఈ రోడ్ షో కొనసాగనుంది. అలాగే, ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా దగ్గర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధితో పాటు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు కురిపించే అవకాశం కూడా ఉంది.

పంజాబ్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై.. ప్లేఆఫ్ రేసులో నిలిచెదెవ్వరో..
ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా ఆదివారం 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హిమాచల్ ప్రదేశ్‌ లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే గత మూడేళ్ల నుండి పంజాబ్‌పై విజయం కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో పంజాబ్ 4 మ్యాచులు విజయం సాధించగా, చెన్నై కేవలం ఒక్క మ్యాచ్‌ లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌ లో కూడా 49వ మ్యాచ్‌ లో చెన్నై 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ పై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇకపోతే, ఈ సీజన్‌లో చెన్నైపై ఒత్తిడిని కొనసాగించడం పంజాబ్‌ కు కాస్త కష్టమే. దీనికి కారణం పాయింట్ల పట్టికలో పంజాబ్ 8 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా., చెన్నై జట్టు 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ లో విజయం సాధించడం ద్వారా చెన్నై పట్టికలో టాప్ 3 లోకి ప్రవేశించాలని చూస్తుంది. ఇక ఇరుజట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే.. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొత్తం 30 మ్యాచ్‌ లు జరిగాయి. ఇందులో చెన్నై పంజాబ్ పై పైచేయి సాధించింది. చెన్నై 16 మ్యాచ్‌ లు గెలవగా, పంజాబ్ 14 మ్యాచ్‌ లు మాత్రమే గెలిచింది. ఇక నేడు జరిగే ధర్మశాల స్టేడియంలో మాత్రం.. ఇరు జట్లు సమాన గెలుపోటములు ఉన్నాయి. ఇరు జట్లు ఒకదానితో ఒకటి రెండు మ్యాచ్‌ లు ఆడగా చెరో ఒక్కో విజయం సాధించాయి.

విరాట్ కోహ్లీ బుల్లెట్ త్రో.. షారూఖ్‌ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్‌!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ షారూఖ్‌ ఖాన్‌ను కళ్లు చెదిరే త్రోతో రనౌట్‌ చేశాడు. విరాట్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు షారుక్ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్ అయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌ టైటాన్స్ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ను విజయ్ కుమార్ వైశాక్ వేశాడు. విజయ్ వేసిన నాలుగో బంతిని రాహుల్ తెవాతియా ఆఫ్‌ సైడ్‌కు షాట్ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న షారుక్ ఖాన్ సింగిల్ కోసం పరుగెత్తుకొచ్చాడు. అయితే స్ట్రైక్‌లో ఉన్న తెవాతియా.. నో అంటూ వెనుక్కి వెళ్లమని చెప్పాడు. షారూఖ్‌ వెనక్కి వెళ్లే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్‌ కోహ్లీ.. బౌలర్‌ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టాడు. ఇంకేముంది షారూఖ్‌ పెవిలియన్ చేరక తప్పలేదు.

శంకర్ సార్.. ఇంకెన్ని షాక్ లు ఇస్తారు..?
విశ్వనటుడు కమల్ హాసన్ ,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నలేటెస్ట్ మూవీ “భారతీయుడు 2 “. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా మరియు ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఉదయనిధ స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి గ్రాండ్ గా నిర్మిస్తుంది.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా జూన్ లో థియేటర్స్ కు రానున్నట్లు ప్రకటించారు. అయితే విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు .అయితే ఇప్పుడు ఈ సినిమా జూన్ లో విడుదల కావడం కష్టమని తెలుస్తుంది .పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 ఏడి “..సినిమా జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది .ముందుగా ఈ మూవీ మే 9 న విడుదల కావాల్సి వుంది .కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.దీనితో జూన్ 27 న ఈ సినిమా విడుదల కానుంది.అయితే భారతీయుడు 2 సినిమాను జూన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమైన కూడా ప్రభాస్ మూవీ ఉండటంతో ఏ తేదీన రిలీజ్ చేసేది క్లారిటీ ఇవ్వలేదు .దీనితో ఈ మూవీ విడుదల జులై కి వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ పై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి వుంది .

మరో ఇంట్రెస్టింగ్ ఆఫర్ కొట్టేసిన “పొలిమేర” హీరోయిన్..
నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రియురాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.”మా ఊరి పొలిమేర” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామాక్షి భాస్కర్ల ఈ సినిమాలో లచ్చిమిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించి తన యాక్టింగ్‌తో మెప్పించింది. బ్లాక్ మ్యాజిక్ కథాంశంతో రూపొందిన మా ఊరి పొలిమేర సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన “మా ఊరి పొలిమేర 2 ” మూవీ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్‌ అయింది.కామాక్షి భాస్కర్లకు మా ఊరి పొలిమేర తో పాటు సీక్వెల్ గా వచ్చిన “మా ఊరి పొలిమేర 2 ” మూవీ కూడా నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాగా మా ఊరి పొలిమేర 2 సినిమాకుగాను ఇటీవల ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటిగా కామాక్షి భాస్కర్ల అవార్డును కూడా అందుకున్నది. ఈ అవార్డు రావడంపై కామాక్షి భాస్కర్ల ఆనందం వ్యక్తం చేసింది.ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో కామాక్షి భాస్కర్ల మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాగచైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత వెబ్‌సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఓ జర్నలిస్ట్ జీవితంలో జరిగే సంఘటనలను ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సిరీస్‌లో చూపించారు .దూత సిరీస్ కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో మరో వెబ్‌సిరీస్ చేసేందుకు నాగచైతన్య, డైరెక్టర్ విక్రమ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది దూతకు కొనసాగింపే అయినా కూడా కథ మరియు బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉండబోతున్నట్లు సమాచారం.ఈ వెబ్‌సిరీస్‌లో కామాక్షి భాస్కర్ల ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఈ సిరీస్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.