NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం పర్యటన.. హిందూపురంలో ప్రసంగంపై ఆసక్తి..!
ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. ఈ రోజు కూడా మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న జగన్‌.. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులో పర్యటిస్తారు.. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే సభకు హాజరై సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో జగన్ పర్యటన కొనసాగనుంది.. గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్నికలలో ప్రచారంలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఉదయం 11 గంటలకు హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో సభ నిర్వహించనున్నారు.. రెండు వేల మందితో భారీ పోలీసు బందోబస్సు ఏర్పాటు చేస్తున్నారు.. అయితే, ఈ సారి హిందూపురంలో జెండా ఎగురవేస్తామంటున్నాయి వైసీపీ శ్రేణులు. కానీ, హాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పనిచేస్తున్నారు.. అయితే, బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.. అయితే, గత నెల సచివాలయాల దగ్గర పడిగాపులు కాసిన వృద్ధులు.. ఇప్పుడు తమ ఖాతాల్లో పడిన సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నారు.. బ్యాంకులు ఓపెన్‌ చేయకముందే.. ఉదయం 9 గంటల నుంచే వాటి ముందు క్యూలు కడుతున్నారు.. అయితే, డీబీటీ ద్వారా డబ్బులు జమ కానివారికి ఇవాళ్టి నుంచి ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. పెన్షన్ల పంపిణీ కొరకు ఈ నెల 1,945.39 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏపీలో పెన్షనర్ల సంఖ్య 65,49,864గా ఉందని.. మూడు రోజుల్లో 64,13,200 మందికి అంటే 97.91 శాతం లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. మరోవైపు.. మొత్తం 16,57,361 మందిలో 15,95,482 (96.27 శాతం) మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించింది ఏపీ ప్రభుత్వం.. 48,92,503 మందిలో 48,17,718 (98.47 శాతం) మందికి డీబీటీ ద్వారా పెన్షన్లు అందించినట్టు పేర్కొంది.. 74,399 మంది బ్యాంకు ఖాతాలు పని చేయకపోవడంతో పెన్షన్ అందలేదని స్పష్టం చేసింది.. పెన్షన్ అందని 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.. ఈ రోజు, రేపు 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్‌ అండ్ రూరల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

మరో వృద్ధుడి ప్రాణాలు తీసిన పెన్షన్‌..!
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలు రావడం ఏమో గానీ.. పెన్షన్ల కోసం వెళ్లి వృద్ధులు ప్రాణాలు వదిలేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. గత నెలలో పెన్షన్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి.. ఎండలో పడిగాపులు కాసి కొందరు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుంటే.. ఇప్పుడు.. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసినా.. మరికొందరు ప్రాణాలు పోతున్నాయి.. గత మూడు రోజుల నుంచి డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది ప్రభుత్వం.. మిగిలిపోయిన వారికి ఇవాళ, రేపు నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్‌ అందించనున్నారు. అయితే, బ్యాంకులో జమ చేసిన సొమ్ము కోసం వెళ్లి.. ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొందరి ప్రాణాలు పోగా.. తాజాగాజజ పెన్షన్ కోసం వెళ్లి మరో వృద్ధుడు మృతి చెందాడు.. కడప జిల్లా బద్వేల్ పట్టణం అమ్మవారిశాలకు చెందిన వల్లంకొండు రామయ్య.. శుక్రవారం రాత్రి కన్నుమూశాడు.. పెన్షన్ కోసం బ్యాంక్ చుట్టు రెండురోజులు తిరిగాడు రామయ్య.. అయితే, ఆధార్ లింక్ కాకపోవడంతో నగదు డ్రా చేసుకోలేక పోయాడు.. కానీ, తీవ్రమైన ఎండ తాకిడి తట్టుకోలేక వడదెబ్బ కొట్టింది రామయ్యకు.. దీంతో.. రాత్రి రామయ్య మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ప్రధాని మోడీ పర్యటన.. ఎల్లుండి రాజమండ్రిలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లు బంద్‌..
సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర నేతలతో పాటు.. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇక, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 6వ తేదీన పర్యటించబోతున్నారు.. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు వేమగిరి జంక్షన్ లోభారీ బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగిస్తారు.. అయితే, మోడీ పర్యటన నేపథ్యంలో భారీ బందోస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.. మరోవైపు.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు విధించారు పోలీసులు.. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉండనున్నాయి.. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేయనున్నారు..

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. ఇకపై ఆ చార్జీలుండవ్..
తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలకు వెళుతుంటారు. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మరింత భారంగా మారుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు బఫర్ ఆఫర్ ప్రకటించింది. సిటీకి వెళ్లాలనుకునే వారు.. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే.. ఎలాంటి రుసుము లేదని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎనిమిది రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు లభించడం విశేషం. ఈ మేరకు ఎక్స్ ట్వీట్ చేసింది. #TSRTC సుదూర ప్రయాణీకులకు రిజర్వేషన్ ఛార్జీలను మాఫీ చేస్తుంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది.

తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్‌
తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మే 13న లోక్‌ సభ ఎన్నికలకు తెలంగాణలో ఓటింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన హోం ఓటింగ్‌ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే.. సీనియర్‌ సిటిజన్‌లు, వికలాంగులు (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్‌ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బషీర్‌బాగ్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లోని ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఫారం 12డి ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు మే 8లోపు కేంద్రంలో తమ హక్కును వినియోగించుకోవచ్చు.

రూల్స్ బ్రేక్ చేశారు.. అమిత్ షా పై కేసు నమోదు..
మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఢిల్లీ లో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల1 వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉందని, ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బాత్ 400 పార్ అంటూ రాసి ఉందని పేర్కొన్నారు. ఇది ఎలక్షన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

మణిపూర్లో కుల సంఘర్షణకు ఏడాది.. రెండుగా విడిపోయిన రాష్ట్రం
మణిపూర్‌లో కుల హింసకు గురై ఏడాది కావస్తున్నా దాని కాటు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. తమ సొంత రాష్ట్రం రెండు వర్గాలుగా విడిపోయి, తరతరాలుగా కలిసిమెలిసి ఉన్న కుటుంబాలు, ఇరుగుపొరుగు వారు విడిపోయిన ఈ రోజును మణిపురి ఎలా మర్చిపోగలదు. వేలాది మంది జీవితాలు తారుమారయ్యాయి. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం, మే 3, 2023 తేదీ మణిపూర్ ప్రజల మనస్సులలో ఒక చెడ్డ జ్ఞాపకంగా ముద్రించబడింది. ఆ రోజు రాష్ట్రాన్ని వర్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా రెండు సంస్థలుగా విభజించారు. ఈ రోజున షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా కొండ జిల్లాలలో నిర్వహించిన ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ కారణంగా మైతేయి, కుకీ వర్గాల మధ్య కుల వివాదం చెలరేగింది. ఇది దాని నివాసితుల రోజువారీ జీవితాలను లెక్కలేనన్ని మార్గాల్లో ప్రభావితం చేసింది.

నేపాల్ రూ. 100 నోటుపై కొత్త భూభాగాలు.. భారత్ తీవ్ర అభ్యంతరం..!
నేపాల్‌ దేశం తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడంతో నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం నాడు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన 100 రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేఖ్‌, లింపియాధురా, కాలాపానీలతో కూడిన కొత్తపటం ఏర్పాటు చేసింది. ఇక, దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ ది కృత్రిమ విస్తరణతో కూడిన ఏకపక్ష చర్యగా ఇండియా పేర్కొంది. ఇది ఆమోదయోగ్యం కాదని క్లారిటి ఇచ్చింది. ఇక, ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) నేతృత్వంలో సమావేశమైన మంత్రి మండలి రూ. 100 నోట్లపై నేపాల్‌ పాతపటం స్థానంలో కొత్తపటం ముద్రణకు నిర్ణయం తీసుకొన్నట్లు ఆ దేశానికి చెందిన సమాచార, ప్రసార శాఖ మంత్రి రేఖాశర్మ మీడియాకు తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా నేపాల్‌ 2020 జూన్‌లో రాజ్యాంగ సవరణ కూడా చేసినట్లు తెలుస్తుంది. సరిహద్దులో వ్యూహాత్మకంగా ఉన్న కీలకమైన పై మూడు భూభాగాలు తమకు చెందినవిగా భారత్‌ తెలియజేస్తుంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌.. ఐదు భారత రాష్ట్రాలతో నేపాల్‌ 1,850 కిలో మీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.

నేడు గుజరాత్తో ఆర్సీబీ ఢీ.. గెలిచిన జట్టుకే ప్లేఆఫ్స్ ఛాన్స్..?
ఐపీఎల్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్‌ పోటీ పడబోతుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఆర్సీబీ తమ చివరి రెండు మ్యాచ్ లలో అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ టీమ్ కూడా మళ్లీ విజయాలను నమోదు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. జీటీ గత 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉండగా.. ఆర్సీబీ మాత్రం 10 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, 7 ఓడిపోయి చివరి స్థానంలో ఉంది. ఇక, బెంగళూరులో ఈరోజు వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, చిన్నస్వామి మైదానం బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీ కారణంగా ఈ గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్లు ఈజీగా కొట్టొచ్చు. ఇక్కడ స్పిన్ బౌలర్లకు కూడా పిచ్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుందని క్రీడా నిపుణులు అంటున్నారు. అయితే, చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 88 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో 37 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలవగా.. సెకండ్ బ్యాటింగ్ చేసి జట్లు ఏకంగా 47 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే ఈ మైదానంలో ఛేజింగ్ కే ఎక్కువ లాభదాయకమని క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇవాళ్టి మ్యాచులో గూగుల్ లో గెలుపు అంచనా ప్రకారం చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి 55 శాతం గెలిచే ఛాన్స్ ఉండగా.. గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు 45 శాతం అవకాశం ఉంది.

ఫైనల్ స్టేజ్ కు గేమ్ చేంజర్ షూటింగ్.. మరి రిలీజ్ ఎప్పుడంటే..?
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలమే అయిన ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు.ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా రాంచరణ్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరినుంచి అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో ఇండియాన్ 2 పూర్తి చేయాల్సి రావడంతో “గేమ్ చేంజర్” షూటింగ్ ఆలస్యం అయింది.