నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం..
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రచారంలో మరింత స్పీడ్ పెంచుతున్నారు.. ఈరోజు మరో మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు.. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, మూడు సభల్లో పాల్గొనేందుకు ఉదయమే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్.. ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమెర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఆ తర్వాత.. మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో ప్రచారంలో పాల్గొననున్న ఆయన.. పామూరు బస్‌స్టాండ్ సెంటర్‌లో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.10 గంటలకు కనిగిరి చేరుకోనున్న సీఎం జగన్.. 3.20 గంటలకు హెలిప్యాడ్ దగ్గర నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.. 3.35 గంటల నుంచి 4.20 గంటల వరకు కనిగిరి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్.. తిరిగి 4.40 గంటలకు తాడేపల్లి బయలుదేరి వెళ్లనున్నారు.. సాయంత్రం 5.50 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
సీఈసీ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు జరపాలి.. మాజీ సీఎం కిరణ్ ఫిర్యాదు..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి లేఖరాయడం చర్చగా మారింది.. సీఈసీ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు జరపాలంటూ ఆయన ఫిర్యాదు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలతో ఓటర్లు భయపడుతున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ ను సవాలు చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వారి కుటుంబీకులు తీవ్రస్థాయిలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.. పుంగనూరు నియోజక వర్గాన్ని పూర్తిగా కేంద్ర ఎన్నికల కమిషన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..
బ్యాంకులో పెన్షన్ డబ్బు పడలేదా..? రేపు ఇంటికే వచ్చి ఇస్తారు..
ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. గత నెలలో సచివాలయం దగ్గర వృద్ధులు, పెన్షన్‌దారులు పడిగాపులు పడాల్సి రాగా.. ఇక, ఈ నెల చాలా మందికి బ్యాంకుల్లో నగదు జమ చేసింది ప్రభుత్వం.. అయితే, ఆ డబ్బుల కోసం బ్యాంకుల దగ్గర భారీ క్యూలు దర్శనమిచ్చాయి.. ఒక్కసారిగా బ్యాంకులకు దగ్గరకు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. వారికి పెన్షన్లు పంపిణీ చేయడం బ్యాంకర్లకు సవాలుగా మారింది.. మరోవైపు.. కొన్ని సాంకేతిక కారణాలతో డబ్బులు తీసుకోకుండా వృద్ధులు వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.. మే 1వ తేదీన ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ.. ఈ రోజు కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ కానివారికి మే 4వ తేదీన అంటే.. రేపు (శనివారం) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.. దీనిపై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేవారు.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 74,399 మంది పెన్షనర్లకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానట్లు గుర్తించామని వెల్లడించిన ఆయన.. వీరందరికీ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.. ఇక, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమకానివారి జాబితాను ఈ రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.. మరోవైపు.. రాష్ట్రంలోని మొత్తం 65.49 లక్షల మందికిగాను 63.31 లక్షల మంది పింఛనుదారులకు వారి ఖాతాల్లో నగదు జమ చేశామని అంటే.. సరాసరి 96.67 శాతం నగదు బ్యాంకుల ఖాతాల్లో జమ అయ్యిందని.. మిగతా వారికి ఇంటివద్దే పంపిణీ చేస్తామని తమ ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్.
నేడు ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ ల్లో సీఎం రేవంత్ పర్యటన..
నేడు ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి జన జాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జన జాతర సభకు సీఎం హాజరుకానున్నారు. ఇక సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఉప్పల్ లో సాయంత్రం రేవంత్ రెడ్డి రోడ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు గమనించాలని సూచించారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇబ్బంది పడకుండా.. వేరే మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు సహకరించాలని కోరారు.
ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత.. నెహ్రూ జూపార్క్‌కు తరలింపు
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో బోనులో చిరుత చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఐదు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఆరు రోజులపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన చిరుత. ఏకంగా ఏర్పోర్ట్ రన్ వే మీదికి వచ్చింది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ పోలీసులు సిఐఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు బోన్ లో చిరుత చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పులి కోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేకలను బోనుల్లో ఉంచినప్పటికీ అది చిక్కుకోలేదు. పలుమార్లు బోను దగ్గరికి వెళ్లిన చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మేకను తినేందుకు బోను వద్దకు వెళ్లిన చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులిని నెహ్రూ జూపార్క్‌కు తరలించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణలో జూ అధికారులు ఉంచనున్నారు. తర్వాత నల్లమల అడవిలో అటవీ శాఖ అధికారులు చిరుతను వదిలేస్తామని తెలిపారు. గత ఆదివారం (ఏప్రిల్ 28) ఉదయం గొల్లపల్లి నుంచి భద్రతా గోడ దూకి శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుత ప్రవేశించింది. దూకుతున్న సమయంలో ప్రహరీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు తగిలి ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత కోసం పులి కోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలు, మేకలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఉత్కంఠకు తెర.. రాయ్‌బరేలీ, అమేథీ అభ్యర్థులు వీరే
గత కొద్ది రోజులుగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. కొద్దిసేపటి క్రితమే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోరి లాల్ శర్మను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ రెండు స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం శుక్రవారమే నామినేషన్‌కు చివరి రోజు. మొత్తానికి కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు హస్తం పార్టీ తెరదించింది. మొత్తానికి రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించేసింది. మరికొద్ది సేపట్లో రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు రాయ్‌బరేలీలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. అయితే సోనియా స్థానంలోకి కుమార్తె ప్రియాంక రావొచ్చని వార్తలు వినిపించాయి. కానీ చివరికి రాహులే బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన కేఎల్. శర్మను అమేథీ నుంచి బరిలోకి దించారు.
రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్.. ఎందుకో తెలుసా..?
పొలిటికల్ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రతిపాదిత లబ్ధిదారుల పథకాల కోసం వివిధ సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలను కోరడం ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి పద్ధతి అని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎన్నికల వేళ సర్వేలు, పథకాల లబ్ధి సాకులతో ఓటర్ల వివరాలు సేకరిస్తే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఈ చర్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లపై ప్రచురణకర్తలను, ప్రింటింగ్ వివరాలు లేకపోతే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అవినీతి ప్రవర్తనకు సమానమైన ఇలాంటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇంటింటికీ గ్యారెంటీ కార్డుల ప్రచారాన్ని అవినీతి అక్రమంగా కాంగ్రెస్ అభివర్ణించిందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, సర్వేల నెపంతో ఓటర్లను తప్పుదోవ పట్టించడం, ప్రలోభ పెట్టడం వంటి నేరాల కిందకే వస్తాయి.. కాబట్టి వీటిపై నిషేధం విధిస్తున్నట్లు ఈసీ పేర్కొనింది.
జర్మనీని ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వాహనాలు
జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది, రెడ్‌క్రాస్ రంగంలోకి దిగి సహాయ సహకారాలు అందిస్తున్నారు. బిసింగర్ మార్కెట్ చౌరస్తాలో మీటరు ఎత్తులో నీరు నిలిచిపోయింది. ఇక గుటెన్‌బర్గ్ కిండర్ గార్డెన్ ఎదుట ఉన్న నిర్మాణ స్థలం కొట్టుకుపోయింది. ఇక పలు ప్రాంతాల్లో అయితే రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. వాహనాలన్నీ ఒక దగ్గరు పోగుపడ్డాయి. వరదలు కారణంగా పలు రోడ్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే బాడెన్-వుర్టెంబర్గ్‌లో ప్రజలు కార్లలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం జరిగింది అన్న విషయం ఇంకా తెలియలేదు. నీళ్లు తగ్గితేనే గానీ.. అధికారులు అంచనా వేయలేరు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువులు అందక.. చాలా చోట్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల దుబాయ్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసేసింది. దీంతో అపార్ట్‌మెంట్లు, రోడ్లు నీరుతో నిండిపోయాయి. ఇక వర్షపు ప్రవాహనంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఎన్నడూ లేనంతగా వర్షం కురవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉప్పల్ మైదానంలో అనసూయ సందడి.. వైరల్‌గా మారిన హాట్ యాంకర్ రియాక్షన్!
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ భారీగా తరలివచ్చారు. సెలెబ్రెటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. స్టేడియంలో చేస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలిపారు. ఎస్‌ఆర్‌హెచ్, ఆర్ఆర్ మ్యాచ్ ఆసాంతం అనసూయ భరద్వాజ్ గ్యాలరీలో సందడి చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఫోర్స్, సిక్స్‌లు బాదినపుడు అనసూయ ఎగిరి గంతేశారు. క్యాచ్‌లు వదిలేసినప్పుడు మాత్రం అయ్యో అంటూ బాధపడ్డారు. జయదేవ్ ఉనాద్కత్ వేసిన 15వ ఓవర్‌లో రియాన్ పరాగ్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో అబ్దుల్ సమద్ క్యాచ్‌కు ప్రయత్నించినా బంతి అందలేదు. ఆ సమయంలో అయ్యో అంటూ అనసూయ ఓ రియాక్షన్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయకు సంబందించిన మరిన్ని ఫొటోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఆఖరి బంతికి వికెట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ సంబరాలు చూశారా?
ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడ్డుకట్ట వేసింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. రాజస్థాన్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్‌తో రోవ్మాన్ పావెల్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఉప్పల్ మైదానంలో అప్పటివరకు ఊపిరిబిగపట్టి ఉన్న హైదరాబాద్ అభిమానులు.. ఊహించని విజయంతో ఒక్కసారిగా అనందంతో కేరింతలు కొట్టారు. మైదానం మొత్తం అరుపులతో మార్మోగిపోయింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో అందరూ తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. ఇక సన్‌రైజర్స్ సీఈఓ కావ్య మారన్ అయితే ఎగిరి గంతేశారు. పక్కన ఉన్న వారితో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ ఉత్కంటంగా ఉండడంతో చివరి బంతి వరకు ఉప్పల్ మైదానంను ఏ అభిమాని వీడలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (58; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీష్ కుమార్ రెడ్డి (76 నాటౌట్; 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లు ) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(42 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం రాజస్థాన్ 7 వికెట్లకు 200 పరుగులు చేసి ఓడిపోయింది. రాజస్థాన్‌కు చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా 11 పరుగులే చేసింది. యశస్వి జైస్వాల్ (67; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రియాన్ పరాగ్ (77; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు.
ప్రభాస్ వాడిన బైక్ గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది విడుదల అయిన “సలార్” మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.సలార్ మూవీ దాదాపు 700 కోట్లకు కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నప్రభాస్ కు ఈ సినిమా భారీ ఊరటను ఇచ్చింది.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సలార్ మూవీకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.థియేటర్లలో అదరగొట్టిన సలార్ మూవీ ఓటీటీలో కూడా దుమ్మురేపింది. ఇటీవల స్టార్ మాలో ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్ మూవీ ఇక్కడ కూడా రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో స్టార్ మా ఆడియెన్స్ కు గోల్డెన్ ఆఫర్ ప్రకటించింది. సలార్ లో ప్రభాస్ వాడిన బైక్ లాంటి బైక్ ను గెలుచుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం సలార్ బైక్ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ను కూడా నిర్వహించింది.అయితే ఈ కాంటెస్ట్ లో చాలా మంది ప్రేక్షకులు పాల్గొనగా విజయవాడకు చెందిన వరప్రసాద్ ను ఆ బైక్ వరించింది. తాజాగా ఈ పోటీలో గెలిచిన విన్నర్ ను స్టార్ మా ప్రకటిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్స్ లక్కీ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.అలాగే స్టార్ మా కూడా ఆ లక్కీ విన్నర్ కు అభినందనలు తెలిపింది.అలాగే బైక్ గెలుచుకున్న వరప్రసాద్ మాట్లాడుతూ తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు..
పుష్ప గాడి క్రేజ్ ఇదే.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట పుష్ప.. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన పుష్ప కంటే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ పై కాస్త ఎక్కువ బజ్ ఉంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా అంచనాలను పెంచగా.. మొన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ మాత్రం రికార్డులను బ్రేక్ చేస్తుంది.. యూట్యూబ్ లో అరుదైన రికార్డును అందుకుంది.. ఈ ప్రాజెక్ట్‌ని ఆగస్ట్ 15న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌కి అరుదైన ప్రత్యేకతను అందుకోవడం విశేషం.. సాంగ్ విడుదలైన ఆరు భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా వీక్షించబడిన లిరికల్ పాటగా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని సంపాదించుకుంది. మొత్తంగా 26.6 మిలియన్లు వ్యూస్ ను రాబట్టడం మామూలు విషయం కాదు.. ఐకాన్ స్టార్ అత్యంత ఖచ్చితత్వంతో హుక్ స్టెప్‌ని అందించిన ఈ పాటకు 1.27 మిలియన్ లైక్‌లు వచ్చాయి. అంతేకాదు 15 దేశాల్లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు విజయ్ పోలాకి పాటకు సంబందించిన ప్రతి ఒక్కరికి ఇది మంచి బ్రేక్ ను ఇచ్చింది.. ఒక్క పాటకే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక సినిమాకు ఎలా ఉంటుంది థియేటర్లు బద్దలవ్వడం పక్కా అని బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు..
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..’ వీరమల్లు ‘ రిలీజ్ అప్పుడే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటివరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.. సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. నిన్న రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది.. టీజర్ ను చూసిన ఫ్యాన్స్ లో మళ్లీ జోష్ మొదలైంది.. అంతేకాదు సినిమా పై మరో క్లారిటీ వచ్చేసింది.. టీజర్ లోనే సినిమా విడుదల తేదీ పై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.. సోషల్ మీడియాలో వీరమల్లు వచ్చేది ఈ డేట్‌కే అంటూ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 20 న విడుదల కాబోతుందని ఊ వార్త షికారు చేస్తుంది.