NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు సీఎం ఉత్తరాంధ్ర పర్యటన.. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్న ఆయన.. చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారక రామ తీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక, విశాఖపట్నం–మధురవాడలో వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌కు శంకుస్ధాపన చేస్తారు.. ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానా­శ్రయం నిర్మా­ణానికి సీఎం వైఎస్‌ జగ ఈ రోజు భూమి పూజ చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులతోపాటు విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్‌ నిర్మించే వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌కు సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. రూ.4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్‌ టెక్‌ పార్కు రూపుదిద్దుకోబోతోంది.

ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్‌..!
కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలిపారు.. నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఆయన.. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు.

“ఆ సమయంలో మాత్రమే కాంగ్రెస్‌కి జాతీయ పార్టీ అని గుర్తుకు వస్తుంది”.. ఆత్మకథలో విమర్శలు..
ఎన్సీపీ నాయకుడు, సీనియర్ నేత శరద్ పవార్ తన ఆత్మకథలో సంచలన విషయాలను వెల్లడించారు. తన మరాఠీ ఆత్మకథ ‘లోక్ మాజే సంగతి’(ప్రజలు నాకు తోడుగా ఉన్నారు) పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ కేంద్రబిందువు అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని శరద్ పవార్ వెల్లడించారు. ఇతర పార్టీలతో వ్యవహరిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా జాతీయ పార్టీగా తన స్థాయిని గుర్తు తెచ్చుకుంటుదని ఆయన అన్నారు. మహరాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఆయన ఆత్మకథలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని భూములు కాపాడుకోలేని భూస్వామిగా పవార్ అభివర్ణించాడు. కాంగ్రెస్ పార్టీ గత వైభవాల గురించి ప్రగల్భాలు పలుకుతున్నారని నిందించారు. మహారాష్ట్రలొో సంక్షీర్ణం ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ తన సహనాన్ని పరీక్షించిందని తెలిపారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ వైఖరి వల్ల సంక్షీర్ణాన్ని కొనసాగించలేనని తాను భావించాని ఆత్మకథలో పేర్కొన్నారు.

భారత్‌లో మతస్వేచ్ఛ లేదు, ఆంక్షలు విధించాలి.. ఇండియా స్ట్రాంగ్ రిప్లై
భారతదేశం అంటే పక్షపాతంగా వ్యవహరించే అమెరికాలోని కొన్ని సంస్థలు మరోసారి అలాంటి ప్రయత్నాన్నే చేశాయి. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదని, మైనారిటీలు హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు భారత్ లోకి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులపై ఆంక్షలు విధించాలని బైడెన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారతదేశంలో 2022లోనూ భారత్ లో మతస్వేచ్ఛ పతనమవడం 2022లోనూ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో మతవివక్షను పెంచేలా చర్యలు తీసుకుంటున్నాయని తన నివేదికలో పేర్కొంది. మతాంతర వివాహాలు, గోవధ, హిజాబ్ తదితర అంశాల్లో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, దళితులు, ఆదివాసీలు నష్టపోయేలా విధానాలు రూపొందిస్తున్నారంటూ తెలిపింది. మైనారిటీ వ్యక్తులను యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాల్ని ప్రముఖంగా ప్రస్తావించాలని తన నివేదికలో చెప్పింది. అయితే అమెరికా ప్రభుత్వం ఈ సూచల్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు.

నాపై మూడోసారి హత్యాయత్నం జరగబోతోంది.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. రాజకీయంగా కూడా పతనావస్థలో ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్, అక్కడి షహజాబ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరోవైపు సైన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు తీవ్ర ఒత్తడిలో ఉన్నాయి. దీనికి తోడు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరగడం పాకిస్తాన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుపుతోంది. ఇదిలా ఉంటే మరోసారి ఇమ్రాన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై మూడోసారి హత్యాయత్నం జరిగినట్లు లాహోర్ హైకోర్టులో తెలియజేశారు. తనపై ఉన్న అన్ని రాజకీయ కేసులను రద్దు చేయాలని కోరుతున్నారని, రెగ్యులర్ కోర్టుకు హాజరుకావడం తన ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని కోర్టుకు తెలిపారు. దేశద్రోహం, దైవదూషణ, హింస మరియు ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి వివిధ ఆరోపణలపై దేశంలోని వివిధ నగరాల్లో తనపై నమోదైన మొత్తం 121 కేసులను రద్దు చేయాలని కోర్టును కోరారు.

నేటి బంగారం, వెండి ధరలు ఇవే..
అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎన్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. మన దేశంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి. నేడు పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల రూ.55,700 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.60,760 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,850 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,910 మార్క్ వద్ద కదులుతోంది.

రజనీకాంత్ ఫ్యాన్స్‌ భేటీ.. మంత్రి రోజాకు సీరియస్‌ వార్నింగ్‌..
విజయవాడ వేదికగా జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు తప్పుబడుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్టీఆర్‌తో తనకున్న పరిచయం, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే.. చంద్రబాబు, బాలయ్యపై ప్రశంసలు కురిపించారు రజనీ.. ఇక, చంద్రబాబు విజన్‌.. హైదరాబాద్‌ అభివృద్ధి వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.. దీంతో, ఆయన వైసీపీకి టార్గెట్‌గా మారిపోయారు.. అయితే, పుదుచ్చేరిలో రజనీకాంత్ అభిమాన సంఘం నేతల సమావేశం అయ్యారు. ఏపీ మంత్రి రోజాకు.. రజనీకాంత్ అభిమానుల సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. రజనీకాంత్ ను విమర్శించే స్ధాయి రోజాకు లేదని హితవుపలికారు.. చేసినా విమర్శలు వెంటనే క్షమాపణ చెప్పాలి.. లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేపడుతాం అంటూ హెచ్చరించారు.. మరోసారి రజనీకాంత్‌పై మాట్లాడితే వదిలే ప్రసక్తేలేదన్నారు.. కాగా, మొన్న పుదుచ్చేరిలో ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో రజనీకాంత్ జీరో అంటూ విమర్శించారు మంత్రి ఆర్కే రోజా.. తిరుకంచి గంగై వరదరాజు నాదీశ్వర ఆలయంలో పుష్కరిణి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుదుచ్చేరి వెళ్ళిన రోజా.. రజనీకాంత్ పై విమర్శలు గుప్పించారు. రజినీకాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కోపంగా ఉన్నారని పేర్కొన్న రోజా, రజినీకాంత్ తాను చేసిన వ్యాఖ్యలతో జీరో అయ్యారని విమర్శించారు.

ఇండియా సినిమాల్లో రికార్డు.. పుష్ప 2 ఆడియో రైట్స్ కు భారీ ఆఫర్
పుష్ప సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‎కు ఏ రేంజ్ హిట్ తీసుకొచ్చిందో తెలిసిందే. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్పకు సీక్వెల్‎గా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. పుష్ప పాటలు ఏ రెంజ్లో ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారంటే ఇప్పటికీ అవి ఎక్కడో చోట మోగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ పాట యూత్ కు మంచి కిక్కిచ్చింది. దీంతో సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 ఆడియోపై కూడా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుంటోంది. ఇది ఇలా ఉంటే అయితే ఈ మూవీ ఆడియో రైట్స్ ఏకంగా రూ. 65 కోట్ల భారీ ధరకు ప్రముఖ మ్యూజిక్ సంస్థ టి సిరీస్ దక్కించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే ఇండియన్ సినిమాల్లో ఇది పెద్ద రికార్డు అనే చెప్పాలి. ఫహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ భండారి, ధనుంజయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.