NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు కలిగినవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వచ్చే నెల నుంచి రాగులను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.. రాయలసీమలోని కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్‌కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కరతో పాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.. అయితే, రాగులు వద్దనుకునే కార్డుదారులు యథావిధిగా మొత్తం బియ్యం తీసుకోవచ్చని వివరించారు. రాయలసీమలోని ఇతర జిల్లాల్లో జూలై నుంచి రాగుల పంపిణీ ప్రారంభిస్తామని, దశలవారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ కూడా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు..2023ను మిల్లెట్‌ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో అధిక పోషక విలువలు కలిగిన బలవర్థకమైన చిరుధాన్యాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో రాగులు, జొన్నలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే జొన్నలను పంపిణీ చేస్తున్నారు.. వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నారు.. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఫిక్స్ అయ్యింది. జూన్ 2న గుంటూరులో పర్యటించనున్నారు…ఈ సందర్బంగా వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగామేళా నిర్వహణలో పాల్గొననున్నారు. ఈ మేరకు 793 ట్రాక్టర్లు, 38 హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారని సమాచారం..

మహారాష్ట్రకు చెందిన ఏకైక కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ సురేష్ బాలు ధనోర్కర్(47) మంగళవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే తెలిపారు. ధనోర్కర్ మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో శివసేన పార్టీలో ఉండి.. 2014లో వరోరా-భద్రావతి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. 2019లో శివసేన పార్టీని వీడి లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చంద్రాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత హన్సరాజ్ అహిర్‌పై విజయం సాధించారు. వైద్య చికిత్స నిమిత్తం మే 28న నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి విమానంలో ధనోర్కర్‌ను తరలించినట్లు పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. కడుపునొప్పి రావడంతో ఎయిర్ అంబులెన్స్‌లో దేశ రాజధానికి తరలించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటేరియన్ మే 27న నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్లతో చికిత్స పొందారని ప్రకటన పేర్కొంది. చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మే 27న, ధనోర్కర్ తండ్రి నారాయణ్ ధనోర్కర్ దీర్ఘకాలిక అనారోగ్యంతో నాగ్‌పూర్‌లో మరణించారు. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు ఎంపీ హాజరు కాలేదు.

2030 నాటికి చంద్రుడిపైకి చైనా వ్యోమగాములు
అంతరిక్ష పరిశోధనలో పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్న చైనా మరో ముందడుగు వేసింది. దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని డ్రాగన్‌ భావిస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడేళ్లలో చంద్రుడి మీదకు మానవసహిత ప్రయోగాలు చేపడతామని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ జికియాంగ్‌ ప్రకటించారు. సన్నాహకాల్లో భాగంగా ముందుగా అంతరిక్ష కేంద్రానికి మూడో విడతగా ముగ్గురు వ్యోమగాములను మంగళవారం పంపుతున్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం 9.31 గంటలకు తన సొంత అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను చైనా పంపనుంది. వారిలో ఇద్దరు వ్యోమగాములు జింగ్‌ హైపెంగ్‌, జూయాంగ్జూ, పౌర వ్యోమగామి గుయ్‌ హైచావో అయిదు నెలల వరకూ అక్కడ ఉండనున్నారు. వీరిని తీసుకెళ్లనున్న షెంజావో-16 వ్యోమనౌకను ప్రయోగించేందుకు ఇన్నర్‌ మంగోలియాలోని జ్యూకాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లినవారంతా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. ఈ అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములను టియాగాంగ్ అనే అంతరిక్ష కేంద్రానికి తీసుకెళుతుందని లిన్ చెప్పారు. చంద్రుడిపై మనుషులతో కూడిన అన్వేషణ కార్యక్రమాన్ని చైనా ఇటీవలే ప్రారంభించింది. 2025 నాటికి తమ వ్యోమగాములను పంపుతామని నాసా, చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా తమ మిషన్‌ను మొదలు పెట్టింది.

అశోక్‌, సచిన్‌ల మధ్య కుదిరిన రాజీ ఫార్ములా.. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు
రాజస్థాన్​​ కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతఃకలహాలకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్​ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్​.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్​ గాంధీతో సమవేశమయ్యారు. ఈ భేటీ సుమారు నాలుగు గంటల పాటు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, ఒకరు తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్న దశాబ్దాల చరిత్రను ఛేదించి వరుసగా ఈసారి కూడా రెండోసారి అధికారంలోకి వచ్చేలా సమిష్టిగా పనిచేయాలని రాహుల్ గాంధీ సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు ఖర్గే నివాసంలో చర్చోపచర్చలు కొనసాగాయి. ఎట్టకేలకు గహ్లోత్-పైలట్‌ల మధ్య సయోధ్య కుదర్చడంలో ఏఐసీసీ అధిష్ఠానం సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభ పరిష్కారానికై ముఖ్యనేతల వరుస భేటీలు, మంతనాలు జరిగాయి. ఇదిలా ఉండగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. రాజస్థాన్‌లో మరో సారి అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమష్టిగా పనిచేసేందుకు అశోక్ గహ్లోత్​, సచిన్ పైలట్ ఇద్దరూ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారని తెలిపారు. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి అశోక్‌ గహ్లోత్​, పైలట్ మధ్య అధికార పోరు కొనసాగుతోంది. 2020 జులైలో డిప్యూటీ సీఎంగా ఉన్న పైలట్‌.. మరో 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి గహ్లోత్‌ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అధిష్ఠానం జోక్యంతో ఆ సంక్షోభానికి తెరపడింది. ఆ తర్వాత పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించారు.

క్రేజీ స్టెప్స్‌తో దుమ్మురేపిన బామ్మ
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆనందం కోసం డ్యాన్స్ చేయడం చిన్నపిల్లలు మాత్రమే చేసే పని అనుకుంటే పొరపాటే.. ఆనందంలో చిందులు వేయడానికి వయసుకు సంబంధం లేదు. ఎవరైనా ఆనందంలో డ్యాన్స్ చేయవచ్చు.. చిందులు వేయవచ్చు.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆశా భోంస్లే పాడిన పియా తు ఆబ్ తో ఆజా అనే ఐకానిక్ పాటకు ఓ వృద్ధురాలు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌భయానీ పేజీ షేర్ చేసింది. ఇప్పటివరకు లక్షకు పైగా వీక్షణలను పొందింది. ఈ వీడియోలో బామ్మా అలిసిపోకుండా క్రేజీ స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ముఖంపై చిరునవ్వుతో, ఆమె హృదయపూర్వకంగా నృత్యం చేసింది మరియు అతిథులు తన చుట్టూ చేరి ఆమెను ఉత్సాహపరుస్తుండగా ఆకట్టుకుంది. క్లిప్‌లో అనేక మంది మహిళలు ఆమె చీర్స్‌కు నృత్యం చేయడం కూడా కలిగి ఉంది. బామ్మ పిచ్చి డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వ్యాఖ్యల విభాగం ప్రేమ మరియు హృదయ ఎమోజీలతో నిండిపోయింది. ఈ పాటను RD బర్మన్ కంపోజ్ చేసారు మరియు లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే పాడారు. అప్పట్లోనే ఈ సాంగ్‌ సూపర్‌ డూపర్‌ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు ఈ సాంగ్‌ వేసుకుని ఓలేడీ పార్టీలో బామ్మ స్టెప్పులతో అదరగొట్టడం అందరిని ఆకట్టుకుంటోంది. అక్కడ అంత మంది లేడీస్ కూర్చున్న కానీ.. బామ్మ మాత్రం లేచి డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్‌ బామ్మ మీరు సూపర్‌ అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. ఈ వయస్సులో అస్సలు అలిసి పోకుండా డ్యాన్స్‌ చేయడం యువతకి మీరు స్పూర్తి అంటూ మరో నెటిజన్‌ కమెంట్‌ చేశాడు.

రిటైర్మెంట్‌పై ఎంఎస్‌ ధోనీ కీలక వ్యాఖ్యలు..
మహేంద్ర సింగ్‌ ధోనీ అలియాస్‌ మిస్ట్‌ కూల్‌.. ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఎంఎస్‌డీ.. ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు.. చెన్నైకి మరోసారి కప్‌ అందించి సత్తా చాటాడు.. అయితే, ధోనీ రిటైర్మెంట్‌ ఎప్పుడు అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.. దీనిపై ధోనీ మాట్లాడుతూ.. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది సరైన సమయంగా పేర్కొన్నాడు.. కానీ, నేను రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశాడు.. సీజన్ తొలి మ్యాచ్‌లో అందరూ నా పేరును జపిస్తుంటే ఎమోషనల్ అయ్యానన్న మిస్టర్‌ కూల్.. స్టేడియంలో అభిమానులు నా పేరును అరుస్తుంటే కళ్ళలో నీళ్లు నిండిపోయాయన్నారు.. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లడం సులభం.. కానీ, మరో తొమ్మిది నెలలు వెయిట్ చేసి ఐపీఎల్ ఆడటం మాత్రం కష్టమే అన్నారు.. మీ కోసం మరో ఐపీఎల్ ఆడటానికి ప్రయత్నిస్తాను.. ఇది మీ అందరికి గిఫ్ట్ గా ఉంటుంది.. కానీ, నా బాడీకి కష్టతరం చెప్పుకొచ్చాడు.. మీ ప్రేమను నేను ఇంకా ఆస్వాదించాలనుకుంటున్నాను అంటూ మహేంద్రుడు చేసిన వ్యాఖ్యలతో.. తన శరీరం సహకరిస్తే.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచన ఎంఎస్‌ ధోనీకి లేదు అనేది స్పష్టమవుతోంది.