NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నగరిలో రోజా వ్యతిరేక వర్గానికి షాక్‌.. కీలకనేతపై సస్పెన్షన్‌ వేటు..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.. మంత్రి ఆర్కే రోజా ప్రాతినిథ్యం వహిస్తోన్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో.. రోజాను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం పార్టీలో చేరగా.. మరోవైపు.. పార్టీలోనే ఉంటూ.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ.. మంత్రి రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై చర్యలకు పూనుకుంది వైసీపీ.. ఇప్పుడు నగరిలో వ్యతిరేక వర్గానికి షాక్ ఇచ్చింది మంత్రి ఆర్కే రోజా.. వడమాలపేట జెడ్పీటీసీ మురళీ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అదడంతో చర్యలకు పూనుకున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నందుకు ఇలాంటి పని చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మురళీరెడ్డి.. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడుగా ముద్రపడిన మురళీరెడ్డిపై వేటు వేయడంతో జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి.. ఇక, మంత్రి రోజా వద్దు.. పార్టీ ముద్దు.. అంటూ నగరిలో రోజా ఓడిపొతుందంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ బహిరంగంగా వ్యాఖ్యానించారు మురళీరెడ్డి.. ఈ వ్యవహారాన్ని పార్టీ తప్పుబడుతోంది.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడనే ఆరోపణలతో మురళీరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.

గాజుగ్లాసు గుర్తు.. హైకోర్టులో టీడీపీ అత్యవసర పిటిషన్‌
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గాజు గ్లాసు గుర్తు టెన్షన్‌ పెడుతోంది.. దీనికి ప్రధాన కారణం.. ప్రీ సింబల్స్‌ జాబితాలో గాజు గ్లాసు గుర్తు ఉండడమే.. అంతేకాదు.. రాష్ట్రంలోని 50కి పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఎన్నికల కమిషన్‌.. దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది జనసేన పార్టీ.. ఇప్పుడు గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది తెలుగుదేశం పార్టీ.. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వేరే ఎవరికి కేటాయించ వద్దని కోరుతూ.. అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ.. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న కారణంగా.. గాజు గ్లాసు గుర్తును జనసేనకే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.. దీనిపై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.

నేడు ఏపీకి నితిన్‌ గడ్కరీ..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కాకరేపుతోన్న విషయం విదితమే కాగా.. ఈ సారి టీడీపీ-జనసేనతో కలిసి జట్టుకట్టి బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. ఇక, ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నేడు ఏపీకి రానున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ.. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు నాగ్‌పూర్‌ నుంచి గడ్కరీ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఇక, విశాఖ ఎయిర్ పోర్టు నుంచి అరకు పార్లమెంటు పరిధిలోని సుందరనారాయణపురంకు ప్రత్యే హెలికాఫ్టర్ లో వెళ్తారు.. ఉదయం 11:30 గంటలకు అరుకు లోక్‌సభ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఇక, మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి విశాఖకు హెలికాఫ్టర్ లో చేరుకోనున్న ఆయన.. విశాఖలోని ITC హోటెల్ డీవీ గ్రాండ్ బీ లో విశ్రాంతి తీసుకోనున్నారు.. ఆ తర్వాత సాయంత్రం 4:30 గంటలకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఇక, సాయంత్రం 6:15 గంటలకు విశాఖపట్నం నుంచి తిరిగి నాగపూర్ వెళ్లనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మరోవైపు.. నితిన్‌ గడ్కరీ సభలను విజయవంతం చేసేందుకు బీజేపీతో పాటు కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు కూడా తమ పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున తరలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అతను లీడర్ కాదు బ్రోకర్.. పల్లా రాజేశ్వర్ రెడ్డి పై రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడర్ కాదు,ఒక బ్రోకర్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బచ్చన్నపేటలో రోడ్ షో,కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతంర మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది,పార్టీ సచ్చిపోయిందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడర్ కాదు,ఒక బ్రోకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళ్ళు పట్టుకొని, మందు, సోడా పోసి సిట్టింగ్ కాండిడేట్ నీ కాదని టికెట్ తెచ్చుకున్నాడన్నారు. పల్లా అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు సృష్టించి గెలిచాడన్నారు. జనగామ ప్రజలు ఒక ఆర్థిక ఉగ్రవాదిని గెల్పించారన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో దర్యాప్తు జరగుతుందన్నారు. కోర్టులో రుజువు అయితే పల్లా, హరీష్ రావు తో పాటు 30 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందన్నారు. అప్పుడు జనగామకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నే ఎమ్మెల్యే అంటూ క్లారిటీ ఇచ్చారు. పల్లాను 6 నెలల్లో గద్దె దించుతామన్నారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి పాపాల చిట్టా బయటకి తీస్తామన్నారు. లిక్కర్ స్కాంలో కవిత జైలులో ఉంది, ఈసారి బతుకమ్మ జైలులోనే ఆడుతుందన్నారు. కాళేశ్వరం కుంభకోణం బయట పడితే ఒకరు చర్లపల్లి,మరకోరు చెంచల్ గూడ, కేసీఆర్ అండమాన్ నికోబార్ జైలుకే అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులు పాలు చేశారన్నారు. బిడ్డ జైలుకు పోతే బిడ్డ దగ్గరకు పోలేదన్నారు. కేసీఆర్ కు బిడ్డ మీద లేని ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా కేసీఆర్ బస్సులో తిరుగుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు.. కానీ అక్కడ 4 గంటల వరకే..
తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 5 గంటలలోపు క్యూ లైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే తెలంగాణలో ఎండల తీవ్రత ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని ఈసీకి నివేదించింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం తెలంగాణలో పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించాలని ఈసీ నిర్ణయించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న పోలింగ్‌ జరగనున్నందున.. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పోలింగ్‌ సమయాన్ని 6 గంటల వరకు పొడిగించాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌కు అనుమతించారు.

అనుమతి లేకుండా ఫీజులు పెంచొద్దు.. ప్రభుత్వ సర్క్యులర్‌ను నిషేధించిన హైకోర్టు
ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలలకు ఢిల్లీ హైకోర్టు పాక్షిక ఉపశమనం ఇచ్చింది, అయినప్పటికీ ఢిల్లీలోని వేలాది మంది తల్లిదండ్రులు ఈ నిర్ణయంతో నిరాశ చెందారు. ఢిల్లీ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించిన ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు అనుమతి లేకుండా ఫీజులు పెంచకుండా అడ్డుకుంటూ ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌పై కోర్టు స్టే విధించింది. మార్చి 27న డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ జారీ చేసిన సర్క్యులర్‌పై జస్టిస్ సి హరిశంకర్ స్టే విధించారు. డైరెక్టరేట్ జారీ చేసిన మార్చి 27, 2024 నాటి వివాదాస్పద సర్క్యులర్ తదుపరి విచారణ తేదీ వరకు స్టేలో ఉంటుందని కోర్టు తెలిపింది. ఢిల్లీ హైకోర్టు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు నోటీసు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఇప్పుడు జూలై 31న జరగనుంది. ఢిల్లీ హైకోర్టు, ఏప్రిల్ 29న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కోర్టు మునుపటి ఆదేశాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు సవాలు చేసినప్పటికీ, దానిని నిలిపివేయలేదని లేదా రద్దు చేయలేదని జస్టిస్ హరిశంకర్ అన్నారు. ఎడ్యుకేషన్ డైరెక్టరేట్, యాక్షన్ కమిటీ అన్‌ఎయిడెడ్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్‌లో ఈ కోర్టు నిర్ణయంపై ఎంత అసంతృప్తిగా ఉన్నా, అది ఉన్నంత కాలం దానిని గౌరవించవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ ముందస్తు అనుమతి లేకుండా ఫీజులు పెంచడంపై విద్యాశాఖ నిరంతరం సర్క్యులర్లు జారీ చేయడం, బెదిరింపులకు పాల్పడడం అభ్యంతరకరమని, అనుమతించబోమని హైకోర్టు పేర్కొంది. పాఠశాలలను బలవంతంగా వ్యాజ్యాల్లోకి నెట్టలేమని, ఏదైనా అన్‌ఎయిడెడ్‌ గుర్తింపు పొందిన పాఠశాలకు భూభాగం వర్తించే భూమి ఉన్నప్పటికీ, ఫీజులను పెంచే ముందు ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన యాక్షన్ కమిటీ అన్‌ఎయిడెడ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

26 ఏళ్ల వయసులో 22 మంది పిల్లలకు తల్లి అయ్యింది..
ఒక బిడ్డ కోసం చాలా మంది మహిళలు తహతహలాడే ప్రస్తుత రోజుల్లో.. కొంతమంది మహిళలు ప్రతి సంవత్సరం పిల్లలను కంటున్నారు. కానీ టర్కీకి చెందిన ఓ ధనవంతుడి భార్య క్రిస్టినా ఓజ్‌టుర్క్ వయస్సు కేవలం 26 ఏళ్లు.. కానీ ఆమె ఇప్పటికే అద్దె గర్భం ద్వారా 22 మంది పిల్లలకు తల్లి అయ్యింది. రష్యాలో జన్మించిన బ్లాగర్ మార్చి 2020, జూలై 2021 మధ్య తన మిలియనీర్ వ్యాపారవేత్త భర్త గాలిప్ సర్రోగేట్ ద్వారా పిల్లలను కంటూ ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, క్రిస్టినా తనకు మరింత మంది పిల్లలు కావాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే, ఆమె పెద్ద బిడ్డ, విక్టోరియా అనే ఎనిమిదేళ్ల కుమార్తె గతంలో ఉన్న భాగస్వామితో సహజంగా జన్మించింది. ఇక, క్రిస్టినాకు చిన్న పిల్లలతో కూడిన పెద్ద కుటుంబం ఉంది. క్రిస్టినా గతంలో తాను మూడు అంకెలను చేరుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో క్రిస్టినా సరోగసీలకు రూ.1 కోటి 43 లక్షలు చెల్లించింది. క్రిస్టినా బేబీస్ డైరీ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేసింది. అందులో పిల్లలను పెంచడం గురించి ప్రతిదీ ఇప్పటికే వ్రాయబడింది. అయితే, ప్రతి రోజు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన వాటిని మాత్రమే అందించడానికి ఉపయోగకరమైన సమాచారం కోసం చూస్తున్నారని ఆమె చెప్పింది.

భారీ వర్షాలతో ఇబ్బందుల్లో చైనా.. హైవే కూలి 36 మంది మృతి
గత కొన్ని రోజులుగా డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు చైనా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తాజాగా చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైవే రోడ్డు కుంగడంతో వాహనాలు గొయ్యిలో పడిపోవడంతో 36 మంది మరణించారు అని అధికారులు చెప్పారు. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మిజౌ, డాబు కౌంటీల మధ్య ఉన్న హైవేలోని కొంతభాగం బుధవారం నాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా భూమి లోపలికి కుంగిపోయింది. కొండప్రాంతంలో ఉన్న ఈ రోడ్డు కింది భాగంలోని మట్టి మొత్తం కొట్టుకుపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆకస్మాత్తుగా ఇలా జరగడంతో వేగంగా వచ్చిన వాహనాలు కొన్ని కింది పడిపోయాయి. అయితే, గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు మెయిజౌ నగర ప్రభుత్వం తెలిపింది. కాగా, హైవేపై ఉన్న 20 వెహికల్స్ పడిపోవడంతో ఈ ప్రమాదంలో దాదాపు 36 మందికి పైగా మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక, 500 మంది రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో గత రెండు వారాలుగా రికార్డు స్థాయిలో వడగళ్ల వర్షం కురుస్తుండటంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. గత వారాంతంలో ప్రావిన్షియల్ రాజధాని గ్వాంగ్‌జౌలో సుడిగాలి దెబ్బకు ఐదుగురు మరణించారు. మెయిజౌలోని కొన్ని గ్రామాలు ఏప్రిల్ ప్రారంభంలో ముంపునకు గురయ్యాయి.

ప్రపంచకప్ జట్టును ప్రకటించని పాకిస్థాన్.. కారణం ఏంటంటే?
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. గడువు లోగా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ లాంటి జట్లు తమ ప్రపంచకప్ టీంలను వెల్లడించాయి. అయితే గడువు ముగిసినా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాల కారణంగానే పాకిస్థాన్ జట్టును ఇంకా జట్టును ప్రకటించలేదట. తమ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండటంతోనే టీ20 ప్రపంచకప్ 2024 కోసం జట్టు ఎంపిక ఆలస్యం అవుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి. మహమ్మద్ రిజ్వాన్, ఆజామ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, హారిస్ రౌఫ్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారట. పొట్టి ప్రపంచకప్ ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ల్లో వారి వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని పీసీబీ సెలెక్టర్లు భావిస్తున్నారట. ‘పాకిస్థాన్ టీం ప్రకటన ఆలస్యం కావడం పెద్ద విషయం కాదు. మే 24 వరకు ఎవరి అనుమతి లేకుండా జట్టులో మార్పులు చేసుకోవచ్చు. మే 24 తర్వాతే టెక్నికల్ కమిటీ అనుమతితో జట్టులో మార్పులు చేయాలి. గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే రిప్లేస్‌మెంట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పాకిస్థాన్ జట్టు ప్రకటనను పీసీబీ వాయిదా వేసింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 తరువాతే ప్రపంచకప్ జట్టును ప్రకటించనున్నారు’ అని పీసీబీకి అధికారి ఒకరు చెప్పాడు. పాకిస్తాన్ జట్టును మే 23 లేదా 24న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను సన్‌రైజర్స్‌ అడ్డుకునేనా?
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30కి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా ఉంది. ఓ ప్లేస్ రాజస్థాన్‌ ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం 7 జట్లు తలపడుతున్నాయి. దాంతో రాజస్థాన్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్‌ రాయల్స్‌ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 8 నెగ్గి.. 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ బెర్త్ ఇప్పటికే దాదాపుగా ఖరారు అయింది. మిగిలిన 5 మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా.. అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్త్ దక్కుతుంది. వరుస విజయాలు సాధిస్తున్న రాజస్థాన్‌.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. సన్‌రైజర్స్‌పై గెలిచి అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్త్ దక్కించుకోవాలని చూస్తోంది. వరుసగా నాలుగు విజయాలు, రికార్డు స్కోర్లతో ఐపీఎల్‌ 2024లో జోష్‌ తీసుకొచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొంది. అంతేకాదు ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ కూడా ఇవ్వలేదు. దాంతో సొంత గడ్డపై రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించాలని చూస్తోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 5 గెలిచి.. 10 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో ఉంది. మిగిలిన 5 మ్యాచ్‌లలో కనీసం 3 గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ వెళ్లే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ రేసులో మెరుగైన స్థితిలో నిలవాలంటే.. ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. అయితే వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్‌ను సన్‌రైజర్స్‌ ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి.

వివాదాల నడుమ జనసేన గుర్తుతో అల్లు అర్జున్ ప్రచారం?
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో బన్నీ లుక్ ఊరమాస్ గా ఉంటుంది.. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి..పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా పుష్ప పుష్ప సాంగ్ ను రిలీజ్ చేశారు.. ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో పాటుగా ట్రోల్స్ కు గురవుతుంది.. గతంలో వచ్చిన పుష్ప టైటిల్ సాంగ్ ఎంతగా హిట్ టాక్ ను అందుకుందో ఇప్పుడు అంతకు మించి హిట్ అవ్వాలని దేవి పుష్ప 2 ఫస్ట్ సింగిల్‌ను ప్లాన్ చేశారు. ఇక ఆయన ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా క్యాచీగా ఉంది. ఈ పాటను లిరిసిస్ట్ చంద్రబోస్ రాశారు.. లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.. అయితే సాంగ్ లో బన్నీ గాజు గ్లాస్ ను పట్టుకొని స్టెప్పులు వేస్తాడు.. గ్లాస్ చూపిస్తూ వేసిన స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ పాట చివరిలో టీ గ్లాస్ పట్టుకొని బన్నీ స్టైలిష్‌గా స్టెప్పులేశాడు. అసలే ఎన్నికల టైమ్.. పైగా జనసేన గుర్తు గాజు గ్లాస్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కింద తెగ కామెంట్లు పెడుతున్నారు.

సుకుమార్ కూతురు సుకృతి వేణికి ప్రతిష్టాత్మక అవార్డ్..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ కూతురు సుకృతి వేణి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది.సుకృతి వేణి ప్రధాన పాత్రలో  ‘గాంధీ తాత చెట్టు’ అనే మెసేజ్‌ ఒరియెంటెడ్‌ మూవీ తెరకెక్కింది. ఇందులో సుకృతి వేణి అద్భుతంగా నటించి మెప్పించారు .ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా “దాదా సాహెబ్ ఫాల్కె” అవార్డు లభించింది. మంగళవారం ఢీల్లిలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సుకృతి వేణికి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం సుకృతి వేణి బండ్రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గ్రేడ్ 8 అభ్యసిస్తుంది.అయితే ఆమె నటించిన ఈ గాందీ తాత చెట్టు మూవీ గతంలో కూడా పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. సుకృతి వేణి తన మొదటి చిత్రంతోనే అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలతో పాటు పలు అవార్డ్స్ గెలుచుకుంది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ మరియు ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఉత్త‌మ తొలి సినిమా బాల‌న‌టిగా సుకృతి వేణి బండ్రెడ్డికి అవార్డులు లభించాయి. 11వ నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఉత్త‌మ చిత్రంగా, న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరి బెస్ట్ ఫిలింగా ,అలాగే ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకుంది.అలాగే జైపూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ల్ తో పాటు 8వ ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు మూవీ అవార్డులు అందుకుంది.