NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కలకలం రేపిన ఈ-మెయిల్.. తిరుమలలో హై అలర్ట్..
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఏడుకొండలపై ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు వచ్చిన ఓ సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేసింది.. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.. ఇక, తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు నిజమేనా అని తేల్చే పనిలో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించారు.. మెయిల్ లో వచ్చిన సమాచారం ఆధారంగా తిరుమలలో జల్లేడ పట్టారు భద్రతాధికారులు.. మెయిల్ లో పేర్కొన్న సమయంలో సూచించిన ప్రదేశంలో ఎలాంటి సంచారం లేదని ఎగుర్తించారు.. మెయిల్ పంపిన వారి గురించి కూడా ఆరా తీసేపనిలో పడిపోయారు.. మరోవైపు.. ఆ ఈ మెయిల్‌పై వివరణ ఇచ్చారు పోలీసులు.. తిరుమలలో టెర్రరిస్ట్‌ సంచారం అన్నట్లు వచ్చిన సమాచారం రూమర్స్ అని తేల్చారు.. మెయిల్ ద్వారా వచ్చింది ఫేక్ న్యూస్ వాటిని నమ్మకండి అని సూచించారు ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి.. మెయిల్ పంపిన వ్యక్తులు ఎవరు అనేదానిపై విచారణ చేపడుతున్నాం.. ఎవరో కావాలని ఈ మెయిల్ పంపునట్టు అనుమానిస్తున్నాం అన్నారు.. అయితే, తిరుమలలో టెర్రరిస్టులు ఉన్నారన్న ఫేక్‌ ప్రచారాన్ని నమ్మొద్దని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. మొత్తంగా తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ వచ్చిన ఈ-మెయిల్‌ కలకలం రేపగా.. తనిఖీల తర్వాత అది నకిలీ ఈ మెయిల్‌ అని తేలడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ జిల్లాల్లో నేడు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..!
అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.. అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.. ఇక, ఈ రోజు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రకటించారు.. విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ఇక, ఇవాళ మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీ విపత్తుల సంస్థ.. పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని.. రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.. మరోవైపు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎవరూ చెట్ల కింద ఉండరాదని.. ముఖ్యంగా వర్షం వచ్చే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్‌ అంబేద్కర్‌.

ఈ నెల 8న తెలంగాణకు ప్రియాంక గాంధీ.. నేడు పార్టీ ముఖ్యులతో థాక్రే సమావేశం
తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 8న హైదరాబాద్ రానున్న ప్రియాంక.. తెలంగాణ కాంగ్రెస్ సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు. మే 5న ప్రియాంక తెలంగాణకు వస్తారని ఇటీవల కాంగ్రెస్ నాయకులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. కర్నాటకలో ప్రియాంక గాంధీ బిజీబిజీగా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన షెడ్యూల్‌ను ఏఐసీసీ మార్చడంతో రద్దు చేశారు. ఏఐసీసీ మార్చిన షెడ్యూల్‌ ప్రకారం ప్రియాంక మే 8న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంచార్జ్‌ మానిక్‌ రావ్‌ థాక్రే ముఖ్య నేతలతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 8న ప్రియాంక గాంధీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో చేయాల్సి ఏర్పాట్లపై ఆయన జూమ్‌ ద్వారా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 10 కర్ణాటక ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుంది. అయితే.. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. అయితే ఈ క్రమంలో నేడు నిర్వహించనున్న కర్ణాటక ప్రచారంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా పాల్గొననున్నారు. అంతేకాకుండా.. ప్రియాంకగాంధీ నేడు కర్ణాటకలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏపీలో రేపు లారీల బంద్‌.. విషయం ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో రేపు లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి.. అదేంటి? లారీలు ఎందుకు ఆగిపోతాయి? అనే అనుమానం రావొచ్చు.. అయితే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది.. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఇలా అన్ని రంగాల నుంచి వారికి మద్దతు లభిస్తూనే ఉంది.. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కూడా ముందుకు కదిలింది.. బుధవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్‌ నిర్వహించినున్నట్టు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు వెల్లడించారు. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు.. రేపు ఉదయం 9 గంటల నుంచి లారీలను ఎక్కడికక్కడే నిలిపివేయాలని లారీ యజమానులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రవాణా రంగానికి విశాఖ ఉక్కు కర్మాగారం వెన్నుముకగా ఉంది.. నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి కారణంగా రోజుకు 2 వేల లారీల ఎగుమతి, దిగుమతుల సామర్థ్యంతో లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు.. అలాంటి ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులందరూ ఈ బంద్‌లు భాగస్వాములు కావాలని కోరారు.. లారీలను ఆపివేయాలని పిలుపునిచ్చారు. కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. ఈ తరుణంలో.. విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి.

విరాట్ కోహ్లీతో కయ్యానికి కాలు దువ్విన గౌతమ్ గంభీర్
ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు జట్ల మధ్య పోరు జరుగుతుంది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గత నెలలో బెంగళూరు జట్టును దాని సొంత మైదానంలో లక్నో టీమ్ ఓడించింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టును బెంగళూరు టీమ్ ఓడించింది. లక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ అనగానే గౌతమ్ గంబీర్, విరాట్ కోహ్లీ గుర్తుకొస్తారు. గత నెల జరిగిన మ్యాచ్‌లో గంబీర్, విరాట్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంబీర్ స్టేడియంలోకి వచ్చి నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు చూపిస్తు సైగ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చైనాకు చెక్ పెట్టేలా క్వాడ్ మీటింగ్
క్వాడ్రిలెటరల్ సెక్యూరిటీ డైలాగ్ లీడర్స్ సమ్మిట్ మే 24న ఆస్ట్రేలియాలో జరుగనుంది. 2017 నవంబర్ లో భారత్, జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యులుగా క్వాడ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్వాడ్ ప్రధాన ఉద్దేశం.. ఇండో-పసిఫిక్ లోని క్లిష్టమైన సముద్ర మార్గాలను ఎటువంటి ప్రభావం లేకుండా ఉంచడానికి.. కొత్త వ్యూహాన్ని అభివృద్ది చేయడానికి, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చటానికి ఏర్పాటైంది. క్వాడ్ మొదటి మీటింగ్ 2021లో అమెరికాలో వర్చువల్ గా జరిగింది. దాని తరువాత 2022లో జపాన్ లోని టోక్యో నగరంలో జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మే 24న మూడో క్వాడ్ సమావేశం జరుగనుంది. ఆస్ట్రేలియాలో మే 24న సమావేశానికి.. క్వాడ్ లో సభ్య దేశాలైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొంటారు. మే 19 నుంచి మే 21 వరకు జపాన్ లో జరిగే జీ7 లీడర్స్ కు హాజరైన తర్వాత మూడవ సారి జరిగే క్వాడ్ లీడర్స్ సమావేశానికి పాల్గొంనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియాకు చేరుకుంటారని వైట్ హౌస్ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

గ్రాండ్‌గా ‘ఆదిపురుష్’ ట్రైలర్ ఈవెంట్!
ఆదిపురుష్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు, కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు, మా హీరోని ఏం చేస్తున్నారు? మా హీరో పాన్ ఇండియా సినిమాకి బజ్ లేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆదిపురుష్ అప్డేట్ కావాలంటూ ట్రెండ్స్ కూడా చేశారు. అప్పుడు అప్డేట్ ఎందుకు? డైరెక్ట్‌గా టీజర్ రిలీజ్ చేస్తానని.. అయోధ్యలో గ్రాండ్‌గా ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశాడు ఓం రౌత్. ఇంకేముంది… ఈ ఒక్క టీజర్ చాలదా, సినిమాను నాశనం చేయడానికి అనేలా ఆదిపురుష్ పై ట్రోలింగ్ జరిగింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని యానిమేషన్ సినిమా తీస్తావా? అంటూ ఓం రౌత్‌ పై మండి పడ్డారు రెబల్స్. త్రీడిలో టీజర్ చూపించినా కూడా ట్రోలింగ్ ఆగలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆదిపురుష్‌ పై అంచనాలు మారుతున్నాయి. సంక్రాంతి నుంచి జూన్ 16కి ఆదిపురుష్ సినిమాను పోస్ట్‌పోన్ చేసి… ఈ మధ్యలో గ్రాఫిక్స్‌ను మరింత బెటర్‌గా మార్చాడు ఓం రౌత్. రీసెంట్‌గా బయటికొచ్చిన టీజర్ విజువల్స్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ లిరికల్ మోషన్ పోస్టర్ ఆదిపురుష్ ఫేట్ ని మార్చింది. ఇలాంటి పోస్టర్ అండ్ సాంగ్ ని పెట్టుకోని సైలెంట్ గా ఎందుకు ఉన్నావ్ ఓం మావా అంటూ ఫాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చేసారు. ఈ మోషన్ పోస్టర్ తర్వాత రిలీజ్ అయిన కృతి సనన్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు అప్డేట్స్ ఆదిపురుష్ సినిమాని మోస్ట్ వాంటెడ్ సినిమాల లిస్టులోకి తెచ్చేసాయి. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ బజ్‌ని మరింత పాజిటివ్‌గా మార్చాలంటే ఖచ్చితంగా ట్రైలర్‌ రావాల్సిందే. ఓం రౌత్ కూడా ఇదే ప్లానింగ్‌లో ఉన్నాడు. అందుకే ట్రైలర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాడనే విషయంలోనే క్లారిటీ రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం రోజుకో డేట్ తెరపైకి వస్తోంది. లేటెస్ట్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెండ్ డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. మే 9న ఆదిపురుష్ ట్రైలర్‌ను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని తిరుపతిలో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఏదేమైనా.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మాత్రం… సోషల్ మీడియా హోరెత్తి పోవడం ఖాయం.

పూజతో డేట్… చరణ్ నా హార్ట్ బీట్… పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో ఏజెంట్
అక్కినేని అఖిల్ భారి ఆశలతో చేసిన ఏజెంట్ సినిమా, ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఈవెనింగ్ షోకే థియేటర్స్ కాలీ అయిపోవడంతో అఖిల్ కెరీర్ లో మాత్రమే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా ఏజెంట్ సినిమా నిలిచింది. రిలీజ్ అయ్యి మూడు రోజులు మాత్రమే అయ్యింది, థియేటర్స్ లో అక్కడక్కడా ఇంకా సినిమా ఆడుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది’ అంటూ షాకింగ్ స్టేట్మెంట్ బయటకి వచ్చింది. దర్శకుడి ట్రాక్ రికార్డ్ చూసి, అతన్ని నమ్మి ఏజెంట్ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం తెరపైన కనిపిస్తుంది. ఏజెంట్ రిజల్ట్ చూసిన తర్వాత ఇక ఇప్పట్లో మళ్లీ అఖిల్ బయట కనిపించడు అనుకున్నారు అందరూ కానీ అఖిల్, హీరోయిన్ సాక్షి కలిసి యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న షోకి గెస్టులుగా వచ్చిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మే 6న ఏజెంట్ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుండడంతో ఇది పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ప్రోగ్రామా అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే ఇది ఏజెంట్ సినిమా రిలీజ్ కన్నా ముందు షూట్ చేసిన ఈవెంట్, ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు అంతే. ఈ ప్రోమోలో అఖిల్ చాలా జోష్ లో కనిపిస్తున్నాడు. సుమపై కూడా పంచులు వేస్తూ పాజిటివ్ వైబ్ లో ఉన్నాడు. “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు” అనే డైలాగ్ చెప్పి అఖిల్, షోలో ఉన్న అందరికీ తన ఎనర్జీని పాస్ చేశాడు. పూజా హెగ్డేతో డేటింగ్ కి వెళ్లాలనుందని, రామ్ చరణ్ నా ఫేవరేట్ హీరో-నా హార్ట్ బీట్ అని అఖిల్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో యుట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

Show comments