NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సవ్యంగా సాగుతోన్న కౌంట్‌డౌన్‌ ప్రక్రియ.. నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–12 ప్రయోగం
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది.. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో GSLV F-12 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ సవ్యంగా కొనసాగుతోంది.. నిన్న ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ.. 27 గంటల 30 నిముషాల పాటు కొనసాగిన తర్వాత.. రాకెట్ ను ప్రయోగించనుంది ఇస్రో.. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నేవిగేషన్ అవసరాల కోసం IRNSS నావిక్ -1ఉప గ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్రవేత్తలు.. ఈ రోజు ఉదయం 10.42 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థానిక సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ శాటిలైట్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌12)ను ప్రయోగించనున్నారు.. ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ప్రారంభించగా.. మొత్తం 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–12 రాకెట్‌ ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన నావిక్‌–01 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగ పనులను ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం బలోపేతం కోసం చేస్తున్నారు.. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్‌–01 పేరుతో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. నావిక్‌–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్‌–5, ఎస్‌–బాండ్‌ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిన్న ఉదయం 7.42 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు.. కౌంట్‌డౌన్‌ తరువాత జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 12 రాకెట్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.. 19 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనుంది.

రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. వివరాలు ఇవిగో
ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. కూర్చున్నా.. నిలబడినా.. తుమ్మినా.. దగ్గినా.. ఏం చేసినా వీడియో తీసి.. దానికి కాస్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండ్. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ రీళ్ల ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూత్ అంతా ఈ రీల్ ట్రెండ్ కి అడిక్ట్ అయిపోయారు. అయితే.. ఈ రీళ్లకు లక్షల్లో వ్యూస్ రావడం.. చాలా మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారు ఏం చేసినా చాలా మంది ఫాలో అవుతారు. అయితే.. ఇలాంటి రీళ్లు తయారు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాటిని చూసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. తెలంగాణ సర్కార్ ఈ రీళ్లు తయారు చేసే వారికి తీపి కబురు వినిపించింది. అయితే తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువైపోతోంది. యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. రీళ్ల ట్రెండ్ నడుస్తుండగా.. ఈ సందేశాన్ని ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో.. ‘‘డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’’ పేరుతో పోలీస్ శాఖ కాంటెస్ట్ నిర్వహించనుంది. 18 ఏళ్లు నిండిన వారందరూ ఈ పోటీలకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్ కు బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను ఈ రీళ్లలో చూపించడమే ఈ పోటీ ఉద్దేశం. అయితే.. ఈ వీడియోను 3 నిమిషాల నిడివితో రూపొందించాల్సి ఉంది. ఈ వీడియోలను జూన్ 20లోపు పంపాల్సి ఉంటుంది. ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందజేయబడతాయి. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 75,000 , రెండో స్థానంలో గెలిచిన వారికి రూ. 50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 ప్రైజ్‌గా ఇవ్వబడుతుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 96523 94751 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లో ఉగ్రవాద మూలాలు
ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్‌లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని కేంద్ర నిఘా సంస్థ ఎన్‌ఐఏ అరెస్టు చేస్తోంది. అందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్‌పూర్‌లోని 13 ప్రాం తాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్‌కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, భోపాల్‌ యాంటీ టెర్రరిస్టు స్కాడ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌యూటీ ఇస్లామిస్టుల సమాచారంతోనే జేఎంబీ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టు అయినవారి నుంచి వివరాలు సేకరిస్తే మరే ఇతర ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారు దొరుకుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్న హెచ్‌యూటీ ఉగ్రవాదులను అరెస్టు చేగా.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఇటువంటి ఘటనలు చూస్తుంటే మధ్యప్రదేశ్‌లో రేపు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులు అరెస్టవుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. అంతలా అక్కడ ఉగ్రమూలాలు వేళ్లూనుకున్నాయి. హెచ్‌యూటీ ఉగ్రవాద సంస్థ మూలాలపై ఆరా తీస్తున్న క్రమంలో ‘జమాత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ బంగ్లాదేశ్‌’ (జేఎంబీ)కి చెందిన పదిమందిని కేంద్ర నిఘా సంస్థ ఎన్‌ఐఏ తాజాగా అరెస్టు చేసింది. ఏ రాష్ర్టానికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినా సరిహద్దుల్లో సైన్యం చనిపోవటం.. కశ్మీర్‌లో తీవ్రవాదులపై దాడులు వంటివి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇది బీజేపీ ఎన్నికల స్టంట్‌ అని విమర్శలున్నాయి. మరికొన్ని నెలల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదుల సాకు చూపి, ఎన్నికల్లో గెలువాలనే దుర్బుద్ధితో కొందరు బీజేపీ నేతలు ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ, బజరంగదళ్‌ వంటి సంస్థలకు చెందిన కొందరు కార్యకర్తలు పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే.. వారిని అరెస్టు చేసి, జైలుకు పంపుతామని ఎంపీ దిగ్విజయ్‌సింగ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇటువంటి ఎన్నో అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో భోపాల్‌కు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేస్తే.. బోడిగుండుకు, మోకాలికి లింకుపెట్టి మాట్లాడిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌.. మధ్యప్రదేశ్‌లో జేఎంబీ ఉగ్రవాదుల అరెస్టుతో తేలుకుట్టిన దొంగలా కిక్కురుమనకుండా ఉన్నారని పలువురు తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై సక్రమంగా ఆరా తీస్తే.. ఏ పార్టీ లింకులు బయటపడతాయో వేచి చూడాల్సి ఉంది.

మళ్లీ రగులుతోన్న మణిపూర్‌.. రంగంలోకి సైన్యం
మణిపూర్‌ మళ్లీ అల్లర్లతో అట్టుడుకుతోంది. మైతీలకు ఎస్టీ హోదా కల్పించాలన్న అంశంపై మొదలైన అగ్గి మళ్లీ రాజుకుంది. ఇప్పటికే హింసాత్మక ఘటనల్లో అనేక మంది చనిపోయారు. కుకీలు, మైతీలు మధ్య చెలరేగిన ఘర్షణల వల్ల వేలాది మంది ఆశ్రయాన్ని కోల్పోయారు. ఇప్పటికీ అనేక మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో తలదాచుకుంటున్నారు. తాజాగా, మళ్లీ అల్లర్లు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పరిస్థితి చక్కబడినట్టే కనిపించినా.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇక ఉపేక్షించడానికి వీల్లేదని భావించిన బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం.. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. కనబడితే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్తున్న భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య హోరా హోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇంఫాల్‌ లోయలోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్‌, సెరయు తదితర ప్రాంతాల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఎదురు కాల్పులు జరిపాయి. సుమారు 40 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు భద్రతా బలగాల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. అలాగే, 10 మంది బుల్లెట్‌ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సాధారణ పౌరులపై దాడులకు తెగబడుతూ, ఇళ్లకు నిప్పు పెడుతున్న 40 మంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు సీఎం బీరేన్‌ సింగ్‌ తెలిపారు. అయితే, వాళ్లని కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. వాళ్లంతా ఉగ్రవాదులని.. నిరాయుధులైన సాధారణ ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నారని తెలిపారు సీఎం బీరేన్‌ సింగ్‌. గ్రామాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. AK-47తో పాటు అమెరికా సైనికులు ఉపయోగించే M-16 రైఫిళ్లు, కిలో మీటరుకు పైగా దూరంలో ఉన్న వాళ్లను కాల్చి చంపగల అత్యాధునిక స్నైపర్‌ తుపాకులున్నాయి. ఉగ్రవాదులకు ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయి..? దీని వెనుక ఎవరున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.

నేడు ఐపీఎల్‌ ఫైనల్.. ఈ రోజు కూడా వర్షం పడితే జరిగేది ఇదే..
ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.. అహ్మదాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం కాగా.. భారీ వర్షం ఆటను అడ్డుకుంది. వరుణుడు కరుణిస్తే తప్ప ఈ రోజు రాత్రి 7.30కు కిక్కిచ్చే ఫైనల్‌ ఫైట్‌ జరగదన్నమాట.. దీంతో.. ఈ రోజు మ్యాచ్‌ ఉంటుందా? లేదా? ఒకవేళ ఈ రోజు మ్యాచ్‌ రద్దు అయితే జరిగేది ఏంటి అనే చర్చ సాగుతోంది.. అహ్మదాబాద్‌లో జరిగాల్సిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్ భారీ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వాన పడుతూ, ఆగుతూ దోబూచులాడింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టీమ్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుందనుకున్న మ్యాచ్‌.. అసలు మొదలవకుండానే ఆగిపోయింది. ఒకవేళ రాత్రి తొమ్మిదిన్నరలోగా వర్షం తగ్గితే… మ్యాచ్‌ నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్‌ కూడా వేయలేదు. కనీసం రాత్రి 11 గంటలకు వర్షం తగ్గినా.. ఓవర్లు కుదించి, విన్నర్‌ ఎవరనేది సస్పెన్షన్‌ లేకుండా తేల్చేయాలనుకున్నారు. అయితే భారీ వర్షానికి గ్రౌండ్‌ మొత్తం చెరువులా మారిపోయింది. వర్షపు నీరు గ్రౌండ్‌లో నిలిచిపోవడంతో.. దాన్ని క్లియర్‌ చేయడానికే సుమారు గంట సమయం పడుతుందని.. ఇక చేసేదేమి లేక ఆటను నిలిపివేశారు. దీంతో ఆటను రిజర్వ్ డేకు పోస్ట్‌ పోన్ చేశారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్ ఫైనల్ నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఫైనల్ జరుగుతుందా..? లేదా అనే ఉత్కంఠ క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. నిన్నటి లాగే ఎడతెగని వర్షం ఈరోజు కూడా కురిస్తే సూపర్‌ ఓవర్‌ ద్వారానైనా విజేతను ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక వేళ అదికూడా సాధ్యం కాకపోతే మాత్రం.. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో లీగ్‌లో ఉన్న మ్యాచ్‌ను ఛాంపియన్‌షిప్‌గా ప్రకటిస్తారు నిర్వాహకులు. అలా జరిగితే 14 మ్యాచ్‌ల్లో పది విజయాలు సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ, క్రికెట్‌ ప్రియులు మాత్రం మ్యాచ్‌ కచ్చితంగా జరుగుతుందనే దీమాతో ఉన్నారు. మరి ఈ రోజైనా వరుణుడు కరునిస్తాడా..? క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ ఆస్వాదించేలా అవకాశం ఇస్తాడా? మ్యాచ్‌ జరిగితే గెలిచేది ఎవరు..? మిస్టర్‌ కూల్‌ తన సీనియార్టీని అంతా ఉపయోగించి మరోసారి కప్‌ అందుకుంటారా? దూకుడుగా ఉండే హార్ధిక్‌ పాండ్యా.. వరుసగా రెండోసారి గుజరాత్‌కు టైటిల్‌ అందిస్తాడా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.. సదరు క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. వరుణుడు కరుణించి.. మ్యాచ్‌ జరగాలని కోరుకుంటున్నారు.

అంతా ఆదిపురుష్ మయం… ఇంకో టాపిక్ లేదు
జూన్ 16న ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా, సీతాదేవిగా కృతి సనన్ నటిస్తోంది. గత మూడు నెలలుగా ఆదిపురుష్ సినిమా టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. పోస్టర్, జై శ్రీరామ్ సాంగ్, ట్రైలర్… ఇలా బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆదిపురుష్ సినిమాపై అంచనాలని పెంచాయి. ముఖ్యంగా జైశ్రీరామ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది, 100 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన ఈ ఒక్క పాత ఆదిపురుష్ బిజినెస్ తల రాతనే మార్చేసింది. భయంకరమైన నెగిటివిటీ ఫేస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా ఈరోజు ఇంత హైప్ క్రియేట్ చేసింది అంటే దానికి కారణం జై శ్రీరామ్ సాంగ్. మరో మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఆదిపురుష్ నుంచి అంచనాలని మరింత పెంచుతూ ‘రామ్ సియా రామ్’ సాంగ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ కానుంది. సాంగ్ రిలీజ్ అంటే అదేదో యుట్యూబ్ లింక్ ఇచ్చేసి చూడమన్నట్లు కాదు. మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మధ్యాహ్నం 12గంటలకు ‘రామ్ సియా రామ్’ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. అంటే ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అండ్ లైవ్ పెర్ఫార్మెన్స్ లో ‘రామ్ సియా రామ్’ సాంగ్ ఒకేసారి ప్లేకానుందన్నమాట. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ సాంగ్ ని సచేత్ – పరంపర కంపోజ్ చెయ్యడంతో పాటు వారే పాడడం విశేషం. జై శ్రీ రామ్ సాంగ్ ని అద్భుతమైన లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి “రామ్ సియా రామ్” సాంగ్ కి కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ సాంగ్ ని వినడానికి ప్రభాస్ ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

షార్ట్ గ్యాప్ అంతే… దేవర వచ్చేస్తాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మే 28న అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి తారక్ వెళ్లిన సమయంలో వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతూనే ఉన్నాయి. మార్నింగ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వైట్ షర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్, ఈవెనింగ్ కి బ్లాక్ అండ్ బ్లాక్ లో ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించాడు. ఫ్యామిలీతో పాటు ఫారిన్ ట్రిప్ కి రెడీ అయిన ఎన్టీఆర్, షార్ట్ పీరియడ్ వెకేషన్ కి వెళ్లాడు. ఈ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ తో పాటు ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉండడంతో ఫాన్స్ ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఉండే ఈ ట్రిప్ ని కంప్లీట్ చేసుకోని ఎన్టీఆర్ తిరిగి వచ్చేస్తాడని సమాచారం. ఆ తర్వాత దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘దేవర’. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జట్ లో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్ గా బయటకి వచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్ తో కొరటాల శివ ఒక బిగ్గర్ వరల్డ్ ని ఎన్టీఆర్ కోసం క్రియేట్ చేసాడు. దీని కోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ని కూడా రప్పించాడు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.