GSLV F-12 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ..
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది.. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో GSLV F-12 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది.. 27 గంటల 30 నిముషాల కౌంట్ డౌన్ అనంతరం రాకెట్ ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నేవిగేషన్ అవసరాల కోసం IRNSS నావిక్ -1ఉప గ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్రవేత్తలు.. ఇక, శ్రీహరికోటలో ప్రయోగ ప్రక్రియను శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్.. 27.30 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ తర్వాత రేపు ఉదయం 10.42 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు.. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్ వ్యవస్థకు చెందిన 2,232 కిలోల బరువు గల ఎన్‌వీఎస్ -01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు.. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) శనివారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో నిర్వహించారు. అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) ప్రతినిధులు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రయోగానికి 27.30 గంటల ముందు అంటే ఈ రోజు ఉదయం 7.42 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు.. కౌంట్‌డౌన్ తరువాత జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.19 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనుంది.
అలర్ట్: ఈ జిల్లాల్లో వడగాల్పులు.. ఆ ప్రాంతాల్లో వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు.. ఓవైపు వగలాలులు.. మరోవైపు ఈదురు గాలుల్లా ఉంది పరిస్థితి.. ఈ రోజు రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.. నేడు 73 మండలాల్లో వడగాల్పులు, రేపు 12 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సూచించింది.. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల సంఖ్య 73గా ఉంన్నరాయి.. అందులో అల్లూరి 3, బాపట్ల 1, తూర్పుగోదావరి 11, ఏలూరు 5, గుంటూరు 15 మండలాల్లో డగాల్పులు వీచే అవకాశం ఉండగా.. కాకినాడ 8, కృష్ణా 9, ఎన్టీఆర్ 10, పల్నాడు 5, మన్యం4, వైయస్సార్ జిల్లాలోని 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపనుందని పేర్కొంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక, నిన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లెలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తిరుపతి జిల్లా గూడూరు లో 44.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా చెరుకుపల్లి, ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో 44.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. ఇక, 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.. పిడుగుపాటు, వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్..
ఓ వైపు ప్రారంభోత్సవం.. మరోవైపు రెజ్లర్ల మార్చ్.. ఢిల్లీలో హై సెక్యూరిటీ..
కొత్త పార్లమెంట్ భవనం ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఇదిలా ఉంటే మరోవైపు జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేసిన రెజ్లర్లు అతడిని అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ వరకు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు రెజ్లర్లు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజర్లు.. ఎలాగైనా కొత్త పార్లమెంట్ వద్దే తమ ‘‘మహిళా మహాపంచాయత్’’ నిర్వహిస్తామని చెప్పారు. అయితే “మహిళా మహాపంచాయత్” నిర్వహించేందుకు అనుమతి లేదని, నిరసనకారులెవరైనా అటువైపుగా వెళ్లేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఇంటెన్సివ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేరళ హోటల్ యజమాని హత్య కేసులో ట్విస్ట్.. సెక్స్ స్కాండల్ కోణం..
కేరళలో సంచలనం సృష్టించిన హోటల్ యజమాని హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సెక్స్ స్కాండర్, హనీట్రాప్ ఈ కేసులో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కోజికోడ్ కు చెందిన వ్యాపారి హత్య కేసులో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. నిందితులు శిబిలి, ఫర్హానా, ఆషిక్ లు ముగ్గురు 58 ఏళ్ సిద్ధిక్ ను హనీట్రాప్ చేసేందుకు కుట్ర చేశారు. అయితే మే 18న ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో మలప్పురం జిల్లాలో ఎరన్హిపాలెంలో హత్య చేశారు. ముగ్గురు నిందితులు కలిసి సిద్ధిక్ ను బలవంతంగా బట్టలు విప్పించి, అతని నగ్న ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో గొడవ జరిగింది. గోడవ సమయంలో ఫర్హానా, శిబిలికి సుత్తె అందించింది. దాంతో అతడు సిద్ధిక్ తలపై కొట్టాడు. ఆ తరువాత ఆషిక్ కూడా బాధితుడిపై దాడి చేశాడు. తీవ్రగాయాలతో సిద్ధిక్ మరణించాడు. ఈ వివరాలను మలప్పురం జిల్లా ఎస్పీ ఎస్ సుజిత్ దాస్ మీడియాకు వెల్లడించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కట్టర్ సాయంతో రెండుగా నరికి, బ్యాగులో పెట్టుకుని అట్టప్పాడి ఘాట్ రోడ్డు వద్ద విసిరేశారు నిందితులు. సిద్ధిక్ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్లు తెలిసిన శిబిలి హత్య తర్వాత ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు. మే 24న నిందితులను చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు. అస్సాంకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్న సమయంలో కేరళ పోలీసులకు నిందితులు పట్టుబడ్డారు. కోజికోడ్ లో ఒలవన్న లో రెస్టారెంట్ నడుపుతున్న తిరూర్ కు చెంది సిద్ధిక్ మృతదేహాన్ని అట్టప్పాడి రోడ్డులో ఒక కొండ వద్ద రెండు ట్రాలీ బ్యాగుల్లో పోలీసులు శుక్రవారం గుర్తించారు.
నేడు టర్కి ప్రెసిడెంట్ ఎలక్షన్స్.. మళ్లీ ఎర్డోగన్ కు పదవి దక్కేనా ?
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. వచ్చే ఐదేళ్లపాటు ఆయన కొనసాగాలా.. వద్దా అనే విషయంపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. నేడు టర్కీ అధ్యక్ష ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశ పోలింగ్ మే 14న జరిగింది. తొలి రౌండ్‌లో ఎవరికీ మెజారిటీ రాలేదు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు ఎర్డోగన్, ఆయన ప్రత్యర్థి కెమల్ కిలిక్‌దరోగ్లు మధ్య గట్టి పోటీ నెలకొంది. తొలి రౌండ్ ఓటింగ్‌లో ఇద్దరిలో ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాలేదు. ఈరోజు రన్‌ఆఫ్ ఓటింగ్ అంటే ఇద్దరు అభ్యర్థుల మధ్య నిర్ణయాత్మక పోటీ ఉంటుంది. టర్కీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 50 శాతం ఓట్లు అవసరం. ఇది జరగకపోతే, రెండవ దశ ఓటింగ్ ఉంది. ఈ ఓటింగ్‌ను ‘రన్ ఆఫ్’ అంటారు. ఈ నిర్ణయాత్మక పోటీలో ఎర్డోగన్ కుర్చీ మళ్లీ దక్కుతుందా లేక ఓడిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. టర్కీలో స్థానిక కాలమానం ప్రకారం, ఓటింగ్ 8 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది 5 గంటల వరకు కొనసాగుతుంది. నేటి ఓటింగ్‌పై ప్రపంచ దేశాలు దృష్టి కేంద్రీకరించాయి. తొలి రౌండ్‌లో 88.8 శాతం ఓటింగ్ నమోదైంది. ఎర్డోగన్‌కు 49.4 శాతం ఓట్లు రాగా, గాంధీ ఆఫ్ టర్కీగా పిలుచుకునే కిలిక్‌డరోగ్లుకు 45 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో నేషనలిస్ట్ అభ్యర్థి సినాన్ ఒగన్‌కు 5.2 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్లుగా ఎర్డోగన్ టర్కీని పాలిస్తున్నాడు. 2003 నుంచి ఆయన అధికారంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. అదే సమయంలో, 2014 సంవత్సరంలో అతను టర్కీ అధ్యక్షుడయ్యాడు. ఈ 20 ఏళ్లలో దేశానికి ప్రధానిగానూ, రాష్ట్రపతిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టం.. ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ నివాళి
టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తెలుగు ప్రజల రుణం తీర్చేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కేజీల బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారిందని అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. తన కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని బాలకృష్ణ అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. ఎన్టీఆర్ అందరికీ నచ్చే అరుదైన వ్యక్తి అని తెలిపారు. వారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయన్నారు. తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయం. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు కష్టాలు ఎదురయ్యాయి. ఘాట్ వద్ద అభిమానులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఎన్టీఆర్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీంతో నివాళులర్పించేందుకు జూనియర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుమారుడు నందమూరి రామకృష్ణ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ యుగపురుషుడు అని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆజ్యం పోశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అందించిన సంక్షేమ పథకాలే నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.