NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్‌లో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. ఎండలు మండిపోతున్నాయి, వడగాల్పులు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.. నేడు 97 మండలాల్లో వడగాల్పులు, రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.. ఈరోజు అల్లూరి జిల్లాలోని 2, అనకాపల్లిలో 1, బాపట్లలోని 7, తూర్పుగోదావరిలోని 7, పశ్చిమ గోదావరిలోని 3, ఏలూరులోని 4 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది.. ఇక, గుంటూరులోని 17 మండలాలు, కాకినాడలోని 9, కోనసీమలోని 10, కృష్ణా జిల్లాలోని 15, ఎన్టీఆర్ జిల్లాలోని 8, పల్నాడుజిల్లాలోని 9, మన్యంలోని 4, వైయస్సార్ జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు వీస్తాయని.. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇక, ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.. మరోవైపు.. నిన్న తిరుపతి జిల్లా రేణిగుంటలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.7 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నింద్ర 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో మూడు రోజుల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ రోజు మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

జనసేనతో పొత్తుపై టీడీపీ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే పొత్తులు, పోటీలపై చర్చ సాగుతోంది.. అయితే, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోని దసరాకు ప్రకటించాలని, పొత్తులపై నిర్ణయం కూడా ఎన్నికల ముందే తీసుకోవాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నరాయుడు అధ్యక్షతన రాజమండ్రిలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు.. ఇక, రాజమండ్రి వేదికగా ఈ రోజు ప్రారంభం కానున్న మహానాడులో ప్రవేశపెట్టనున్న 15 తీర్మానాలపై చర్చించారు. మొత్తంగా మహానాడులో పొత్తులపై ప్రకటన ఉండదని తేల్చారు టీడీపీ నేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తుపై నిర్ణయం ఎన్నికల సమయంలోనే తీసుకోవాలని నిర్ణయించారు. ఇక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానించనున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం సీనియర్ నేతలు కాల్వ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామని ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామనేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మరోవైపు.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పాత్రదారులతోపాటు, సూత్రధారులను బయటపెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనివ్వకుండా డ్రామా నడుస్తుంది విమర్శలు గుప్పించారు..

రేవంత్‌ రెడ్డికి హెచ్‌ఎండీఏ లీగల్‌ నోటీసులు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే..
ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలను హైదరాబాద్‌ మహా నగర్‌ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సీరియస్‌గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది. నోటీసు అందిన 48 గంటల్లోగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లోక్‌సభ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఏం మాట్లాడినా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది కాబట్టి చేసే ప్రతి ప్రకటన, మాట్లాడే మాటకు బాధ్యత ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఓఆర్‌ఆర్‌ను లీజుకు తీసుకున్నట్లు హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 9న టీవీఓటీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు టెండర్ల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు. అత్యధిక బిడ్ దాఖలు చేసిన ఐఆర్ బీ ఇన్ ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ కు లీజు ఖరారు చేస్తూ గత నెల 27న లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చామని వివరించారు. టెండర్ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు, ఐఆర్‌బి ఇన్‌ఫ్రాకు జారీ చేసిన పత్రాలు మరియు ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లీజుపై ప్రజలకు అన్ని విధాలుగా సమాచారం ఉన్నప్పటికీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ దానిపై రేవంత్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని నోటీసుల్లో హెచ్‌ఎండీఏ ఆరోపించింది.

వృద్ధుణ్ని చంపి.. ముక్కలు చేసి అటవీలో పడేసిన యువజంట
ప్రస్తుత కాలంలో ఓ మనిషిని చంపడం సర్వసాధారణం అయిపోయింది. చంపడమే కాకుండా.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రదేశాలలో పడేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ.. ఢిల్లీలో తన ప్రేయసి శ్రద్ధ వాకర్ ను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసి ముక్కలుగా చేసి ఇంట్లో ఫ్రీడ్జ్ లో పెట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత ఇంచుమించు ఇలాంటి హత్యలే ఎక్కుగా మనకు కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళలో జరిగింది. కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో సిద్ధిఖ్‌ అనే హోటల్‌ యజమానిని ఓ యువజంట అత్యంత దారుణంగా చంపారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీబ్యాగులో తీసుకువెళ్లి అటవీప్రాంతంలో విసిరేశారు. అయితే నిందితులను పోలీసులు శుక్రవారం చెన్నైలో అరెస్ట్ చేసి కేరళ పోలీసులకు అప్పగించారు. సిద్ధిఖ్‌ వ్యాపార నిమిత్తం కుటుంబసభ్యులకు దూరంగా కోజికోడ్‌ జిల్లాలోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మే 18న కోజికోడ్‌లోని ఎరంజిపాలెంలో ఉన్న ఓ హోటలులో రెండు గదులను ( బి3, బి4 ) ఆయన బుక్‌ చేసుకున్నారు. అదే హోటలులో పాలక్కడ్‌కు చెందిన నిందితులు శిబిల్‌, ఫర్హానాపై అంతస్తులో అద్దెకు దిగారు. మే 19న శిబిల్‌, ఫర్హానా ఓ ట్రాలీబ్యాగుతో కిందకు దిగిన విజువల్స్ హోటల్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత వీరు ముగ్గురూ కనిపించకుండా పోయారు. సిద్ధిఖ్‌కు అతడి కుమారుడు చాలాసార్లు ఫోను చేసినా అతని మొబైల్ స్విచ్‌ఆఫ్‌ వచ్చింది.

భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వీసాల రిజెక్ట్
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ, వెస్ర్టన్‌ సిడ్నీ యూనివర్సిటీలు ఎడ్యుకేషన్‌ ఏజెంట్లకు సూచనలు జారీ చేశాయి. ఇదే అంశంపై వ్యక్తిగతంగానే కాకుండా మెయిల్స్‌ ద్వారా కూడా సమాచారాన్ని పంపించినట్టు ఫెడరేషన్‌ యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇండియాలోని ఆ 6 రాష్ర్టాల విద్యార్థులు చేస్తున్న దరఖాస్తుల్లో చాలా వరకు వాస్తవమైనవి కావని, మోసపూరితంగా ఉన్నట్టు ఆష్ర్టేలియా హోం శాఖ వెల్లడించడం వల్లే వీసాల మంజూరును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం దరఖాస్తుల్లో 25 శాతం మోసపూరితంగానే ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. సుమారు 2 నెలల పాటు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. వలసలు, విద్య నైపుణ్య మార్పిడులను పెంపొందించుకునేందుకు ఇండియా, ఆష్ర్టేలియా దేశాలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. విక్టోరియా యూనివర్సిటీ, ఎడిత్‌ కోవన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వోలోంగాంగా, టొరెన్స్‌ వంటి పేరొందిన విశ్వవిద్యాలయాలన్నీ తమకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు వాటికి అనుబంధంగా కొందరు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. వారి నుంచి వచ్చిన మెయిల్స్‌ ఆధారంగానే విద్యార్థులకు వీసాలు మంజూరు అవుతాయి. భవిష్యత్తులో ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించేలా యూనివర్సిటీలు తమ ఏజెంట్లకు సూచనలు జారీ చేసినట్టు ది సిడ్నీ హెరాల్డ్‌ పేర్కొంది.

హార్థిక పాండ్యాను ప్రశంసిస్తున్న నెటిజన్స్
ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. తద్వారా రెండో సారి IPL ఫైనల్‌లో చోటు సంపాదించింది. ఇది టైటాన్స్ వరుసగా రెండవసారి ఫైనల్ కు వచ్చిన టీమ్ గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ వచ్చిన రెండవ సంవత్సరంలో రెండు సార్లు ఫైనల్ కు రావడం విశేషం. ఇక ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ తలపడనుంది. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరం ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం కూడా ఫైనల్ లోకి అడుగు పెట్టింది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికీ పటిష్టంగా కొనసాగుతోంది.. ఈ సారి ఫైనల్ లో గెలిచి మరోసారి చరిత్రను లిఖించగలుగుతుందా అనేది చూడాలి. నిన్న జరిగిన పోటీలో 5 సార్లు విజేత ముంబై ఇండియన్స్‌పై జట్టు 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ట్రోఫీని ఎత్తే దిశగా గుజరాత్ అడుగులు వేస్తుంది. ముంబై, సీఎస్కే తర్వాత వరుసగా ఫైనల్స్‌లోకి ప్రవేశించిన మూడవ జట్టుగా గుజరాత్ నిలిచింది. శుబ్ మన్ గిల్ అద్భుత సెంచరీతో గుజరాత్ టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ స్కోరును ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్‌కు మెరుపు ఆరంభం అవసరం కాగా.. రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా నేహాల్ వధేరా వచ్చాడు. అయితే అతను ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఇషాన్ కిషన్‌ గాయం కారణంగా బ్యాటింగ్ కు రాలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత వరకు ముంబై ఫైనల్ రేసులో నిలిచింది. కానీ అతను ఔట్ అయిన తర్వాత MI యొక్క అవకాశాలు శూన్యమయ్యాయి. ఫలితంగా జట్టు 171 వద్ద ఆల్ అవుట్ అయింది.

ఆ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ రేటు
ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. ఏడాది కాల పరిమితితో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) రేట్లను పెంచింది బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI).. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఏడాది కాల డిపాజిట్‌పై 7 శాతం వడ్డీ వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది.. ఇది ఇప్పటి వరకు 6 శాతంగా ఉండగా.. ఒకేసారి 100 బేసిస్‌ పాయింట్లను పెంచి 7 శాతానికి తీసుకొచ్చింది బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. 2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేటు వర్తించనుండగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ప్రకటన ప్రకారం, కొత్త రేట్లు మే 26, 2023 నుండి అమలులోకి వచ్చాయి. రిటైల్ కస్టమర్లకు ఒక సంవత్సరం కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటును 6 శాతం నుండి 7.00 శాతానికి బ్యాంక్ పెంచింది. పునర్విమర్శ తర్వాత, బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం 3 శాతం నుండి 7.00 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఇది ఒక సంవత్సరం డిపాజిట్ కోసం సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు దేశీయ, NRO మరియు NRE డిపాజిట్లకు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా FD వడ్డీ రేట్లు 7 రోజుల నుండి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు బ్యాంక్ 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 46 రోజుల మరియు 179 మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 180 రోజుల నుండి 269 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 5.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 270 రోజుల నుండి ఒక సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై బ్యాంక్ 5.50 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది.

ఇకనుంచి యూట్యూబ్ లో ఆ ఆప్షన్ కనిపించదు
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ ను ఆపేయనుంది. యూట్యూబ్ 2017లో స్టోరీస్ ఫీచర్‌ను పరిచయం చేసింది. యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈజీ అప్‌డేట్‌ షేరింగ్, సంభాషణల ప్రారంభం, కంటెంట్‌ ప్రచారం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లను ప్రోత్సహించాలని యూట్యూబ్ భావిస్తోంది. ఇందుకు యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు బెస్ట్ అని అనుకుంటోంది. ఎందుకంటే స్టోరీస్ ఫీచర్ తో పోలిస్తే యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు.. ఎక్కువ వ్యూయర్ షిప్ తో పాటు.. కామెంట్‌లు, లైక్‌లు వస్తాయి. ఇవి యూజర్లకు ఎక్కువ కనెక్ట్ అవుతాయి. “6/26/2023 నుంచి కొత్త YouTube స్టోరీని సృష్టించే ఎంపిక అందుబాటులో ఉండదు. ఆ తేదీలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేయబడిన కథనాలు పోస్ట్ చేసిన ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయి” అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఈ స్టోరీస్ ఫీచర్ ను సోషల్ మీడియా దిగ్గజాలైన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ప్రవేశపెట్టారు. కానీ ఈ ఫీచర్ సక్సెస్ కాలేదు. ప్రవేశపెట్టిన మొదట్లో ఆదరణ భాగానే లభించినా క్రమంగా యూజర్లు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్, ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఏడాది పొడవునా కొత్త ఫీచర్‌లతో షార్ట్‌లు, కమ్యూనిటీ పోస్ట్‌లను మెరుగుపరచడం కొనసాగిస్తామని యూట్యూబ్ చెబుతోంది.