NTV Telugu Site icon

Top Headlines @ 9AM : టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*నేడు ఆరో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్.. బరిలో ప్రముఖులు వీరే..!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా, ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ లో8, హర్యానా 10, జమ్ముకశ్మీర్ లో 1, ఝర్ఖండ్ 4, ఢిల్లీ 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ లో 8 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. కాగా, వీటితో పాటు ఒడిశా అసెంబ్లీలో 42 ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక, ఈ ఆరో దశలో ఎన్నికల బరిలో సంబల్పూర్ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (కర్నాల్), దీపేందర్ హుడా (రోహ్‌తక్), మేనకాగాంధీ (సుల్తాన్‌పూర్), పీడీపీ చీఫ్ మెహబూబా ముస్తీ (అనంతనాగ్- రాజౌరీ), నవీన్ జిందాల్ (కరుక్షేత్ర), కన్నయ్య కుమార్ (నార్త్ ఈస్ట్ ఢిల్లీ), రావు ఇందరితీసింగ్ (గురుగ్రామ్), బన్సూరి స్వరాజ్ (ఢిల్లీ) నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలనూ గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకోగా.. అక్కడ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్రై చేస్తుంది. పొత్తులో భాగంగా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుంది. ఇక, ఇండియా కూటమి నుంచి ఎన్డీయేకి గట్టి పోటీ ఇస్తుంది. కాగా, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 543లో 428 స్థానాలకు ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ దశ ఎన్నికలు కూడా అయిపోతే.. మొత్తం 486 స్థానాలకు పోలింగ్ పూర్తైనట్లు. ఏడో దశలో 57 స్థానాలకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజున ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు తెలంగాణలోని కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం కూడా రానుంది. అలాగే, జూన్ 6వ తేదీన ఎన్నికల కోడ్ ముగియనుంది.

 

*ఆ నియామకాలు వాయిదా వేయాలి.. యూపీఎస్సీ ఛైర్మన్‌కు చంద్రబాబు లేఖ
రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ రాశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్‌ ప్రక్రియ చేపట్టడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కూడా కేవలం సీఎంఓలో ఉన్నవారే మాత్రమే అని గుర్తు చేశారు. జాబితా కూడా నిబంధనల ప్రకారం రూపొందించలేదని లేఖలో ప్రస్తావించారు. సరైన విధానాలు అనుసరించకుండా పదోన్నతులు కట్టబెట్టేందుకు జాబితాను రూపొందించారని ఆరోపించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో ప్రభుత్వం హడావుడిగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. పారదర్శకత లేకుండా రూపొందించిన జాబితాను పున:పరిశీలించాలని.. పదోన్నతుల అంశాన్ని జూన్ 7 తర్వాత చేపట్టేలా చూడాలని కోరారు. చంద్రబాబు లేఖ కాపీలను పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ, కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల ఫలితాలు రానున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా… టీడీపీ కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమిగా పోటీ చేయగా… వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. విజయంపై రెండు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

 

*నంద్యాలలో అల్లు అర్జున్‌ పర్యటన వివాదం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్ , నాగరాజు వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనెల 11న ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అంత మంది జనసమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయ్యింది. ఈ నెల 11న సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. శిల్పా రవి అల్లు అర్జున్‌కు ఫ్రెండ్‌ కావడంతో.. ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్‌ వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో శిల్పా రవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా.. అల్లు అర్జున్‌ మీద కూడ కేసు నమోదైంది. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

*ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం.. ఆరుగురికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడ ఇనుము కరిగించే కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో అర డజను మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ ఘటన నగరంలోని తలనగరి ప్రాంతంలో చోటుచేసుకుంది. పేలుడు తర్వాత మంటలు భారీ రూపం దాల్చాయి. ఫ్యాక్టరీలో అమర్చిన ఫర్నేస్‌లో ఇనుము కరిగిస్తుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ సమయంలో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. ఫ్యాక్టరీలో మంటలు క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. మంటల కారణంగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, అర డజను మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఐదుగురి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు ఫ్యాక్టరీ వైపు పరుగులు తీశారు. తన సోదరుడు ఫ్యాక్టరీలో ఇనుము కరిగే పని చేసేవాడని మృతుడి సోదరుడు తెలిపాడు. ఇంతలో కర్మాగారంలో ఇనుమును కరిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ మొత్తం గందరగోళం నెలకొంది. లావా అతని సోదరుడితో సహా కొందరిపై పడింది. దీంతో సోదరుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రమంగా ఫ్యాక్టరీలో లావా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతంలో మంటలు పెరగడం ప్రారంభించాయి. ఎక్కువ మంది ప్రజలు కూడా ప్రభావితమయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్యాక్టరీలో కరిగిన ఇనుముతో తయారు చేసిన లావా కొందరు యువకులపై పడడంతో ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదం జరగడానికి ముందు కూడా ఫ్యాక్టరీలో పేలుళ్ల శబ్ధం ఒకరోజు ముందు వినిపించిందని మృతుడి సోదరుడు తెలిపాడు. అయితే దీనిని ఫ్యాక్టరీ నిర్వాహకులు పట్టించుకోలేదు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినట్లు సమాచారం అందిందని విశాఖ జిల్లా మెజిస్ట్రేట్ సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం అందించారు. ఈ సమయంలో రెస్క్యూ టీమ్‌ను ఫ్యాక్టరీకి పంపించారు. రెస్క్యూ టీమ్ మంటలను ఆర్పింది. అలాగే ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. మరికొందరు కూడా లోపల ఉంటే వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ నిరంతరం ప్రయత్నిస్తోంది. అలాగే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

 

*గొడుగు పట్టుకుని బస్సు నడిపిన డ్రైవర్.. వీడియో తీసిన కండక్టర్ సస్పెండ్
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బస్సు డ్రైవర్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని బస్సును నడుపుతున్నాడు. దీంతో అక్కడ ఉన్న కండక్టర్ వీడియోను రికార్డు చేయడంతో ఆ వీడియో వైరల్ కావడంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా బస్సు డ్రైవర్, కండక్టర్ వినోదం కోసమే ఈ వీడియో తీశారని చెబుతున్నారు. నార్త్ వెస్ట్రన్ కర్నాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(nwkrtc) ప్రకారం.. ఈ సంఘటన గురువారం జరిగింది. ఈ సమయంలో బస్సు డ్రైవర్ హనుమంతప్ప కిల్లెదర, కండక్టర్ అనిత డ్యూటీలో ఉన్నారు. డ్రైవర్ బస్సును బెటగేరి-ధార్వాడ మార్గంలో నడుపుతున్నాడు. సాయంత్రం బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. అప్పుడు డ్రైవర్ తన వినోదం కోసం గొడుగును పట్టుకున్నాడు. అదే సమయంలో మరో చేత్తో బస్సును నడుపుతున్న సమయంలో బస్సులో ఉన్న కండక్టర్ హెచ్ అనిత ఘటన మొత్తాన్ని వీడియో తీశారు. అతను ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు, ఆ వీడియో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత NWCRTC బృందం బస్సును తనిఖీ చేసింది. డిపార్ట్‌మెంట్ టెక్నికల్ ఇంజినీర్లు బస్సును పరిశీలించి రూఫ్‌లో లీకేజీ లేదని నిర్ధారించారు. కేవలం వినోదం కోసమే ఈ వీడియో తీశానని డ్రైవర్ తన ప్రకటనలో తెలిపాడు. అయితే బస్సులో ఎలాంటి సమస్య లేకపోవడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

 

*వరంగల్ లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ఏం జరిగిందంటే?
రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలోని ఏడు మోరీల దగ్గర రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు తీవ్ర గాయాలతో, రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఖమ్మం జిల్లా సారధి నగర్ కు చెందిన యువతిగా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువకుడు వరంగల్ కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఆత్మహత్య యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమా? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. ఈ ఘటన తెలియగానే యువతి, యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు దర్యప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

 

*పాకిస్థాన్‌లో మండుతున్న వేడి.. ఉష్ణోగ్రత రికార్డు బద్దలు
లాహోర్, పంజాబ్‌లోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన వేడిగా ఉండే అవకాశం ఉందని పాకిస్తాన్ వాతావరణ విభాగం (PMD) అంచనా వేసింది. మే 27 వరకు పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 6-8 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది. మే 21 నుంచి దేశంలోని దాదాపు 26 జిల్లాలు తీవ్రమైన వేడిగా ఉన్నాయి. మొదటి వేవ్ మే 30 వరకు ఉంటుందని, జూన్‌లో రెండు వేర్వేరు హీట్‌వేవ్‌లు ఉంటాయని వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. వాతావరణ మార్పులపై ప్రధానమంత్రి కోఆర్డినేటర్ రోమినా ఖుర్షీద్ ఆలం పౌరులను, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను తీవ్రమైన వేడి నుండి రక్షించడానికి అందుబాటులో ఉన్న వనరులను సమీకరించాలని ప్రభుత్వ శాఖలను కోరారు. ఆమె నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) సీనియర్ అధికారులతో విలేకరుల సమావేశంలో సూచనలు చేశారు. పాకిస్తాన్ వాతావరణ శాఖ డేటాను ఉటంకిస్తూ, చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం సాధారణం కంటే 5 నుండి 6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయని రోమినా ఆలం చెప్పారు. పంజాబ్, సింధ్, బలూచిస్థాన్‌లోని 26 జిల్లాలు తీవ్రమైన వేడి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆయన వెల్లడించారు. ఇది వేసవి అంతా మూడు తరంగాలలో కొనసాగుతుందని భావించారు. మే 22-30 వరకు నడిచిన మొదటి వేవ్, జూన్ ప్రారంభంలో.. చివరిలో అదనపు తరంగాలను అనుసరిస్తుంది. జూన్ 7-8 వరకు రెండవ హీట్ వేవ్ సంభవిస్తుందని.. జూన్ చివరి వారంలో మూడవ వేవ్ సంభవిస్తుందని ఆయన చెప్పారు. దేశం తీవ్రమైన వేడిని ఎదుర్కొంటోందని, ఇది ప్రారంభం మాత్రమేనని ఆయన అన్నారు. అధిక వాతావరణ పీడనం ఈ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తోందని, ఇది మన ప్రజల సామాజిక-ఆర్థిక కార్యకలాపాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. రాజధాని లాహోర్‌లో గురు, శుక్రవారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45-47 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో నగరవాసుల కష్టాలు పెరుగుతాయన్నారు. పోటోహార్ ప్రాంతంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పగటి ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 4-6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుందని అంచనా. లాహోర్‌లో నిన్న నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్, సాపేక్ష ఆర్ద్రత సాయంత్రం 21 శాతం నమోదైంది. వేడి ఒత్తిడి పెరుగుతుంది.

 

*షాబాజ్, అభిషేక్‌ మాయాజాలం.. ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌!
అద్భుత ఆటతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ 2024 ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్లో రాజస్థాన్‌ రాయల్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించింది. సన్‌రైజర్స్‌ విజయంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (50; 34 బంతుల్లో 4×6), షాబాజ్‌ అహ్మద్‌ (3/23), అభిషేక్‌ శర్మ (2/24) కీలక పాత్ర పోషించారు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ తలపడుతుంది. 2016లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌.. 2018లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు ట్రెంట్ బౌల్ట్‌ షాక్ ఇచ్చాడు. ఊపు మీద ఉన్న అభిషేక్‌ను బోల్తా కొట్టించాడు. రాహుల్ త్రిపాఠి (37; 15 బంతుల్లో 5×4, 2×6) ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. అయితే బౌల్ట్‌ అతడిని పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్లో మార్‌క్రమ్‌ (1) కూడా అవుట్ అయ్యాడు. ఈ సమయంలో హెడ్‌ (34; 28 బంతుల్లో 3×4, 1×6), క్లాసెన్‌ జట్టును ఆదుకున్నారు. హెడ్‌, నితీశ్‌ (5), సమద్‌ (0)లు పెవిలియన్ చేరినా.. షాబాజ్‌ అహ్మద్‌ (18)తో కలిసి క్లాసెన్‌ జట్టును మంచి స్థితిలో నిలిపాడు. ఛేదనలో ఓపెనర్‌ కోహ్లెర్‌ క్యాడ్‌మోర్‌ (10) తడబడినా.. జైస్వాల్‌ (42; 21 బంతుల్లో 4×4, 3×6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. భువనేశ్వర్‌ వేసిన ఆరో ఓవర్లో అతను 19 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో 51/1తో రాయల్స్‌ మంచి స్థితిలో నిలిచింది. అయితే 8వ ఓవర్లో యశస్విని ఔట్‌ చేసిన షాబాజ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. పార్ట్‌టైమర్‌ అభిషేక్‌ కీలకమైన సంజు శాంసన్‌ (10) వికెట్‌ తీశాడు. రన్ రేట్ పెంచే క్రమంలో పరాగ్‌ (6) అవుట్ అయ్యాడు. పరాగ్‌ సహా అశ్విన్‌ (0) సైతం షాబాజ్‌ పెవిలియన్ చేర్చాడు. హెట్‌మయర్‌ (4)ను అభిషేక్‌ బౌల్డ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ విజయం దాదాపు ఖాయమైపోయింది. అయితే ధ్రువ్‌ జురెల్‌ (56 నాటౌట్‌; 35 బంతుల్లో 7×4, 2×6) మాత్రం పోరాడాడు. రోమన్‌ పావెల్‌ (6) తేలిపోవడంతో రాజస్థాన్ ఓడక తప్పలేదు.

 

*ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్
స్పిన్నర్ షాబాజ్‌ అహ్మద్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్‌’గా ఆడించడమే తమకు కలిసొచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే నిర్ణయం ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ డానియల్ వెటోరిది అని చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన తమకు సర్‌ప్రైజ్ అని, రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతడిని ఆడించమని పేర్కొన్నాడు. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం అని, ఫైనల్ మ్యాచ్‌లో కూడా గెలుస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం చెపాక్‌ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించి.. ఐపీఎల్ 2024 ఫైనల్లో అడుగుపెట్టింది. మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఈ సీజన్‌ మొత్తం మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. జట్టులో మంచి ఉత్సాహం ఉంది. ఈ సీజన్ ప్రారంభంలో ఫైనల్ చేరాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు దానిని సాధించాము. మా బలం బ్యాటింగ్ అని తెలుసు. జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్స్ అనుభవాన్ని మేం తక్కువ అంచనా వేయడం లేదు. టైటిల్ గెలవడం భువీ, నట్టూ, ఉనాద్కత్ డ్రీమ్. దాంతో నా పని మరింత సులువైంది’ అని చెప్పాడు. ‘షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మా కోచ్ డానియల్ వెటోరి ఆడించారు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అయితే బాగుంటుందని షాబాజ్‌ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన మాకు బిగ్ సర్‌ప్రైజ్. రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతన్ని బరిలోకి దించాం. అభిషేక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో మాకు విజయం అందించారు. ఈ వికెట్‌పై 170 పరుగుల లక్ష్యం చేధించడం చాలా కష్టం. రెండు వికెట్లు తీస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించే అవకాశం ఉంటుందనుకున్నాం. అందరూ బాగా కష్టపడ్డారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తాం’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.