NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*రీపోలింగ్ జరపాలి.. అంబటి, చెవిరెడ్డి పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది. కొందరు నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీ పోలింగ్‌ జరపాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఈసీ, సీఈవో సహా మరో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. మంత్రి అంబటి రాంబాబు వేసిన ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు మాచర్లలో రీ పోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ చేపట్టాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈవోతో పాటు మరో ఏడుగురిని చేర్చారు. ఈ పిటిషన్‌పై కూడా ఇవాళ విచారణ జరపనుంది హైకోర్టు. ఇక రిగ్గింగ్‌ జరిగిన చోట రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు. అవసరమైన రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీ పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా దీనిపై ఏపీ సీఈవో ఎంకే మీనా వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసమైనా అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీ పోలింగ్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

 

*ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు హాహాకారాలు చేస్తు్న్నారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. మృతులు లక్ష్మీ(13), గోవర్ధిని(8) హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణీకులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

*మోడీతో సరితూగే వ్యక్తి దేశంలో ఎవరూ లేరు..
జనగామ జిల్లా కేంద్రంలో సాయిరాం కన్వెన్షన్ హల్ ఏర్పాటు చేసిన వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల సమ్మేళనంలో బీజేపీ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జులా ప్రేమెందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీతో సరితుగే వ్యక్తి దేశంలో ఎవ్వరూ లేరన్నారు. 23 సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఒక్క అవినీతి మచ్చ లేని వ్యక్తి మోడీ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఒక ఆకాశాన్ని మాత్రమే వదిలారు తప్ప అన్నింటిలో అవినీతే చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ప్రపంచంలో అన్న ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకున్నారు.. దేశాన్ని అన్ని విధాలుగా ముందుగా తీసుకుపోతున్న నాయకుడు మోడీ.. తెలంగాణలో బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణను గత 10 సంవత్సరాలుగా అన్ని విధాలుగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్.. బీజేపీ మీ అందరూ భద్రత కోసం పని చేస్తుంది.. కరోనాను ఆరోగ్యశ్రీలో కలపలేదు కేసీఆర్ అందుకే చాలా ప్రాణాలు పోయాయి.. స్కిల్ ఇండియా పేరుతో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత మోడీ.. లక్ష పది వేల స్టార్టప్ లు పది సంవత్సరాలో చేసిన ఘనత మోడీ.. ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు.. ఉచితల పేరుతో పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి.. గాడిద గుడ్డు చూపెట్టి మీరు మాట్లాడే మాటలు ఎవ్వరూ నమ్మరు.. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి వాయిదాలతో పూట గడుపుతున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు జరిగితే గెలిచిలేది బీజేపీ పార్టీ యే.. మెదవులు అందరూ ఆలోచించి బీజేపీ పార్టీ అభ్యర్థి గుజ్జులా ప్రేమెందర్ రెడ్డినీ గెలిపించాలని కోరారు.. త్వరలోనే పీఓకేనీ మనం స్వాధీనం చేసుకుంటామని లక్ష్మణ్ పేర్కొన్నారు.

 

*హైస్కూల్‌లో దారుణం.. తరగతి గదిలో సహచర విద్యార్థినిపై అత్యాచారం
ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండవల్లి మండలంలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించింది. ఈ క్రమంలోనే ఈ నెల 15న మార్కుల మెమోను తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. టీచర్లు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్తుండగా.. మాటువేసిన తోటి విద్యార్థి బాలికను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ సంఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీశారు. బాలికకు వీడియో చూపించి తమ కోరికను తీర్చాలని బలవంతం చేశారు. అనంతరం తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులను బెదిరించారు. రూ.2లక్షలు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు ప్రాధేయపడినా.. ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్‌ చేశారు. దాంతో పాటు వీడియోను వాట్సప్‌ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి ఒడిగట్టిన బాలుడిని అదుపులోకి తీసుకొని విజయవాడ జువైనల్‌ హోమ్‌కు తరలించారు. వీడియోను గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసిన నలుగురిని అరెస్ట్ చేసి కైకలూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.

 

*బురఖా ధరించి ఓటు వేసే మహిళలను గుర్తించాలి… బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్
దేశ రాజధాని ఢిల్లీలో మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. ఓటు వేసే ముందు బురఖా ధరించిన మహిళలను గుర్తించాలని ఆయన కోరారు. అలాగే అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళా పోలీసు సిబ్బందిని పక్కాగా మోహరించాలి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అజయ్ మహావార్ ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారికి తన దరఖాస్తులో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు బురఖా ధరించిన మహిళలను గుర్తించి ధృవీకరించాలని కోరారు. హైదరాబాద్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పాత్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిన ప్రతి రౌండ్ తర్వాత ప్రతిపక్షాలు ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నాయి. పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళలను గుర్తించేందుకు ఒక బీజేపీ నాయకుడు వారి బురఖాలను ఎత్తడం మనం చూశాం. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆయన అన్నారు. అధికార పార్టీ, ప్రధాని మోడీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నిజాయతీని ఎదుర్కొందని, 400 దాటుతుందని మాట్లాడుతున్నారని సాగరిక ఘోష్ అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌పై చర్చిస్తూ.. రాష్ట్రంలో రెండంకెల స్థాయికి చేరుకునేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. బెంగాలీ సంస్కృతి గురించి బీజేపీకి ఏమీ తెలియదన్నారు. రాజకీయ వాతావరణం పూర్తిగా మమతా బెనర్జీకి అనుకూలంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు దుర్భాషలాడుతున్నారు. అతని మాటల్లో వెయిట్ లేదన్నారు.

 

*గొంతుకోసి, శవాన్ని ముక్కలుగా నరికి.. ఫ్రీజర్‌లో ఉంచి… బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలనం
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 13న తన న్యూటౌన్ ఫ్లాట్‌లో గొంతు కోసి దారుణంగా చంపబడ్డాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి మరో సారి అతని తలపై ఏదో బరువైన వస్తువుతో కొట్టాడు. శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్రత్యేక ఫ్రీజర్ లో ఉంచారు. ఇరు దేశాల దర్యాప్తు సంస్థల మధ్య జరిగిన సమాచార మార్పిడి ఆధారంగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులుగా ఎంపీ శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు చోట్ల విసిరేశారు. మే 14, మే 15 , మే 18 – ఈ మూడు రోజుల్లో, ఎంపీల శరీర భాగాలను వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఇద్దరు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, మృతదేహాన్ని ఎక్కడ విసిరారనే విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది. కాగా, ఎంపీ కారులోని సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. నివాసం లోపల నుండి సీసీటీవీ ఫుటేజీలో, ఒక చిన్న ఎర్రటి కారు ఇంటి ముందుకు ప్రవేశించడం కనిపిస్తుంది. నివాసం బయట కారు ఆగింది. ఆ కారులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగారు. వారిలో బంగ్లాదేశ్ అవామీ లీగ్ దివంగత ఎంపీ అన్వరుల్ అజీమ్ ఒకరు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు రెడ్ కలర్ కారును గుర్తించారు. పోలీసులు కారు యజమాని, డ్రైవర్‌ను విచారించడం ప్రారంభించారు. ఎంపీతో పాటు వచ్చిన వ్యక్తులు ఒక్కొక్కరుగా ఇంటిని విడిచిపెట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులకు తెలిసింది. కానీ దివంగత ఎంపీ మాత్రం తన నివాసాన్ని వదిలి వెళ్లలేదు. ఎంపీ అన్వరుల్ అజీమ్ బంగ్లాదేశ్ నుండి కోల్‌కతాకు పని చేయడానికి వచ్చారు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. ఓ పథకం ప్రకారం అన్వరుల్‌ను కోల్‌కతాలో హత్య చేశారని బంగ్లాదేశ్ హోం మంత్రి తెలిపారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ బాధ్యతలు చేపట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం సీఐడీ ఐజీ అఖిలేష్ చతుర్వేద్ న్యూటౌన్‌లోని నివాసాన్ని సందర్శించారు.

 

*రైసీ హెలికాప్టర్ వాతావరణం కారణంగా కూలలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన
ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి సహా తొమ్మిది మంది మరణించారు. అజర్‌బైజాన్‌లోని కిజ్ కలాసి, ఖోడాఫారిన్ డ్యామ్‌లను ప్రారంభించిన తర్వాత రైసీ తిరిగి వస్తున్నారు. ఆయన మరణవార్త తెలియగానే ఇరాన్‌ మాత్రమే కాకుండా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ఎప్పుడు, ఎలా, ఏమి జరిగింది… అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని అందించారు. హెలికాప్టర్ క్రాష్‌పై, ఇరాన్ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అజర్‌బైజాన్ నుండి తిరుగు ప్రయాణంలో వాతావరణం స్పష్టంగా ఉందని సంచలనాత్మక విషయం వెల్లడించారు. రైసీ హెలికాప్టర్ రెండు హెలికాప్టర్ల మధ్య ఎగురుతోంది. 45 నిమిషాల ఫ్లైట్ తర్వాత, రైసీ హెలికాప్టర్ పైలట్ అకస్మాత్తుగా మేఘాల రాక గురించి హెచ్చరిక ఇచ్చాడు. మేఘాలను నివారించడానికి, రైసీ పైలట్ తోడుగా ఉన్న హెలికాప్టర్‌లను పైకి ఎగరమని కోరాడు. మేఘాల పైన 30 సెకన్ల పాటు ప్రయాణించిన రైసీ హెలికాప్టర్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. మిగిలిన ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు రైసీ హెలికాప్టర్ పైలట్‌తో రేడియో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు. మేఘాలు కమ్ముకోవడంతో రెండు హెలికాప్టర్లు టేకాఫ్ కాలేదు. రైసీ కాన్వాయ్‌తో పాటు మరో రెండు హెలికాప్టర్లలో ఒకదానిలో ఉన్న గులాం హుస్సేన్ ఇస్మాయిలీ, విమానం టేకాఫ్ అయినప్పుడు వాతావరణం బాగానే ఉందని, అయితే దట్టమైన మేఘాలలో రైసీ హెలికాప్టర్ తప్పిపోయిందని స్టేట్ టీవీకి చెప్పారు. ఇతర హెలికాప్టర్లు రేడియో ద్వారా వారిని చేరుకోలేకపోయాయి. అమీరాబ్దుల్లాహియాన్‌ను లేదా విమానంలో ఉన్న వ్యక్తులను ఎవరూ సంప్రదించలేకపోయారని ఇస్మాలీ చెప్పారు.

 

*రాజస్థాన్‌ చేతిలో ఓటమి.. ఐపీఎల్ 2024 నుంచి బెంగళూరు ఔట్‌!
ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. బెంగళూరు నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (45; 30 బంతుల్లో 8×4), రియాన్‌ పరాగ్‌ (36; 26 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ఈ విజయంతో ఆర్ఆర్ క్వాలిఫయర్‌-2కు చేరగా.. ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం చెపాక్‌లో సన్‌రైజర్స్‌తో రాజస్థాన్‌ తలపడుతుంది. ఎలిమినేటర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్ల దూకుడుకు ట్రెంట్ బౌల్ట్‌ కళ్లెం వేశాడు. పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ (3-0-6-1) చేశాడు. ఫాఫ్ డుప్లెసిస్‌ (17) ఔట్ అయినా.. పవర్‌ప్లేలో 50 పరుగులు చేసిందంటే అందుకు కారణం విరాట్ కోహ్లీనే. అయితే స్పిన్నర్ల రాకతో బెంగళూరు ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. కెమరూన్ గ్రీన్‌ (27) పెద్దగా ప్రభావం చూపలేదు. కొద్ది వ్యవధిలోనే కోహ్లీ (33; 24 బంతుల్లో 3×4, 1×6), గ్రీన్‌ సహా మ్యాక్స్‌వెల్‌ (0) పెవిలియన్ చేరారు. ఈ సమయంలో రజత్‌ పటీదార్‌ (34; 22 బంతుల్లో 2×4, 2×6), మహిపాల్‌ లొమ్రార్‌ (32; 17 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించారు. దినేశ్‌ కార్తీక్‌ (11) నెమ్మదిగా ఆడినా.. స్వప్నిల్‌ (9 నాటౌట్‌) సిక్సర్‌తో స్కోరు 170 దాటింది. ఛేదనలో రాజస్థాన్‌కు తొలి రెండు ఓవర్లలో 6 పరుగులే వచ్చాయి. యశ్‌ దయాళ్ బౌలింగ్‌లో జైస్వాల్‌ క్యాచ్‌ను గ్రీన్‌ అందుకోలేదు. యశ్‌ వేసిన తర్వాతి ఓవర్లో కాడ్మోర్‌ (20) ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ వదిలేశాడు. ఆ వెంటనే స్లో యార్కర్‌తో కాడ్మోర్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేసినా.. శాంసన్‌ (17) అండగా జైస్వాల్‌ బౌండరీలు బాదాడు. గ్రీన్‌ ఓవర్లో స్కూప్‌కు ప్రయత్నించిన జైస్వాల్‌ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే శాంసన్‌ పెవిలియన్ చేరడంతో బెంగళూరు పోటీలోకి వచ్చింది. కాసేపటికే కోహ్లీ అద్భుత త్రోకు జూరెల్‌ (8) రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో రాజస్థాన్‌ విజయ సమీకరణం 30 బంతుల్లో 47 పరుగులుగా మారింది. ఈ సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ హెట్‌మయర్‌ (26), పరాగ్‌ బౌండరీలు, సిక్సులు బడడంతో సమీకరణం 18 బంతుల్లో 19 పరుగులుగా మారింది. 18వ ఓవర్లో పరాగ్, హెట్‌మయర్‌ను ఔట్‌ చేసిన సిరాజ్‌.. 6 పరుగులే ఇచ్చి ఆశలు రేపాడు. కానీ ఫెర్గూసన్‌ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో పావెల్‌ (16 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశాడు.

 

*విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి.. 17 ఏళ్ల ఐపీఎల్‌లో మొదటి క్రికెటర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‌లో 8000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కింగ్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్‌లో కోహ్లీ 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 33 రన్స్ చేశాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో 8 వేల రన్స్ చేసిన మొదటి క్రికెటర్ కోహ్లీనే. ఐపీఎల్‌లో 252 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 244 ఇన్నింగ్స్‌లలో 8004 రన్స్ బాదాడు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ అత్యధిక స్కోర్ 113 కాగా.. 705 ఫోర్లు, 272 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ ఆర్‌సీబీ తరపునే ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఓ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. అంతేకాదు ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ కోహ్లీనే. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అనంతరం అత్యధిక పరుగుల చేసిన ఆటగాడు శిఖర్ ధావన్. గబ్బర్ 222 మ్యాచ్‌లలో 6769 రన్స్ చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (6628), డేవిడ్ వార్నర్ (6565), సురేష్ రైనా (5528), ఎంఎస్ ధోనీ (5243), ఏబీ డివిలియర్స్ (5162) ఉన్నారు. వేరు మాత్రమే ఐపీఎల్‌లో 5 వేల కంటే ఎక్కువ రన్స్ చేశారు.

 

*ఐపీఎల్‌కు దినేష్ కార్తీక్‌ గుడ్ బై!
టీమిండియా వెటరన్ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు గుడ్ బై చెప్పాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓడిన అనంతరం డీకే తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2024లో కార్తీక్‌ 15 మ్యాచ్‌లు ఆడి 326 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 2008 ఎడిషన్‌ నుంచి దినేశ్‌ కార్తిక్‌ ఆడుతున్నాడు. 17 సీజన్లలో ఇప్పటివరకు 257 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డీకే అత్యధిక స్కోర్ 97 నాటౌట్. కీపర్‌గా 145 క్యాచ్‌లు, 37 స్టంప్‌ ఔట్లు, 15 రనౌట్స్ చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు జట్లకు కార్తిక్‌ ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ లయన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు ఆడాడు. చివరగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు దినేశ్‌ కార్తిక్‌ గుడ్‌బై చెప్పాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. డీకే 2004లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే ఎంఎస్ ధోనీ వెలుగులోకి రావడంతో అతడు కనుమరుగయిపోయాడు. భారత్ తరఫున 26 టెస్టులు ఆడి 1025 పరుగులు చేశాడు. చివరిసారిగా 2018లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 94 వన్డే మ్యాచ్‌లు ఆడిన కార్తిక్‌.. 1752 పరుగులు, 64 క్యాచ్‌లు అందుకున్నాడు. 60 టీ20లలో 686 రన్స్, 30 క్యాచ్‌లు పట్టాడు.