NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పోలింగ్‌ ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు.. సీఎస్‌కు డీజీపీ నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముందు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి నివేదిక ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా.. ఎన్నికల ముందు తర్వాత హింసాత్మక ఘటనలు జరిగేందుకు బాధ్యులైన 12 మంది సబార్డినేట్ పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు.. శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారు.. దీంతో.. డీజీపీ నివేదిక మేరకు వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ శాఖా పరమైన విచారణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. తిరుపతి, అనంతపురం, పలనాడు జిల్లాల సబర్దినేట్ అధికారులు తమ విధుల్లో తీవ్ర స్థాయి నిర్లక్ష్యం వహించారని స్పష్టం చేసింది నివేదిక.. పలనాడు జిల్లా, అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకర్గంలో ఎన్నికల ముందు, తర్వాత హిసాత్మక ఘటనలు జరిగాయని స్పష్టం చేసింది.. ఇక, ఈ ప్రాంతాల్లో వేర్వేరు హోదాల్లో ఉన్న పోలీసు అధికారులు అనైతికంగా, విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేశారని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ. జరిగిన ప్రతీ హింసాత్మక ఘటనలోనూ సదరు పోలీసు అధికారుల పూర్తి నిర్లక్ష్యం, ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఘటనల తీవ్రత పెంచాయని వెల్లడించింది డీజీపీ నివేదిక. చట్టాన్ని, శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా పోలీసు అధికారులు విఫలం అయినట్టు స్పష్టం చేసింది.. జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలోనూ అలాంటివి జరగకుండా శాంతి భద్రతలు కాపాడటంలో ఈ అధికారులు విఫలం అయినట్టు వెల్లడించారు. విధుల పట్ల ఈ అధికారుల నిజాయితీ, నిబద్ధతపై కూడా అనుమానం వ్యక్తం అవుతోందని డీజీపీ నివేదిక పేర్కొంది. ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో వీరు పూర్తిగా విఫలం అయ్యారని స్పష్టం చేసింది.. ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల్లోని సెక్షన్ 3(1)ను వీరు పూర్తిగా అతిక్రమించారని నివేదికలో పేర్కొన్నారు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా..

125 నుంచి 150 సీట్లలో కూటమి విజయం..!
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది.. ఫలితాలు రావాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.. కానీ, ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సారి 151కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం.. ఈ ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్‌ అవుతుందనే ప్రకటించిన విషయం విదితమే కాగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో 125 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు నరసాపురం ఎంపీ మరియు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి 125 నుంచి 150 సీట్లలో విజయం సాధిస్తుంది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 25 నుంచి 40 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.. అంతేకాదు.. నా మాట నిజమవుతుందో.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాట నిజమవుతుందో.. జూన్‌ 4వ తేదీన మధ్యాహ్నం వరకు ప్రజలకు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు నరసాపురం ఎంపీ మరియు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు. కాగా, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగి.. నరసాపురం లోక్‌సభ ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణ రాజు.. ఆ తర్వాత క్రమంగా ఆ పార్టీకి దూరమైన విషయం విదితమే.

ఒక నెల కరెంట్ బిల్లు రూ.85,76,902.. మూర్ఛపోయిన యజమాని
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఈ పథకం గత మూడు నెలలుగా అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పేదల ఇళ్లల్లో వెలుగులు నింపుతోంది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కరెంట్ అధికారుల నిర్లక్ష్యం వలన ప్రతినెల 800 వచ్చే బిల్లు ఏకంగా 85 లక్షల 76,000 92 రూపాయలు రావడంతో గృహ యజమాని ఒక్కసారిగా బిత్తర పోయాడు. కరెంట్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వకూడదు ఆందోళన చెందుతున్నారు. అన్ను లలితా అనే గృహ యజమానికి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నారు. ప్రతి నెల కరెంట్‌ బిల్లు రూ.800 వచ్చేదని తెలిపారు. ఎప్పుడు రూ.800 వచ్చే కరెంట్‌ బిల్లు అంతకు మించి రాలేదని కానీ మే 7వ తేదీన కరెంట్ బిల్లు చూసి షాక్‌ తిన్నాడు. వందలు వేలు కాకుండా ఏకంగా లక్షల్లో బిల్లు రావడంతో మూర్ఛవచ్చినంత పనైంది యజమానికి. కరెంట్ బిల్లు ఏకంగా 85 లక్షల 76,000 92 రూపాయలు రావడంతో వెంటనే తేరుకున్న యజమాని కరెంట్‌ కార్యాలనికి ఫోన్‌ చేశాడు. అయితే అక్కడ ఎవరు ఫోన్‌ కాల్ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు. ఎవరిని ఆశ్రయించాలో అర్థంకానీ పరిస్థితిల్లో ఒకటికి రెండు మార్లు కరెంట్‌ అధికారులకు కాల్ చేస్తునే వున్నాడు. అయినా ఎవరూ స్పందించక పోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

ఢిల్లీలో కాల్పులకు పాల్పడిన నిందితుడి ఎన్ కౌంటర్..
రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఓ షూటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కి, దుండగులకు మధ్య అర్ధరాత్రి భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల నుంచి భారీ కాల్పులు జరగ్గా పోలీసులు ఓ నేరస్థుడిని హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన ఫైరింగ్ లో ఒక నేరస్థుడికి అనేక బుల్లెట్లు తగిలాయి. ఆ తర్వాత పోలీసు బృందం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. హతమైన నేరస్థుడిని షూటర్ అజయ్ అలియాస్ ‘గోలీ’గా గుర్తించారు. హర్యానాలోని సోనిపట్‌లో నివాసముంటున్నాడు. కాగా.. గోలీ భారతదేశం నుంచి తప్పించుకుని పోర్చుగల్‌లో కూర్చున్న హిమాన్షు భౌ అనుచరుడిగా గుర్తించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇందులో కారు, స్కార్పియో ఒకదానికొకటి ఢీకొన్న దృశ్యం కనిపించింది. ఘటనా స్థలంలో పలువురు పోలీసులు కూడా ఉన్నారు.

నేడు ఒకే వేదికపై కనిపించనున్న సోనియా, ప్రియాంక, రాహుల్, అఖిలేష్ యాదవ్‌
సోనియా గాంధీ రాయ్‌బరేలీలో ఉన్నారు. నేడు రాయ్‌బరేలీ ఐటీఐ దగ్గర జరిగే ర్యాలీలో ఆమె ప్రసంగిస్తారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్‌లు ఆయనతో పాటు వేదికపై ఉన్నారు. అఖిలేష్ యాదవ్‌తో సోనియా గాంధీ వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. శుక్రవారం జిల్లా రాజకీయాలకు చారిత్రాత్మకమైన రోజని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే రోజున ప్రముఖుల సమ్మేళనం జరగడం ఇదే తొలిసారి. ఎన్నికల గేమ్‌లో ఎవరు గెలుస్తారో జూన్ 4న తేలిపోనుంది. కానీ ఈ రోజున మాత్రం రాజకీయ వేడి మరింత పెరగడం ఖాయం. హోంమంత్రి అమిత్ షా వారంలో రెండోసారి పర్యటించనున్న ఉంచహార్ అసెంబ్లీ నియోజకవర్గం దౌలత్‌పూర్. ఆయన సమక్షంలో ఎస్పీ ఎమ్మెల్యే డాక్టర్ మనోజ్ కుమార్ పాండే బీజేపీ సభ్యత్వం తీసుకోవచ్చు. అదే సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు సంయుక్తంగా నగరంలోని శివాజీ నగర్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించి రాజకీయ వేడిని పెంచనున్నారు. అయితే రాయ్‌బరేలీలో ఐదో దశ ఎన్నికలు మే 20న జరగనున్నాయి. మే 18 సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. అయితే ఈ ఎన్నికలలో శుక్రవారం అత్యంత ముఖ్యమైన రోజు.

ఢిల్లీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. 6780 మెగావాట్లకు చేరిక
ఉక్కపోతతో పాటు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ రికార్డులను బద్దలు కొట్టింది. గురువారం ఢిల్లీలో 6780 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవగా, గతేడాది మేలో గరిష్టంగా 5781 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మధ్యాహ్నం 3:26 గంటలకు విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉంది. విద్యుత్ సంస్థలు గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను విజయవంతంగా తీర్చుకున్నాయి. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 8000 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. గత నెలలో ఢిల్లీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 3809-5447 మెగావాట్ల మధ్య ఉంది. గతేడాది ఇదే నెలతో పోల్చితే 3388-5422 మెగావాట్ల మధ్య విద్యుత్ డిమాండ్ ఉంది. ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని టాటా పవర్ చెబుతోంది. ఈ సీజన్‌లో అత్యధిక డిమాండ్‌గా ఉన్న పీక్‌ డిమాండ్‌ గురువారం అందుకుంది. ప్రస్తుత వేసవి సీజన్ కోసం, రోహిణి, రాణి బాగ్‌లలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ఏర్పాటు చేయబడింది. ఇది అంతరాయం లేని బ్యాకప్‌ని అందిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థ ఏ గరిష్ట వేసవి డిమాండ్‌ను అయినా నిర్వహించగలదు.

విభవ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. కేసు దర్యాప్తులో నిమగ్నమైన 10 బృందాలు
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న రాత్రి పోలీసులు బాధితురాలు స్వాతి మలివాల్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. మలివాల్ 4 గంటల పాటు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీ పోలీసులు స్వాతి మలివాల్‌ను ఎయిమ్స్‌లోని ట్రామా సెంటర్‌కు తీసుకువచ్చారు. అదే సమయంలో ఆజ్ తక్ కరస్పాండెంట్ స్వాతి మలివాల్‌తో విచారణ కోసం ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) బృందం కూడా AIIMSకి చేరుకుంది. కాగా.. కేసు నమోదు అనంతరం నార్త్ జిల్లా పోలీసు బృందం, క్రైమ్ బ్రాంచ్ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ముందుగా ఢిల్లీ పోలీసు బృందం విభవ్ కుమార్ ఇంటికి చేరుకుంది. విభవ్ అక్కడ లేరు. ఇంట్లో అతని భార్య ఉంది.ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈరోజు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు విభవ్ కుమార్‌ను హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం లక్నో విమానాశ్రయంలో అరవింద్ కేజ్రీవాల్‌తో విభవ్ కుమార్ కనిపించారు. ఇండియా కూటమి నేతల సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్ లక్నో వచ్చారు. పోలీసులు ఇప్పుడు టైమ్‌లైన్ ద్వారా మొత్తం సంఘటనను సీక్వెన్స్ చేస్తున్నారు. సీక్వెన్స్ ప్రకారం.. విభవ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీని ఫుటేజీ సహాయం తీసుకున్నారు. ఈ రోజు మహారాష్ట్రలో ఇండియా కూటమి ర్యాలీ ఉంది. విభవ్ మహారాష్ట్రకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 10 పోలీసు బృందాలు దర్యాప్తులో నిమగ్నమయ్యాయి. అందులో నాలుగు బృందాలు విభవ్ ఎక్కడున్నాడో కనుగొనేందుకు యత్నిస్తున్నాయి.

హైదరాబాద్‌కు గోల్డెన్ ఛాన్స్‌.. ఇలా జరిగితే సెకండ్ ప్లేస్ పక్కా!
ఐపీఎల్ 17వ సీజన్‌ తుది అంకానికి చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌ అర్హత సాధించగా.. మిగిలిన ఓ ప్లేస్ కోసం నాలుగు టీమ్స్ పోటీ పడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో టీమ్స్ చివరి బెర్త్ కోసం రేసులో ఉన్నాయి. ఇప్పటికే 14 పాయింట్స్ ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చెన్నై తర్వాత బెంగళూరు అవకాశాలు ఉన్నాయి. శనివారం జరగనున్న మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై గెలిస్తే.. 16 పాయింట్లతో యెల్లో ఆర్మీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అప్పుడు బెంగళూరు, ఢిల్లీ, లక్నో ఇంటిదారి పడుతాయి. చెన్నైపై భారీ తేడాతో గెలిస్తేనే బెంగళూరు ముందంజ వేస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే 15 పాయింట్లతో చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. ప్రస్తుతం మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఉండడం చెన్నైకి బాగా కలిసొచ్చే అంశం. 99 శాతం అవకాశాలు చెన్నైకే ఉన్నాయి. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే ఆరెంజ్‌ ఆర్మీకి రెండో స్థానంలో నిలిచే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్‌ తన చివరి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తప్పక గెలవాల్సి ఉంటుంది. మరోవైపు కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్‌ 16 పాయింట్లకే పరిమితం అవుతుంది. హైదరాబాద్‌ 17 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళుతుంది. మొదటి రెండు స్థానాల్లో ఉంటే.. క్వాలిఫైయర్ 1లో ఓడినా.. క్వాలిఫైయర్ 2 రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.

కాస్టింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..
సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం ” సినిమాతో మంచి విజయం అందుకున్నారు.త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ చిత్రం బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనుంది.ఈ సినిమా మహేష్ 29 వ సినిమా గా తెరకెక్కనుంది.”ఎస్ఎస్ఎంబి 29 ” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది .ఈ సినిమాను శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు . అలాగే ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ చేంజ్ చేసుకున్నారు.లాంగ్ హెయిర్,గడ్డంతో మహేష్ లుక్ అదిరిపోయింది.ఈ సినిమాను బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే “ఎస్ఎస్ఎంబి 29” మూవీ కాస్టింగ్ గురించి వస్తున్న రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించింది.ప్రముఖ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా మా చిత్రం కాస్టింగ్ గురించి ప్రచురించిన కథనం మా దృష్టికి వచ్చింది.మా చిత్రంలో వేణు స్వామికి ఏ భాగానికి ,ఏ విధంగానూ ప్రమేయం లేదని తెలిపింది.మా చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటనలు మా ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తే తప్ప ఎలాంటి రూమర్స్ నమ్మొద్దని చిత్ర యూనిట్ ఓ నోట్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈనోట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

“అరవింద సమేత” విషయంలో ఆ బాధ పడ్డాను..
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటించి మెప్పించింది .చిన్న సినిమాలకు ఈ భామ బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది.అయితే అనుకోకుండా ఓ పెద్ద సినిమాలో ఈ భామకు ఆఫర్ వచ్చింది.ఆ సినిమానే ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’.అయితే ఈ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని ఈషా రెబ్బా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2018 అక్టోబర్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది.ఈ సినిమా లో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈషా రెబ్బా సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈషా రెబ్బ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను నటించిన మొదటి పెద్ద చిత్రం ‘అరవింద సమేత’.ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ నన్ను సంప్రదిస్తే నటించేందుకు నేను ఆసక్తి చూపలేదు.మెయిన్ హీరోయిన్ గా చేయాలనీ వుంది అని చెప్పాను. అయితే ఈ సినిమాలో మీదీ ప్రధాన పాత్రే’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత నటించడానికి ఒప్పుకున్నాను. నాపై ఓ పాట కూడా చిత్రీకరించాలని ప్లాన్‌ చేశారు. కానీ, అది జరగలేదు.అయితే ఇంకొన్ని సీన్స్‌ ఎడిటింగ్‌లో తొలగించారు వీటికి కారణమేంటో నాకు తెలియదు.ఆ సినిమా విషయంలో మాత్రం బాధ ఉండేది. కానీ, ఎన్టీఆర్‌తో నటించడం, త్రివిక్రమ్‌ గారి దర్శకత్వంలో వర్క్‌ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది.