NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు గుర్తించారు.. జిల్లాలోని కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగగా.. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. తిరుమల నుండి తాడిపత్రికి వెళ్తున్న తుఫాన్‌ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నట్టుగా తెలుస్తుండగా.. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృత్యువాత పడ్డారు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మృతులు, క్షతగాత్రులు అంతా తాడిపత్రి వాసులుగా గుర్తించారు పోలీసులు.. ఇక, ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.. ఆ వాహనంలో మృతదేహాలు ఇరుక్కుపోయాయి.. అతివేగమే ప్రమాదానికి కారణమని.. డ్రైవర్‌ నిర్లక్ష్యం దీనికి తోడు అయినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు..

ఇక నుంచి సర్కార్ బడుల్లో ఉదయం టిఫిన్ కూడా
చదువుతో పాటు విద్యార్థుల ఆకలి తీర్చుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో మధ్యాహ్నా భోజనం అమలవుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఉదయం కూడా పిల్లలకు అల్పాహారాన్ని(టిఫిన్) అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉదయం స్కూలుకు వచ్చిన విద్యార్థులకు టిఫిన్ పెడతామని కీలక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య బెల్లం, రాగితో చేసిన పదార్ధాలను అందిస్తామని ప్రకటించింది. సర్కార్ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే.. చాలా ప్రాంతాల్లో విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపుతో బడికి వస్తున్నారని.. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ తెలిపింది. అలాగే మధ్యాహ్నం భోజనం మెనూలోనూ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంలో ఒకరోజు వెజిటబుల్ బిర్యానీతో పాటు హైస్కూల్ విద్యార్థులకు తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని అందిస్తామని పేర్కొంది.

చేతులు కలిపి కలిసిపనిచేయాలన్న సీఎం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.. ఇదే సమయంలో.. పార్టీలో ఉన్న విభేదాలను తొలగించి.. అంతా కలిసి కట్టుగా పనిచేస్తూ ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, నెల్లూరు జిల్లా రాజకీయాలు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయిన విషయం విదితమే.. వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏకంగా నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. నెల్లూరు జిల్లా వైసీపీలో ఉన్న విభేదాలపై దృష్టిసారించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రూప్ కుమార్ యాదవ్.. అనిల్ కుమార్ యాదవ్‌లు కలిసి పని చేయాలని కోరారు.. ఇటీవల కావలి పర్యటనలో ఇద్దరి చేతులు కలిపిన సీఎం వైఎస్‌ జగన్‌.. విభేదాలు పక్కనబెట్టి కలిసి ముందుకుసాగాలని సూచించారు. అయితే, రెండు రోజుల తర్వాత దీనిపై స్పందించిన మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్.. కొందరికి సందేశాలు పంపారు.. ‘జగనన్న మాటని దేవుడి మాటగా భావిస్తా.. ఒకవేళ ఆ రాముడి మాటను ఈ హనుమంతుడు తప్పాల్సి వస్తే రాజకీయాల నుంచి అయినా శాశ్వతంగా వైదొలుగుతా.. కానీ, రూప్ కుమార్ తో మాత్రం కలవను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

సహజీవనం చేస్తూనే రూ.6వేల కోసం గొడవ.. మహిళ ఇంటికి నిప్పు
ఈ మధ్య మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. డబ్బు మాయాలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రూపాయి మనిషి రూపాన్నే మార్చి వేస్తుంది. అప్పటివరకు మనతో ఉన్న వాళ్లు కూడా మనీ కోసం వెన్నుపోటు పొడుస్తున్నారు. అలాంటి ఘటనే కామారెడ్డిలో చోటు చేసుకుంది. నారయణ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహేశ్వరి అనే మహిళతో నారాయణ సహజీవనం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ ఆరు వేల రూపాయల విషయంలో గొడవ జరిగింది. తనకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని తగువు పడ్డారు. దీంతో సహనం కోల్పోయిన నారాయణ.. మహేశ్వరి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి వీక్లీ మార్కెట్ సమీపంలో చోటు చేసుకుంది. నారాయణ నిప్పు పెట్టిన సమయంలో మహేశ్వరి ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతడు నిప్పు పెట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని చితకబాదారు. దీంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నారాయణను చికిత్సి నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

కర్ణాటక ఉపముఖ్యమంత్రి ముస్లిం అయి ఉండాలి.. వక్ఫ్ బోర్డు చీఫ్ కీలక వ్యాఖ్యలు
సున్నీ ఉల్మా బోర్డుకు చెందిన ముస్లిం నాయకులు తమ కమ్యూనిటీ నుండి గెలిచిన అభ్యర్థులకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదుగురు ముస్లిం ఎమ్మెల్యేలకు హోం, రెవెన్యూ, ఆరోగ్యం, ఇతర శాఖల వంటి మంచి శాఖలున్న మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. “ఉప ముఖ్యమంత్రి ముస్లిం అయి ఉండాలని, మాకు 30 సీట్లు ఇవ్వాలని ఎన్నికలకు ముందే చెప్పాం.. మాకు 15 వచ్చాయి, తొమ్మిది మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. దాదాపు 72 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పూర్తిగా ముస్లింల వల్లే గెలిచింది. ఒక సంఘంగా మనం కాంగ్రెస్‌కు చాలా ఇచ్చాం. ఇప్పుడు మనం ప్రతిఫలంగా ఏదైనా పొందే సమయం వచ్చింది. మాకు ఒక ముస్లిం ఉప ముఖ్యమంత్రి, ఐదుగురు మంత్రులు హోం, రెవెన్యూ, విద్య వంటి మంచి శాఖలు కావాలి. దీనికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. ఇవన్నీ అమలయ్యేలా చూడడానికి మేము సున్నీ ఉల్మా బోర్డు కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించాము.” అని వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్ షఫీ సాది చెప్పారు.అయితే, తొమ్మిది మందిలో ఎవరికి ఈ పదవులు వస్తాయన్నది అప్రస్తుతం.

నన్ను పదేళ్లపాటు జైల్లో ఉంచాలని పాక్ సైన్యం ప్లాన్ చేస్తోంది..
దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన పాక్‌ మిలిటరీ ప్లాన్‌ చేస్తోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం పేర్కొన్నారు. అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. అయితే పాక్‌ సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితం ఆయనకు బెయిల్‌ మంజూరుచేసింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి లాహోర్‌లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం వరుస ట్విట్ల ద్వారా పాక్‌ మిలిటరీపై ఆరోపణలు గుప్పించారు. లండన్‌ ప్రణాళిక ఇప్పుడు పూర్తయింది. తాను జైలులో ఉన్నప్పుడు హింసను సాకుగా చూపి న్యాయమూర్తి పాత్రను పోషించారు. తన భార్య బుష్రా బేగంను జైలులో పెట్టడం ద్వారా అవమానించాలనుకున్నారు. దేశ ద్రోహ చట్టాన్ని ఉపయోగింది వచ్చే పదేళ్ల పాటు తనను జైలులోనే ఉంచాలనుకున్నారంటూ ట్వీట్‌ చేశారు. తనను అరెస్టు చేయడం ద్వారా పీటీఐ కార్యకర్తలనే కాకుండా సాధారణ ప్రజలను కూడా భయబ్రాంతులకు గురిచేయాలనుకున్నారని చెప్పారు. అదేవిధంగా మీడియా పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకోవాలని చూశారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ రిలీఫ్.. గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్బీఐ..
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త వినిపించింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ).. ఇంతకీ ఆర్బీఐ చెప్పిన ఆ గుడ్‌న్యూస్ ఏంటి అనే విషయంలోకి వెళ్తే.. బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఫైన్‌ విధించకూడదు బ్యాంకులు.. ఇది బ్యాంకు ఖాతాదారులకు ఊరట కల్పించే విషయంగానే చెప్పుకోవాలి.. భారత బ్యాంకింగ్‌ రంగంలో ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ బ్యాంకులు కూడా కీలక భూమిక పోషిస్తున్నాయి.. ఈ రోజుల్లో అయితే, బ్యాంకు ఖాతా లేనివారు చాలా తక్కువే.. ఎందుకంటే.. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సొమ్ముల నుంచి.. ఉద్యోగానికి సంబంధించిన జీతం సహా అన్నీ బ్యాంకులకే ముడిపడి ఉంటున్నాయి.. ఇదే సమయంలో కొందరికైతే రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు..