NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీకి భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో.. రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి తెరపడింది.. ఇక ఎన్నికల్లో రేపు కీలకగట్టమైన పోలింగ్‌ జరగనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. రేపు ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు వాతావరణశాఖ అధికారులు..

పోలింగ్‌కు కడపలో సర్వం సిద్ధం..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లలో మునిగిపోయారు అధికారులు.. ఇక, ఎన్నికల నిర్వహణకు కడప జిల్లా సిద్ధం అయ్యింది. ఉదయం 6:30 గంటల నుంచే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుంటున్నారు ఉద్యోగులు.. ఏ ఏ పోలింగ్ కేంద్రానికి ఎవరిని కేటాయించాలి అన్న ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు.. ఆయా కేంద్రాలకు వెళ్లాల్సిన ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తున్నారు.. నియంత్రణ యూనిట్లు (CUలు): 4,712 కాగా.. రిజర్వ్ 99, అసెంబ్లీ పరిధిలో 48 పార్లమెంటు పరిధిలో 51 యొక్క అదనపు కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశారు.. బ్యాలెట్ యూనిట్లు (BUలు): 4,712 కాగా.. రిజర్వులు 319 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేశారు.. అసెంబ్లీ పరిధిలో 277, పార్లమెంటు పరిధిలో 278 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేసి ఉంచారు. ఇక, జిల్లా వ్యాప్తంగా వీవీ ఫ్యాట్స్ 5,158 సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.. రిజర్వులో 555 వీవీ ఫ్యాట్స్ ఉంచారు.. అసెంబ్లీ పరిధిలో 277, పార్లమెంటు పరిధిలో 278 వీవీ ఫ్యాట్స్ సిద్ధంగా ఉన్నాయి.. మరోవైపు.. కడప జిల్లా వ్యాప్తంగా 337 మందిని మైక్రో అబ్జర్వర్లుగా నియమించారు.. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ స్థానాలతో సహా పోలింగ్ స్టేషన్లలో 610 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎంవోలుగా నియమించారు.. సెక్టార్ ఆఫీసర్లు 214 మందిని అన్ని సెక్టార్లలో ఏసీతో నియమించారు. జిల్లావ్యాప్తంగా 2334 మంది ప్రిసైడింగ్ అధికారులు (PO).. జిల్లా వ్యాప్తంగా 2336 అసిస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసరర్స్ (APO).. ఇతర పోలింగ్ అధికారులు 9,768 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.. మొత్తంగా రేపటి పోలీంగ్‌కు కడప జిల్లా సిద్ధమైంది.

ఓటు వేసే సమయంలో ఇలాంటి పనులు చేస్తే.. జైలుకే..!
ఐదేళ్లపాటు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించే సమయం ఆసన్నమైంది. మే 13 సోమవారం పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతుండగా, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు స్వగ్రామాలకు వెళ్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలు నిలిచిపోవడంతో.. కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓటు వేసేందుకు వెళ్లే వారికి అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఓటు వేసే సమయంలో ఇలాంటి పనులు చేస్తే జైలుకు వెళ్లడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఏపీ, తెలంగాణలో మే 13న సోమవారం పోలింగ్ జరగనుంది. హైదరాబాద్‌లో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అలాగే ఓటు వేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ఇంకా క్లియర్‌ కాలె.. పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై శని, ఆదివారల్లో తెల్లవారుజామున భారీ వాహనాల రద్దీ పెరిగింది. అంతేకాకుండా వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో సోమవారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం నుంచి ఓటర్లు సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో శని, ఆదివారాల్లో ఒక్కసారిగా వాహనాలు రావడంతో టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన టోల్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలు దేరారు. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతున్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు కీలకమైంది. ప్రతి ఓటు విలువైనది. ఒక్క ఓటుతో తలరాతలు సైతం మారుతుంటాయి. అలాంటి వజ్రాయుధం లాంటి ఓటు వేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని భావిస్తున్నారు.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ఓటర్లు. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్ల పండుగకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయినా.. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

ఎన్నికల డ్యూటీ శిక్షణకు గైర్హాజరు.. 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసు
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్‌ను దాటేసినందుకు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడింది. జిల్లా అధికారి సూర్యపాల్ గంగ్వార్ ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడుతుంది. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు పోలింగ్ సిబ్బందికి రెండో శిక్షణా కార్యక్రమాన్ని జయనారాయణ (కేకేసీ) పీజీ కళాశాలలో ఈరోజు నిర్వహించినట్లు అధికారి తెలిపారు. సిబ్బంది అందరికీ శిక్షణ తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ క్రమంలో ట్రైనింగ్‌కు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారిపై జిల్లా అధికారి చర్యలకు ఉపక్రమించారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు 7 దశల్లో పోలింగ్ జరగనుంది. మే 13న షెడ్యూల్ చేయబడిన నాల్గవ దశలో షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరహర, సీతాపూర్, హర్దోయ్, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్‌లలో ఓటింగ్ జరగనుంది.

మొదటిరోజు భారీ సంఖ్యలో యాత్రికులు.. ఇద్దరు మృతి..
హిమాలయ దేవాలయాలకు యాత్ర ప్రారంభమైన ఒక రోజు తర్వాత శనివారం చార్ ధామ్ పుణ్యక్షేత్రాల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు కనిపించారు. యమునోత్రి వద్ద భారీగా రద్దీ ఉంది. మొదటి రోజు సుమారు 45,000 మంది యాత్రికులు దర్శనమ్ చేసుకున్నారు. ప్రజలు ఆలయానికి వెళ్లే ఇరుకైన మార్గంలో నడవడం కూడా కష్టమైంది. కేదార్నాథ్ లో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ మొదటి రోజు సుమారు 30,000 మంది వచ్చారు. ఇంతలో, ఇద్దరు యాత్రికులు మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన రామ్గోపాల్ (71), ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావ్కు చెందిన విమలా దేవి (69) యమునోత్రిలో శుక్రవారం గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం, బార్కోట్ నుండి జానకీచట్టి వరకు వివిధ ప్రదేశాలలో యాత్రికులు చిక్కుకుపోయారు. తెల్లవారుజాము వరకు వాహనాల పొడవైన క్యూలు విస్తరించి ఉన్నాయి. ట్రెక్కింగ్ మార్గంలోనే రద్దీ భక్తులకు గణనీయమైన సవాళ్లను ఎదురుకున్నారు. ఓ యాత్రికుడు సునీల్ మాండవియా మాట్లాడుతూ.., “మేము ఒక అంగుళం కూడా కదలకుండా మా కారులో ఏడు గంటలు కూర్చోవాల్సి వచ్చింది. మా ఆహారం, నీరు అన్నీ అయిపోయాయి, ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అయ్యి యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో మాకు తెలియదు “అని చెప్పారు.

సెంట్రల్ గాజా పై ఐడీఎఫ్ భీకర దాడి.. 21 మంది మృతి
గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరమైన రఫాలో చిక్కుకున్న పాలస్తీనియన్లను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించడం ఆమోదయోగ్యం కాదని యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ శనివారం అన్నారు. “అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని.. రఫాలో గ్రౌండ్ కార్యకలాపాలను నిర్వహించవద్దని మేము ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము” అని అతను చెప్పాడు. మరోవైపు, ఇజ్రాయెల్ భద్రతా దళాలు శనివారం రఫాతో సహా గాజాలోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. మరోవైపు రద్దీగా ఉండే నగరంపై ఇజ్రాయెల్ నేరుగా దాడి చేస్తే పెను విపత్తు తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. జర్నలిస్టులు, వైద్య సిబ్బంది, సాక్షులు తీర ప్రాంతంలో దాడులను నివేదించారు. సెంట్రల్ గాజాలో జరిగిన దాడుల్లో కనీసం 21 మంది మరణించారని డీర్ అల్-బలా నగరంలోని అల్-అక్సా ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లటి బట్టలు కప్పుకున్న మృతదేహాలు ఆసుపత్రి ఆవరణలో నేలపై పడి ఉన్నాయి. రాఫాలోని ప్రత్యక్ష సాక్షులు ఈజిప్ట్‌తో క్రాసింగ్ సమీపంలో దాడులు తీవ్రతరం చేసినట్లు నివేదించారు. నగరంలో పొగలు కక్కుతూ కనిపించాయి. ఉత్తర గాజాలో ఇతర దాడులు కూడా జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రంజీ క్రికెట్లో మార్పులు.. ఇక నుంచి రెండు దఫాలు
దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక రంజీ సీజన్‌ను ఇక నుంచి రెండు దశలుగా నిర్వహించనున్నట్టు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (bcci ) వెల్లడించింది. 2024- 25 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు.. దీంతో రంజీ ట్రోఫీని రెండు దశల్లో ఆడించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నాట్ల టాక్ వినిపిస్తుంది. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో.. ‘దులీప్‌ ట్రోఫీతో సీజన్‌ స్టార్ట్ కాబోతుందని వెల్లడించారు. అయితే, ఆ తర్వాత ఇరానీ కప్‌ కూడా జరగనుంది. అనంతరం రంజీ ట్రోఫీలో భాగంగా ప్రతి జట్టు తమ తొలి ఐదు లీగ్‌ మ్యాచ్ లను ఆడనున్నాయి. అవి ముగిసిన తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే టోర్నమెంట్ జరగనుంది. చివర్లో మళ్లీ రంజీ రెండో దశను నిర్వహించేందుకు ప్రతిపాదించామని బీసీసీఐ పేర్కొనింది. దీనికి బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అలాగే, సీకే నాయుడు ట్రోఫీలో టాస్‌ను ఉపయోగించకుండా పర్యాటక జట్టు ఇష్ట ప్రకారం మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బీసీసీఐ యోచిస్తుంది.

చావో.. రేవో.. ప్లేఆప్స్ కు చేరువయ్యేది ఎవరో..
మే 12న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆడుతుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌ లలో 5 గెలిచింది, ఇప్పుడు ప్లేఆఫ్‌ లకు అర్హత సాధించడానికి అవకాశం పొందడానికి తదుపరి 2 గేమ్‌ లను తప్పక గెలవాలి. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి చివరి 5 మ్యాచ్ లలో 4 బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ లను గెలుచుకుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 12 మ్యాచ్‌ లలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. రిషబ్ పంత్‌కు కూడా ఇది తప్పక గెలవాల్సిన గేమ్. కాకపోతే నిషేధం వల్ల పంత్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఇక ఈ రెండు టీమ్స్ బెంగళూరు, ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు 30 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్12 గెలిచింది. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధిక స్కోరు 215. బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధిక స్కోరు 196. ఇక నేటి మ్యాచ్ లో ఆడబోయే ఆటగాళ్ల వివరాలు చూస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్ లు అంచనా వేయొచ్చు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్ లో అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, మయాంక్ డాగర్, వైషక్ విజయ్కుమార్, యశ్ దయాల్ లు ఉన్నారు.

విరూపాక్ష దర్శకుడితో చైతూ సినిమా.. ఈ సారి టార్గెట్ అదేనా..?
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ హీరోకు గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ ఇబ్బంది పెడుతున్నాయి.ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్” ..నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన అంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నాగచైతన్య జాలరి రాజు పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి ఆయన భార్య బుజ్జమ్మగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే తాజాగా నాగ చైతన్య మరో సినిమా లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.గతేడాది విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండుతో నాగ చైతన్య మూవీ చేయనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు కార్తీక్ చైతూని కలిసి కథ వినిపించగా చైతూ ఓకే చెప్పినట్లు సమాచారం. నాగచైతన్యతో తెరకెక్కించే ఈ సినిమా ఏ జోనర్ లో రాబోతుందో మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.అయితే నాగచైతన్య ఈ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

రాంచరణ్ “గేమ్ ఛేంజర్” షూటింగ్ కు మోక్షం కలిగేది ఎప్పుడంటే..?
గ్లోబల్ స్టార్ రాంచరణ్‌ నటిస్తున్నలేటెస్ట్ మూవీ “గేమ్‌ఛేంజర్‌”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ “కియారా అద్వానీ” హీరోయిన్ గా” నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ “అంజలి” ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.అయితే దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా “ఇండియన్ 2” సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దీనితో “గేమ్ చేంజర్” సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే “ఇండియన్ 2” సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధం కావడంతో దర్శకుడు శంకర్ రాంచరణ్ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా 45 రోజుల  పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తుంది.ఈ షెడ్యూల్ కనుక పూర్తయితే గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.అయితే రాంచరణ్ అభిమానులు మాత్రం ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో నవీన్‌ చంద్ర, సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.