NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

ఏపీలో నేటితో ప్రచారానికి తెర..
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్‌లు ప్రచారంలో పాల్గొననున్నారు.. మే 13న జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా మైక్‌లు మూగబోనున్నాయి.. ఇక, ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించడం, ప్రసారం చేయడంపై కూడా నిషేధం ఉంటుంది.. ప్రచారాలు ముగిసిన సమయం నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.. మరోవైపు.. పోలింగ్‌ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు మీనా.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి ఎన్నికల ప్రచారానికి తెరపడనుండగా.. ఇక సైలెంట్‌గా ప్రలోభాలకు తెరలేచే అవకాశాలు ఉన్నాయి.. ఇక, పోలింగ్‌ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డేగా ప్రకటించారు.. ప్రచార పర్వం ముగియగానే.. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన నేతలు, వివిధ పార్టీల శ్రేణులు.. ఆయా నియోజకవర్గాలను వీడాల్సి ఉంటుంది.. మరోవైపు.. ఎన్నికల్లో ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఏ అభ్యర్థి అయినా.. ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు మీ దృష్టికి వస్తే.. మాకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు.

పిఠాపురంలో ప్రచారాన్ని ముగించనున్న సీఎం జగన్‌.. నేటి షెడ్యూల్‌ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. వైనాట్ 175 అంటున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ పిఠాపురంలో ఆఖరి అస్త్రాన్ని సంధించబోతున్నారు. ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఉదయం పది గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్‌ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. ఒంటి గంటకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో సభలో పాల్గొంటారు. చివరగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రచారాన్ని ముగిస్తారు సీఎం జగన్. అయితే, మొదటి నుంచీ వైసీపీ పిఠాపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో.. ఆయనపై అదే సామాజికవర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దింపింది వైసీపీ. పవన్ కల్యాణ్‌ ప్రచార సభల్లో సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తుండటంతో.. ఇవాళ్టి సభలో సీఎం జగన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారా అనే ఆసక్తి ఏర్పడింది. సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్ర, ప్రచార భేరి ఇలా.. విడతలవారీగా ప్రచారాన్ని నిర్వహించారు సీఎం జగన్. దాదాపుగా జనవరి నుంచి ప్రచారంలోనే ఉన్నారు. ఈ రోజు ప్రచారానికి ఫైనల్‌ టచ్‌ ఇవ్వనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పిఠాపురంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

చివరి రోజు ఏపీకి అగ్రనేతలు.. కడపకు రాహుల్.. తిరుపతికి నడ్డా..
ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు రాహుల్‌ గాంధీ. ఇవాళ కడపలో రాహుల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఉదయం పదకొండున్నరకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్‌… అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 11 గంటల 45 నిముషాలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. ఆ తరువాత ఒంటి గంట సమయంలో కడపలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు రాహుల్‌. మరోవైపు.. ఎన్నికల ప్రచారం కోసం నేడు ఏపీకి రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తిరుపతిలో జరిగే రోడ్‌షోలో జేపీ నడ్డా పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు తిరపుతిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి నాలుగు కాళ్ల మండపం వరకు జేపీ నడ్డా రోడ్‌షో కొనసాగనుంది. జనసేన నేత నాగబాబుతో పాటు టీడీపీ, జనసేన ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇక, నేడు చిత్తూరులో చంద్రబాబు పర్యటన ఉంది.. ఎన్నికల ముగింపు ప్రచారాన్ని చిత్తూరు సభతో ముగించనున్న చంద్రబాబు… చిత్తూరు సభ అనంతరం నేరుగా తిరుమల వెళ్లనున్నారు.. రాత్రికి స్వామివారిని దర్శించుకోనున్న చంద్రబాబు. మరోవైపు నేడు కాకినాడలో రోడ్ షో, ఎన్నికల ప్రచారంలో పవన్‌ పాల్గొన్నారు..

నేడు వికారాబాద్ , వనపర్తి ల్లో అమిత్ షా సభలు
తెలంగాణ నుంచి బీజేపీకి రెండంకెల సీట్లు రావాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చారు. చివరగా శనివారం హైదరాబాద్ నారాయణపేట ఎల్బీస్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మోడీ మొత్తంగా రాష్ట్రంలో పది బహిరంగ సభలు, అనేక రోడ్ షోలలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే మూడుసార్లు రాష్ట్రానికి వచ్చి బీజేపీ ప్రచారాన్ని ఊపందుకున్నారు. ఇవాళ మరోసారి వనపర్తి, వికారాబాద్‌లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ లో జరిగే జనసభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం వనపర్తిలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు వెళ్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. దీంతో బీజేపీ అగ్రనేతలు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం కూడా చేశారు. మరోసారి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కూటమి నేతలు ప్లాన్ చేశారు. ఈ మేరకు భీమవరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, అమిత్ షా పర్యటన రద్దు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది.

3డీ-ప్రింటెడ్ రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. అధునాతన అడిటీవ్ మాన్యుఫాక్చరింగ్(ఏఎం) సాంకేతికతను ఉపయోగించి పీఎస్‌4 లిక్విడ్ రాకెట్‌ ఇంజిన్‌ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. దీనిని 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. సాధారణంగా అనేక విడి భాగాలను ఒక చోట అమర్చి.. వెల్డింగ్ చేసి తయారు చేస్తారు. కానీ ఈ ఇంజిన్‌ను ఒకే భాగంగా తయారు చేశారు. ఈ టెక్నాలజీని వాడడం వల్ల 97 శాతం ముడి పదార్థాలు, ఉత్పత్తి సమయం 60 శాతం తగ్గుతుందని ఇస్రో తెలిపింది. మే 9న 665 సెకన్ల పాటు ఏఎమ్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించి ఇస్రో ఈ ప్రధాన మైలురాయిని సాధించిందని అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇస్రో ప్రకటించింది. ఇంజిన్ తయారీ భారతీయ పరిశ్రమలో జరిగింది. ఇంజిన్‌ను తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ ఇంజిన్‌ను పరీక్షించేందుదుకు నాలుగు విజయవంతమైన డెవలప్‌మెంటల్ హాట్ టెస్ట్‌లు 74 సెకన్ల సంచిత వ్యవధి కోసం నిర్వహించారు. ఇవి ఇంజిన్ పనితీరు పారామితులను ధృవీకరించాయి. ఇంకా, ఇంజిన్ 665 సెకన్ల పూర్తి అర్హత వ్యవధి కోసం విజయవంతంగా పరీక్షించబడింది. అన్ని పనితీరు పారామితులు ఊహించిన విధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. ఈ పీఎస్‌4 ఇంజిన్‌ను సాధారణ PSLV ప్రోగ్రామ్‌లో చేర్చాలని యోచిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

నేటితో ప్రచారానికి తెర.. జోరు పెంచిన ప్రధాన పార్టీలు
నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ సోమవారం అంటే మే 13న జరగనుంది. నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ అన్ని స్థానాల్లో ప్రచారానికి నేడు చివరి రోజు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థులు తమకు అనుకూలంగా ప్రచారం చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అభ్యర్థులందరూ ముమ్మరంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నించనున్నారు. నాలుగో దశలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌.. ఈ 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా తెలంగాణ నుంచి 525 మంది అభ్యర్థులు 17 ఎంపీ స్థానాల బరిలో నిలిచారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక బీహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 55 మంది పోటీలో నిలిచారు. జమ్మూకాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి 24 మంది పోటీపడుతున్నారు. ఝార్ఖండ్‌లోని 4 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 45 మంది పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు గానూ 74 మంది పోటీపడుతున్నారు. అటు మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానా

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య.. అనంతరం నిందితుడు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఇక్కడ మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాంపూర్-మథుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్హాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలన్నింటిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. 45 ఏళ్ల అనురాగ్ సింగ్ మానసికంగా బలహీనంగా ఉన్నాడని సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. మద్యానికి బానిసయ్యాడు. తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం మేరకు రాంపూర్ మథుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్హాపూర్ గ్రామానికి చెందిన అనురాగ్ ఠాకూర్ (42) తన తల్లి సావిత్రి (65), భార్య ప్రియాంక (40), కుమార్తె అశ్విని (12), చిన్న కుమార్తె అశ్విని (10)లను హత్య చేశాడు. శనివారం ఉదయం కుమారుడు అద్వైత (6)పై కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అనురాగ్ కూడా తనను తాను కాల్చుకున్నాడు. ఇంట్లో నుంచి కేకలు రావడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. అతడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సాయి ధరమ్ తేజ్ మీద సీసా విసిరారు.. తలకి తగిలితే?
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం మీదే వుంది.ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.గత పవన్ కల్యాణ్ఎన్నికలలో భీమవరం ,గాజువాక రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయారు.ఈ సారి జనసేన పార్టీ బీజేపీ ,టీడీపీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీలోకి దిగింది.దీనితో ఈ సారి పవన్ గెలుపు ఖాయమని జన సైనికులు భావిస్తున్నారు . పవన్ కల్యాణ్ కోసం పలువురు టాలీవుడ్ ప్రముఖులు పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కోసం జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.రీసెంట్ గా మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్,సాయిధరమ్ తేజ్ ప్రచారంలో పాల్గొన్నారు .అయితే సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతనిపై బాటిల్ ను విసిరారు..కానీ అది గురి తప్పి పక్కన వున్న తెలుగు దేశం కార్యకర్తకు తగిలింది .ఈ విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై, కార్యకర్తలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు .సాయిధరమ్ తేజ్ నా మీద వున్న ప్రేమతో ప్రచారానికి వచ్చాడు.రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిపై దాడి చేస్తారా అదే బాటిల్ తలకి తగిలి ఉంటే ఏమై ఉండేది అని పవన్ మండిపడ్డారు.అలాగే గాయపడిన తెలుగు దేశం వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

కన్ఫ్యూషన్ లో రామ్.. తన నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..?
టాలీవుడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం “డబుల్ ఇస్మార్ట్” మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీ గా వున్నారు.అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో క్లారిటీ లేదు. అయితే రామ్ తన తరువాత సినిమా కోసం గౌతమ్‌ మీనన్‌ కథను ఇప్పటికే ఓకే చేసినట్లు సమాచారం.’డబుల్‌ ఇస్మార్ట్‌’ తర్వాత రామ్ చేసేది ఈ సినిమానే అని ఓ న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు అనుకోకుండా సీన్ లోకి త్రివిక్రమ్‌ ఎంటరయ్యారు. ప్రస్తుతం త్రివిక్రమ్ హీరో రామ్‌ కోసం మంచి కథను సిద్ధం చేసే పనిలో వున్నారని సమాచారం.దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ తో చేసిన ‘గుంటూరు కారం’ తర్వాత అల్లుఅర్జున్ తో తరువాత సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో ఓ న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేయనున్నట్లు సమాచారం.దర్శకుడు అట్లీ చెప్పిన కథ నచ్చడంతో ‘పుష్ప-2’ మూవీ తర్వాత అట్లీతోనే సినిమా చేసేందుకు అల్లు అర్జున్‌  ఫిక్స్ అయ్యారు.దాంతో దర్శకుడు త్రివిక్రమ్‌ హీరో రామ్ కోసం మంచి లవ్ స్టోరీ ని సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.అయితే రామ్ ఎవరితో తన తరువాత సినిమా చేస్తారో అని కన్ఫ్యూషన్ ఏర్పడింది.